రాతిమద్దెల

వరంగల్ మొదటిసారి 2003 లో వెళ్ళాను. అప్పుడే వేయిస్తంభాల గుడీ, ఏకశిల కోట, రామప్పా, ఏటూరు నాగారం అడవులూ చూసాను. తిరిగి వచ్చాక ఆరు కవితలు రాసాను. అవి ఆదివారం వార్తలో 17-8-2003 న ప్రచురితమయ్యాయి. అందులో చివరి రెండూ నా ‘పునర్యానం ‘ కావ్యంలో చేర్చాను, కాని మొదటి నాలుగూ ఏ కవితాసంపుటిలోనూ చేర్చలేదు. ఇప్పుడు ప్రపంచ వారసత్వసంపదగా రామప్పకు గుర్తింపు వచ్చిన సందర్భంగా ఆ నాలుగూ మీకోసం.
 
1
 
వేయి స్తంభాల గుడి
 
ఎండలో చుట్టచుట్టుకు పడుకున్న పాము
దాని పురాతన దేహం మీద పొలుసులు, పొలుసులు.
 
రాతిని ఒక శంఖం వలె మలచారు
గతించిన కాలాల హోరు అవిరామంగా వినవస్తున్నది.
 
పురుషసూక్తం మీద నిర్మించబడ్డ
ఒక కల్పన,
ఆ రాజ్యం గతించిపోయింది,
ఆనవాలు మిగిలిపోయింది.
 
ఇప్పుడక్కడ దేవుడితో పాటు
ఎలుకలు కూడా నివసిస్తున్నాయి.
 
2
 
కీర్తి తోరణం, ఖిలా వరంగల్
 
శిల్పుల్ని సమావేశపరిచి అడిగాడా రాజు
‘చూడండి, ఈ ముత్యాల హారాలు, ఈ పట్టు పీతాంబరాలు
ఈ రథాలు, హయాలు, మత్తేభాలు,
మంగళవాద్యాలు, స్తోత్రపాఠాలు
ఇప్పుడే వేడి నెత్తురు రుచి చూస్తున్న కరవాలాలు
నిర్మించండి శాశ్వత స్థూపాన్ని
అందరికీ కనబడేలా
ఎప్పటికీ నా యశోవిజయాన్ని.’
 
అర్థం కాలేదు శిల్పులకదేమీ
వాళ్ళముందొక అస్పష్ట స్వప్నం
అంతులేని రాళ్ళు.
 
ఒక ప్రభాత వేళ శిల్పుడొకడు
నేస్తుల్ని పిలిచాడు
‘చూడండి, ఆకాశంలోకి నేనొక
ఆభరణాన్ని విసిరాన ‘న్నాడు
‘దాన్నక్కడే నిశ్చలంగా నిలిపా’నన్నాడు మరొకడు
కాలగ్రీవంపైన ఆ హారం ఒక తోరణాన్ని తలపించింది.
ఆశ్చర్యం, దివినుంచి హంసలు వాలాయక్కడ.
 
మట్టికోట కట్ట తెగిన చెరువయ్యింది
రాతికోట అంచు తెగిన పాత్రయ్యింది
రథాలు, హయాలు, మదగజాలు
అదృశ్యమైపోయాయి.
లేవింక ఆ కరవాలాలు, ఆ బజార్లు, ఆ వైడూర్యాలు.
ఎన్ని యుద్ధాలు, ఎన్ని యుగాలు-
 
కానీ
ఆ తోరణాలు వాడలేదు
ఆ హంసలెగిరిపోలేదు.
 
3
 
రామప్ప
 
అడవిదారిన రాజూ, కవీ ప్రయాణిస్తున్నారు
మధ్యాహ్నపు మగతనీడలో
మద్దిచెట్ల నీడన రాజు కలగన్నాడు
కవి పాటపాడాడు.
 
అడవి కరిగింది,
పత్రహరితం ప్రవహించి సరసుగా మారింది
నీలిదిగంతం జలతరంగం వాయించింది.
రాజు మేల్కొన్నాడు
‘ఇక్కడ నా స్వప్నాన్ని ప్రతిష్టించాలనుకుంటున్నా’నన్నాడు
 
కలల చెరువులు తవ్వి మట్టి తెచ్చారు
వెన్నెల రాత్రుల రాగప్రవాహాల్లో
శిల్పులు తమ హృదయాలు తెప్పలు కట్టేరు
యక్షిణుల, మదనికల, నాగినుల నూపురస్వనాలతో
అడవి చలించిపోయింది.
 
తెల్లవారేటప్పటికి తడిసిన పచ్చికలో
కుసుమించిన ప్రేమోన్మత్త అధరాలు
గోడలంతా తాపడమయి
మృదంగాలు, చరణమంజీరాలు.
 
ఒక రాజు కన్న కల, కవి పాడిన పాట
రామప్ప ఒక రాతిమద్దెల.
 
4
 
తాడవాయి నుంచి ఏటూరు నాగారం
 
దట్టమైన అడవుల్లో ప్రయాణం
వెన్నంటే సంధ్యారాగం
పచ్చని దారి పొడుగునా పసిగట్టిన
బాల్యపు జాడలు.
 
ఆమె నన్ను మరొకసారి గాయపరిచి వెళ్ళిపోయింది.
లేత చివుళ్ళ గాలితో హృదయానికి
పసరు పూసింది అడవి.
వసంతం ఈ కొసనా, హేమంతం ఆ కొసనా
నడిచిన దారి పొడవునా నాతో
దాగుడుమూతలాడుతున్నాయి.
 
దిగబోయే మజిలీలో నా కన్న ముందే
ఆమె జ్ఞాపకాలు బాకుల్తో పొంచి ఉంటాయి.
నడివేసి వెన్నెల రాత్రి నా కోసం
పూర్వసంతోషాల గాడ్పుల్తో మాటువేసింది.
 
అడవి అదే, ఆ పక్షి లేదు
హృదయమదే, ఆ రెక్కలేవి?
 
28-7-2021

Leave a Reply

%d bloggers like this: