స్మృతిగా, స్వప్నంగా, ఊహగా

లూయిస్ గ్లూక్ పన్నెండు కవితాసంపుటాల్నీ ఒకదానితో ఒకటి పోల్చడానికి లేదు. ప్రతి ఒక్క కొత్త సంపుటంతోనూ ఆమె తన పాఠకుల్నీ, ప్రపంచాన్నీ కూడా ఆశ్చర్యపరుస్తూనే వచ్చింది. తననెవరూ ఒక గాటన కట్టడానికి వీల్లేకుండా ఆమె ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఆమె కవిత్వం మీద మొదటిసారిగా సమగ్రమైన ఒక పరిశీలనకు ప్రయత్నించిన డేనియల్ మోరిస్ తన పుస్తకం The Poetry of Louise Gluck: A Thematic Introduction (2006) లో ఇలా రాస్తున్నాడు:

‘(ఎలిజబెత్) బిషప్ లాగా గ్లూక్ ది కూడా ఒక ప్రోటియన్ స్వరూపం. ఆమె కవిత్వాన్ని మనం ఆత్మకథనాత్మకంగా భావించవచ్చు, అలా భావించకుండా ఆమె అడ్డుపడుతూంటుంది కూడా. జేమ్స్ లాంగెన్ బాక్ అన్నట్టుగా ‘ఎప్పటికప్పుడు మారుతూండటమే లూయిస్ గ్లూక్ కవిత్వంలోని అత్యున్నత లక్షణం.’ గ్లూక్ కవిత్వాన్ని మనం ఒక జాతికిగాని, మతానికిగాని, లింగప్రాతిపదికకిగాని కుదించలేం. సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి ఐడెంటిటీ రాజకీయాల్ని ఆసరాగా తెచ్చుకునే పరిశీలనల్ని ఆమె కవిత్వం వ్యతిరేకిస్తుంది. తననొక గాటన కట్టే ప్రయత్నాల్ని ఆమె నిరాకరిస్తుంది. అంటే ఆమెని యూదీయ అమెరికన్ కవి అనో, ఫెమినిస్టు కవి అనో, ప్రకృతి కవి అనో అనలేం. సదా ఆ ప్రాతిపదికలన్నిటిమధ్యా సంచరిస్తూ, ఆమె, ఏ ఒక్కదానికీ చెందకుండా ఆ మూసల్ని బద్దలుకొడుతూ వుంటుంది..’

లూయిస్ గ్లూక్ తల్లితండ్రులు అమెరికాలో స్థిరపడ్డ రష్యన్-హంగేరియన యూదీయ సంతతికి చెందినవాళ్ళు. గ్లూక్ పుట్టడానికి ముందు ఆ దంపతులకొక బిడ్డ పుట్టి చనిపోయింది. తాను పుట్టకముందే పుట్టి మరణించిన ఆ బాలిక గ్లూక్ ని గాఢంగా ప్రభావితం చేసింది. ఆమె అట్లా మరణించడానికి తాను పుట్టడం ఒక కారణమేమో అనే ఒక అపరాధ భావన గ్లూక్ ని చాలాకాలం పాటు వెన్నాడింది. ఆ అపరాధ భావన వల్ల ఆమె టీనేజికి వచ్చేటప్పటికి అనరెక్సియా నెర్వాసా అనే వ్యాథికి లోనయ్యింది. అనరెక్సియా అంటే తాను ఎక్కువగా తింటే లావెక్కిపోతానేమో అనే భయంతో తిండి తినకుండా ఉండే వ్యాథి. దానివల్ల పిల్లలు మరీ బలహీనంగా పెరుగుతారు. గ్లూక్ విషయంలో తాను తిండి తింటే లావెక్కిపోతానన్న భయం ఒక మానసిక రుగ్మతకి స్థాయికి చేరుకుంది. అంటే తాను తిండి తింటే తన శరీరం వికసించి ఒక స్త్రీదేహంగా రూపుదిద్దుకుంటుంది, కాని తాను అలా స్త్రీగా ఎదగకూడదు, అలా ఎదగడాన్ని వీలైనంతగా వాయిదా వెయ్యాలి, అసలు తనకి బతకడానికి హక్కు లేదు, కాని తాను బతకాలి, ఒక స్త్రీగా కాదు, మనిషిగా. కాని తాను మనిషిగా బతకాలంటే ఒక స్త్రీదేహంతోటే బతకాలి, కాని అది తనకి ఇష్టం లేదు, ఇలా అన్నమాట. ఆ రుగ్మత నుంచి ఆమెని బయటపడెయ్యడానికి ఆమెని తల్లిదండ్రులు కాలేజీకి పంపడం మానేసి ఇంట్లోనే ఒక మానసిక వైద్యురాలితో చికిత్స చేయడం మొదలుపెట్టించారు. అట్లా ఏడేళ్ళ పాటు ఆమె సైకో ఎనాలిసిస్ చికిత్స తీసుకుంది. ఆ విశ్లేషణ ఆమెకి తనని తాను లోతుగా చూసుకునే అవకాశాన్నిచ్చింది. తనలోని ప్రతి ఒక్క స్పందననీ, సంవేదననీ పోల్చుకునే విధంగా తీర్చిదిద్దింది. తనని కవిని చేసింది సాహిత్యం కాదు, సైకో అనాలిసిస్ అని చెప్పుకుందామె.

