సాహిత్య పురస్కారం

రెండువారాల కిందట శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు ఫోన్ చేసి ఎన్ టి ఆర్ సాహిత్య పురస్కారం ఇవ్వడానికి నా పేరు ఎంపిక చేసామని చెప్పినప్పుడు సహజంగానే నాకు సంతోషం కలిగింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు తెలుగు వారికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నేత. తెలుగుని గాఢంగా ప్రేమించినవాడు. తెలుగు భాష అభ్యున్నతికోసం, తెలుగు సంస్కృతి వర్థిల్లడం కోసం జీవితకాలంపాటు అటు కళాకారుడిగానూ, ఇటు ప్రభుత్వాధినేతగానూ కూడా అహర్నిశం కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరుమీద, అది కూడా వారి సతీమణి లక్ష్మీపార్వతిగారి ద్వారా పురస్కారం అందుకోవడమంటే, అది రామారావుగారే స్వయంగా అందిస్తున్న అభినందనగా నేను భావిస్తున్నాను.

ఏ పురస్కారమైనా, మరీ ముఖ్యంగా ఇటువంటి పురస్కారం, బాధ్యతని గుర్తు చేసే హెచ్చరిక. అందువల్ల ఈ పురస్కారం నేను సాహిత్య రంగంలో ఇంతదాకా చేసిన కృషికి కాక, చేయవలసిన కృషిని గుర్తు చేస్తూ ఇస్తున్న పురస్కారంగా భావిస్తున్నాను.

నేను తాడికొండ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఐ ఏ ఎస్ అధికారిని కావాలనుకున్నాను. కాని ఇరవయ్యేళ్ళ వయసులో రాజమండ్రిలో అడుగుపెట్టినప్పుడు ఆ ఊరు, అక్కడి సాహిత్యవాతావరణం నా జీవితాశయాల్ని మార్చేసాయి. ఆ ఊళ్ళో ఒక ఏడాది గడిచిందో లేదో తక్కిన అన్ని యాంబిషన్లూ పక్కకుపోయి కవిని కావాలని కలలు కనడం మొదలుపెట్టాను. అక్కడే నా మొదటి కవితాసంపుటి నిర్వికల్ప సంగీతం వెలువరించడంతో నా సాహిత్యప్రయాణం మొదలయిందనుకున్నాను. ఆ జీవితం అలానే కొనసాగిఉంటే ఇప్పటికి ఏమి సాధించి ఉండేవాణ్ణోగాని, ఆ పుస్తకం వెలువరించి ఏడాది కూడా తిరక్కుండానే నేను గిరిజన సంక్షేమ శాఖలో చేరి రాజమండ్రి వదిలిపెట్టాను. అప్పటినుంచీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు నా సాహిత్యజీవితాన్ని నా వృత్తి జీవితం పక్కకు నెట్టేస్తూనే ఉంది. అయినా కూడా ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నాను. రాస్తూనే ఉన్నాను. మీకు రాయడానికీ, చదవడానికీ ఇంత సమయం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు మిత్రులు. నేనేం చెప్తానంటే, సాహిత్యమే లేకపోతే నా ఉద్యోగ జీవితంలో నేను ఉన్మాదిని అయిపోయి ఉండేవాణ్ణని. ఇన్నేళ్ళుగానూ నా మనశ్శాంతి కాపాడుకోవడం కోసమే నేను సాహిత్యసాధన కొనసాగిస్తూ వచ్చాను తప్ప నిజంగా సాహిత్యంకోసం సాహిత్యసాధన కొనసాగించలేదనే చెప్పాలి.

ఇప్పుడు నేను నా పదవీవిరమణ ముహూర్తం కోసం కాచుకుని ఉన్నాను. ఒకసారి ఉద్యోగం నుంచి బయటపడ్డాక నేను చెయ్యవలసిన పనుల గురించి, చేపట్టవలసిన సాహిత్యప్రయోగాల గురించీ, ప్రయత్నాల గురించీ నాకెన్నో ఆలోచనలున్నాయి. అన్నిటికన్నా మొదటిది, సృజనాత్మక సాహిత్యంలో నేనింతదాకా కవిత్వాన్ని మాత్రమే కొనసాగిస్తూ వచ్చాను. కాని నవలలు రాయాలి, నాటకాలు రాయాలి. అటువంటి ఊహలకి నా ముందు నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. గోపీనాథ మొహంతీ అమృత సంతానంలాగా, సవరవారిమీద ఒక ఇతిహాసం రాయాలని ఉంది నాకు. రాజమండ్రి కేంద్రంగా గత ముప్పై, నలభై ఏళ్ళల్లో తెలుగు నేల మీద సంభవించిన సామాజిక పరిణామాల్ని చిత్రిస్తూ పెద్ద నవల రాయాలి. ఆముక్తమాల్యద కావ్యం పూర్తయ్యాక శ్రీకృష్ణదేవరాయల మనఃస్థితిలోంచి ఆయన సాహిత్యసమరాంగణ జీవితం గురించి ఒక చారిత్రిక నవల రాస్తానని జోళదరాశి చంద్రశేఖర రెడ్డిగారికి చేసిన వాగ్దానాన్ని మరవలేను. తనకో నాటకం రాసి ఇమ్మని కీర్తిశేషుడు టి.జె.రామనాథం దాదాపు ముప్పై ఏళ్ళ కిందట నన్నడిగాడు. ఆయన జీవించి ఉండగా నేను ఆ కోరిక తీర్చలేకపోయాను. ఆయన కోసమేనా, నాటికలు, నాటకాలు, యక్షగానాలు వీలైనన్ని రాయాలని ఉంది. మహాభారతం ఇతివృత్తంగా ఒక మహాకావ్యం రాయాలని చాలా ఏళ్ళుగా అనుకుంటూనే ఉన్నాను. మహాత్మాగాంధీ జీవితంలోని మూడు ముఖ్యమైన దశలు తీసుకుని ఒక ట్రయాలజీ రాయాలి. నా కథల సంపుటి కోసం మిత్రులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటిదాకా రాసినవాటితో పాటు మనసులోనే రాసిపెట్టుకున్న మరికొన్ని కథలుకూడా రాసి ఆ సంపుటి వీలైనంత త్వరగా తేవాలని ఉంది.

ఇవి కాక, భారతీయ తత్త్వశాస్త్రాన్ని పరిచయం చేస్తూ ఆత్మాన్వేషణ పేరిట ఒక పుస్తకం వెలువరిస్తానని మిత్రుడు విజయకుమార్ కి ఇరవయ్యేళ్ళ కిందట మాట ఇచ్చాను. తీరా ప్రణాళిక వేసుకునేటప్పటికి, అది ఒక పుస్తకం కాక, కనీసం ఇరవై సంపుటాలేనా తేవలసిన అవసరం కనిపించింది. నేను రిటైరవగానే ఆ బాకీ తీర్చమని విజయకుమార్ నా వెంటపడతాడని నాకు తెలుసు.

ఈ దేశంలో బీదవారికి పాఠశాలల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న కాలంలో నేను ఉద్యోగంలో చేరాను. చదువుని అందరికీ అందుబాటులోకి తెచ్చే ఆ కార్యక్రమాల్లో, నా ఉద్యోగజీవితంలో మొదటి పదేళ్ళకాలం, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాను. ఆ అనుభవాల్ని ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ పేరిట విజయకుమార్ నాతో రాయించాడు. 1987 నుంచి 1997 దాకా అనుభవాలు అవి. అప్పణ్ణుంచీ ఇప్పటిదాకా కొనసాగిన ఉద్యోగ జీవితంలో నా అనుభవాల్ని పుస్తకంగా ఎప్పుడు రాయబోతున్నారని విజయకుమార్ ఇప్పణ్ణుంచే అడగడం మొదలుపెట్టాడు. ఆ పుస్తకం కూడా రాయక తప్పదు.

ఇక కనీసం మూడు భాషలు, తమిళం, పారశీకం, చైనీస్ నేర్చుకోవాలన్న కోరిక ఎలానూ ఉంది. తమిళం నేర్చుకుని సంగం సాహిత్యాన్నీ, పారశీకం నేర్చుకుని రూమీని, చైనీస్ నేర్చుకుని తాంగ్ యుగానికి చెందిన చీనాకవిత్వాన్నీ తెలుగు చేయకుండా నేను ఈ లోకం నుంచి నిష్క్రమించేది లేదు.

టాగోర్ తన యాభయ్యవ ఏట చిత్రలేఖనం మొదలుపెట్టినట్టు నేను నా యాభయ్యవ ఏట సంగీత సాధన మొదలుపెట్టాలనుకున్నాను. కానీ వీలవలేదు. కనీసం నా అరవయ్యవ ఏటనైనా సంగీత శుశ్రూష మొదలుపెట్టాలనీ, ఒక పదకర్తని కావాలనీ ఒక్కొక్కప్పుడు ఎంత బలంగా అనిపిస్తుందంటే, అదొక్కటి చేయగలిగితే చాలు, నా జన్మ సార్థకమవుతుందనుకుంటాను.

ఇట్లాంటి కలలు, ఊహలు, శివసంకల్పాలు చాలా ఉన్నాయి. నా తల్లిదండ్రులు, గురువులు, భగవంతుడి ఆశీస్సులతో పాటు, వీటిని నేను ఎట్లాగేనా మొదలుపెట్టాలనీ, జయప్రదంగా పూర్తి చెయ్యాలని కోరుకుంటున్న మిత్రులు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఆ మిత్రబృందంలో నందమూరి తారకరామారావు దంపతులు కూడా చేరారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

29-5-2021

Leave a Reply

%d bloggers like this: