సత్యాన్ని దర్శించిన ధైర్యం

Reading Time: 4 minutes

చిత్రకొండ గంగాధర్ ని ఒకటి రెండు సార్లు కలిసి ఉంటాను. అది కూడా పాతికేళ్ళ కిందట. 95-96 మధ్యకాలంలో, హైదరాబాదులో, సి.వి.కృష్ణారావు గారి నెలనెలా వెన్నెల సమావేశాల్లో. అప్పట్లో అతడి కవితలు ‘వార్త’ సాహిత్యానుబంధంలో వస్తుండేవి. చాలా సాంద్రమైన అనుభూతి కనిపిస్తుండేది వాటిలో. అతడు హైకూలు కూడా రాస్తుండేవాడని గుర్తు.

రెండేళ్ళ కిందట, ఒక సాయంకాలం, అతడి కవిత్వసంపుటి ఆవిష్కరణ సభ కి వెళ్ళినప్పుడు తెలిసింది. అతడు 2011 లో ఆత్మహత్య చేసుకున్నాడని. అది కూడా ఏదో క్షణికోద్రేకంలోనో, లేదా భరించలేని ఏదో ప్రేమవల్లనో లేదా మనం గుర్తుపట్టగల ఏ దుఃఖంతోనూ కాదు. ఎంతో చిత్తశుద్ధితోనూ, దృఢసంకల్పంతోనూ తనని తాను అదృశ్యం చేసుకున్నాడని తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ దగ్గర తన స్వగ్రామం బొడ్డపాడులో, తాను చిన్నప్పణ్ణుంచీ ఏ చెరువుని చూస్తూ గడిపాడో, ఆ చెరువు దగ్గర, ఒక పక్కగా తన చెప్పులు విడిచి, వాటికింద ఒక చీటీ పెట్టి, ఆ చెరువులోకి నడిచివెళ్ళిపోయేడట. ‘బొడ్డపాడులో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నాను, గర్వపడుతున్నాను, నా మరణానికి నేనే బాధ్యుడను ‘ అని రాసి ఉందట ఆ చీటీలో.

అతడట్లా అదృశ్యమైపోయిన ఆరేడేళ్ళకిగాని, ఆ సంగతి తక్కిన సాహిత్య ప్రపంచానికి తెలియలేదు. అది కూడా అతడి సన్నిహిత మిత్రుడు అజయప్రసాద్ ఎన్నో ఏళ్ళు అతడి నుంచి ఎప్పుడన్నా కనీసం ఒక ఫోన్ కాల్ అయినా వస్తుందేమోనని ఎంతో నిరీక్షణలో గడిపేక. అతడు ఈ లోకం నుంచి నిష్క్రమించిన ఏడేళ్ళ తరువాత అతడి కవిత్వాన్ని ప్రేమలేఖ ప్రచురణ వారు ‘ఆత్మహత్యా సదృశ్య దేశద్రిమ్మరి ఆఖరికోరిక’ పేరిట ప్రచురించారు. ఆ పుస్తకావిష్కరణ సభకే నేను వెళ్ళింది.

భారతీయ సాహిత్యంలోగాని, తెలుగు సాహిత్య సంప్రదాయంలోగాని, కవులంటే దీర్ఘాయుష్మంతులనే మనం భావిస్తూ ఉంటాం. దీర్ఘకాలం జీవించడమే కాదు, కవులు, ఈ లోకంలో, సన్మానాలకీ, సత్కారాలకీ నోచుకోవాలని కూడా ఆశపడుతుంటారు. మామూలుగా మనుషులకుండే జీవితేచ్ఛ కన్నా కవుల జీవితేచ్ఛ మరింత బలంగా కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది కూడా. కవి అనగానే మనకు ఒక టాగోర్ లాగా పండుగెడ్డంతో ఋషి సదృశుడిగా ఉండే స్ఫురద్రూపమే కళ్ళముందు కనిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప, అల్పాయుష్కులూ, అకాలంగా మరణించినవాళ్ళూ మనకవుల్లో మనకి ఎవరూ పెద్దగా కనిపించరు. చివరికి తిలక్ కూడా నలభై అయిదేళ్ళు జీవించాడు. అప్పటికి కూడా శ్రీ శ్రీ అతణ్ణి ‘లోకబాల్య తిలక్’ అనే సంబోధించేడు. ఇరవయ్యేళ్ళవయసులోనో లేదా ముప్పై ఏళ్ళు నిండకుండానో మరణించిన కవులు తెలుగులో, ఈ క్షణానికి, నాకెవరూ గుర్తు రావడం లేదు. తన యవ్వనంలోనే ఇల్లు విడిచివెళ్ళిపోయిన కవులు ఇద్దరున్నారు. ఒకరు, ముందు తరం కవుల్లో, కొడవటిగంటి కుటుంబరావుగారి సోదరుడు కొడవటిగంటి వెంకటసుబ్బయ్య. మరొకరు నా ఆత్మీయుడు, మా రాజమండ్రి మిత్రుడు, కవులూరి గోపీచంద్.

కాని యూరపియన్ సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ అర్థాంతరంగా మరణించిన కవులు చాలామందే ఉన్నారు. యుద్ధక్షేత్రంలో మరణించిన రూపర్ట్ బ్రూక్ లు, కాన్ సెంట్రేషన్ కాంపుల్లో మరణించిన ఓసిప్ మెండెల్ స్టాం లు, క్షయవ్యాధి తినేసిన జాన్ కీట్స్ లు, ఫ్రాంజ్ కాఫ్కాలు, మాదకద్రవ్యాలు తినేసిన జార్జి ట్రాకల్ లు, ఆత్మాభిమానంకోసం ద్వంద్వయుద్ధానికి పాల్పడి ప్రాణాలు వదిలిన పుష్కిన్, లెర్మెంటోవ్ లు మనకి ఎందరో కనిపిస్తారు. వాళ్ళల్లో ఆత్మహత్య చేసుకుని మరణించిన కవులు మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. రొమాంటిసిస్టులకి ఆరాధ్యనాయకుడైన థామస్ ఛాటర్ టన్, రష్యన్ విప్లవ ప్రవక్త మయకోవస్కీ, ఇటాలియన్ కవి చెసారే పావేస్, అమెరికన్ కవి జాన్ బెర్రీమెన్ లాంటి వారు చాలామంది ఉన్నారు. అలా అర్థాంతరంగానూ, నిండు జీవితం వికసించకుండానే మొగ్గలోనే తుంచేసుకుని వెళ్ళిపోయిన కవుల పట్ల పాశ్చాత్యసమాజం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తుంది. మనం చూడలేకపోతున్న ఏ సత్యమో వాళ్ళు చూసారనీ, అదేమిటో మనకి పూర్తిగా వివరించకుండానే వెళ్ళిపోయారనీ భావిస్తుంది. వారు మరణించిన తర్వాత వాళ్ళు రాసిన ప్రతి ఒక్క కాగితం, వాడుకున్న ప్రతి ఒక్క వస్తువు, కొట్టివేతల్తో ఉన్న ప్రతి ఒక్క చిత్తుప్రతి కూడా అపారమైన విలువని సంతరించుకుంటాయి. ఆ కవులు నెమ్మదిగా cult figures గా రూపొందుతారు. మామూలు జీవితాల్లో మనం అనునిత్యం పడే రాజీల నుంచి, ఆత్మవంచనలనుంచి బయటపడ్డ విముక్తమానవులుగా కనిపించడం మొదలుపెడతారు. కొన్నాళ్ళకు వాళ్ళని విమర్శకులు visionaries అని శ్లాఘించడం మొదలుపెడతారు.

అలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోగలిన కవులు తదనంతర కవులకి ఆరాధనీయులుగా మారడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు ఫ్రాన్సులో జెరార్డ్ డి నెర్వాల్ అనే డార్క్ రొమాంటిసిస్టు కవి ఉండేవాడు. అతడి గురించి తలుచుకుంటూ శ్రీ శ్రీ ఇలా రాసాడు:

‘ఈ వ్యాసం రాస్తున్న సమయంలో నా అభిమాన రచయిత జెరార్డ్ డి నెవాల్. ఆయన అభిమాన జంతువొక పీత. దానికొక సిల్కు దారం కట్టి ఎప్పుడూ తనవెంట తిప్పుకునేవాడు. తాను రాసుకునేటప్పుడు అది కుక్కలాగా పిల్లిలాగా ఏమీ అల్లరి పెట్టదనేవాడు. అందుకు అదంటే అంత ఇష్టం. ‘ఇట్ ఈజ్ ఏ స్మాల్ సైలంట్ బీస్ట్ దట్ నోస్ ది సీక్రెట్స్ ఆఫ్ ద డీప్’ అని తన పీత గురించి అన్నాడు. ‘సముద్ర గర్భ రహస్యాలు దీనికి తెలుసు, కాని ఎవ్వరికీ చెప్పదు. అదీ దాని గొప్పదనం’…నెర్వాల్ హాస్యప్రియుడు. అందరినీ వేళాకోళం చేసేవాడు. అతడు చేసిన ఆఖరి వేళాకోళపు పని పారిస్ నగరంలోని ఒకానొక నిర్మానుష్యమైన సందులో లాంతరు స్తంభానికి ఉరిపోసుకుని మరణించడం. నెర్వాల్ నే కాదు, ఎవరినీ నేను అనుకరించలేను.’ (శ్రీ శ్రీ ప్రస్థాన త్రయం, కదంబం, పే.108)

ఇప్పుడు చిత్రకొండ గంగాధర్ ని తలుచుకున్నప్పుడు ఈ కవులంతా జ్ఞప్తికి రావడం సహజం. కాని, మరణం ఈ కవులకి తెచ్చిన ప్రకాస్తికి గంగాధర్ ఇంకా నోచుకోలేదు. రెండేళ్ళ కిందటనే అతడి కవిత్వం నా చేతుల్లోకి వచ్చినప్పటికీ, అతడు తన జీవితంద్వారానూ, మరణం ద్వారానూ కూడా ఎలుగెత్తి చాటవలసిన కవి అని తెలుస్తున్నప్పటికీ నేనిన్నాళ్ళూ మౌనంగానే ఉండిపోయేను.

మొన్న సాయంకాలం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన సమావేశానికి అనుకోకుండా నేను వెళ్ళ వలసి వచ్చింది. చిత్రకొండ గంగాధర్ రాసిన ‘మృతనగరంలో’ అనే నవల ఆవిష్కరణ సభ అది. పల్లవి పబ్లికేషన్స్ వెంకట నారాయణగారు ప్రచురించిన ఆ నవలని ఆవిష్కరించే బాధ్యత నాకు అప్పగించారు. ఆ సభకి అనిల్ డ్యానీ అధ్యక్షత వహిస్తే, కాకుమాని శ్రీనివాసరావు పుస్తక పరిచయం చేసారు. అప్పుడు అర్థమయింది నాకు, ఆ కవి నన్ను వెన్నాడుతూనే ఉన్నాడని.

నిన్న రాత్రి ఆ నవల పూర్తిగా చదివాను. అది మామూలు రచన కాదు. ఇప్పటికి తెలుగు సాహిత్యం ఏకకాలంలో పూర్తిగా modernize అయిందనీ, postmodernize అయిందనీ చెప్పవచ్చు. పాశ్చాత్య సాహిత్యంలో ఇలియట్, జాయిస్ వంటి రచయితలతో మొదలైన మాడర్నిజం తెలుగులో శ్రీ శ్రీ, బైరాగి, అజంతాలతో కొంతమేరకు మాత్రమే మాడర్నైజ్ కాగలిగింది. ఇక డొనాల్డ్ బార్తెల్మి, ఇటాలో కాల్వినో, కార్లోస్ ఫ్యుయెంటిస్, జూలియో కోర్టజార్ వంటి రచయితలతో వికసించిన పోస్ట్ మాడర్నిజం తెలుగు సాహిత్యానికి ఇంతదాకా పరిచయమే కాలేదు. ఆ రెండు ధోరణులనీ పూర్తిగా పుణికిపుచ్చుకున్న నవల ‘మృతనగరంలో.’ తన మరణానంతరం వెలువడిన ఈ నవలతో గంగాధర్ తనకు తెలియకుండానే తెలుగు భాషను రాత్రికి రాత్రి ఆత్యాధునిక ప్రపంచభాషగా మార్చేసాడు.

తాను ఏ సత్యాన్ని దర్శించిన ధైర్యంతో అంత దృఢ నిశ్చయంతో గంగాధర్ ఆ చెరువులోకి అడుగుపెట్టగలిగాడు? ఆ రోజు నవలని పరిచయం చేస్తూ శ్రీనివాసరావు చెప్పిందేమంటే, నవల్లో ప్రధాన పాత్ర ఇకారస్ నవలమొదలవుతూనే ఒక చెరువులోకి బయటకి వస్తాడు, బహుశా గంగాధర్ తాను ఆ చెరువులో అడుగుపెట్టిన తరువాత, తిరిగి ఇకారస్ లాగా బయటకి వస్తానని భావించి ఉండవచ్చు అని.

అయి ఉండవచ్చు. మనమంతా ఈ లోకంలో ఉన్నాం గాని, మన ఆత్మవంచనలవల్ల మనం మరణించినవాళ్ళకిందే లెక్క. అతడు మరణించినప్పటికీ, తన సత్యసంధత వల్ల, జీవించి ఉన్నట్టే.

శ్రీనివాసరావు మరొక మాట కూడా అన్నాడు. ‘ఈ పుస్తకావిష్కరణ ఆ బొడ్డపాడు చెరువు దగ్గర జరుపుకోవాలని ఉంది. ఆ చెరువుని చిత్రకొండ గంగాధర్ చెరువు అని పిలవాలని ఉంది’ అని. యూరప్ లో అయితే ఈ పాటికి ఆ రెండూ జరిగి ఉండేవి.

ఆ పుస్తక ఆవిష్కరణ సభలో అనిల్ డ్యానీ ‘అసమర్థుని జీవయాత్ర’ని గుర్తు చేసాడు. ఆయన మరొక మాట కూడా అన్నాడు. ఆ నవల చదువుతుంటే, దుస్తుల షాపులో మనం ట్రయల్ రూం లోకి వెళ్ళి మనకి సరిపోయే దుస్తులేవో పరీక్షించి చూసుకునేటట్టుగా అనిపిస్తుందని. ‘మృతనగరంలో ‘ చదవండి. అది మనల్ని చెప్పలేనంత అశాంతికి గురిచేస్తుంది. నా పదిహేడేళ్ళ వయసులో గుంటూరు బస్ స్టాండులో ‘అసమర్థుని జీవయాత్ర’ కొనుక్కుని నాగార్జున్ సాగర్ వెళ్ళే దారిలో పూర్తిచేసేసిన రోజు గుర్తొచ్చింది. ఈ పుస్తకం వల్ల ఇన్నాళ్ళకు మళ్ళా ఆనాటి నాలోని ఆ స్వచ్ఛమానవుణ్ణి గుర్తుపట్టగలిగాను. ఈ పుస్తకం చదివితే మీరు కూడా మీలోని నిర్మల మానవుణ్ణి గుర్తుపట్టగలుగుతారు.

21-11-2020

Leave a Reply

%d bloggers like this: