వెలుగు రాజ్యం చేసే కాలం

Reading Time: 4 minutes

నాలుగైదు రోజుల కిందట విజయదశమినాడు ఇక్కడ ఊరిచివర సాయిబాబా గుడికి వెళ్ళి వస్తూండగా ఎవరో బాట పక్కనుంచి ప్రేమగా పిలిచినట్టనిపించి ఆగిచూసాను. ఎవరూ కనిపించలేదు. ఒకటి రెండు నిముషాలు గడిచాక అర్థమయింది, అది బాటపక్కన విరబూసిన ఏడాకుల పొన్న చెట్టు పిలిచిన పిలుపని. శరత్కాలమంటే అందరికీ పారిజాతాలు గుర్తొస్తాయి. కాని గాల్లో చెరకురసాన్ని పిచికారీ చేసినట్టు విరబూసే ఏడాకుల పొన్నపూల గురించి ఒక్క మహాకవి మాత్రమే మాట్లాడగలడు. శరత్కాలం తన శోభనంతా ఏడాకుల పొన్నచెట్లలో నింపిపెట్టిందంటున్నాడాయన:

శాఖాసు సప్తచ్ఛదపాదపానామ్

ప్రభాసు తారార్క నిశాకరాణామ్

లీలాసుచైవోత్తమవారణానామ్

శ్రియం విభజ్యాద్య శరత్ ప్రవృత్తా (కిష్కింధ, 30:29)

(శరత్కాలం తన శోభనంతటినీ ఏడాకుల పొన్నచెట్లకొమ్మలమీదా, తన కాంతుల్ని సూర్యచంద్రతారకల్లోనూ, తన లీలావిలాసాన్ని చక్కటి ఏనుగులగుంపుల్లోనూ పంచిపెట్టింది)

ఈ రోజు శరత్పూర్ణిమ. ఒక మహాకవి పుట్టడానికి ఇంతకన్నా అనుకూలమైన రోజు మరేముంటుంది? ఈ రోజు వసంతకాలపు కవోష్ణమధురిమలు లేవు. వేసవికాలపు పెనుగాడ్పులు లేవు. వర్షాకాలపు ఉరుములు మెరుపులు లేవు, హేమంతకాలపు శీర్ణపత్రాలుగానీ, శిశిరర్తు హిమపాతాలు గానీ లేవు. మహర్షి అన్నట్లుగా శరత్కాలంలో సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ అన్నీ శోభాయమానంగానే ఉంటాయి. వెలుగు రాజ్యం చేసే కాలమిది.

ప్రతి కవికీ తాను పుట్టిన ఋతువుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎందుకంటే, ఆ రోజుల్లో అతడు తన తల్లికడుపులో మేలుకుని ఆమె ద్వారా తన చుట్టూ ఉన్న ఋతుసౌరభాన్ని ఆఘ్రాణించి ఉంటాడు. టాగోర్ కి వైశాఖమంటే అందుకే అంత ప్రేమ, నాకు ఫాల్గుణం లాగా. వాల్మీకి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు శరత్కాల సౌందర్యాన్ని చూడటం కాదు, విన్నాడని ఊహించవలసి ఉంటుంది.

జలగర్భాః మహావేగాః కుటజార్జున గంధినః

చరిత్వా నిరతాః సౌమ్య వృష్టివాతాః సముద్యతాః (కి.30:25)

( సౌమ్యుడైనా లక్ష్మణా! ఇంతదాకా నీళ్ళతో నిండిఉండి, కొండగోగుపూలనీ, తెల్లమద్ది పూలసువాసనల్నీ విరజిమ్ముతూ మహావేగంతో సంచరించిన వానగాలులు ఇప్పటికి సద్దుమణిగాయి)

ఘనానామ్ వారణానామ్ చ మయూరాణామ్ చ లక్ష్మణ

నాదః ప్రస్రవణానాం చ ప్రశాంతః సహసానఘ (కి.30:26)

(లక్ష్మణా, ఇంతదాకా హోరెత్తించిన మేఘగర్జనలు, ఏనుగుల ఘీంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు సెలయేళ్ళ సునాదాలూ ఇప్పటికి ప్రశాంతమయ్యాయి.)

శాతమంటే శమించడం. రామాయణం కరుణ రస ప్రధానంగా కనిపించే శాంతరస కావ్యం. శమించడం, నెమ్మదికావడం, సద్దుమణగడం-మనలో పదితలలతో విజృంభించే ప్రలోభాలు నెమ్మదిగా అడగిపోవడం. రాముడు నడిచిన దారి అటువంటి ఒక శాంతాన్వేషణ.

నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడూ, నా పసితనంలోనూ మాఘఫాల్గుణాల చివరిదినాల్నీ, వసంతకాలపు తొలిదినాల మహాసౌందర్యాన్నీ కళ్ళారా చూసాను. ఆ రోజులదగ్గరే ఆగిపోయాను. నా జీవితమంతా తిరిగి ఆ సౌందర్యం కోసమే అన్వేషిస్తో ఉన్నాను. ఒక పునర్యానం చేస్తోనే ఉన్నాను.

మహాకవి తాను పుట్టినప్పటి ఒక ప్రశాంతిని తనలో నిలుపుకున్నాడు. ఆ ప్రశాంత మనస్కతను మనకు ఒక దొన్నెలో పెట్టి తేనెలాగా అందించాడు. ఆ అంతరంగమంతా ఆయన శరత్కాల వర్ణనలో కనిపిస్తున్నది.

అభివృష్టాః మహామేఘైః నిర్మలాశ్చిత్ర సానవః

అనులిప్తా ఇవాభాన్తి గిరయశ్చిత్రదీప్తిభిః (కి.30:27)

(మహామేఘాలు మహావర్షాలు కురిపించి వెళ్ళిపోవడంతో నిర్మలమైన పర్వతాల కొండచరియలకి రంగురంగుల కాంతులు పూసినట్లు కనిపిస్తున్నాయి)

రామాయణమంతా మహామేఘాలు కురిపించిన మహావృష్టి. ఆ కావ్యాస్వాదన పూర్తయిన తర్వాత రసజ్ఞ హృదయం తేటపడుతుంది. ఆ కావ్యరామణీయకత అప్పుడు ఆ తేటపడ్డ హృదయంలో ప్రతిఫలించి రసజ్ఞ హృదయమే రంగురంగులతో చిత్రితమయిందా అనిపిస్తుంది. తన కావ్యసౌందర్యాన్ని కవి సహృదయసౌందర్యంగా భావింపచేస్తాడన్నమాట.

రామాయణాలు ఎన్నో. ఏ రామాయణం ప్రయోజనం దానికుంది. కాని వాల్మీకి రామాయణం ప్రయోజనం అన్నిటికన్నా ముందు మనకొక భాషనివ్వడంలో ఉంది. అది శుభ్రభాష, సుసంస్కృత భాష. అది పారాయణం చెయ్యదగ్గ భాష. ఆ భాష మనమాటల్లోని మాలిన్యాన్ని శుభ్రం చేయడమేకాక, ఆ తర్వాత మనమాటలకొక కాంతినీ, సొగసునీ అద్దిపెడుతుంది.

సంప్రత్యనేకాశ్రయ చిత్రశోభా

లక్ష్మీః శరత్కాల గుణోపనీతా

సూర్యాగ్రహస్తప్రతిబోధితేషు

పద్మాకరేష్వభ్యధికం విభాతి (కి.30:30)

(ఇప్పుడు విప్పారిన రంగురంగుల పూలతో నిండి ఉండి శరత్కలా శోభమరింత లక్ష్మీప్రదంగా గోచరిస్తున్నది. విప్పారుతున్న తామరపూల కాంతి ఉదయసూర్యకాంతితో మరింత ఇనుమడిస్తున్నది.)

రామాయణ కర్తకి తన ఇష్టాలకీ, తన కావ్యనాయకుడి ఇష్టాలకీ మధ్య తేడా తెలుసు. ఆ రెండింటి మధ్యా ఆయన ఎన్నడూ పొరపడడు. రాముడికి హేమంత ఋతువంటే ఇష్టమని లక్ష్మణుడితో చెప్పిస్తాడు. కాని తనకి ఏ ఋతువు ఇష్టమో ఎక్కడా వాచ్యంగా చెప్పడు. ఆయన చేసిన అయిదు ఋతువర్ణనలూ వేటికవి తీసిపోనివే. ఏ వర్ణన చదివితే ఆ ఋతువే ఆయనకి అత్యంత ఇష్టమయినదేమో అనిపిస్తుంది. కాని, నా మనసుకి మాత్రం వాల్మీకికి శరత్కాలమే అత్యంత ప్రియమైన కాలమని అనిపిస్తూంది. అలాగని ఆయన వట్టి వెన్నెలని మాత్రమే ప్రేమించాడని చెప్పలేము. శరత్కాలమంటే ఆయనకి వెన్నెల, తుమ్మెదలు, ఏనుగులు, అన్నిటికన్నా ముఖ్యంగా ఏడాకుల పొన్నపూలు.

సప్తచ్ఛదానామ్ కుసుమోపగంధీ

షట్పాదబృందైరనుగీయమానః

మత్తద్విపానామ్ పవనోనుసారీ

దర్పం వనేష్వభ్యధికం కరోతి (కి:30:31)

(శరత్కాల పవనాలు ఏడాకుల పొన్నపూల సుగంధాలతో నిండి ఉన్నాయి. తుమ్మెదల గుంపులు వాటి గుణగానం చేస్తున్నాయి. మదించిన ఏనుగుల్ని అవి మరింత మత్తెక్కిస్తున్నాయి)

మదప్రగర్భేషు చ వారణేషు

గవామ్ సమూహేషు చ దర్పితేషు

ప్రసన్నతోయాసు చ నిమ్నగాసు

విభాతి లక్ష్మీ బహుధా విభక్తా (కి.30:33)

(బాగా మత్తెక్కిన ఏనుగుల్లోను, మత్తెక్కి సంచరిస్తున్న ఆలమందల్లోనూ, స్వచ్ఛజలాలతో ప్రవహిస్తున్న సెలయేళ్ళలోనూ, జలపాతాల్లోనూ శరత్కాల శోభ అనేకవిధాలుగా ప్రకాశిస్తున్నది)

మనోజ్ఞగంధైః ప్రియకైరనల్పైః

పుష్పాతిభారావనతాగ్రశాఖైః

సువర్ణగౌరైర్నయనాభిరామైః

ఉద్యోతతనీవ వనాంతరాణి (కి.30:35)

(మనసుని దోచుకునే సుగంధాలు చల్లుతూ బాగా పూసిన పూలకొమ్మలతో చెట్లు కిందికి వాలి ఉన్నాయి. అవి తెల్లగానూ, బంగారుకాంతితోనూ కనువిందుచేస్తున్నాయి. అడవుల్లోపల ఈ శోభ మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది)

వ్యపేత పంకాసు సవాలుకాసు

ప్రసన్నతోయాసు సగోకులాసు

ససారసారావవినాదితాసు

నదీసు హృష్టా నిపతంతి హంసాః (కి.30:43)

(నదులు బురద తగ్గి జలాలు ప్రసన్నంగా కనిపిస్తున్నాయి. వాటి ఇసుకతిన్నెలమీద ఆలమందలు హాయిగా సంచరిస్తున్నవి. సారసపక్షుల కలరవాలతో ప్రతిధ్వనిస్తున్న నదీజల్లాల్లో హంసలు సంతోషంగా క్రీడిస్తున్నవి)

ఆ సంతొషభరితమైన శరత్కాల వర్ణనలోనే సుప్రసిద్ధమైన ఈ వర్ణన కూడా మహాకవి నోటివెంట వెలువడింది:

చంచచంద్ర కరస్పర్శహర్షోన్మీలిత తారకా

అహో రాగవతీ సంధ్యా జహాతి స్వయమంబరమ్ (కి.30:46)

(చంద్రకిరణస్పర్శవల్ల కలిగిన ఆకాశంలో తారకలు మిలమిల్లాడుతుండగా, ఆహా, ఏమాశ్చర్యం! సంధ్య తనంతట తానే అంబరాన్ని విడిచిపెడుతున్నది)

కరస్పర్శవల్ల ఆమె తన వస్త్రాంబరాన్ని తనంతతానుగానే విడిచిపెడుతున్నదనే మరొక అర్థం కూడా స్ఫురిస్తున్నందువల్ల, ఈ శ్లోకం వాల్మీకిది కాదనీ, ప్రక్షిప్తమనీ భావించేవారు లేకపోలేదు. కానీ, శరత్కాల వర్ణనలో సీతావియోగవేదన తేమగా పరుచుకుని ఉన్నదని మనం గుర్తుపెట్టుకుంటే, ఈ శ్లేషార్థంలో శృంగారం కన్నా ఆశ్చర్యమే అధికంగా కనిపిస్తున్నది చెప్పుకోవాలి.

పూలూ, తుమ్మెదలూ, మదించిన ఏనుగులూ వసంతకాలంలో కూడా కనిపించేవే కదా, వాటిని బట్టి ప్రత్యేకంగా శరత్కాలాన్ని ఎట్లా గుర్తుపట్టగలం అనిపించవచ్చు. కాని, వసంతంలో లేనిదీ, శరత్కాలంలో మాత్రమే ఉన్నదీ ఒక నైర్మల్య స్ఫురణ. శుభ్రత, స్వచ్ఛత.

ప్రసన్న సలిలాః సౌమ్య కురరీభిర్వినాదితాః

చక్రవాక గణాకీర్ణా విభాంతి సలిలాశయాః

ఆసనాః సప్తపర్ణాశ్చ కోవిదారశ్చ పుష్పితాః

దృశ్యంతే బంధుజీవాశ్చ శ్యామశ్చ గిరిసానుషు (కి.30:58-59)

(లక్ష్మణా, జలాశయాలు నిర్మలంగా, ప్రసన్నంగా ఉన్నాయి. వాటి ఒడ్డుమీద చక్రవాకాల గుంపుల మధురకూజితాలు వినవస్తున్నాయి. గోరింట చెట్లు, కోవిదార వృక్షాలు, ఏడాకుల పొన్నచెట్లు విరబూసి ఉన్నాయి. దట్టంగా పూసిన ఆ చెట్లతో కొండచరియలు శ్యామవర్ణశోభితాలుగా ఉన్నాయి.)

‘ప్రసన్నం’! అదీ కవి అంతరంగాన్ని పట్టిచ్చే మాట. అందుకనే ‘ఋషీ, రెండవ వాల్మీకి ‘అయిన నన్నయ తన కవిత్వం ‘ప్రసన్న కథాకలితార్థయుక్తి’తో కూడి ఉంటుందని చెప్పుకున్నాడు.

శరత్కాల వర్ణనలో కవికి విసుగులేదు. చూసిన దృశ్యమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నా చెప్పడంలో పునరుక్తి లేదు.

నవైర్నదీనాం కుసుమప్రభాసైః

వ్యాధూయమానైర్మృదుమారుతేన

ధౌతామలక్షౌమ పటప్రకాశైః

కూలాని కాశైరుపశోభితాని (కి 30: 52)

(నదీ తీరాల్లో కొత్తగా వికసించిన రెల్లుపొదలు పిల్లగాలులకి మృదువుగా తలలూపుతున్నాయి. ఆ తెల్లటిపూలకాంతులతో శరదృతువు ఉతికి ఆరవేసిన తెల్లటి పట్టువస్త్రంలాగా శోభిస్తున్నది.)

వనప్రచండా మధుపాన శౌండాః

ప్రియాన్వితాః షట్చరణాః ప్రహృష్టాః

వనేషు మత్తాః పవనాను యాత్రాం

కుర్వంతి పద్మాసన రేణు గౌరాః (కి: 30: 53)

(తుమ్మెదలు అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. బాగా పూలతేనెలు పీల్చి సంతోషంతో పరవశిస్తున్నాయి. తామరపూల గోరింటపూల పుప్పొడి అంటుకుని పసుపురంగులో కనిపిస్తున్నాయి. గాలివాటుకి కొట్టుకొస్తున్న పరిమళాల్ని తమ ప్రియురాళ్ళతో కలిసి పానం చేస్తున్నాయి)

శరత్కాలం ప్రసన్నం. గోదావరి నీళ్ళలాగా రమ్యం. కాని మహాకవికి శరత్కాలమంటే ఇందుకు మాత్రమే ఇష్టం కాదు.

వ్యక్తం నభః శస్త్రవిధౌత వర్ణం

కృశప్రవాహాని నదీజలాని

కల్హారశీతాః పవనాః ప్రవాంతి

తమోవిముక్తాశ్చ దిశః ప్రకాశాః (కి:30:37)

(మబ్బులు తొలగిపోవడంతో ఆకాశం స్వచ్ఛమైన శస్త్రంలాగా విరాజిల్లుతున్నది. వరద మందగించడంతో నదులు సన్నబడి ప్రవహిస్తున్నాయి. ఎర్రతామరపూల మీంచి గాలులు ప్రసరిస్తున్నాయి. చీకట్లనుంచి బయటపడి దిక్కులు ప్రకాశిస్తున్నాయి.)

‘శస్త్ర విధౌత వర్ణం’. సానబెట్టిన కత్తిలాగా ఉందట శరత్కాలం. అంత మృదు ఋతుగానంలో ఆయనకి శస్త్రం ఎందుకు స్ఫురించింది? ఆ తర్వాత రానున్నది యుద్ధకాండ కాబట్టి అనుకోవాలా? కాదు. ఒక మనిషి మనసు ప్రసన్నం కావడమంటే చీకట్లు తొలగి దిక్కు తోచడం. తనని చుట్టుముట్టిన చీకట్లని చీల్చుకోడానికి ఒక శస్త్రం దొరకడం. శరత్కాలమంటే ఒక ఖడ్గసృష్టి. శస్త్రంలా శరత్కాలం సాక్షాత్కరించాక జైత్రయాత్ర ఎలానూ మొదలు పెట్టక తప్పదు.

31-10-2020

Leave a Reply

%d bloggers like this: