ఎనీడ్ -1

ఎనీడ్ మహాకావ్యం చదవడం పూర్తిచేసాను. ఎన్నో ఏళ్ళుగా అనుకుంటూ ఉన్నది, ఇప్పటికి పూర్తయింది. వర్జిల్ (క్రీ.పూ 70-19) రోమన్ మహాకవి. ఆయన లాటిన్ భాషలో రాసిన ఇతిహాసం ఎనీయడ్. మనం యూరప్ నీ, పాశ్చాత్య ప్రపంచాన్నీ అర్థం చేసుకోవాలంటే చదవవలసిన కొన్ని గ్రంథాలున్నాయి. వాటిని ఒక western canon గా అభివర్ణిస్తూంటారు. వాటిలో ఎవరి గ్రంథాల జాబితా వారిదే అయినప్పటికీ, తప్పనిసరిగా చదవలసిన వాటిలో, గ్రీకు మహాకవి హోమర్ రాసిన ఇలియడ్, ఒడెస్సీ, గ్రీకు నాటకకర్త సోఫోక్లిస్ రాసిన ఈడిపస్ రెక్స్, ప్లేటో రిపబ్లిక్, అరిస్టాటిల్ పొయెటిక్స్, ఇటాలియన్ మహాకవి డాంటే డివైన్ కామెడీ, షేక్స్పియర్ నాలుగు మహావిషాదాంత నాటకాలూ, ఫ్రెంచి సాహిత్యకారుడు మాంటేన్ వ్యాసాలూ, ఇటాలియన్ రచయిత బొకాషియో డికామెరూన్, ఆధునిక జర్మన్ మహాకవి గొథే ఫౌస్ట్ మొదటి భాగం, స్పానిష్ మహారచయిత సెర్వాంటిస్ రాసిన డాన్ క్విక్సోట్, కిర్క్ గార్డు ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్, టాల్ స్టాయి యుద్ధం-శాంతి, డాస్టొవస్కీ బ్రదర్స్ కరమజోవ్, జాయిస్ రాసిన యులిసెస్, కాఫ్కా మూడు నవలలూ అటు వంటి కొన్ని ముఖ్యగ్రంథాలు. ఎనీయడ్ కూడా వాటిలో ఒకటి. ఇంకా చెప్పాలంటే, ఇలియట్ మాటల్లో ఎనీయడ్ మొత్తం యూరోప్ కే క్లాసిక్. థియొడర్ హేకర్ అనే ఒక జర్మన్ పండితుడి దృష్టిలో వర్జిల్ ఏకంగా పాశ్చాత్య ప్రపంచపు పితామహుడు.

సాధారణంగా యూరోప్ కి హోమర్ ప్రాతిపదిక అనుకుంటాం. కాని వాస్తవానికి, పాశ్చాత్య ప్రపంచపు భావుకతనీ, భావోద్వేగాల్నీ వర్జిల్ ప్రభావితం చేసినంతగా హోమర్ ప్రభావితం చేయలేదనే చెప్పాలి. డాంటే, మిల్టన్ లమీదుగా ఇలియట్ దాకా యూరపియన్ మహాకవులకి వర్జిల్ ఒక నమూనా. హోమర్ ని అనుసరించినవాళ్ళు యూరోప్ లో అయితే ఉన్మాదులయ్యారు లేదా ఒంటరివాళ్ళయిపోయారు. హోల్డర్లిన్, కీట్స్, జాయిస్- ఈ సంఖ్య చాలా చిన్నది. కాని వర్జిల్ కేవలం ఐరోపీయ కావ్యాదర్శాలని మాత్రమే కాదు, నాగరికతాదర్శాలనీ, రాజకీయ ఆదర్శాలనీ కూడా ప్రభావితం చేస్తూ వచ్చాడు. అందువల్ల వర్జిల్ ని అనుసరించిన వాళ్లు మహాకవులుగా ప్రఖ్యాతులయ్యారు.

ఎనీడ్ వర్జిల్ రాసిన రోమన్ మహేతిహాసం. ఒక రకంగా అది రోమన్ మనుచరిత్ర. రోమ్ పుట్టుకకి కారణమైన పూర్వీకుల కథ. హోమర్ ఇలియడ్ లో అప్రధానమైన ఎనియస్ అనే ఆయన ట్రాయ్ నగరం నుంచి తప్పించుకుని, తన భవిష్యత్తుని, తన కర్మభూమిని వెతుక్కుంటూ అనేక ప్రయాణాలు చేస్తూ చివరికి ఇటలీలో అడుగుపెట్టడం ఎనీయడ్ ఇతివృత్తం. ఆ ప్రయాణంలో అతడు తనకు వినిపిస్తున్న దైవవాణిని నమ్ముకుంటూ, ఆ దైవవాణి పట్ల విధేయంగా, తనదైన ప్రతి ఒక్కదాన్నీ వదులుకుంటూ, ఒక దేశంకోసం, ధర్మంకోసం ముందుకు నడుస్తాడు. ఒక విధంగా ఎనియస్ రాముడి వంటి కథానాయకుడు. తనకి విధించబడ్డ కర్తవ్యాన్ని నెరవేర్చడంకోసం రాముడు తనని తాను నిరాకరించుకున్నట్టే, ఎనియస్ కూడా తనదైన ప్రతి ఒక్కటీ వదులుకుంటూ వెళతాడు.

ఇంకా చెప్పాలంటే ఎనియస్ రాముడికన్నా మరింత విషాదపాత్ర. ట్రాయ్ నగరం మంటల్లో దగ్ధమవుతూ ఉండగా, తన తండ్రినీ, తన కుమారుణ్ణీ, తన దేవతల్నీ వెంటబెట్టుకుని ఆ నగరం నుంచి బయటపడే క్రమంలో తన భార్యని పోగొట్టుకుంటాడు. అదొక మహావిషాదం. ఆ తర్వాత తాను చేసిన సంచారాల్లో భాగంగా కార్తేజిలో అడుగుపెట్టినప్పుడు అక్కడి మహారాణి డిడో అతణ్ణి ప్రేమిస్తుంది. అతడు ఆ ప్రేమకి ప్రతిస్పందిస్తాడు. కాని దేవతలు అతడి గమ్యం కార్తేజి కాదని హెచ్చరించడంతో తన మనసు రాయి చేసుకుని డిడోని వదిలిపెట్టివెళ్ళిపోతాడు. ఆమె ఆ దుఃఖం భరించలేక అతడి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆత్మహత్య చేసుకుంటుంది. చివరికి అతడు తన వాగ్దత్త వసుంధర ఇటలీని చేరుకుంటాడు. అక్కడి రాజు లాటినస్ తో దైవవాణి అతని కూతురు లవినియాని, తమ తీరానికి చేరిన ఆగంతుకుడైన, ఎనియస్ కి ఇచ్చి పెళ్ళి చేయమని చెప్తుంది. కాని లాటినస్ అంతకుముందే తన బంధువు టర్నస్ కి ఆమెని ఇచ్చి పెళ్ళిచేస్తానని వాగ్దానం చేసి ఉంటాడు. దాంతో లాటినస్ కి అతిథిగా వెళ్ళినప్పటికీ, ఎనియస్ కీ, టర్నస్ కీ మధ్య యుద్ధం తప్పదు. ఏనియాస్ అనుచరులైన ట్రోజన్ వీరులకీ, లాటిన్ వీరులకీ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. చివరికి, ఆ హింసనీ, రక్తపాతాన్నీ నివారించడానికి, లాటినస్, ఎనియస్ శాంతి ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధపడతారు. కాని, ఆ చివరినిమిషాల్లో టర్నస్ మళ్ళా మరొక యుద్ధం మొదలుపెడతాడు. ఇరుపక్షాల సైనికులూ, వీరులూ, యువతీ యువకులూ అసంఖ్యాకంగా మరణించాక, వారి నెత్తురుతో ఇటలీ తడిసిపోయాక, చివరికి ఎనియస్ టర్నర్ ని సంహరించడంతో కథ ముగుస్తుంది.

ఎనీడ్ పన్నెండు సర్గల మహాకావ్యం. ఆ కావ్యాన్ని లాటిన్ భాషలో చదవగలిగినవాళ్ళు భాగ్యవంతులు. ఇంగ్లీషులో చెప్పుకోదగ్గ అనువాదాలు వచ్చినప్పటికీ, నేను అలెన్ మండెల్ బామ్ చేసిన పద్యానువాదం The Aeneid of Virgil (1961)చదివాను. దానితో పాటు డేవిడ్ వెస్ట్ అనే ఆయన పెంగ్విన్ బుక్స్ కోసం చేసిన వచనానువాదం The Aeneid (1990) కూడా. ఆ రెండూ మార్చి మార్చి చదివాను. వచనానువాదం కూడా ఎంతో బిగువుతోనూ, కౌశల్యంతోనూ చేసినప్పటికీ, పద్యానువాదం ఒక తుపానులాగా నన్ను నిలవనివ్వలేదు. ఎందుకంటే అలెన్ మెండల్ బామ్ ఆ కావ్యాన్ని ఒక అన్వేషణలాగా అనువదించాడు. వర్జిల్ కి ఆ కావ్యం రాయడానికి పదకొండేళ్ళు పడితే మెండల్ బామ్ కి అనువాదానికి ఆరేళ్ళు పట్టింది. తన అనువాదానికి 1970 లో మెండల్ బామ్ ఒక ముందుమాట రాసుకున్నాడు. అందులో ఆయన తనని వర్జిల్ వైపుగా నడిపించిన శక్తుల గురించి వివరించాడు.

మామూలుగా గ్రీకు, రోమన్ సాహిత్యాల గురించి మాట్లాడేవారు హోమర్ ని ఒక స్థాయిలోనూ, వర్జిల్ ని అంతకన్నా కొద్దిగా కింద స్థాయిలోనూ పెట్టి మాట్లాడుతుండటం పరిపాటి. తాను కూడా అటువంటి అపోహకి లోనయినందువల్లనే చాలా ఏళ్ళు ఎనీడ్ కావ్యానికి దూరంగా ఉండిపోయానని రాసుకున్నాడు మెండల్ బామ్. తాను వర్జిల్ ని సమీపించకుండా అలా అడ్డుపడ్డ ముగ్గురు పండితుల్ని పేర్కొంటూ, వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మాక్ వాన్ డొరెన్ అన్న మాటలు Homer is a world, Virgil, a style అన్నవి తన యవ్వనకాలమంతా వర్జిల్ కి దూరంగా పెట్టేసాయని చెప్పుకున్నాడు. కోలరిడ్జ్ కూడా దాదాపుగా ఆ మాటే అన్నాడట: ‘మీరు వర్జిల్ లోంచి ఆయన ఛందస్సునీ, పదజాలాన్నీ తీసేస్తే, ఇంకేముంటుంది అక్కడ’ అని. హోమర్-వర్జిల్-డాంటే అనే కవిత్రయంలో అయితే అటు హోమర్ తోటో లేదా ఇటు డాంటే తోటో పోలుస్తూ, వర్జిల్ ని ఎప్పటికీ వెనక్కి నెడుతూనే ఉన్నారని తాను ఆలస్యంగా గ్రహించానంటాడు మెండల్ బామ్. తనని అటువంటి దురభిప్రాయం నుంచి తప్పించి వర్జిల్ కి సన్నిహితుణ్ణి చేసినవాళ్ళల్లో మొదట డాంటేని, ఆ తర్వాత ఉంగారెట్టిని స్మరించుకోవాలంటాడు.

గుయెస్సెప్పి ఉంగారెట్టి ఆధునిక ఇటాలియన్ కవిత్వానికి వైతాళికుడు. ఎనీడ్ ని ఆయన ఒక ప్రాచీన పురాణగాథలాగా చూడలేదు. అందుకు బదులు, దాన్నొక అన్వేషణగా, ఒక వాగ్దత్త వసుంధరవైపు ఒక మానవుడు చేసిన నిర్విరామప్రయాణంగా చూసాడు. ప్రసిద్ధ మార్క్సిస్ట్ విమర్శకుడు లూకాక్స్ వర్జిల్ ని ఒక యుటోపియన్ గా పరిగణించాడని చెప్తూ, కాని ఆ దృక్కోణాన్ని నిరాకరిస్తాడు మెండల్ బామ్. ఒక ఆగామిభవిష్యత్తుకోసం సన్నిహిత వర్తమానాన్ని వర్జిల్ ఎన్నడూ నిరాకరించలేదని చెప్తాడు. ఇంకా చెప్పాలంటే, తాను ఎన్నటికీ తిరిగిపొందలేని ఒక గతం పట్ల వర్జిల్ కి అపారమైన స్పృహ ఉందని చెప్తాడు. ఆ మాట మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే, ఎనీడ్ రాయకముందు వర్జిల్ Eclogues అనే పది గీతాలు రాసాడు. అవి అకలుషితమైన, గ్రామీణ, సస్య జీవితానికి చెందిన గీతాలు. ఎకొలాగ్స్ లో పాడిపంటలు పొంగిపొర్లే కవిత్వానికీ , రక్తం ఏరులుగా పారిన ఎనీయడ్ కీ మధ్య ఎక్కడా పోలిక కనిపించదు. ఆ తర్వాత ఎనీయడ్ రాయడానికి ముందు వర్జిల్ Georgics అనే మరొక నాలుగు గీతాలు రాసాడు. ఆ గీతాల్లో ఎనీడ్ లోని ఆందోళన కొంత సూచన ప్రాయంగా కనిపిస్తుంది.

మనం ఎనీడ్ ని లాటిన్ లో చదివే అవకాశం లేదు కాబట్టి, ఆ కావ్యంలోని కవిత్వ విశేషాలకి బదులు తక్కిన విషయాలు మాట్లాడుకోక తప్పదేమో అనుకోవచ్చు మీరు. అందుకనే ఒక పండితుడు ఎనీడ్ ని secondary epic అన్నాడు.అంటే ఆ ఇతిహాసంలో కవిత్వం, పురాణకథ ఇవన్నీ పక్కకుపోయి, ఆ కవి ప్రకటించిన సామాజిక-రాజకీయ అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుకునే ఇతిహాసం అన్నమాట. మన దగ్గర రామాయణానికి ఇటువంటి పరిస్థితి ఉంది. కాని అతి బలహీనమైన అనువాదంలో చదివినా కూడా కవిగా వాల్మీకి ప్రతిభని మనం పట్టుకోగలిగినట్టే, ఇంగ్లీషు అనువాదం చదివి కూడా మనం వర్జిల్ ని మహాకవి అని అంగీకరించగలం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రయోగించే ఆ ఉపమానాలు. నిన్ను నిలవనియ్యని ఆ కథాకథన చాతురి. నిన్ను ఉక్కిరిబిక్కిరిచేసే ఆ సంఘటనా క్రమం. అన్నిటికన్నా ముఖ్యంగా అల్పవివరాల్ని కూడా తన దృష్టిపథం నుంచి పక్కకు పోనివ్వని ఆ లోకజ్ఞత, ఆ సూక్ష్మపరిశీలనా శక్తి.

కాని గత రెండువేల ఏళ్ళుగా ఎనీడ్ ఒక కావ్యంగా కన్నా కూడా ఒక రాజకీయ రచనగానే యూరోప్ ని ప్రభావితం చేస్తూ ఉన్నది, మరీ ముఖ్యంగా ఇరవై, ఇరవై ఒకటవ శతాబ్దాల్లో.

3-6-2021

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading