సిద్ధౌషధం

Reading Time: 4 minutes

ఋతుపవనం ఆకాశాన్ని ఆవరించిన తరువాత నా ధ్యాస పనిమీంచి తప్పిపోయింది. కాని ఊపిరాడనివ్వనంత పని. క్షణం కూడా ఏమరిఉండటానికి వీల్లేని బాధ్యతలు. ఒకప్పుడొక యక్షుడు పనిలో మనసు పెట్టనందుకు శాపానికి గురయ్యాడు. అప్పుడతడు ఓదార్పు కోసం మేఘం దిక్కు చూసాడు. ఇప్పుడు మేఘమే నన్ను పనిలో మనసు పెట్టనివ్వకుండా చేస్తే నేనెవరి దిక్కు చూడాలి?

గాలిబ్ మాటలు గుర్తొచ్చాయి.

ఇష్క్ నే గాలిబ్, నికమ్మా కర్ దియా

వర్నా హమ్ భీ ఆద్మీ థే కామ్ కే.

(ఇప్పుడంటే ప్రేమ నిన్ను పనికిమాలినవాడిగా మార్చిందిగాని, గాలిబ్, ఒకప్పుడు మనం కూడా ప్రయోజకులమే)

అర్థమయింది, పని తనని తల్లకిందులు చేస్తే కవి మేఘం దిక్కు చూసాడు. మేఘం నిన్ను తల్లకిందులు చేస్తే నువ్వు కవి దిక్కు చూడాలి. గాలిబ్ లాంటి కవి దిక్కు.

గాలిబ్ ని తెరిచాను. ఎప్పుడో దాశరథి ద్వారా పరిచయమైన గాలిబ్. కాని ఆ తెలుగు గాలిబ్ కన్నా ఉర్దూ గాలిబ్, ఉర్దూ గాలిబ్ కన్నా పారశీక గాలిబ్ ఊహించలేనంత విస్తారమైనవాళ్ళు. లోతైనవాళ్ళు.

‘ప్రణయమనగ వింత వహ్ని, అంటించిన

అంటదార్పినంత ఆరబోదు.’

ఈ మాటలకే ఎన్నో ఏళ్ళు కరిగిపోయాను. కాని దాశరథి గాలిబ్ ని పూర్తిగా మనకి అందించలేదు. అసలైన మాట తన దగ్గరే అట్టేపెట్టేసుకున్నాడు:

‘ఇష్క్ పర్ జోర్ నహీ హై ఏ వో ఆతిష్, గాలిబ్

కే లగాయే న లగే, ఔర్ బుఝాయే న బనే.’

‘ఇష్క్ పర్ జోర్ నహీ’. ప్రేమమీద నువ్వు పెత్తనం చేయలేవు. అదీ అసలైన మాట. ఎందుకంటే అది రగలడం కానీ, చల్లారడం కానీ నీ చేతుల్లో లేవు.

ఇరవయ్యవ శతాబ్దం దృష్టిలో గాలిబ్ గొప్ప ఉర్దూ కవి. కానీ ఇరవైఒకటవ శతాబ్దం దృష్టిలో గాలిబ్ సర్వోన్నతుడైన కవి. ఒకాయన అన్నాడట, ‘హిందూస్తాన్ లో రెండే ఉన్నాయి, ఒకటి వేదాలూ, మరొకటి గాలిబ్ దీవానూ’ అని.

గాలిబ్ కీ, నాలాంటి వాడికీ మధ్య ఒక్క పోలిక ఉంది. అదేమంటే గాలిబ్ లానే నాకు కూడా వెయ్యి కోరికలు, వెయ్యి ఆకాంక్షలు.

హజారోఁ క్వాహిషేఁ ఐసీ కె హర్ క్వాహిష్ పే దమ్ నికలే

బహుత్ నికలే మెరే అరమాన్, లేకిన్ ఫిర్ భీ కమ్ నికలే.

(వెయ్యి ఆకాంక్షలు, ప్రతి ఒక్క ఆకాంక్ష ప్రాణం తీసేస్తుంది, పొందవలసినన్ని పొందాను, అయినా తీరవలసినంత తీరనేలేదు)

ఈసారి గాలిబ్ కవిత్వం కాదు, ఉత్తరాలు చదవడం మొదలుపెట్టాను. పందొమ్మిదో శతాబ్దానికి గాలిబ్ కవికన్నా కూడా చక్కటి ఉర్దూ వచనకారుడిగానే ఎక్కువ ప్రశస్తి. ఆ ప్రసిద్ధి ఆయన ఉత్తరాల వల్ల వచ్చింది. కవిత్వంలో గాలిబ్ ప్రణయైక జీవి. ఉత్తరాల్లో మామూలు మనిషి. కొన్ని సార్లు మరీ బలహీనుడైన మనిషి. మనతో ముఖాముఖి కూచుని తన కష్టసుఖాలు చెప్పుకునే మనిషి. ఒకవేళ గాలిబ్ రాసిన కవిత్వం మనకి తెలియకపోయినా, ఆయన ఉత్తరాలు మాత్రమే లభ్యమయినా కూడా, ఆయన్ని ఉర్దూలో సర్వశ్రేష్ట రచయితగా లెక్కిచగలనన్నాడు ఒక విమర్శకుడు.

వాటిలో ఇప్పుడు ఎనిమిదివందలకు పైగా మనకి లభిస్తున్న ఉత్తరాలు గాలిబ్ జీవితకాలంలోనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి ఇంగ్లీషులోకి అనువాదం కావడం మొదలయ్యాక ప్రపంచం దృష్టిని ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ ఉత్తరాలు ఆధారంగా రాల్ఫ్ రస్సెల్ అనే ఆయన గాలిబ్ జీవితాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నించాడు. Ghalib, Life, Letters and Ghazals (2003) అనే ఆయన పుస్తకంతో గాలిబ్ పట్ల ఇరవై ఒకటవ శతాబ్దపు ఆరాధన మొదలయ్యింది. ఆ తర్వాత దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక కొత్త పుస్తకం వెలువడుతూనే ఉంది. ముఖ్యంగా, ఆ ఉత్తరాల ఆధారంగా గాలిబ్ మలిజీవితాన్ని, 1857 తిరుగుబాటు నేపథ్యంలో భారతదేశ చరిత్రని అధ్యయనం చేయడం మొదలయ్యింది. ఆ ఉత్తరాలు మరీ ముఖ్యంగా డిల్లీ ఆత్మకథ. ఒక విధంగా మీర్ ఆత్మకథ ‘జిక్ర్ ఎ మీర్ ‘ పద్ధెనిమిదో శతాబ్ది డిలీ ఆత్మకథ అనుకుంటే గాలిబ్ ఉత్తరాలు పందొమ్మిదో శతాబ్దపు డిల్లీ ఆత్మకథ.

ఉర్దూ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి ఒక ఉద్యమంలాగా అనువాదం చేసి పరిచయం చేసిన కె.సి.కందా తాను గాలిబ్ గజళ్ళకు చేసిన అనువాదంలో ఉత్తరాలు కూడా కొన్ని అనువదించాడు. Mirza Ghalib: Selected Letters and Lyrics (2004) అనే సంపుటిలో 68 ఉత్తరాల సంక్షిప్త అనువాదాలు ఉన్నాయి. కాని గాలిబ్ ఉత్తరాలు ఎలా ఉంటాయి, ఆ ఉత్తరాల్లో మనకి కనిపించే మానవుడు ఎలా ఉంటాడు అని తెలుసుకోవటానికి ఆ కొన్ని ఉత్తరాలూ మంచి నమూనా. అవి చదివేక మిగిలిన ఉత్తరాలన్ని చదవాలన్న కోరిక ఎలానూ కలిగి తీరుతుంది.

బయట మబ్బు అలముకున్నప్పుడు, ఒక ఆదివారం పనినుంచి తప్పించుకుని, గాలిబ్ ఉత్తరాలు చదువుకోవడంలో ఒక తియ్యటి దిగులు ఉంది. ఎందుకంటే గాలిబ్ ఆ ఉత్తరాలు రాసినప్పుడు అతడి జీవితంమీదా, డిల్లీ మీదా కూడా విషాదమేఘాలు కమ్ముకుని ఉన్నాయి. వెలుగు మందగించింది. చల్లారని కోరికలు, ఎన్నో తీరినా కూడా ఇంకా తీరాలని తపించే ఆకాంక్షలు ఆయన్ని వేధిస్తున్నాయి. కవిగా ఆయన సర్వోన్నతుడు, కాని మనిషిగా బలహీనుడు, ఎంత మహావిషాదాన్ని చూసినా కూడా తన జీవితేచ్ఛ చల్లారని వాడు. ‘పొద్దుటిపూట దీపంలాగా ఏ క్షణాన్నైయినా కొండెక్కేలాగా ఉంది’ తన జీవితమని ఒక ఉత్తరంలో రాసుకున్నాడుగాని, ఆ నిశాంతవేళ కూడా సాయంసంధ్యాదీపంలాగా ప్రజ్వరిల్లాలనే తపించాడు.

ఆ ఉత్తరాలు ఎవరికి వారు చదువుకోవలసినవి. లేదా రాల్ఫ్ రస్సెల్ లాగా ప్రతి ఒక్క ఉత్తరం తీసుకుని గాలిబ్ జీవితకథగా చెప్పుకోదగ్గవి. ఆ ఉత్తరాల్లో కనబడే ఆ మనిషి నాకెందరో కవుల్ని, నా సాహిత్యమిత్రుల్ని గుర్తుకు తెచ్చాడు. కాని ఎవరితోనూ పోల్చలేని అద్వితీయమైన వ్యక్తిత్వం గాలిబ్ అనడానికి కూడా ఆ ఉత్తరాల్లో ఎన్నో సాక్ష్యాలున్నాయి. అన్నిటికన్న ముందు చెప్పవలసింది మనకి లభ్యమవుతున్న 837 ఉత్తరాల్లో అత్యధికం ఆయన ఒక హిందువుకి రాసిన ఉత్తరాలు. ఎందుకంటే, హిందువూ, ముస్లిమూ అనే సరిహద్దులు చెరిగిపోయిన చోటమాత్రమే కవిత్వకపోతం వచ్చి వాలుతుంది కాబట్టి.

అన్ని ఉత్తరాల గురించీ రాయాలని ఉంది గాని, సమయం లేదు. ఒక్క ఉత్తరంలోంచి చిన్న ఉదాహరణ ఇస్తాను. 1860 లో అంటే తన అరవై మూడవ ఆలీ సాహిబ్ మెహర్ అనే ఆయనకి రాసిన ఉత్తరంలో ఇలా రాస్తున్నాడు:

‘మిత్రుడా, మొఘల్ రాజ వంశస్థులు దారుణమైన మనుషులు-వాళ్ళెవరిని ప్రేమిస్తారో వాళ్ళని చంపేస్తారు. నేను కూడా మొఘల్ వంశపు పాదులో పుట్టినవాణ్ణే. నేను కూడా నా జీవితంలో ఒక యువతి ని ప్రేమించాను, ఆమెని చంపేసాను. గొప్ప గాయిక ఆమె. వియోగానికి గురైన మా ప్రేమైక హృదయాలకు భగవంతుడు ముక్తి ప్రసాదించుగాక! ఆయన నీమీదా నామీదా కూడా తన కరుణ కురిపించుగాక! ఎందుకంటే మనిద్దరం కూడా మనం ప్రేమించినవాళ్ళనుంచి శాశ్వతంగా ఎడబాటుకు గురైన వాళ్ళం. నా జీవితంలో ఈ సంఘటన జరిగి నలభై రెండేళ్ళయింది. నేను ఆ ప్రణయపథాన్ని వదిలిపెట్టి చాలాకాలమే అయినప్పటికీ, నన్ను కడతేర్చే ఆ చూపుల్నీ, ఆ విలాసవిభ్రమాల్నీ ఇప్పటికీ మరవలేకపోతున్నాను. ఆమె మరణించిందన్న వార్త నాకు కలిగించిన ఆఘాతం నుండి నేనిప్పటికీ తేరుకోలేకపోతున్నాను. కాబట్టి నీ హృదయబాధనీ, నీ మనఃస్థితినీ నేను అర్థం చేసుకోగలుగుతున్నాను..’

గాలిబ్ అన్నిటికన్నా ముందు పారశీక కవి. తన పారశీక వైదుష్యం పట్ల ఆయనకి అపారమైన గర్వం. ఎందుకంటే అమీర్ ఖుస్రో పాదాలు కడిగి ఆ జలపానం చేసానని చెప్పుకున్నాడు. ఖుస్రో తరువాత అంతటి మహనీయుడైన భారతీయ-పారశీక-సూఫీ కవి బేదిల్ అడుగుజాడల్లో నడిచినవాడు. ఆ స్థాయి కవుల్ని తనకి నమూనాలుగా పెట్టుకున్నాడు కాబట్టి తన సమకాలికులు కవిత్వం చెప్తున్నప్పుడు అంత తొందరగా తల ఊపేవాడు కాడు. మరీ ముఖ్యంగా, తన జీవితకాల ప్రత్యర్థి, బహదూర్ షా జఫర్ ఆస్థాన కవి జౌక్ విషయంలో మరీను. అసలు అతణ్ణి కవిగానే గుర్తించేవాడు కాడు. కాని ఒకరోజు గాలిబ్ చదరంగం ఆడుతున్నాడు. పక్కనొక మిత్రుడు ఒక షేర్ వినిపించాడు.

‘ఈ జీవితంతో విసిగిపోయి మృత్యువు పట్ల ఆశగా చూస్తాం. మృత్యువు కూడా మనశ్శాంతినివ్వకపోతే మరెటు చూసేది?’

గాలిబ్ ఆగిపోయాడు. అతడి చేతిలో చదరంగం పావు అలానే ఉండిపోయింది. ‘ఏదీ మళ్ళీ వినిపించు’ అన్నాడు. ‘ఎవరు రాసారిది’ అనడిగాడు. జౌక్ అని చెప్పగానే నిర్ఘాంతపోయాడు. ఆట ఆపేసాడు. మళ్ళీ మళ్ళీ వినిపించమన్నాడు. మళ్ళీ మళ్ళీ విన్నాడు. తన ఉత్తరాల్లో, మరీ ముఖ్యంగా చివరిరోజుల్లో ఉత్తరాల్లో మళ్ళీ మళ్ళీ తలుచుకున్నాడు ఆ వాక్యాల్ని.

తన సమకాలికుడు మోమిన్ పట్ల కూడా చిన్నచూపే గాలిబ్ కి. కాని ఒకరోజు మోమిన్ షేర్ ఒకటి విన్నాడు:

‘మిత్రులందరూ వెళ్ళిపోయాక, నేనొక్కణ్ణే మిగిలినప్పుడు

సరిగ్గా అప్పుడే నువ్వు నా పక్కన కూచున్నావనిపిస్తుంది.’

ఆ వాక్యాలకు గాలిబ్ ఎంత చలించిపోయాడంటే మోమిన్ గనక ఆ ఒక్క షేర్ ని తనకిచ్చేస్తే తన దివాన్ మొత్తం అతనికిచ్చేస్తానన్నాడు గాలిబ్. ఈ షేర్ కూడా పదే పదే ఆ ఉత్తరాల్లో కనిపిస్తుంది.

1859 లో రాసిన ఒక ఉత్తరంలో ఒక కవిత వినిపించాడు:

అమరత్వంతో నాకేమి పని? నజీరీ, తాలిబ్

ఇద్దరూ మరణించాక?

గాలిబ్ ఎలా ఉన్నాడని ఎవరేనా అడిగితే

గాలిబ్ చనిపోయాడని చెప్పేయండి.

ఆ మాట రాసాక కూడా మరొక పదేళ్ళు బతికాడు. ‘గాలిబ్ చనిపోయాడని చెప్పేయండి’ అనే మాటలో జీవితం పట్ల ఎంత ఆకాంక్ష! బతకాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా మనకి సిద్ధౌషధం గాలిబ్ గజల్ మాత్రమే.

19-6-2021

Leave a Reply

%d bloggers like this: