కాకరపర్రు

Reading Time: 4 minutes

కిందటి వారం పశ్చిమగోదావరి జిల్లాలో పాఠశాలలు చూస్తూ పెరవలి గ్రామానికి వెళ్ళాను. అక్కణ్ణుంచి కాకరపర్రు పాఠశాల కూడా చూద్దామని బయల్దేరాను. ఆ ముందురోజు చిరుజల్లులు పడినట్టున్నాయి. దారంతా మృదులంగానూ, వానకు తడిసిన ఆకుపచ్చతో రసార్ద్రంగానూ ఉంది. పెరవలి నుంచి కాకరపర్రు వెళ్ళే ఆ దారికి ఒక పక్క గోదావరి కాలవ ప్రవహిస్తూ ఉంది. ఆ కాలువలో నీళ్ళు వదిలినట్టున్నారు, కొత్తవాగులాగా ఉరకలెత్తుతూ ప్రవహిస్తూ ఉంది. నాకు దారి చూపించడానికి ఇద్దరు ఉపాధ్యాయులు కూడా నాతో కారులో ఉన్నారు. వారిలో ఒక ఉపాధ్యాయిని నా రచనలు ఎప్పటికప్పుడు చదువుతూ ఉన్నానని చెప్తూ, నా వ్యాసాల్లోంచీ, కథల్లోంచీ ఏవేవో ప్రస్తావనలు గుర్తు చేస్తూ ఉంది. గలగల ప్రవహిస్తున్న ఆ గోదావరి కాలువనే చూస్తూ ఉన్న నాతో ‘మీకు ఇక్కడ ఆగిపోయి బొమ్మలు వేసుకోవాలనిపిస్తున్నది కదూ ‘ అందామె.

కానీ ఆ క్షణాన నాలో ఏవో సున్నితమైన విద్యుత్ ప్రకంపనలు రేకెత్తుతూ ఉన్నాయి. ఏదైనా కొండ, వాగు, అడవి, పల్లె, నగరం-అక్కడ ఏదైనా ఒక సాంస్కృతిక వైశిష్ట్యం ఉంటే నా హృదయంలో నాకు తెలీకుండానే ఏవో ప్రకంపనలు కలుగుతూ ఉండటం నాకెన్నో సార్లు అనుభవంలోకి వచ్చిన విషయమే. కాని ఆ రోజు ఆ గోదావరి కాలువ పక్కనే ఆ దారిన నేను ప్రయాణిస్తున్నప్పుడు నాలో ఆ సంవేదనలు ఎందుకు సంచలించాయో కాకరపర్రులో అడుగుపెట్టాక గానీ అర్థం కాలేదు.

చాలా ఏళ్ళు రాజమండ్రిలో ఉన్నవాణ్ణి కాబట్టి, ఎప్పుడో ఎవరి దగ్గరో కాకరపర్రు గురించి విని ఉంటానుగాని ఏమి విన్నానో గుర్తులేదు. ఆ ఊరి మొదట్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడుగుపెట్టినప్పుడు నాకొక అరటితోటలో అడుగుపెట్టినట్టనిపించింది. ‘నాడు నేడు’ లో భాగంగా ఆ పాఠశాల రూపురేఖలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కాని అంతకన్నా గర్వించదగ్గ విషయం అక్కడి ఉపాధ్యాయులు. వారెంతో ఉన్నతవిద్యావంతులు. అక్కడ సంస్కృతం బోధిస్తున్న ఉపాధ్యాయిని న్యాయదర్శనం చదువుకున్నామె. ‘అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు ‘ అంటే ‘పండితులు కూర్చున్న మా అరుగు మేలు ‘అంటారు కదా, ఇంత గొప్ప పండితులు పనిచేస్తున్న ఈ పాఠశాల ఎంత మేలైన పాఠశాల అని నేనగానే, ఆ ఉపాధ్యాయులు ముక్తకంఠంతో ‘ఇది కాకరపర్రు, యుగాలుగా పండితులు కొలువున్న ఊరు కదా’ అన్నారు.

ఒకరు ఇది చిలకమర్తి వారు చాలాకాలం నివసించిన ఊరు అన్నారు. మరొకరు నన్నయ ఇక్కడే ఉండేవాడు అన్నారు. ఇంకొకరు నన్నయ భారత రచనకి అంకురార్పణ ఇక్కడే జరిగింది అన్నారు. నేనెప్పుడో విన్నవాటికీ నాకూ మధ్య విస్మృతి ఒక తెరలాగా కప్పడిపోయింది. నేను ఆ విస్మృతి తెరను పక్కకు లాగి నా స్మృతిపథంలో ఆ ఊరు గురించి ఎప్పుడు ఏమి వినానా అని గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాను. కాని నాతో వచ్చిన ఉపాధ్యాయిని ‘ఈ మధ్య ఒకాయన కాకరపర్రు గురించి పుస్తకం రాసారు. ఆ పుస్తకం మీకిస్తాను, చూడండి’ అన్నది. అనడమే కాక, నేను తిరిగివస్తున్నప్పుడు తన పాఠశాలకు తీసుకువెళ్ళి ఆ పుస్తకం నా చేతుల్లో పెట్టింది.

‘తరతరాల సరస్వతీపీఠం, మన కాకరపర్రు ‘(2020). కానూరి బదరీనాథ్ అనే ఆయన రాసిన పుస్తకం. ఆ పుస్తకం అక్కడికక్కడే కొన్ని పేజీలు తిప్పి చూసాను. నా బండి వెనక్కి తిప్పి మళ్ళా కాకరపర్రు వెళ్ళిపోదామనిపించింది. ఆ రోజంతా అక్కడే ఉండిపోదామనిపించింది. కాని ఆ సాయంకాలానికే నేను విశాఖపట్టణం చేరుకోవలసి ఉంది. మళ్ళా గోదావరి కాలువ ఒడ్డమ్మట కాకరపర్రు దారిన ప్రయాణించాలన్న కోరిక బలవంతాన నిగ్రహించుకోగలిగాను. మరొకరోజు తప్పకుండా మరొకసారి ఆ ఊరువెళ్తాననీ, అక్కడ కవులూ,పండితులూ ఎక్కడెక్కడ నివసించారో ఆ తావులన్నీ పేరుపేరునా చూస్తాననీ నాకు నేను చెప్పుకున్నాను.

బదరీనాథ్ గారు రాసిన పుస్తకం చదివితే, కాకరపర్రు మామూలు ఊరు కాదనీ, సాధారణమైన చారిత్రిక ప్రదేశం కూడా కాదనీ అర్థమవుతుంది. బెంగాల్లో నవద్వీపం అనే పట్టణం ఉంది. తర్కానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. చైతన్యమహాప్రభువు పుట్టిన ఊరు. నవద్వీపం అనే మాటవినగానే రామకృష్ణ పరమహంసకి స్పృహతప్పేదట. బదరీనాథ్ గారు రాసింది చదివాక, కాకరపర్రు నవద్వీపం తో సమానమైన ఊరనిపించింది. నవద్వీపంలో చైతన్యుడుంటే కాకరపర్రులో వల్లభాచార్యులు వంటి కృష్ణ భక్తుడు పుట్టిపెరిగాడు. అంతేకాదు, అప్పయ్యదీక్షితులు వంటి అద్వైతి కూడా జన్మించాడు. భక్తులూ, వేదాంతులూ సరే, అన్నిటికన్నా ముఖ్యం, ఆదికవి అక్కడ ఆంధ్రమహాభారత అనుసృజన మొదలుపెట్టాడు.

ఎంతో మహావిద్వాంసుడైనప్పటికీ, జ్ఞాని అయినప్పటికీ, నిరాడంబరంగా, సాదాసీదాగా ఉండే మహనీయులు కొందరుంటారు. కాకరపర్రు అలాంటి ఊరు. అటువంటి ఊరుమీంచి ఇన్నేళ్ళుగా వస్తూ పోతూ ఉన్నాకూడా ఇన్నాళ్ళకు గాని ఆ మట్టివిశిష్టత నాకు తెలియలేదు.

ఈ వారం రోజులుగానూ, ఆ ఊరు నాకు గుర్తొస్తూనే ఉంది. ఆ గోదావరి కాలువా, ఆ ఆకుపచ్చని దారీ, వానకు తడిసిన గాలీ, ఆ ఆకాశమూ నా మనసులో పదే పదే మెదుల్తున్నాయి. వెయ్యేళ్ళ కిందట ఆ ఊరు, ఆ గాలి ఎలా ఉండేవో నన్నయ పద్యాల్లో పోల్చుకోవాలని చూసాను.

ఏ పద్యాల్లో కాకరపర్రును పట్టుకోగలం? అడవిలో దారితప్పిన దమయంతి ఒక ఆశ్రమవాసాన్ని చూసినప్పుడా?

వారిభక్షులు, పర్ణభక్షులు, వాయుభక్షులు, శాకనీ

వారభక్షులు, వృక్షమూల నివాసయుక్తులు, నైతపం

బార జేయు మహామునీంద్రుల యాశ్రమంబెడగాంచెనం

భోరుహాక్షి పురాసమార్జిత పుణ్యకర్మఫలంబునన్

నీళ్ళూ, ఆకులూ, గాలీ, గింజలూ, కందమూలాలూ మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సుచేసుకునే ఆ మహామునీశ్వరుల ఆశ్రమాన్ని ఆమె ఏ పూర్వజన్మ పుణ్యంవల్లనో చూడగలిగినదట. కాకరపర్రు నిశ్చయంగా అటువంటి ఊరే.

మరొకచోట కూడా కాకరపర్రును పోల్చుకోవచ్చనిపించింది. వేటకి బయల్దేరిన దుష్యంతుడు అడవిలో కొంతదూరం పోయిన తర్వాత, అతడికొక ప్రదేశం కనిపించింది. అదెలా ఉందట?

అతిరుచిరాగతుండయిన యాతనికిన్ హృదయప్రమోద మా

తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదూలానిపాపవ

ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టిన యట్టి రైరి సం

పదతదళినీనినాద మృదుభాషల దీవనలొప్పనిచ్చుచున్

ఇంకా

ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల జొంపములం

బూచిన మంది యశోకములన్, సురపొన్నలు బొన్నల్ గేదగులం

గాచి బెడంగుగ బండిన యా సహకారములంగదళీతతులం

జూచుచు వీనులకింపెసగన్ వినుచున్ శుకకోకిల సుస్వరముల్

చిలుకలూ, కోకిలలూ సుస్వరంగా పాడుతున్న ఆ తావులో-

చని ముందట నాజ్యహవిర్ధృత సౌరభలతాతతులంబెస

గిన మ్రాకుల కొమ్మలమీద నపేతలతాంతములైనను బా

యని మధుప్రకరంబుల జూచి జనాధిపుడంత నెరింగె తపో

వనమిది యల్లదె దివ్యమునీంద్రనివాసము దానగు నంచు నెడన్

అది తపోవనమూ, దివ్యమునీంద్రనివాసమూ. కాబట్టి-

శ్రవణసుఖంబుగా సామగానంబులు

చదివెడు శుకముల చదువు తగిలి

కదలకవినుచుండు గరికర

శీతలచ్ఛాయ దచ్ఛీకరాంబు

కణముల చల్లనిగాడ్పాస పడి వాని

చెంది సుఖంబున్న సింహములును

భూసురప్రవరులు భూతబలుల్ తెచ్చి

పెట్టునీవారాన్నపిండతతులు…

సరే, నేను వెళ్ళినప్పటిలాగా, ఒక వానపడ్డ రోజు కాకరపర్రు ఎలా ఉండిఉంటుంది? బహుశా భీముడూ, ద్రౌపదీ అడవిలో విహరిస్తూ ఉండగా వారివద్దకి ఒక సౌగంధికం వచ్చివాలినప్పటిలాగా ఉంటుందా?

లలిత మధుస్రవములు

విలసిత మృదుపత్రతతుల వృత్తస్కంధం

బులు నవిచలిత చ్ఛాయలు

గల బదరీ తతుల జూచి కడువిస్మితులై

ఉన్నప్పుడు

అలఘులు గంధమాధన మహాధరణీసాను రత్న వే

దుల బవమాననందనుడు ద్రోవదియున్ విహరించుచున్నచో

లలితసహస్ర పత్ర కమలంబు సమీరవిధూతమై మహీ

తలము పయిన్ వడిం బడియె దద్దయు బొల్పుగ వారి ముందటన్.

‘నన్నయ్య రుషి. ఇతని శబ్దం గానం, నన్నయ్య భారతం పాడవలసింది. దీనిలో ఒక్కొక్క శబ్దం తీసుకుని బ్రద్దలు కొట్టి ఉచింతమా, అనుచితమా అని విచక్షణ చేయలేము. నన్నయ్య కొన్ని శబ్దాలను చూశాడు. కొన్ని విన్నాడు..’ అని రాసాడు కృష్ణశాస్త్రి.

ఆ లలిత సహస్రపత్ర కమలం సమీరవిధూతంగా వచ్చి పడింది అన్నమాటలో ‘సమీరవిధూతం’ అనే మాట కవి చూస్తే తప్ప చెప్పలేని మాట. నేను కారకపర్రు వెళ్ళినరోజున ఆ గాలినీ, ఆ ఆకాశాన్నీ చూసానుగానీ, దానికి తగ్గ మాట ఇప్పుడు స్ఫురిస్తున్నది. సమీర విధూతం అనే మాటవినగానే క్షాళిత సమీరం అనే మాట స్ఫురిస్తున్నది. ఆ రోజు ఆ గాలి ప్రక్షాళిత సమీరం, ఆ ఆకాశం శుభ్రధౌత గగనం.

ఇదంతా సరే, అంతకాలం గోదావరి ఒడ్డున గడిపిన నన్నయ్యకి గోదావరి ఎలా కనబడి ఉంటుంది? రామాయణమైతే గోదావరిని నేరుగా వర్ణించి ఉండవచ్చుగాని, భారతంలో గోదావరిని ఎట్లా చూపడం? అందుకని బహుశా గంగని వర్ణించినప్పుడు ఆ మిషన గోదావరిని వర్ణించేడేమో అనుకుంటాను. మొదటిసారిగా శంతనుడు గంగాతీరంలో విహరిస్తున్నప్పుడు, గంగ అతనికి ఇలా కనబడిందట:

కని, వనకన్యయో, దనుజకన్యయో, భుజగేంద్ర కన్యయో

అనిమిష కన్యయో ఇది వియచ్చర కన్యకయో యపూర్వ మీ

వనమున కిట్టులేకతమ వచ్చునె మానవకన్య యంచు మీ

య్యనఘుడు దాని చిత్తమున నాదట వోవక చూచె బ్రీతితోన్

ఇది నా అనుభవం కూడా. గోదావరి ఒకసారి కనబడ్డట్టు మరొకసారి కనబడదు. ఒకసారి ‘అడవి చెట్లన్నీను జడలోన తురుముకుని ‘ కనిపిస్తుంది. మరొకసారి పాముపిల్లలాగా సరసరసాగిపోతుంది. కొన్నిసార్లు రాక్షసి. మరికొన్ని సార్లు దేవత. చాలాసార్లు ఆ మిలమిలని బట్టి ఆమె అప్సరస అని ఇట్టే తెలిసిపోతుంది.

వెళ్ళాలి మరొకసారి కాకరపర్రు.

15-7-2021

Leave a Reply

%d bloggers like this: