ఒంటిగా ఉయ్యాలలూగితివా

తెలుగులో పదకర్తలు, పద్యశిల్పులూ నడయాడిన తావులు వెతుక్కుంటూ తిరుగుతున్న నాకు నేను రోజూ తిరిగే పటమటలోనే గొప్ప గీతకారుడొకాయన పుట్టి పెరిగాడన్న సంగతి చాలా ఆలస్యంగా తెలిసింది. పటమటలో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలోనే నేను మొన్నటిదాకా పనిచేసింది. ఇప్పుడు కూడా దాదాపుగా ప్రతిరోజూ ఏదో ఒక సమావేశానికి పటమట వెళ్తూనే ఉంటాను. కాని పటమటలోనే బసవరాజు అప్పారావు పుట్టిపెరిగాడని తెలిసినప్పుడు నాకు కలిగిన పులకింత అంతా ఇంతా కాదు.
 
ఆధునిక తెలుగు కవిత్వ వికాసానికి సంబంధించి మన సాహిత్య చరిత్రకారులు రూపొందించిన ఒక కథనంలో బసవరాజు అప్పారావు ఒక భావకవి మాత్రమే. కాని మన సాహిత్య విమర్శకులకు తెలియనిదేమింటంటే, ఇరవయ్యవశతాబ్ది తెలుగు కవిత్వం గేయానిదీ, వచనకవిత్వానిదీ మాత్రమే కాదు, పాటది కూడా అనీ, అటువంటి పాటకి ప్రాణం పోసిన తొలి ఆధునిక తెలుగు కవుల్లో బసవరాజు అప్పారావు కూడా ఒకడనీ. నిజానికి ఇరవయ్యవశతాబ్దిలో వికసించినంతగా పాట మునుపెన్నడూ వికసించలేదు, అంతమంది గీతకర్తలూ మునుపెన్నడూ ప్రభవించలేదు. ఆధునిక కవిత్వానికి తలుపులు తెరిచిన గురజాడనే ఇరవయ్యవశతాబ్దపు మొదటి పదకర్త కూడా. గురజాడ నీలగిరి పాటలనుంచి గద్దర్ పాటల దాకా తెలుగులో గళమెత్తిన గీతకర్తల్ని తలుచుకునేటప్పుడు బసవరాజు అపారావుకి అందరికన్నా ముందు అగ్రస్థానం ఇవ్వాలి. ఎందుకంటే ఒక గీతకర్తగా అతడు తెలుగు పాటకు ప్రాణం పోసాడు. నూత్న యవ్వనాన్నీ, సత్త్వాన్నీ సంతరించాడు. ఆయనే లేకపోతే, నండూరి సుబ్బారావు లేడు, గీతరచయితగా కృష్ణశాస్త్రి కూడా ఉండేవాడు కాడు.
 
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రని నిర్మించే విమర్శకులు సాధారణంగా గురజాడ, రాయప్రోలు, భావకవులు, అభ్యుదయకవులు అంటో ఒక యుగవిభజన చేసుకుంటో పోతారు. చాలా స్థూలంగానూ, ఎందరినో విస్మరించేదిగానూ ఉండే ఈ కథనానికి నారాయణరెడ్డి పరిశోధన గ్రంథం చాలావరకూ కారణమనుకుంటాను. కాని, గురజాడకీ, కృష్ణశాస్త్రికీ మధ్య పదేళ్ళ కాలంలో మహనీయులైన తెలుగుకవులెందరో గొంతువిప్పిన సంగతి ఆ కథనాలు వివరించవు. తెలుగులో వేంకటపార్వతీశ్వర యుగమంటూ ఒకటుండేదని రాస్తాడు కృష్ణశాస్త్రి ‘ఏకాంతసేవ’ కావ్యం గురించి రాస్తూ. 1915 నుంచి 1925 మధ్యకాలంలో యూరోప్ లో మొదటి ప్రపంచయుద్ధం సంభవించిన కాలంలో, ఎన్నో కవిత్వాలు ఆధునిక యుగంలో ప్రవేశించాయి. రష్యాకి సంబంధించినంతవరకూ 20 వ శతాబ్దం 1914 లో మొదలయ్యిందని రాసింది అన్నా అఖ్మతోవా ఒకచోట. తెలుగులో కూడా అది సముజ్జ్వల శకం. ఒకవైపు సహాయనిరాకరణోద్యమం, మరొకవైపు ఆధునిక యుగపవనాలు బలంగా వీచడం మొదలైన కాలం. ఆ రోజుల్నీ, ఆ పవనాల్నీ తమ కవిత్వంలో ఎంతో మౌలికమైన ప్రజ్ఞతో పట్టుకున్న దువ్వూరి రామిరెడ్డి, కవికొండల వెంకటరావు, నండూరి సుబ్బారావు, చలం వంటి వారి గురించి తెలుగు సాహిత్యచరిత్రకారులకి తెలియదు. ఆ విశిష్ట గళాలన్నింటిలోనూ బసవరాజు అప్పారావుది మరింత విశేష గళమని వారు మర్చిపోతారు.
 
నీలగిరి పాటలతో ఇరవయ్యవశతాబ్దిలో పాట మొదలయినప్పటికీ ఆ గీతాలు పారశీక కవిత్వ ప్రభావంతో పూర్వకాలాల జావళీల తరహాలో రాసిన పాటలు. కృష్ణశాస్త్రి, చలం బ్రహ్మసమాజ గీతాలు రాసినప్పటికీ వాటి వెనక రవీంద్రుడున్నాడు. ఎటువంటి నమూనా తనముందుపెట్టుకోకుండా పూర్తి స్వేచ్ఛతోనూ, ఎంతో మౌలికమైన ప్రతిభతోనూ పాటకట్టిన తొలిగీతకర్తలు తెలుగులో నండూరీ, బసవరాజూ మాత్రమే. నండూరి పాటలన్నీ ఎంకి చుట్టూతానే తిరిగే పాటలు, అక్కడ ఇతివృత్త వైవిధ్యంలేదు. కాని బసవరాజు అప్పారావు పాటలు ప్రపంచమంత విశాలమైనవి.
 
బసవరాజు అప్పారావు కవిత్వం నాకు నా చాలా చిన్ననాట వైతాళికులు సంకలనం ద్వారానే పరిచయమయ్యింది. ఆ తర్వాత తాడికొండ స్కూలు లైబ్రరీలో ‘బసవరాజు అప్పారావు గీతములు ‘అనే పుస్తకం నాకు దొరికింది. ఆ నా హైస్కూలు దినాల్లో, నేను ఇంటిమీద బెంగతో ఒక్కణ్ణీ కునారిల్లే ఆ రాత్రుల్లో ఆ పాటలు నాకు గొప్ప ఓదార్పుగా ఉండేవి. అవి పసిపిల్లల పాటలు కావు, అలాగని పూర్తి ప్రణయగీతాలూ కావు. పసివాళ్ళూ, ప్రేమికులూ కూడా ఒక్కదాన్నే కోరుకునే ఏదో స్వాప్నిక లోకానికి చెందినపాటలు.
 
మామిడిచెట్టును అల్లుకున్నదీ మాధవీలతొకటీ
ఏమా రెండిటి ప్రేమసంపదా యింతింతనలేమూ..
 
ఎదమెత్తనౌటకై సొదగుందరా అంత
మదిలగల యహమ్మంత వదలిపోవురా..
 
ఈ మావిపై నుండి ఈవు కూ కూ యంచు
ఆ మావిపైనుండి ఆపె కూ కూ యంచు
ఏమి బాసల చేతురే , కోకిలా
ఏమి బాసలు చేతురే..
 
నల్లవాడే గొల్లపిల్లవాడే చెలియ
కల్లగాదే వాని వల్లొ జిక్కితినే..
 
కోయిలా కోయిలా కూయబోకే
గుండెలూ బద్దలూ చేయబోకే..
 
నాగుల చవితికి నాగేంద్ర, నీకు
పుట్టనిండా పాలుపోసేము తండ్రి..
 
ఈ పాటలన్నీ దాదాపుగా వైతాళికుల్లో ఉన్నవే. కాని అందులో సంకలనం కాని పాటలు, గాంధీగారి మీద రాసినవి, నాలోనేను మరీ మరీ పాడుకునేవాణ్ణి.
 
కొల్లాయిగట్టితేనేమీ, మా గాంధి
కోమటై పుట్టితేనేమి..
 
గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలనవ్విందీ
జగత్తూ కలకలనవ్విందీ..
 
పోదాము స్వరాజ్యలక్ష్మి పెండ్లి చూడ
రారె రమణులారా!
 
తాడికొండ వదిలిపెట్టాక, ఆ గేయసంపుటి మళ్ళా నేను చేతుల్లో పట్టుకున్నది లేదు. పది పదిహేనేళ్ళకిందట గుంటూరి నుంచి ఒకాయన తన దగ్గర బసవరాజు అప్పారావు గేయాలు సాప్ట్ కాపీ ఉందంటే హైదరాబాదునుంచి గుంటూరు వెళ్ళి మరీ ఆ పుస్తకం కాపీ చేసుకున్నాను. చేసుకున్నదే తడవు ఆతృతతో ఆ పుస్తకం పుటలు తిరగేస్తుంటే, నా చిన్ననాటి అనుభూతి మళ్ళా అంత తాజాగానూ నన్నావరించింది. కాని ఆ పిడి ఎఫ్ కూడా ఎక్కడో పోగొట్టుకున్నాను.
 
కాని ఈ సారి ఆ మేలు ప్రతి ఆర్కైవ్ లో దొరికింది. ఈ సారి ఈ పాటలు నన్ను మరింత ప్రగాఢంగా సమ్మోహితుణ్ణి చేస్తున్నాయి. చూడండి, ఈ పాట:
 
వాడిన పూవున కేటికి మరలను
పరిమళమొసగెదు దేవా?
ఎండిపోయినట్టి బావినూటల
నేటికి ఊరించెదు దేవా?
 
బ్రద్దలైన సంద్రపుటలల నేటికి
పైకి తిరిగిపంపెదు దేవా?
నేలను పడుచున్న గాలిపడగను
ఏటి కెగరగొట్టెదవు దేవా?
 
పారబోసుకున్న ప్రణయపాత్రము
పానీయముతో నింపెదు దేవా?
ఆశలువీడిన వానికి మరలను
ఆశలేల గూర్చెదు దేవా?
 
ప్రాణమ్ములు చేదైన వానికిని
ప్రాణము తీయగ జేసెదు దేవా?
అంధకారగర్భ నరకవాసికి
ఆనందతేజమేటికి దేవా?
 
వాడిన పూవున కేటికి మరలను
పరిమళమొసగెదు దేవా?
 
ఈ సారి ఈ పుస్తకంలో నాకు సరికొత్త ఆశ్చర్యం శాఫో గీతాల అనువాదాలు. బహుశా, శాఫో కవితలు తెలుగులో ఇన్ని అనువదించిన మొదటి కవీ, చివరి కవీ కూడా బసవరాజు అప్పారావేనేమో. ఈ గీతం చూడండి:
 
గున్నమావి కొమ్మలందు గువ్వలు
గుసగుసలాడుచు నుండెన్
వాడినయాకులు నిదురచరించెడి
వాడల నాడుచునుండెన్
ఇవ్వని మాడ్చెడు మధ్యాహ్నమెల్ల
నిట్లె కాచుకునియుంటిన్
సంజను గబగబ వచ్చు నీ అడుగు
చప్పుడు వినబడునా యంచున్
 
శాఫోనే కాదు, శంకరాచార్యుణ్ణి కూడా భావకవిగా మార్చేసాడు ఆయన తన అనువాదాల్లో. రామకర్ణామృతంలోని ఈ పద్యం చూడండి:
 
మార్గమందున మార్గమందున
వృక్షశాఖల రత్నవేదులు
వేదులందున వేదులందున
కిన్నరీ బృందముల గీతము
గీతమందున గీతమందున
మంజులాలాపార్ద్రగోష్టియు
గోష్టియందున గోష్టియందున
నీదు కథయే రామచంద్రా!
 
పద్యం నిర్మించడం కన్నా పాట కట్టడం చాలా కష్టం. అందుకనే ప్రజలు గుర్తుపెట్టుకునేది పాటలు కట్టేవాళ్ళని మాత్రమే. అందులోనూ, తనదైన సొంతగొంతుతో పాటకట్టేవాళ్ళు ఏ భాషలోనైనా కొంతమందే ఉంటారు. బసవరాజు అటువంటి కవి.తెలుగులో ప్రసిద్ధి చెందిన ఎన్నో గీతాలకూ, కవితలకూ మూలవాక్కు ఆయన కవితల్లో కనిపిస్తుంది. చూడండి:
 
ఇది సంపెంగపూ
విది మల్లెపూవు
ఎది కావలెనే?
చెలియా!
 
ఇది మామిడిపం
డిది జామపండు
ఎది కావలెనే?
చెలియా!
 
ఇది ద్రాక్షారస
మిది పూవుదేనే
ఎది కావలెనే?
చెలియా!
 
ఇది వైడూర్యం
బిది మేలికెంపు
ఎది కావెలెనే!
చెలియా?
 
ఇది కృష్ణుప్రేమ
మిది మిత్రుప్రణయ
మెది కావలెనే
చెలియా!
 
ఈ పాట మీకు ఏ కవితను గుర్తుకు తెస్తున్నదో నేను అడగను. అలాగే ఈ పాట కూడా-
 
వాయింపుమా మురళి వాయింపుమా కృష్ణ
తుమ్మెదగండ్లు జుంజుమ్మని పాడు
శారదరమణియు సంద్రంపు రాజు
ఆనందమున ఓలలాడుచున్నారు
వాయింపుమా మురళి వాయింపు కృష్ణ
వాయింపుమా మురళి స్వచ్ఛముగ కృష్ణ!
 
ఇంకా ఈ పాట చూడండి. దీన్ని మరొక భాషలో మరొక కవి పాడి ఉంటే ప్రపంచమంతా తలకెత్తుకుని ఉండి ఉండేది:
 
చిలుకలు కొరికిన పండొక్కటి నా
చేతులబడె నో దేవా
తెలియునెట్లు తీయనిదో విషమో
తినకుండగ నో దేవా?
 
త్రోవబోవుచుండ దండవీడిన
పూవొకటి దొరికె నో దేవా
తావి కమ్మనిదొ తలనొప్పిడునో
ఏ విధి తెలియును దేవా?
 
రెక్కలు తెగినట్టి పిట్ట యొక్కటి
అక్కున గొంటిని దేవా
ఎక్కరణిని పెంచి బాగుచేసెదొ
నీకే వదిలితి దేవా!
 
ఇంక ప్రస్తావించను,
కాని ఈ పాట మాత్రం నాతోనే ఉండిపోతుంది, చదివాక, మీతో కూడా:
 
ఒంటిగా ఉయ్యాలలూగితివా
నా ముద్దు కృష్ణా
జంటగా నను పిల్వదగదోయీ
 
కంటికంతా జలమయంబై
మింటివరకును ఏక రాశై
జంటదొరకని మహాప్రళయపు
టింటిలో వటపత్రడోలిక
ఒంటిగా ఉయ్యాలలూగితివా
 
నా ముద్దుకృష్ణా
జంటగా నను పిల్వదగదోయీ
 
జగములన్నియు కాలయోనిని
మొగములెరుగక నిద్రబోవగ
నగుమొగముగల ముద్దుబాలుడ
వగుచు జోలల బాడుకొంచూ
 
ఒంటిగా ఉయ్యాలలూగితివా
నా ముద్దుకృష్ణా!
 
25-7-2021

Leave a Reply

%d bloggers like this: