సజీవసంగీతాలు

కార్వేటి నగరం వెళ్ళాలన్న నా కోరిక ఇప్పటిది కాదు. దాదాపు ముప్పై ఏళ్ళ కిందట నేను ఉట్నూరులో పనిచేస్తున్న రోజుల్లో, అక్కడ ఉపాధ్యాయుల కోసం కృత్యాధార విద్యకి సంబంధించి కరదీపికలు రూపొందిచేటప్పుడు కార్వేటినగరం ఉపాధ్యాయ శిక్షణా సంస్థ వారితో కలిసి పనిచేసాం. అప్పణ్ణుంచీ కార్వేటినగరం ఉపాధ్యాయ శిక్షణా సంస్థని చూడాలన్నది నా కల. ఇన్నాళ్ళకు అక్కడ అడుగుపెట్టగలిగాను. దాదాపు పధ్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అరటి, మామిడితోటల మధ్య ఆ విద్యాలయం ఒక శాంతినికేతనంలాగా ఉంది. అక్కడ ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలుసుకున్నాక, మాట్లాడుకున్నాక, కార్వేటినగరం కోటనీ, సారంగపాణినీ చూద్దామని బయల్దేరాం.

కార్వేటి అనే పదం కాడువెట్టి అనే పదానికి రూపాంతరం. అంటే అడవిని నరికి రూపొందించిన పట్టణం అని అర్థం. ఆ సంస్థానం తెలుగు సాహిత్యానికీ, సంస్కృతికీ చేసిన సేవ అపారం. ఆ సేవ ఇప్పటికీ కొనసాగుతున్నదనే చెప్పాలి. ఎందుకంటే, ఆ వంశంలో చివరి రాజు తన రాజ మహల్ ని ఉన్నతపాఠశాల పెట్టుకోడానికి ఇచ్చేసాడు. ఆ పాఠశాలకి కూడా వెళ్ళాం. అక్కణ్ణుంచి ఆ సంస్థానాధీశులు తవ్వించిన పుష్కరిణిని చూసాం. కార్వేటినగర సంస్థానానికి ఇలవేలుపైన వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా వెళ్ళాం.

ఇప్పుడు ఆ ప్రధాన దేవాలయం మరమ్మత్తుల్లో ఉన్నందున పక్కనే చిన్న ఆలయంలో బాలలయం చేసి ఉన్నారు. బాలలయం అంటే ప్రధానదేవాలయం లో ఉండే దైవాన్ని చిన్నదేవాలయంలోకి ఆవాహన చెయ్యడం. ఆ చిన్న ఆలయంలో కూడా వేణుగోపాల మూర్తి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు. ప్రధాన ఆలయంలోని దేవతామూర్తుల్ని దారుఫలకాలమీద చిత్రాలుగా చిత్రించి అందులోకి ఆహ్వానించి ఉన్నారు. ఆ చిత్రలేఖనాలు చూస్తుంటేనే ఆ మూర్తులు ఎంత సుందరరూపాలో అర్థమవుతూ ఉంది.

ఆ దేవాలయానికి వెళ్ళే దారిలో వీథి మొదట్లో సారంగపాణి విగ్రహం ప్రతిష్టించి ఉంది. ఆ విగ్రహం కింద ‘హరినామ స్మరణే సేయకుంటే అవతల గతి యేమి ‘ అనే వాక్యం చెక్కి ఉంది. కార్వేటినగరం సారంగపాణికి జీవిక ప్రసాదించి ఉండవచ్చుగానీ, సారంగపాణి వల్ల కార్వేటినగరం లోకప్రసిద్ధి చెందింది. ఆ సంస్థానాన్ని పాలించిన మాకరాజు కార్వేటి రాజేంద్రుడి కాలంలో అతడి ఆస్థానంలో ఉన్న కవిపండితుల్లో సారంగపాణి కూడా ఒకడు. ఆయన కాలాన్ని ఇతమిత్థంగా తేల్చలేకపోయినప్పటికీ, సాహిత్య పరిశోధకులు స్థూలంగా 1680-1750 కాలానికి చెందినవాడిగా లెక్కిస్తున్నారు.

విజయనగర సామ్రాజ్య పతనం (1565) నుంచి నాలుగవ మైసూరు యుద్ధం (1799) దాకా రెండు శతాబ్దాల పైగా దక్కను, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక, రాయలసీమ ప్రాంతాలు అనుభవించిన సంక్షోభం గురించి మనకి చరిత్రకారులు ఏమీ చెప్పరు. వాళ్ళు యుద్ధాల చరిత్ర రాయగలరే తప్ప, ఆ యుద్ధపరంపరలో, ఆ రాజకీయ అస్థిరతలో సామాన్యమానవుడు ఏ విధంగా అతలాకుతలమయ్యాడో మనకి చెప్పలేరు. విజయనగర పతనంతో మధ్యయుగాలు ముగిసి, సెంట్ జార్జికోటలో మద్రాసు ప్రెసిడెన్సీ పాలన నిలదొక్కుకోవడంతో ఆధునిక యుగం మొదలయిందని చెప్పవచ్చు. ఆ పరివర్తనను మనకు పట్టివ్వగలిగింది సాహిత్యం మాత్రమే. కాని పదిహేడు, పద్ధెనిమిది శతాబ్దాల తెలుగు సాహిత్యాన్ని మనం క్షీణాంధ్రయుగంగా లెక్కించుకుంటూ ఉన్నాం. నిజానికి తెలుగు సాహిత్యం ఆధునీకరణకు లోనయిన కాలం అది. 1565 నుంచి 1812 లో మొదటి తెలుగు పుస్తకం ముద్రణా యంత్రం మీద అచ్చయ్యేదాకా దాదాపు రెండువందల ఏళ్ళకు పైగా తెలుగు సమాజం లోనైన సామాజిక పరివర్తనను అర్థం చేసుకోవాలంటే ఆ కాలం నాటి సాహిత్యాన్నే మరింత లోతుగానూ, క్షుణ్ణంగానూ చదువుకోవాలి.

అటువంటి అవశ్యపఠనీయ కవుల్లో సారంగపాణి ఒకడు.

ఆయన ప్రధానంగా పదకర్త. ఆ పదాల్లో ఇప్పుడు సుమారు 210 దాకా మనకి లభ్యమవుతున్నాయి. వాటిని పరిశోధకులు శృంగార, దేశీయ, జాతీయ పదాలు, కీర్తనలు అని నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తున్నారు. పదకర్తగా సారంగపాణి క్షేత్రయ్యకూ, త్యాగయ్యకూ మధ్య కాలానికి చెందినవాడు. కాని వారిద్దరికన్నా ప్రత్యేకమైన ముద్ర అతనిది. అతడు క్షేత్రయ్యలాగా శృంగార పదాలు మాత్రమే రాసి ఉండలేదు. త్యాగయ్యలాగా ఆధ్యాత్మిక కీర్తనలు మాత్రమే పాడి ఉండలేదు. తన కన్నా ముందుగాని, తన తర్వాత కాని ఏ కవీ చిత్రించలేనంతగా సామాన్యప్రజల పలుకుబడిలో సామాజిక జీవితపు ఆటుపోట్లని అనితర సాధ్యంగా చిత్రించాడు. బహుశా ఈ ఒక్క అంశంలో సారంగపాణి తెలుగు సాహిత్యంలో అద్వితీయ పదకర్తగా నిలబడిపోతాడు.

శృంగార పదాలు చెప్పడం ప్రతి పదకర్తకూ ఒక కనీసపరీక్ష. పారశీక గజల్ లాగా పదసామగ్రి, అలంకార సామగ్రి పరిమితం మాత్రమే కాక, ఆ సామగ్రిని అప్పటికే ఎవరో ఒక కవి వాడి ఉంటాడు. అదీకాక అన్నమయ్య లాంటి మహాకవి వేలాది పదాలు పాడిన తరువాత మరొక కవి శృంగార పదాల్ని రాయడానికి పూనుకోవడమే సాహసం. కాని సారంగపాణి ఆ పరీక్షలో కృతకృత్యుడు కావడమే కాక, మరవలేని పదాల్ని మనకు కానుక చేసి వెళ్ళిపోయాడు. రసజ్ఞలోకం ముక్తకంఠంతో ప్రశంసించిన ఈ పదం చూడండి:

~

ఏమిటికే నీపే-రేమని యడిగితివి

కోమలి నను వేణు-గోపాలుడని తెలిసి

పడతీ నీ మోము ము-ద్దిడుకున్నప్పటినుంచి

పద్మాక్షుడని నను-బలుకుదురే

జడియక నీదు కీల్-జడ యల్లినదే మొదలు

తొడరి శేషశయ-నుడనుచు బిలుతురే

అలివేణి నీ మోవి-యానిన నెపమున

తలకొని మధుసూ-దను డందురే

బలిమి నీ గుబ్బలు-బట్టి చూచుటచేసి

తలిరుబోణి మందర-ధరుడని తలతురే

మరుకేళి నినుగూడి-మరిగినదే గురిచేసి

మదన జనకుడని ప్రే-మను గొలుతురే

పరిమళవతి నీమై-పసుపు దుప్పటైనది

అరసి పీతాంబరధరు-డనుకొందురే.

~

అపురూపమైన భ్రాంతిమదలంకారమే కాదు, ఈ పదంలో చూడవలసింది, ఆ పదాల పోహళింపు, వెన్నలాగా కరిగిపోయే ఆ కూర్పు, అన్నిటికన్నా ముఖ్యం, ఆ శయ్య.

ఇటువంటి శృంగార పదాలు దాదాపు డెబ్బై అయిదు దాకా ఉన్నాయి. ఇక దేశీయ పదాలు అనే వర్గీకరణలో కనిపించే పదాలు కూడా కావటానికి శృంగార పదాలే కాని పల్లెటూరి ప్రేమికుల మధ్య నడిచే సరససల్లాపాలు. అలాగని ఈ పదాలు లలిత ప్రేమగీతాలు కావు. వీటిలో చాలా పాటలు వేశ్యల చుట్టూ అల్లినవే. సాహిత్య పరంగా ఒకటి రెండు పదాలు మనల్ని ఆకట్టుకోక మానవు. ఈ ఉదాహరణ చూడండి:

~

నీ పొందు సేయక విడచేనా వేరే-

నెలత కొప్పున విరులు ముడిచేనా-అరే

బాపురే నే సేయు-ప్రతిన చెల్లకపోతే

నా పేరు ఇక వేణు-గోపాలుడనవలెనా

మరుని గూర్చి తపము సేయనా ఈడా-మనసు లేదంటేనే ఆయెనా

మరులు నిలుపలేక-మరి మరి వేడితే

కరుణమాలి యట్టె కండ్లెర్ర సేయగా

పాటపాడి మెప్పించనా నీ పై-పదము చెప్పి వలపించనా

బూటకాలమారి నీ -పుణ్యమనే కొద్ది-

మోటుబారుకొని-మొగము చిట్లించగా

కూనలమ్మకు వేటగొట్టనా నిన్ను-కూడితే పొంగళ్ళు పెట్టనా

చానరో బతిమాలి-సరసకు రమ్మంటె

కాని లేలేమ్మని-కసరి పొమ్మనగా.

~

ఇక కీర్తనల విభాగంలో దాదాపు యాభైకి పైగా పదాలున్నాయి. అవి ప్రజల నాలుకలమీద నడయాడుతున్న సజీవసంగీతాలు. వాటిల్లో నుతులు ఉన్నాయి, స్తుతులు ఉన్నాయి, తత్త్వాలు ఉన్నాయి. కవి హృదయం నుంచి నేరుగా పల్లవించిన అంకురాలవి. ఒక కీర్తన చూడండి:

~

హరినామ స్మరణే సేయకుంటే-

అవతల గతి యేమి-ఈ

వెరవు తెలసి సత్సంగతి వదలక

వేణుగోపాలుడైన-శ్రీనర

అన్నదమ్ములెడబాయక మునుపే-

ఆలు నిష్టురోక్తులనక మునుపే

కన్న కొడుకు దండించక మునుపే-

కాయము వ్యాధుల చివుకక మునుపే

వృద్ధాప్యము ప్రాప్తించక మునుపే-

వుత్సాహము బలముడుగక మునుపే

నిర్ధనుడై దిగులు బడక మునుపే-

నేత్రాలు పొరగప్పక మునుపే

కర్ర నూనుకొని తిరుగక మునుపే-

కంఠధ్వని తగ్గిపోక మునుపే

అర్రు ముందరికి వంగక మునుపే-

అంగము తల వణుకెత్తక మునుపే

దవడలు లోనికి బోవక మునుపే-

దంతపటుత్వము తప్పక మునుపే

చెవులకు మందము దట్టక మునుపే-

చెల్లబోనడవ చేరక మునుపే-

అప్పుల కాపులు కదియక మునుపే

అన్నమొకరు తినిపించక మునుపే

దొప్పలోన చై కడగక మునుపే-

దోవతి బరువై తోచక మునుపే.

~

ఇక ఎందరో తల్లులు తరతరాలుగా తమ హృదయానికి హత్తుకున్న ఈ సుకోమల గీతం చూడండి:

~

లాలనుచు వూచేరు-లలనలింపునను

శ్రీల చెన్నలురు ను-య్యాల పాన్పునను

గోల రుక్మిణిదేవి కోరి సొంపునను

బాళితో వచ్చె నీ-పై తలంపుననూ

జోలపాడెదమనుచు -జోడు కూడుకొని

బాలికలు తమలోన పంతమాడుకొని

మేలిమిగ నిన్ను యే-వేళ పొగడుకొని

తాలిమితొ వచ్చేరు-దయను వేడుకొని

కరమునను రత్నాల-కంకణము మ్రోవా

హరిణాక్షి మరువంపు-సురటిగొని వీవా

మరి ప్రొద్దు బోయె నె-మ్మది నిదురబోవా

పరమపావనుడైన -పరవాసుదేవా

చిన్నబాలురతోటి-చెలిమి సేయకురా

కన్నికామణుల ద-గ్గరికి పిలువకురా

మన్ననతొ మీ తల్లి-మాట మీరకురా

వెన్న యిచ్చేను నీ-వెందు తిరుగకురా.

ధరలోన వసుదేవు-తనయుడై పుట్టి

శరణాగత త్రాణ-బిరుదు చేపట్టి

వరుస సద్భక్తులకు-వరమొసగినట్టి

దొరవనుచు సుజనులెం-తురు గంటకట్టి.

జారచోరత్వముల- చతురుడైనావు

ధీరుడై ఇల్లిల్లు-దూరి వచ్చేవు

వారు కోపించితే-వగల బొయ్యేవు

దూరగావలె ననుచు- దుడుకు చేసేవు

అసురులను శిక్షించి-అవని రక్షించి

మసలకను కౌరవుల-మదములణగించి

పొసగ ధర్మజు చేత-భూమి నేలించి

రసికుడై చెలగితివి-రాజసము మించి.

వాణీశ రుద్రాది-వందితుడవీవు

ప్రాణికోటుల నెల్ల-ప్రబల చేసేవు

నాణెముగ కార్వేటి-నగరమున నీవు

వేణుగోపాలుడై-వెలసి యున్నావు.

~

ఇక సారంగపాణి పదాల్లో జాతీయ పదాలు అని చెప్పదగ్గ 17 పదాలున్నాయి. అటువంటి పదాలు రాసిన కవి మొత్తం భారతదేశంలోనే మరొకరు కనబడరు.

15-4-2021

Leave a Reply

%d bloggers like this: