సదాశివరావు

Reading Time: 3 minutes

సదాశివరావుగారితో దాదాపు పాతికేళ్ళకు పైగా అనుబంధం. ఆయనతో కలిసి నవ్వుకున్న రోజులున్నాయి, కోపంతోనో, చిరాకుతోనో మాట్లాడటం మానేసిన రోజులూ ఉన్నాయి. నిన్న రాత్రి ఆయన ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచివెళ్ళిపోయారన్న వార్త వినగానే మనసు చివుక్కుమంది.

దాదాపు పాతికేళ్ళ కిందట నేను హైదరాబాదు చేరినప్పుడు సదాశివరావుగారితో దగ్గరి పరిచయం ఏర్పడింది. అప్పుడాయన రైల్వేలో ఉన్నతాధికారిగా ఉండేవారు. ఒకటి రెండు సార్లు వాళ్ళింటికి వెళ్ళాను. ఆ గవర్నమెంటు బంగళాలో పెద్ద గదినిండా పుస్తకాల రాకులనిండా కొన్ని వందల పుస్తకాలతో పాటు జిరాక్సు తీసిపెట్టుకున్న క్లాసిక్సు కూడా వందలాది కనబడ్డాయి. ప్రపంచ సాహిత్యంతో అంత విస్తృతపరిచయం కలిగిన మనిషిని నేను చూడటం అదే మొదటిసారి.

అప్పట్లో మేము గుడిమల్కాపూర్ లో విశ్వాసనగర్ లో ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ ఇంటి ముంగిట్లో ఒక పనసచెట్టు ఉండేది. ఆయన ఒకరోజు కెమేరాతో ఆ ఇంటికి వచ్చారు. మమ్మల్నీ, ఆ పనసచెట్టునీ కూడా ఫొటోలు తీసారు. ఆ తర్వాత చాలా కాలంపాటు ఆ పనసచెట్టు గురించి అడుగుతూ ఉండేవారు.

నేను మళ్ళా హైదరాబాదు వచ్చిన తరువాత గత ఇరవయ్యేళ్ళుగా ఆయనతో పరిచయం చాలా దగ్గరి సాన్నిహిత్యంగా, స్నేహంగా మారింది. చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొన్ని వందలసార్లు ఫోన్ లో మాట్లాడుకుని ఉంటాం. ‘మీరు తెలుగువాళ్ళు ఏమీ చదవరు, మీకు సాహిత్యమంటే తెలీదు, నిన్న ఆ పుస్తకం చదివాను, ఇవాళ ఈ పుస్తకం పార్సెల్లో వచ్చింది, రాత్రి ఆ సినిమా చూసాను, ఇవాళ ఈ రచయితతో క్లబ్బుకి వెళ్తున్నాను’ లాంటి మాటలు సదాశివరావుగారి నోటివెంట వినని తెలుగు రచయిత ఉండడు. తన విశ్వసాహిత్య పరిచయంతో తెలుగు రచయితలని చిన్నబుచ్చేలా చెయ్యడం ఆయన జీవితకాలం పాటు వదులుకోలేకపోయిన వ్యాపకం.

సదాశివరావుగారి జాతకకుండలి నేను చూడలేదుగాని, అందులో కుజుడూ, శుక్రుడూ ఏ గదుల్లో ఉన్నారన్నది నాకెప్పుడూ కుతూహలమే. ఆయనలో ఒక పోలీసు అధికారీ, ఒక సౌందర్యారాధకుడూ ఎట్లా సహజీవనం చేసారో నాకెప్పటికీ ఆశ్చర్యమే. ఆయన డిజిపి ఆఫీసులో ప్లానింగ్ విభాగం చూస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళ ఆఫీసుకి రమ్మని పిలిచారు. ఆ ఆఫీసులో ఆయన్ని చూస్తే నాకు చాలా వింతగా అనిపించింది. ఆయన యాంటీఛాంబర్ లో నీటిరంగులు తెరిచిఉన్నాయి. ఆయన ఏదో చిత్రలేఖనం వేస్తూ ఉన్నాడు. బయట ఆఫీసు చాంబర్ లో బల్లమీద ఏవో పుస్తకాలు నాలుగైదు సగం సగం చదివి మడిచిపెట్టి కనబడ్డాయి. ఆయన నన్ను తీసుకుని బయటకు వచ్చి కారు ఎక్కగానే డ్రైవర్ కారులో స్టీరియో ఆన్ చేసాడు. ఏదో హిందుస్తానీ సంగీతం మంద్రంగా మొదలైంది. శుక్రుడూ, అంగారకుడూ ఇంత దగ్గరగా ఒకరితో ఒకరు గొడవపడకుండా ఉండే జీవితం నేను చూసినంతమటుకు ఆయనదే.

ఆయన నన్నొకసారి తన మిత్రుడి ఇంట్లో ఒక సాయంకాలం పండిట్ జస్ రాజ్ ఇస్తున్న కచేరీకి తీసుకువెళ్ళారు. ఆ సంగీతం వినిపిస్తున్నంతసేపూ ఆయన పూర్తిగా లీనమై నిశ్శబ్దంగా ఉన్నారు. కవులతోనూ, రచయితలతోనూ మాట్లాడేటప్పుడు చూపించే ఔద్ధత్యం ఆ రోజు ఏ కోశానా కనిపించలేదు. సంగీతం ఎదటా, చిత్రకారుల ఎదటా ఆయన ఒక శిశువులాగా ప్రవర్తించడం నేను చాలా సార్లు చూసేను.

ఆయనతో పెనవేసుకున్న అనుభవాల్లో గుర్తుచేసుకోదగ్గవి చాలానే ఉన్నాయిగాని, అన్నిటికన్నా ఎక్కువ గుర్తుండేది, నాతో ఆయన బషొ ట్రావెలాగ్ ని తెలుగు చేయించడం. జపనీయ హైకూ కవి మత్సువొ బషొ తన జీవితం పొడుగుతా చేసిన యాత్రల్ని ఎప్పటికప్పుడు కవిత్వయాత్రాకథనాలుగా రాసిపెట్టాడు. వాటిని తెలుగు చేయమని ఇస్మాయిల్ గారిని అడిగాననీ, కాని ఆయన చేస్తానంటోనే వెళ్ళిపోయారనీ, ఇస్మాయిల్ తర్వాత ఆ పని ఎవ్వరు చెయ్యగలరా అని ఆలోచిస్తే నేనే గుర్తొచ్చాననీ అన్నారాయన. ఆ మాట ఇచ్చిన స్ఫూర్తితో బషొ యాత్రావర్ణనల్ని ‘హైకూ యాత్ర’ పేరిట తెలుగు చేసాను. అందుకు సదాశివరావుగారికి నేనెప్పటికీ ఋణపడి ఉంటాను.

మరవలేని మరొక అనుభవం మేము కవితాప్రసాద్ తో గడిపిన ఒక సాయంకాలం. కవితాప్రసాద్ తో మాట్లాడాలని ఉందంటే ఒక రాత్రి నేను నా మిత్రుణ్ణి వెంటబెట్టుకు వెళ్ళాను. నాలుగైదు గంటలు కూచుని ఉంటాం. ఆ రోజు కవితాప్రసాద్ విశ్వరూపం చూపించాడు. ఎక్కడెక్కడి తెలుగు పద్యాలు, ఎక్కడెక్కడి అవధాన విశేషాలు, సమస్యాపూరణాలు-ఒకటేమిటి, అన్నిటికన్నా ముఖ్యంగా, పూర్వకవుల తెలుగు పద్యాల్ని చదివితేనో, పాడుకుంటేనో సరిపోదనీ వాటిని అభినయించుకుంటూ చదవాలని ఆయన సాభినయంగా చదివిన పద్యాలు వింటున్నంతసేపూ సదాశివరావుగారి వదనం వెలిగిపోతూనే ఉంది.

పాతికేళ్ళ కిందట డెరెక్ వాల్కాట్ కి నోబెల్ బహుమతి వచ్చిన మర్నాడే ఆయన ఒక వ్యాసం రాసారు. ఆ వ్యాసం చదివి అప్పటి సమాచార శాఖామంత్రి ఆయన్ని మెచ్చుకుంటూ ఆ పత్రికకి ఒక ఉత్తరం రాసారు. ఎప్పటికైనా ఆ వ్యాసరచయితని కలుసుకోగలనా అనుకున్నాను అవాళ. పాతికేళ్ళ తరువాత ఆయనతో బోర్హెస్ గురించీ, ట్రాన్స్ ట్రోమర్ గురించీ సంభాషించే స్థాయికి చేరుకోగలగడం నాకు గొప్ప గర్వాన్నిచ్చే విషయం. ప్రపంచ కవిత్వం నుండి తాను చేసిన అనువాదాలు నాకు ఇచ్చి వాటిని దిద్దిపెట్టమని అడగటం కూడా. కాని నేనా సాహసం చెయ్యలేకపోయాను. వాటిని ఇటీవలే ఆయన ‘కావ్యకళ’ పేరిట పుస్తకంగా వెలువరించారు.

కాని ఆయన చేసిన సాహిత్య కృషికి ఆయనకి రావలసినంత గుర్తింపూ పేరూ రాలేదు. ‘క్రాస్ రోడ్స్ ‘ కథాసంపుటి నేనిప్పటిదాకా పూర్తిగా చదవనేలేదు. తెలుగు కథలనుంచి నేను ఎంపికచేసి వెలువరించిన ‘వందేళ్ళ తెలుగు కథ’ లో ఆయన కథ లేనందుకు నన్నాయన ఇప్పటికీ క్షమించలేదు. బ్రిటిష్ కాలానికి సంబంధించిన కొన్ని కథలు ఆయన చాలా పాషన్ తో రాసినప్పటికీ అవి నన్నేమంత ఆకర్షించలేదు. కాని ఇటీవల నాలుగైదేళ్ళుగా ఆయన సైన్స్ ఫిక్షన్ మీద రాస్తూ వచ్చిన వ్యాసాలు మాత్రం తెలుగు సాహిత్యంలో అపురూపమైనవి, నాలుగు కాలాలపాటు నిలబడదగ్గవి. ‘సైన్స్ ఫిక్షన్ రచయితలు’ పేరిట నాలుగు సంపుటాలుగా వెలువడ్డ ఆ వ్యాసాల్లో ఆయన చేసిన కృషి నిరుపమానంగా కనబడుతుంది. తెలుగులో మరెవ్వరూ ఆయనకి దరిదాపుల్లోకి రాలేని రంగం అది. ‘పాలపిట్ట ‘ పత్రికలో ఆయన వెలువరిస్తూ వచ్చిన వ్యాసాలు ఎప్పుడు చూసినా నాకొకటే భావం కలిగేది: ఇంత ఎప్పుడు చదివాడు ఆయన! ఇందులో కనీసం శతాంశమేనా మనం చదవగలమా?

ఆయన తన మీద ఎప్పుడూ ఏ బరువూ పెట్టుకోలేదు. ఎవరి పట్లా ద్వేషంగాని, శతృత్వంగాని వహించలేదు. సునాయాసంగా బతికాడు, అనాయాసంగా వెళ్ళిపోయాడు.

8-8-2020

Leave a Reply

%d bloggers like this: