
ఇంతదాకా నడిచిన వచ్చిన దారుల్లో ఎన్నోసార్లు వినబడుతూనే వస్తున్నది ఆ గీతం:
శ్రీరామచంద్ర కృపాలు భజు మన హరణ భవభయ దారుణం
నవ కంజ లోచన కంజ ముఖ, కర కంజ పదకంజారుణం
అప్పుడే కొలనునుంచి తెచ్చిన తామరపూలు,ఇంకా ఆ చల్లదనంతో, ఆ నునులేతరేకలమీంచి అంటీఅంటనట్టు కదలాడే నీటిబిందువులతో, దేవుడిపూజకోసం గంపలో రాశిపోసినట్టుగా-
కందర్ప అగణిత అమిత ఛవి నవనీల నీరద సుందరం
పటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం
భజు దీనబంధు, దినేశ దానవ దైత్య వంశ నికందనం
రఘునంద , ఆనందకంద, కోసల చంద, దశరథ నందనం
సిర ముకుట, కుండల తిలక, చారు ఉదారు, అంగ విభూషణం
ఆజానుభుజ, శరచాప ధర, సంగ్రామ జిత, ఖరదూషణం
ఆ భగవద్వైభవ గుణకీర్తనం ఆగేది కాదు, కాని ఆ కీర్తన ఎక్కడో ఒక్కచోట ఆగాలి కాబట్టి, ఇక ఇలా ముగుస్తుంది:
ఇతి వదతి తులసీదాస, శంకర శేష మును మన రంజనం
మమ హృదయ కంజ నివాస కురు, కామాది ఖల దల గంజనం.
ఈ కీర్తన తులసీదాసుదని ముద్ర చెప్తున్నది కాని, ఎక్కడిదో తెలియలేదు చాలాకాలం. తెలిసిన తర్వాత, బహుశా, పదేళ్ళ కిందట అనుకుంటాను, ‘వినయపత్రిక’ కోసం పుస్తకాల దుకాణానికి పరుగెత్త కుండా ఉండలేకపోయాను.
వినయపత్రిక.
ఎంత సముచితమైన పేరు! ఎంత అత్యాధునికమైన పేరు! ఎంత సనాతమైన పేరు! మరే ఒక్క కవికైనా స్ఫురించిందా అటువంటి కావ్యశీర్షిక? అటువంటి ఇతివృత్తం?
వినయపత్రిక కవిత్వం కాదు. సంగీతం. రెండు అట్టలమధ్య గుదిగుచ్చిన కాంతిధార. బహుశా పోతన భాగవతం ఒక్కటే ఆ రాగమయస్రవంతికి సాటివచ్చేది. అజంత తెలుగుభాషలో పోతన సంకీర్తనం నోరారా పాడుకునేది, వినయపత్రికలో ఆ హలంత పదాలతో సంస్కృతం వ్రజభాషగా మారిపోయి వినిపిస్తుంది. ఆ గీతాలు పాడుకుంటూ ఉంటే, మన హృదయస్పందనాన్ని మనమే వింటున్నట్టు ఉంటుంది. చూడండి:
రామ జపు రామ జపు రామ జపు రామ జపు
రామ జపు మూఢ మన బార బారం
సకల సౌభాగ్య సుఖ ఖాని జియ జాని శఠ,
మాని విశ్వాస వద వేదసారం.
కోసలేంద్ర నవ నీల కంజాభతను,
మదన రిపు కంజహృది చంచరీకం
జానకీరవన సుఖభవన భువనైక ప్రభు
సమర భంజన పరమ కారునీకం
దనుజ వన ధూమధుజ పీన ఆజానుభుజ
దండ కోదండవర చండ బానం
అరునకర చరణ ముఖ నయన రాజీవ
గున అచన బహు మయన శోభానిధానం
వాసనావృద కైరవ దివాకర
కామ క్రోధ మద కుంజ కానన తుషారం
లోభ అతి మత్త నాగేంద్ర పంచాననం
భక్తహిత హరణ సంసార భారం
కేశవం క్లేశహం కేశవందిత పదద్వంద్వ
మందాకినీ మూలభూతం
సర్వదానంద సందోహ మోహాపహం
ఘోర సంసార పాధోధి పోతం
శోక సందేహ పాధోదపటలానిలం
పాప పర్వత కఠిన కులిశరూపం
సంతజన కామ ధుక్ ధేను విశ్రామపద
నామ కలి కలుష భంజన అనూపం
ధర్మ కల్పద్రుమారామ హరిధామ పథి
సంబలం మూలమిద మేవ ఏకం
భక్తి వైరాగ్య విజ్ఞాన శమ దాన దమ
నామ ఆధీన సాధన అనేకం
తేన తప్తం, హుతం, దత్తమేవాఖిలం,
తేన సర్వం కృతం కర్మజాలం
యేన శ్రీరామనామామృతం పానకృతం
ఆనిమిష మనవద్యమవలోక్య కాలం
శ్వపచ, ఖల, భిల్ల, యవనాది హరిలోక గత,
నామబల విపుల మతి మల న పరసీ
త్యాగి సబ ఆస, సంత్రాస, భవపాస,
అసి నిసిత హరినామ జపు దాసతులసీ.
వినయపత్రికలో ఏ కీర్తన తెరిచినా ఇలా గంగ మన బల్లమీద ప్రవహిస్తున్నట్టే ఉంటుంది. పుస్తకం పుటల్లోంచి సూర్యోదయం సంభవిస్తున్నట్టే ఉంటుంది. నీ రెండు భుజాల మీదా రెండుకోకిలలు, ఒకటి వాల్మీకి కోకిల, మరొకటి తులసీ కోకిల గొంతెత్తి కూస్తూనే ఉన్నట్టుంటుంది.
ఎక్కడ తాకిచూడండి, ఆ తంత్రులు రాగాలు పలుకుతూనే ఉంటాయి:
రాజ రాజేంద్ర రాజీవలోచన రామ,
నామ కలి కామ తరు సామ శాలీ
అనయ అంబోధి కుంభజ, నిశాచర నికర
తిమిర ఘనఘోర ఖరకిరణమాలీ..
సుని సీతాపతి సీల సుభావు
మోద న మన తన పులక నయన జల సొ నర ఖేహర ఖావు
సిసు పనతేఁ పితు మాతు బంధు గురు సేవక సచివ సఖావు
కహత రామ బిధు బదన రిషోహైఁ సపనేహు లఖ్యో న కావు…
దీన బంధు సుఖసింధు కృపాకర కారునీక రఘురాయీ
సునహు నాథ మన జరత త్రిబిధ జుర, కరత ఫిరత బౌరాయీ..
తూ దయాలు, దీన హోఁ తూ దాని, హోఁ భికారీ
హోఁ ప్రసిద్ధ పాతకీ, తూ పాప పుంజ హారీ..
జానకీ జీవన జగ జీవన జగత హిత
జగదీస రఘునాథ రాజీవలోచన రామ్
సరద బిధు బదన సుఖసీల శ్రీ సదన
సహజ సుందర తను సోభా అగనిత కామ్..
హోమర్ రెండు ఇతిహాసాలు రాసి, తృప్తి చెందక కొన్ని గీతాలు కూడా రాసాడు. షేక్స్పియర్ ముప్పై ఏడు నాటకాలు రాసి తనివి తీరక సానెట్లు కూడా రాసాడు. డాంటే ‘డివైన్ కామెడీ’ తో పాటు ‘విటానోవా’ కూడా రాసాడు.అంతవరకే. కానీ తులసీ వంటి కవి ప్రపంచంలోనే మరొకడు లేడు. ఒక కథానాయకుడిమీద ఒక ఇతిహాసం లాంటి కావ్యం రాసినా కూడా తృప్తి చెందని కవి. ఇంకా ఇంకా మరెన్నో రూపాల్లో ఆ అగణిత సౌందర్యాన్ని గానం చేస్తోనే ఉన్నాడు.
వినయపత్రికలో ఒక ఇతివృత్తం ఉంది. అదేమంటే కవిని ఒకప్పుడు ఆరుగురు శత్రువులు చుట్టుముట్టారు. ఆయన వాళ్ళనుంచి తనని రక్షించమంటూ దేవుడికొక అర్జీ పెట్టుకున్నాడు. ఒక grievance petition అన్నమాట. కాని ఆ grievance ఎంత మహిమాన్వితం! అక్కడ శోకం శ్లోకంగా కాదు, సంగీతంగా మారిపోయింది. ఇది కదా నేను కోరుకోవలసింది, నా grievance గానంగా మారాలని కదా తపించవలసింది, తపసు చేయవలసింది.
కాని దానికి ముందు ‘తేన తప్తం, హుతం’ అని అనుకోవాలి, అనగలగాలి.
20-7-2021