ఆ తర్వాత గ్లూక్ పెళ్ళి చేసుకుంది. ఒకసారి కాదు, రెండు సార్లు వైవాహిక జీవితంలోకి ప్రవేశించి బయటికి వచ్చేసింది. రెండవ భర్త ద్వారా ఒక కొడుకు పుట్టాడు. తన తల్లి, తండ్రి, తన ఇద్దరు భర్తలు, తన కొడుకు, చెల్లెలు, చెల్లిలి బిడ్డ, మేనత్తలతో ఆమె సంబంధాలు గ్లూక్ కవిత్వానికి మూలజలాలు. ఆమె తన ప్రతి ఒక్క అనుబంధాన్ని తరచి తరచి చూసుకుంటూ వచ్చింది. అలాగని కేవలం తన ఆత్మకథని రాస్తున్నట్టుగా ఆమె ఎక్కడా కవిత్వం రాయలేదు. అలాగని తన మానసికవేదనని మనముందు వెళ్ళగక్కుకునే లాగా కన్ఫెషనల్ తరహా కవిత్వం కూడా రాయలేదు. ఆమె జీవితం గురించి మనకి తెలిసింది ఇంత మాత్రమే. కాని ఆమె కవిత్వంలో కనిపించే మరిన్ని వివరాలు ఏ మేరకు యథార్థాలో చెప్పలేం. అలాగని వాటిని పక్కనపెట్టి ఆమె కవిత్వం చదవలేం కూడా.

ఒకటి మాత్రం మనకి అర్థమవుతుంది. ఈ అరవై డెభ్భై ఏళ్ళుగా ప్రపంచం తనని బాధిస్తున్న ఎన్నో ప్రశ్నలతోటీ సమస్యలతోటీ తలమునకలవుతూ ఉండగా, అక్కడ, మసాచుసెట్స్ లో ఒక కవయిత్రి తన ప్రాథమిక కౌటుంబిక అనుబంధాల్ని ఒక శాస్త్రవేత్తలాగా సూక్షంగా పరిశీలిస్తూ ఉన్నది. ఆ అనుబంధాల్లో తన పాత్ర ఏమేరకు అని నిజాయితీగా నిగ్గుతేల్చుకుంటూ ఉన్నది. ఒక కూతురుగా, భార్యగా, తల్లిగా తనని తాను మోసపుచ్చుకోకుండా, తన ఆత్మని వంచించుకోకుండా తనని తాను కవిత్వం ఆసరాగా బతికించికుంటూ వస్తున్నది. ఇప్పుడామె కవిత్వం మనం చదువుతూన్నప్పుడు మనం కూడా మన మౌలిక కౌటుంబిక అనుబంధాల్ని వంచనా రహితంగా పరికించుకోకుండా ఉండలేం. అందుకనే ఆమె మనకి అత్యంత ఆత్మీయురాలిగా గోచరిస్తూ ఉన్నది.

మనం మామూలుగా ‘నేను’ అని చెప్తున్నప్పుడు ఆ ‘నేను’ ఎవరు? నేను, అంటే, self పట్ల మేలుకోవడంతో ప్రపంచం ఆధునిక యుగంలో అడుగుపెట్టింది. నిజానికి ‘నేను’ అనేది ఏదీ లేదనీ, ప్రపంచంతో మనం వ్యవహరించే తీరుని బట్టే ‘నేను’ ఏర్పడుతుందనీ, ‘పరుడు’ (the other) ని తీసేస్తే ‘నేను’ కూడా ఉండదనేది ఆధునికానంతర ప్రపంచానికి కలిగిన మెలకువ. అది బౌద్ధులు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఏర్పడి మరునిముషంలో అదృశ్యమయ్యే ఒక సంజ్ఞ మాత్రమే. దాన్ని మనం సాహిత్యం, కళ, సృజనల ద్వారా గుర్తుపట్టి ఎప్పటికప్పుడు ఒక ‘నేను’గా నిర్మించుకుంటూ ఉంటాం. అందుకు కారణం ‘నేను’ ఉంటుంది, ఒక స్మృతిగా, స్వప్నంగా, ఊహగా.

My memory is like a basement filled with old papers:

Nothing ever changes

కాని ఆ స్మృతిని వివరించే తన భాషనీ, గుర్తుల్నీ గ్లూక్ ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ వచ్చింది. ఆ ప్రయత్నంలో ఆ ‘ నేను’ని తుడిచిపెట్టేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఈ అత్యంత ఆత్మనిరాకరణలో ఆమె నాకళ్ళకి ఒక బౌద్ధ సన్యాసినిలాగా గోచరిస్తూ ఉన్నది. బహుశా నిష్ఠురమైన, నిర్దాక్షిణ్యమైన ఈ తపస్సుకే ప్రపంచం ఆమెని ఈ విధంగా సత్కరిస్తున్నదని అనుకోవాలి.

తనని తాను గుర్తుపట్టుకోడానికి ఆమెకి ఉపకరించినవి బైబిలు, తన యూదు వారసత్వమూ, పువ్వులూ, ప్రకృతీ, అన్నిటికన్నా ముఖ్యంగా హోమరూను. ఆమెకి చిన్నప్పుడు ఆమె తండ్రి గ్రీకు పురాణగాథలు చెప్పేవాడట. మూడేళ్ళ వయసుకే ఆమెకి గ్రీకు ఇతిహాసాల ఇతివృత్తాలతో పరిచయం ఏర్పడింది. తాను జీవిస్తున్న ప్రపంచంలో తన వేదన ఏమిటో తాను తెలుసుకోవడానికి ఆమెకి ఉపకరించింది ఆ కథలే.

ఆ కవిత్వయాత్రలో పతాక సంపుటిగా Ararat (1990) ని పేర్కొనవచ్చు. మొదటి సంపుటాల్లోని క్లిష్టతగానీ, ఇటీవలి సంపుటాల్లోనీ మార్మికత గానీ లేవు అందులో. Ararat లో ఆమె నిరుపమానమైన సారళ్యాన్నీ, స్పష్టతనీ సాధించుకోగలిగింది. తనని జీవితమంతా వేధిస్తున్న ప్రశ్నలకి సమాధానాలు అన్వేషించడం కన్నా, ముందు ఆ ప్రశ్నల్ని ప్రశ్నలుగా గుర్తుపట్టగలడం మీద దృష్టి పెట్టింది అక్కడ.

ప్లేటో రాసిన ఈ వాక్యంతో ఆమె ఆ సంపుటిని మొదలుపెట్టింది. …Human nature was originally one and we were a whole, and the desire and pursuit of the whole is called love.’. అద్వైతానుభవంగా చెప్పదగ్గ ఒక Eleusinian mystery ని చిత్రిస్తూ ఆమె Averno (2006) అనే మరొక సంపుటి కూడా వెలువరించక పోలేదు. కానీ ఈ సంపుటిలో ఆమె రహస్యాన్ని రహస్యపరిభాషలో కాక, మామూలు మాటల్లో పట్టుకోగలిగింది, చెప్పగలిగింది. అందులో మొదటి కవిత Parados. ఆ మాటకి రెండు అర్థాలున్నాయి. మొదటిది, Para ode అంటే గ్రీకు నాటకాల్లో వినిపించే నాందీగీతం లాంటిది. అక్కడ ఆ గాయకుడు తెరపక్కగా సగం మాత్రమే కనిపిస్తుంటాడు. ఇక్కడ కవి కూడా ఈ కావ్యంలో సగం మాత్రమే కనిపిస్తూంటుంది. ఆ మొదటి కవితలో ఆమె చెప్తున్నదేమంటే, జన్మ మృత్యువులు నిజానికి రహస్యాలు కావు, ఆ రెండింటి మధ్యా ఉన్నదే నిజమైన రహస్యం. ఒకపట్టాన అంతుచిక్కని రహస్యం. ఆ రహస్యానికి సాక్షిగా మిగిలిపోవడమే ఆమె కోరుకుంది.

నేను గాయపడి చాలాకాలమే అయింది

దానికి జవాబుగా

నేను నేర్చుకున్నది

ఈ ప్రపంచాన్ని దాటి

మనగలగడం.

అంటే కేవలం వింటూండటమే-

అలాగని

జడంగా కాదు,

రాతిలానో, కొయ్యదుంగలానో

నిశ్చలంగా.

ఊరికే అరుస్తోనో, వాదిస్తోనే

నన్ను నేనెందుకు అలసట పెట్టుకోవాలి?

అక్కడ ఆ శయ్యలమీద నిద్రిస్తున్నవాళ్ళకి

ఏమి అర్థమవుతుంది?

ఒక కలలాగా మనచేతుల్లోలేనిది?

కిటికీ పరదాల్లోంచి

చిక్కనవుతున్న, చిక్కిపోతున్న

చంద్రుణ్ణి పరికిస్తున్నాను.

మహారహస్యాలకు

సాక్షిగా జీవించడమనే

ధ్యేయం కోసం ప్రభవించినదాన్ని.

జన్మనీ మృత్యువునీ రెండింటినీ చూసాక

నాకు తెలిసిందేమంటే

గాఢాంధకార ప్రకృతికి

అవి సాక్ష్యాలే తప్ప రహస్యాలు కావని.

తన తండ్రి డేనియల్ గ్లూక్ 1985 లో మరణించినప్పుడు ఆ శూన్యాన్నీ, బరువునీ అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ వెలువరించిన కవితల సంపుటి అది. ఆ సంపుటిని సమీక్షిస్తూ 2012 లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక the most brutal and sorrow filled book of American poetry published in the last 25 years అని రాసింది.

అరారత్ అంటే ఒక పర్వతం. పాతనిబంధన్లో జలప్రళయం తర్వాత భూమి బయటపడ్డప్పుడు తొలిసారిగా కనిపించింది అరారత్ శిఖరాగ్రమే. ఆ సంపుటిలోని కొన్ని కవితల్ని బట్టి గ్లూక్ హృదయాన్ని మనం కొంత పోల్చుకోగలుగుతాం. చూడండి:

1

ఒప్పుకోలు

నాకు భయంలేదంటే

అది నిజం కాదు.

అనారోగ్యమంటే, అవమానమంటే నాకు భయం

అందరికీ ఉన్నట్టే నాకూ కలలున్నాయి.

ఎక్కడ అవి నెరవేరిపోతాయోనన్న భయంతో

వాటిని మరుగుపరచడం నేర్చుకున్నాను.

సంతోషం మీద విధి ఎప్పుడూ కన్నెర్ర చేస్తూనే ఉంటుంది.

ఆ రెండూ అక్కచెళ్ళెళ్ళు, ఒట్టిమొరటు మనుషులు.

వాళ్ళిద్దరి మధ్యా చివరికి మిగిలేది

వట్టి అసూయ తప్ప మరొకటి కాదు.

2

ముందు జరిగిన సంగతి

తక్కినవాళ్ళకోసం సిద్ధం చేసేటట్టే మా అమ్మ

తన చనిపోయిన బిడ్డకి కూడా ఏర్పాట్లు చేసుకుంది

మెత్తటిగుడ్డల్తో పొత్తిళ్ళు కుట్టిపెట్టుకుంది

చక్కగా మడిచిన వస్త్రాలు

ఒక్కొక్కటీ అరచేతిలో పట్టేసేంత మెత్తగా ఉండేవి.

ఆమె పుట్టినరోజు ఏ రోజవుతుందా

అని ఎదురుచూసేది, ఒక్కొక్క రోజూ గడిచేకొద్దీ

ఏ రోజైతేనేం సంతోషమే అనుకునేది

మృత్యువు మా అమ్మ జీవితాన్ని తాకలేకపోయింది

కాబట్టి ఆమె ఆలోచన మరోలా ఉండేది

బిడ్డపుడుతుందనుకున్నప్పుడు తల్లులు ఎదురుచూస్తారే అట్లా

కలల్లో కూరుకుపోయేది.

3

నష్ట ప్రేమ

మా అక్క పూర్తిజీవితం భూమ్మీద జీవించింది.

పుట్టింది, మరణించింది,

ఆ మధ్యలో

ఒక్క ఉలుకు లేదు, ఒక్క పలుకు లేదు.

అందరు బిడ్డలూ చేసినట్టే ఆమే చేసింది

గుక్కపట్టి ఏడ్చింది, కాని పాలకోసం కాదు

అయినా మా అమ్మ ఆమెని ఎదకు చేర్చుకుంది, ముందు

ఆమె తలరాత మార్చాలనుకుంది, అప్పుడు మా ఇంటిరాతని.

మొత్తానికి ఒకటైతే మారింది: మా అక్క చనిపోగానే

మా అమ్మ హృదయం గడ్డకట్టింది

చిన్న ఇనుప లోలాకు లాగా

గట్టిపడిపోయింది.

అప్పుడు అర్థమయింది నాకు, మా అక్క శరీరం

ఒక అయస్కాంతమని.

అది మా అమ్మ హృదయాన్ని

భూమిలోకి లాక్కుంటోందని.

అక్కడైనా ఆ గుండె వికసిస్తుందని.

4

అరారత్ పర్వతం

మా అక్క సమాధికన్నా నన్ను దుఃఖపెట్టేది మరొకటిలేదు

అది ఆ పక్కనే మా మరెవరో బంధువుదై ఉంటే తప్ప.

ఈ రోజుకి కూడా నేను మా అమ్మనీ మా పిన్నమ్మనీ

చూడలేకపోతున్నాను, వాళ్ళ బాధ చూడలేక

ఎంత తప్పించుకుందామంటే అంతగా

అది మా కుటుంబాల తలరాతనిపిస్తోంది.

మా ఇళ్ళల్లో ప్రతి శాఖా ఒక ఆడబిడ్డని

నేలపాలు చేస్తూనే ఉంది.

మా తరంలో మేము పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చాం

పిల్లల్ని కనడం వాయిదా వేస్తూ వచ్చాం

తీరా పిల్లల్ని కనేటప్పటికి, మాకు ఒక్కొక్కరే.

అది కూడా మగపిల్లలే, ఆడపిల్లలసలేలేరు

మేమెప్పుడూ ఇది పైకి మాట్లాడుకోం

కాని వయోవృద్ధుల అంత్యక్రియల్లో ఒక ఊరట ఉంది.

మనకి అంతగా సంబంధం లేని వాళ్ళని, ఉదాహరణకి

మా నాన్నలాంటివాళ్ళనుంచి సెలవుతీసుకున్నామంటే

అది వేరే విషయం, ఏదో కుటుంబ ఋణం

మొత్తం చెల్లించేసినట్టుంటుంది.

నిజానికి ఎవరూ నమ్మరు గానీ

ఇక్కడ భూమిలానే, ప్రతి రాయి కూడా

ఒక యూదుదేవతకి అంకితమైనట్టే ఉంది

ప్రతి తల్లినుంచీ ఆమె కొడుకుని లాక్కోటానికి

సుతరామూ సంకోచించని ఒక దేవతకి.

5

అద్భుత కథ

బాగా తెలివైన ఓ రాజు దగ్గరికి పోయి

ఇద్దరాడవాళ్ళు తమ తగువు తీర్చమన్నారు.

ఇద్దరు తల్లులు, ఒక్క బిడ్డ.

రాజుకి అర్థమయింది, ఇద్దరిలో

ఎవరో ఒకరు అబద్ధమాడుతున్నారు.

ఆ బిడ్డని అడ్డంగా నరకండి

అన్నాడతడు. చెరోముక్కా చెరో తల్లికీ

అప్పగించండి అంటో కత్తి తీసాడు.

వెంటనే ఆ ఇద్దరిలో ఒకామె

వెనక్కి తగ్గింది, బిడ్డ బతికితే

అదే చాలనుకుంది. అసలు తల్లి ఎవరో

తెలుసుకోడానికి అదీ గుర్తు, గుణపాఠం.

అదే నీ తల్లి ఇద్దరు బిడ్డలమధ్య

నలిగిపోతోందనుకో

ఆమెని బతికించుకోడానికి నిన్ను నువ్వు

ధ్వంసం చేసుకున్నావనుకో-

అదీ గుర్తు. ఆమె ప్రేమ న్యాయంగా ఎవరికి

దక్కాలో తెలుసుకోడానికి, తన తల్లిగుండెని

ముక్కలు చెయ్యలేని ఆ బిడ్డ ఎవరో తెలిసిపోడానికి.

6

సాధువులు

మా ఇంట్లో ఇద్దరు సాధువులున్నారు

మా పిన్నమ్మ, మా అమ్మమ్మ.

కాని వాళ్ళిద్దరి జీవితాలూ ఒక్కలాంటివి కావు.

మా అమ్మమ్మ చాలా నెమ్మది, చివరిదాకా కూడా.

ప్రశాంతమైన జలాల్లో నడుస్తున్నట్టే ఉండేది

ఎందుకనో, చివరికి సముద్రం కూడా

ఆమెముందు తలవంచుతుందనిపించేది.

మా పిన్నమ్మ కూడా ఆ బాటనే నడిచిందిగానీ

కెరటాలు ఆమె మీద విరుచుకుపడ్డాయి, నిలువునా ముంచెత్తాయి

నిజమైన సాధుస్వభావులపట్ల

విధి ప్రవర్తించే తీరు అట్లానే ఉంటుంది.

మా అమ్మమ్మ జాగ్రత్తపరురాలు, సనాతనురాలు

అందుకనే ఆమె వేదననుంచి తప్పించుకుంది

మా పిన్నమ్మ దేన్నుంచీ బయటపడలేకపోయింది

ప్రతి సారీ సముద్రం వెనక్కి తగ్గినప్పుడు

ఆమెకి ప్రియాతిప్రియమైనదాన్ని దేన్నో

ఆమె నుంచి లాక్కుపోయేది.

అయినా ఆమె సముద్రాన్ని ఎన్నడూ శపించలేదు

సముద్రం సముద్రంలాగే ఉందనుకునేది

కడలి ఎప్పుడు నేలని తాకినా కల్లోలం తప్పదనుకునేది.

26-10-2020

Leave a Reply

%d