మాయగీతము

ఒకప్పుడు జర్మనీలో హెర్డర్ అనే ఒక పండితుడుండేవాడు. జర్మన్ గ్రామసీమల్లో రైతులూ, పశువుల కాపర్లూ పాడుకునే పాటల్ని, చెప్పుకునే కథల్నీ సేకరించి జర్మనీ తన సాంస్కృతికమూలాల్ని వాటిల్లో వెతుక్కోవాలని చెప్పాడాయన. అప్పటికి ప్రచలితంగా ఉన్న ఫ్రెంచి ఎన్ లైటన్ మెంటు యుగాదర్శాలనుంచి, భావజాలం నుంచి జర్మనీని తప్పించి, అమాయికమైన, నిష్కపటమైన జర్మనీ అడవులవైపూ, పల్లెపట్టులవైపూ కవుల రచయితల దృష్టి మళ్ళించాడు.

ఆయన ప్రభావానికి లోనైన గొథే అటువంటి కథల్ని కొన్నింటిని జానపదబాణీల్లో పాటలు కట్టాడు. అటువంటి ఒక గీతం Erl King ని నేను గతంలో ‘భూతాల కాన’ గా అనువదించి ఇక్కడ పరిచయం చేసాను.

గొథే సుప్రసిద్ధ నాటకం Faust లో The King of Thule కూడా అటువంటి గీతమే.

గొథే తర్వాత ఆ కృషిని మరింత ముందుకు తీసుకుపోయినవాడు హైన్రిఖ్ హైని. ఆయన గీతాలు నోటికి రాని జర్మన్ ఉండడు. హైని గీతాల్ని కొన్నింటినేనా తెలుగు చేయాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాను.

అందులో మొదటగా, The Lorelei అనే గీతం. లోరెలీ జర్మన్లో రైన్ నది ఒడ్డున ఉన్న ఒక నిటారు పర్వతశిఖరం. మర్మరమంగా ధ్వనించే శిఖరం అని దాని అర్థం. ఆ కొండ పక్కన ఆ నదిలో ఎన్నో నావలు సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయాయి. ఆ కొండమీద ఒక సుందరి ఉండి పాటలు పాడుతూ ఉంటుందనీ, పడవనడిపే వాళ్ళు ఆ పాట వింటూ దారితప్పి మరణిస్తుంటారనీ స్థానిక కథనం. హోమర్ రాసిన ఒడెస్సీలో సైరన్లలాంటి ఆ గాయికసుందరిమీదా, ఆమె మాయగీతం మీదా హైని రాసిన కథాగీతమిది.

~

మాయగీతం

కతనమేమో తెలియకున్నది

గూడు కట్టెను దిగులు గుండెన

పూర్వకాలపు గాథ ఒక్కటి

మనసునేలనొ వదలకున్నది.

శీతపవనము, సంధ్యసమయము

శాంతముగనది సాగుతున్నది

కొండచరియలపైన సాయం

సూర్యకాంతులు మెరయుచున్నవి.

అందమలరగ, సుందరొక్కతె

మణులు శిరసున, స్వర్ణవస్త్రము,

కనక కబరీభరము కైకొని

కూరుచున్నది కులుకులొలుకుచు.

పసిడిదువ్వెన చిక్కు తీయుచు

పడతి ఏదో పాటపాడగ

మంత్రముగ్ధగ మారిపోయెను

చెట్టు చేమల సకలజగమును.

నదిన సాగే నావనందున

పడవవాడా పాటవినగా

బెంగపుట్టెను, చూడసాగెను

మాటిమాటికి కొండకొమ్మును.

దారితప్పెను, మునిగిపోయెను

నావతోటే నావికుడునూ.

ఏమి చెప్పుదు? మిగిలెనక్కడ

మంత్రశిఖరము, మాయగీతము.

24-6-2021

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading