విషాదమధుర వాక్యం

ఎమెస్కో ప్రచురించిన ‘ఎంకి పాటలు ‘ ఆవిష్కరణ సందర్భంగా అమెరికాలో ఉన్న తెలుగు వారు కొందరు ఒక సదస్సు పెట్టుకుని నన్ను కూడా జూమ్ లో చేరి మాట్లాడమని అడిగారు. ఆ సమావేశంలో నా వంతు రావడానికి చాలాసేపే పట్టింది. అంతసేపూ మాట్లాడిన వక్తలు ప్రతి ఒక్కరూ ఎంకి పాటల్లోంచి ఒకటో రెండో ఏదో ఒక పల్లవినో చరణమో పాడుతూనే ఉన్నారు. ఎంకిపాటల గురించి మాట్లాడేవాళ్ళు తరచూ ప్రస్తావించే విశేషాలు వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. వాళ్ళ మాటలు వింటూ ఉండగా, కొంతసేపటికి ఎంకి కూడా వాళ్ళతో పాటు అమెరికా వెళ్ళిపోయిందా అనిపించింది. ఎందుకంటే ఇక్కడి సాహిత్య చర్చల్లోగాని, స్నేహితుల మధ్య గురించి గాని ఎంకి మాట వినబడి చాలా కాలమే అయ్యింది. నాకు తెలిసి నేను చివరి సారి విన్నది, నండూరి సుబ్బారావుగారి పైన సాహిత్య అకాడెమీ కోసం మా అక్క రాసిన మోనోగ్రాఫు ఆవిష్కరించినప్పుడు. అది జరిగి కూడా అయిదారేళ్ళయ్యింది.

మొన్నటి సమావేశం పూర్తి స్థాయి సాహిత్య సమావేశం కాదు కాబట్టి ఎంకిపాటల గురించి నేను మరీ ఎక్కువ విస్తారంగానూ, లోతుగానూ మాట్లాడే అవకాశం లేకపోయిందిగాని, ఆ మర్నాటికి నాకు ఎంకి జ్వరం పూర్తిగా పట్టేసింది. ఒకప్పుడు మా మాష్టారు ఇట్లాంటి అవస్థ అనుభవిస్తుండటం చూసేను. ఆయన్ని కాళిదాసుగురించో, కృష్ణశాస్త్రి గురించో మాట్లాడమని పిలిచేవారు. ఆయన ఆ ప్రసంగం కోసం రెండు మూడు రోజులు ముందునించే ఆ మనఃస్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆ రోజు ఒక గంటనో, రెండు గంటలో మాట్లాడి ఇంటికి వచ్చేసాక, ఆ కవి ఆయన్ని పూర్తిగా ఆవహించేసేవాడు. ఆ మర్నాడు ఆయన్ని చూడటానికి వెళ్తే కళ్ళు ఎర్రబడి పోయి ఉండేవి.

ఆ రాత్రి తర్వాత రెండు మూడు రోజుల దాకా నా అవస్థ కూడా అట్లానే ఉండింది. ఆ అవస్థ ఎట్లాంటిదో అందరికన్నా ముందు ఆ కవికే అనుభవం. అందుకనే ఇట్లా అనుకున్నాడు:

యెంకిపాటినగానె

యెదర నిలిసే దెవరొ?

నా సూపు

సెదరగొట్టేదెవరొ?

నా తోవ

సదునుసేసేదెవరొ?

నా చాలా పసితనంలో మా అక్క వైతాళికులు పుస్తకం నాకు పరిచయం చేసినప్పణ్ణుంచి ఎంకి పాటలు, పాతవీ, కొత్తవీ కూడా పూర్తిగా చదివిన రోజుల కన్నా ,ఇప్పుడు ఎంకి నాకు మరింత కొత్తగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యం, దేశదేశాల కవిత్వం నాకు పరిచయమైన తర్వాత, గాథాసప్తశతి, వజ్జాలగ్గం, కురుంతొగై, చర్యాగీతాలు చదివిన తర్వాత, అత్యంత రాగాత్మకమైన పందొమ్మిదో శతాబ్ది యూరపియన్ కవులు, గొథే, షిల్లర్, పాల్ వెర్లేన్, హైన్రిక్ హీన్, అలెగ్జాండర్ పుష్కిన్ వంటి కవుల కవిత్వంలోని సంగీత మహిమ ఎటువంటిదో తెలిసి వచ్చాక, ఎంకి పాటలు తెలుగు సాహిత్యానికి ఎంత అపురూపమైన కానుకనో అర్థమవుతూ ఉంది. ఆ పాటలు కాదు, ఆ పాటల వెనక ఉన్న ‘మాటలనియెడు మంత్రమహిమ ‘గోచరిస్తూ ఉంది.

ఆ రాత్రి ఆ సమావేశంలో ఒక ఎంకి పాట చదివివినిపిద్దామని ఏ పాట తెరిచినా, ప్రతి ఒక్క పాట దగ్గరా నా హృదయం మూర్ఛపోతూనే ఉంది. చివరికి ఈ పాట చదివివినిపించాను:

ఆనాటి నావోడు సెందురూడా

అలిగి రాలేదోయి సెందురూడా

‘యెంకి! మన మిద్దరమె

యెవ్వరొ ‘ద్దన్నాడు;

‘యీ సేలు యీ తోట లింక

నీ ‘ వన్నాడు-

మాటాడుతుండంగ సెందురూడా!

మంచిదా పోయేవు సెందురూడా!!

‘కలకాల మీ దినమె

నిలుసు మన ‘ కన్నాడు;

‘ గాలికైనా తాను

కవుగీల’ నన్నాడు-

నను సూసి నవ్వేవు సెందురూడా!

నాయమా నా ముద్దు సెందురూడా!!

నా కాసి సూశాడు

నీ కాసి సూశాడు;

‘మద్దె సెంద్రుడె మనకు

పెద్దమని ‘ సన్నాడు-

కన్నీరు నీ కేల సెందురూడా!

కనికారమే శాన సెందురూడా!!

ఏమి పాట ఇది! ఎటువంటి నిర్మాణం ఇది! ఎటువంటి ప్రయాణం ఉందిందులో! అసలన్నిటికన్నా ముందు ఆ ఎత్తుగడ. ‘అనాటి నావోడు..’ ఇంతకన్నా విషాదమధుర వాక్యం మరొకటి ఉంటుందా? ‘అనాటి..’ అనే మాటలో ఉందంతా. ఆ ఒక్క మాట ఒక Paradise Lost మహాకావ్యం. ‘అనాటి నావోడు ‘ వాడు ‘నావోడు ‘.కాని ఇప్పుడు ‘ఆనాటి నావోడు.’ ఆ ఒక్క మాటతో ఆ కవిత పూర్తయిపోయింది. ఇక ఆ తర్వాత ఉన్నదంతా ఆ దుఃఖాన్ని విస్తరించి విస్తరించి చెప్పడమే. ఆ చెప్పడంలో కూడా ఎన్ని మలుపులు! ఎన్ని మజిలీలు!

ఆమె తన వేదనని పంచుకోడానికి చంద్రుడు తప్ప మరొక దిక్కులేదు. ఆమె ఎందుకు చంద్రుడికే చెప్పుకుంటున్నదో చివరి చివరికి మనకి తెలుస్తుంది. కాని ముందు పాట మొదలుపెట్టగానే ‘ఆనాటి నావాడు అలిగి రాలేదు, అప్పట్లో ఎంకీ, మనకి మనమిద్దరమే, ఇంకెవ్వరూ వద్దన్నాడు, ఎవరితోటీ పనిలేదన్నాడు ‘అని ఆమె చెప్తూ ఉండగానే చంద్రుడు ఆగి వినకుండా కదిలిపోతున్నాడు. మబ్బుల్లో దాగిపోతున్నాడు. తనవాడిలానే చంద్రుడు కూడా ముఖం చాటేస్తున్నాడా అనిపించింది ఎంకికి. అందుకని ‘మాటాడుతుండగానే చంద్రుడా, మంచిగా దాగిపోతున్నావా?’ అని నిలదీసింది. దాంతో చంద్రుడు బహుశా ఒక్క క్షణం ఆగిఉంటాడు. అప్పుడామె తర్వాతి కథ చెప్తోంది. ‘ఆ నాటి నావాడు ఆ రోజు మేమిద్దరమూ కలుసుకున్న ఆ దినం, ఆ క్షణమే శాశ్వతమనీ కలకాలం అది నిలిచిపోతుందనీ నన్ను నమ్మించాడు. ఆ రోజు మా ఇద్దరి మధ్యా గాలి కూడా చొరబడటానికి వీల్లేనంత బిగికౌగిలిలో నన్ను బంధించాడు. ఆ కౌగిలి మహిమ అటువంటిది, మేమిద్దరం గాలి కూడా చొరబడనంత దగ్గరితనంలోనే కలకాలం నిలిచిపోతామనుకున్నాం. కాని ఇదేమిటిది, ఇంతలోనే నావాడు ఆనాటి నావాడు గా మారిపోయాడు ‘అంటూ ఉంటే, ఆ అమాయికత్వానికి చంద్రుడికి నవ్వొచ్చింది. అది ఆమె కంటపడకపోలేదు. ‘నన్ను చూసి నవ్వుతున్నావు, నా ముద్దు చంద్రుడా నీకిది న్యాయమా? అని జాలిగా అడిగింది. ఎందుకంటే ఆమె బాధ చూసి ఎవరన్నా నవ్విపోవచ్చుగాని చంద్రుడికి ఆ అధికారం లేదు. ఎందుకని? ఎందుకో అప్పుడు చెప్తోంది. ‘ఆ రాత్రి మేమట్లా బిగి కౌగిలిలో ఉండగా ఆనాటి నావాడు నావైపొకసారి చూసాడు, ఆకాశంలో నీవైపొకసారి చూసాడు. ముందేమో ఎంకీ, మనమిద్దరమే, మనకి ఇంక ఎవ్వరూ వద్దన్నాడు కదా. కాని నిన్ను చూడగానే ఏమనిపించిందో, ఇదిగో, మనకిద్దరికీ ఈ చంద్రుడే పెద్దమనిషి అన్నాడు. అంటే మా ప్రణయానికీ, మా బంధానికీ, అనుబంధానికీ నువ్వే సాక్షివి, పెద్దమనిషివి, పెద్దదిక్కువి.,’అని ఆమె చెప్తుండగా చంద్రుడు ముందుకు పోలేకపోయాడు, ఇందాకటిలాగా చిరునవ్వు నవ్వలేకపోయాడు. ఇప్పుడు ఆమె వేదనలో తనకీ భాగం ఉందని గుర్తురాగానే చంద్రుడు కన్నీరు కార్చకుండా ఉండలేకపోయాడు. ఆ రాత్రి చంద్రుడు కార్చిన కన్నీరుగా ఆ వెన్నెల కురుస్తుంటే, ఎంకి గుండె మరింత కరిగిపోయింది. ‘అయ్యో, చంద్రుడా, నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు? నాకు నీ కనికరం దక్కితే అదే చాలు. నా బాధ నువ్వు అర్థం చేసుకోగలిగితే అదే చాలు ‘అంటున్నది. అప్పుడామె బహుశా ఆమె తన చీరచెరగుతో చంద్రుడి కన్నీరు తుడిచి ఉంటుంది కూడా.

కన్నీరు నీకేల సెందురూడా

కనికారమే సాన సెందురూడా

ఎంకి ఈ మాటలు తన గురించి మాత్రమే కాదు, తన సమస్త కవిలోకాన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటలు. ఎందుకంటే, అప్పటికే కృష్ణశాస్త్రి ఇలా విలపిస్తున్నాడు:

నన్నుగని యేరు జాలిచెందంగ వలదు-

ఎవ్వరని యెంతురో నన్ను? -ఏ ననంత

శోకభీకర తిమిరలోకైక పతిని!

ఇంకా-

మీరు మనసారగా నేడ్వనీరు నన్ను-

నన్ను విడువుడు! ఒకసారి నన్ను విడిచి

నంత నేకాంత యవనికాభ్యంతరమున

వెక్కివెక్కి రోదింతును-

ఇంకా-

అపుడు గొంతెత్తి యేడ్చినాను, అపుడు నన్ను

కాంచగా నోపగా లేక కన్నులట్టె

యార్చికొనినవి తారకలు,

ఏమి వేదన! ఆ వేదన చూడలేక తారకలే కన్నుల రెప్పలు వాలిపోయినవట. కాని తన వేదన చూడలేక చంద్రుడిప్పుడు కరిగినీరయిపోయాడంటున్నది ఎంకి. అందుకని కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దని చెప్తున్నది చంద్రుడికి.

ఈ పాట మనలో రేకెత్తించే స్వాప్నికలోకం ఎటువంటిదో గాని, ఆ చంద్రుడు తెలుగు కవుల్ని వదలనే లేదు. శ్రీ శ్రీనుంచి ఆత్రేయదాకా. ఈ పాట తలుచుకోగానే, ఈ సినిమా పాట నాకు గుర్తుకు రాకుండా ఉండదు:

కోడి కూసే జాముదాకా తోడు రారా చందురూడా

కోడె కారు కొత్త కోర్కెలు రగులుతున్నవి అందగాడా.

కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను

కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను

కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం

కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేడా

కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు

తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట

తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట

మత్తు తెలిసిన చందురూడా…మసక వెలుగే చాలు లేరా

అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది

చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట

చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట

తీపి మాపుల చందురూడా… కాపువై నువ్వుండి పోరా

ఎంకి లేకపోతే ఆత్రేయ లేడు. ఆయనకి ఎంకి అంటే ఎంత ఆరాధన అంటే ఆమెని తెల్లవారే వేళ ఆవరించే వెలుగుతో పోల్చాడు. అక్కడితో ఆగలేక, ఆ పాటలోనే

తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా _ ఎంకి

కొప్పులోని ముద్దబంతి పువ్వులా

గోదారి కెరటాల గీతాల వలె నాలో

పలికినది _ పలికినది _ పలికినది…

చల్లగా _ చిరుజల్లుగా

జలజలా గలగలా….

అని అనేదాకా ఆగలేకపోయాడు.

ఎంకిని తెలుగు కవులు ఎట్లా అనుసరించారో, బాహాటంగానూ, రహస్యంగానూ కూడా, వెతికి పట్టుకోవడంలో ఒక సంతోషముంది.

చూడండి:

యేడనే నీ కాపురమో యెల్తురు పిల్లా

నీ

నీడలోనే మేడ కడతా నాయుడు బావా

అని ఎంకి కదా అంది, కాని ఆ ఒక్క మాటతో ఆమె శ్రీ శ్రీ హృదయంలో నిదురించే చెలిగా మారిపోయింది, చివరికి, శ్రీ శ్రీ ఆమె మాటలే తన మాటలుగా ఎలుగెత్తి చాటుకున్నాడు.

నీ వెచ్చని నీడా వెలసెను

నా వలపుల మేడా

ఎవడో కొంటెవాడు ఆ చెలి ఎవరని అడిగితే, ఎంకి అని చెప్పలేక, కమ్యూనిజం అని జవాబిచ్చాడు!

ఎంకి రహస్యారాధకుల్లో ఇస్మాయిల్ కూడా ఉన్నాడని ఇప్పుడు పసిగట్టాను. ఆయన ‘హృదయభక్షి ‘ కవిత గుర్తుందికదా మీకు. అదిగో, ఆ హృదయభక్షిని ఆయన తొలిసారి ఇక్కడ చూసాడు:

రాసోరింటికైన

రంగు తెచ్చే పిల్ల

నా సొమ్ము- నా గుండె

నమిలి మింగిన పిల్ల!

నా మానాన నా ఉద్యోగమేదో చేసుకుంటున్న నన్ను ఎంకి ఒక్కసారిగా చెదరగొట్టేసింది. ఇప్పుడు నాకు ఎన్నెలంతా నెమరేసిన ఆ యేరు, ఆ కొండ, ఆ తెల్లవారు జామున తేనెరంగు తిరిగే నెలవంక, గాలికి కూడా చోటివ్వని ఆ కౌగిలి- ఇవి కావాలనిపిస్తున్నది. అన్ని పనులూ పక్కన పెట్టేసి, ఇదిగో, ఈ పాట పదే పదే హమ్ చేయాలనిపిస్తున్నది:

ఆరిపేయవె దీపమూ

యెలుగులో నీ మీద నిలపలేనే మనసు

ఆరిపేయవె దీపమూ

సూపులే ఆపేసి

రూపు వూసే మరిసి

వొకరెరుగ కింకొకరు

వొరిగి నిదరోదాము

ఆరిపేయవె దీపమూ..

20-3-2021

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%