వీరవాక్యం

ఆ రాత్రికి రాయచోటికి మీదుగా కడప వెళ్ళి అక్కడ బసచేసి మర్నాడు పొద్దున్నే బ్రహ్మంగారి మఠానికి బయల్దేరాను. నాకు దారి చూపించడానికీ, స్థలవిశేషాలు దగ్గరుండి వివరించడానికీ మిత్రుడు వేంపల్లి గంగాధర్ కూడా వచ్చాడు. గంగాధర్ స్థానిక చరిత్రకారుడు, కథకుడు, సామాజిక చింతనాపరుడు. దాదాపు పదేళ్ళ కిందట ఆయన రాసిన ‘పుణే ప్రయాణం ‘ పుస్తకం మా గిరిజనసంక్షేమ శాఖ కళ్ళు తెరిపించింది. తొలి తెలుగు శాసనం కలమళ్ళ గురించి ఆయన రాసిన తర్వాతనే ఆ శాసనానికి తెలుగు పాఠ్యపుస్తకాల్లో చోటు దొరికింది.

మేము బ్రహ్మం గారి మఠానికి చేరుకునేటప్పటికి మఠంలో నిత్యపూజలు జరుగుతున్నాయనీ, మాకు మరికొంత సమయం ఉందనీ తెలియడంతో బ్రహ్మసాగర్ జలాశయానికి వెళ్ళాం. ముప్పై ఏళ్ళ కిందట నేను కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు మా హీరాలాల్ మాష్టారు నన్ను బనగాన పల్లె తీసుకువెళ్ళి బ్రహ్మంగారి గురించి వివరంగా పరిచయం చేసారు. అక్కడ బ్రహ్మంగారు చిన్నప్పుడు పనిచేసిన గురివిరెడ్డి అచ్చమ్మగారి ఇల్లు చూపించారు. ఆ ఇంటినుంచి ఒక దూరదర్శిని సహాయంతో బ్రహ్మంగారు పశువులు మేపిన చోటు, ఆయన తపస్సు చేసుకున్న చింతచెట్టు కూడా చూసినట్టు గుర్తు. అప్పుడు విన్నాను మొదటిసారి బ్రహ్మంగారి మఠం గురించి. అవి తెలుగుగంగ పథకం మొదలైన రోజులు. తెలుగు గంగ కి బ్రహ్మం గారి మఠం దగ్గర పెద్ద రిజర్వాయర్ కడుతున్నారని చెప్పుకునేవారు. అప్పణ్ణుంచీ కోరిక బ్రహ్మం గారి మఠాన్ని చూడాలని. ఇన్నాళ్ళకు నెరవేరింది. ఆ జలాశయం చిన్నపాటి సముద్రంలాగా ఉంది. ఒక సిద్ధపురుషుడు ఒక చోట జీవిస్తే ఆ ప్రాంతంలో కరువుకాటకాలు ఉండవంటారు. అందుకు ఇంతకన్నా నిదర్శనమేముంటుంది అనుకున్నాను.

నెమ్మదిగా మేము జలాశయం నుంచి కిందకు దిగి మఠానికి చేరుకునే తోవలో బ్రహ్మం గారు నివసించిన ఇల్లు, రచ్చబండ చూసాం. ఆ రచ్చబండ దగ్గరే ఆయన్ను ఊరిపెద్దలు పోలేరమ్మ జాతరకి చందా అడిగినప్పుడు ఆయన ఇవ్వలేనని చెప్పినప్పుడు వాళ్ళు ఆయన్ని నిలదీస్తే ఆయన ఆ పోలేరమ్మను నిప్పు తెమ్మన్నారని, ఆమె చిన్నపిల్ల రూపంలో నిప్పు తెచ్చి ఇచ్చిందనీ ఐతిహ్యం. అక్కణ్ణుంచి మఠానికి వచ్చాం. అక్కడ సింగల్ రెడ్డి ఈశ్వర రెడ్డి అనే మిత్రులు మా కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన మమ్మల్ని మఠంలోకి తీసుకువెళ్ళి బ్రహ్మంగారి సజీవసమాధి మందిరందగ్గర పూజలు చేయించారు.

‘జీవసమాధికీ, సజీవసమాధికీ తేడా ఉంది. సజీవసమాధి అంటే, ఆయన ఇంకా ఇక్కడ జీవించి ఉన్నారనే అర్థం. ఆయన సజీవసమాధి పొందిన ఏడాది తర్వాత ఆయన కొడుకు ఆయన సమాధిలో ఉన్నారో లేదో చూద్దామని పరీక్ష చేస్తే బ్రహ్మంగారు జీవించే ఉన్నారని తెలుసుకోవడమే కాకుండా ఆయన ఆగ్రహానికి గురయ్యాడు కూడా ‘ అని చెప్పారు ఈశ్వరరెడ్డిగారు. నేను కొన్ని క్షణాలు ఆ మందిరం దగ్గర నిశ్శబ్దంగా నిల్చున్నాను. ఒక మహాపురుషుడు అక్కడ సజీవంగా ఉన్నాడన్న విశ్వాసాన్ని నా అనుభవంలోకి తెచ్చుకోడానికి ప్రయత్నించాను.

ఆ మంటపంలో ఒక పెట్టెలో బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్రాల సంపుటి ఉంది. ఈశ్వరరెడ్డిగారి కోరిక మేరకు అక్కడి నిర్వాహకులు ఆ సంపుటి పైకి తీసి నాకు దూరంనుంచి చూపించి మళ్ళా ఆ పెట్టెలో పెట్టేసారు. ‘కరోనా లేకపోయుంటే ఆ తాళపత్రాల్ని చేత్తో తాకనిచ్చి ఉండేవారు’ అన్నాడు ఈశ్వరరెడ్డి. కాని నాకు అదే పదివేలు అనిపించింది. ఒకప్పుడు మాంచెస్టరు లైబ్రరీలో జాన్ గూటెన్ బర్గ్ ముద్రించిన మొదటి అచ్చుపుస్తకం ‘ద బైబిల్ ‘ ని కూడా ఇట్లానే దూరం నుంచి చూడటం గుర్తొచ్చింది.

ఆ తర్వాత ఆ ప్రాంగణంలోనే ఉన్న బ్రహ్మంగారి ఇతర కుటుంబసభ్యుల సమాధులతో పాటు వారి మనమరాలు ఈశ్వరమ్మగారి సజీవసమాధి కూడా చూసాం. ఒక కుటుంబం మొత్తం ఆ గ్రామాన్ని అంటిపెట్టుకుని ఇప్పటికీ తమ ఉనికితో అనుగ్రహిస్తూ ఉన్నారన్నది నాకెంతో విశేషంగా తోచింది. మేము బయటికి వచ్చాక ఈశ్వరరెడ్డి గారు నా చేతుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్త్వాలు, అవధూత నారాయణరెడ్డి గారి మీద తాను రాసిన బుర్రకథ నా చేతుల్లో పెట్టారు.

‘కాలజ్ఞాన తత్త్వములు’ (2019) మఠం వారు ప్రచురించిన పరివర్థిత సంపుటం కాబట్టి ఆధికారికమైన సంకలనం. అందులో మొత్తం 80 గీతాలు ఉన్నాయి. వాటిని వి.వి.ఎల్. నరసింహారావుగారు పరిష్కరించారు. ఆ సంపుటాన్ని 1988 లో మొదటిసారిగా ప్రచురించినప్పుడు దానికి కొండవీటి వెంకటకవిగారు రాసిన ముందుమాట కూడా ఈ సంపుటంలో ఉంది. ఆ తత్త్వాలు చిన్నప్పణ్ణుంచీ వింటున్నప్పటికీ అలా ఒకచోట చూడటం ఇదే మొదటిసారి. వాటిని ఆ రోజు ప్రయాణంలోనే చదివేసాను. తిరిగి వచ్చాక కూడా మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను.

వీరబ్రహ్మం గారి కాలజ్ఞాన దృక్పథం గురించీ, సామాజిక విప్లవకారుడిగా ఆయన పోషించిన పాత్ర గురించీ చాలామంది రాసారుగానీ, కవిగా వీరబ్రహ్మం గురించి ఎవరూ ఎక్కడా చెప్పుకోదగ్గ విశ్లేషణ ఏమీ చేసినట్టు నాకు కనిపించలేదు. అందుకని, తక్కినవన్నీ పక్కన పెట్టి, కేవలం కాలజ్ఞానతత్త్వాలు ఆధారంగా వీరబ్రహ్మంగారి హృదయాన్నీ, వాక్కునీ అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను. ఈ 80 గీతాల్లో అన్నీ వీరబ్రహ్మంగారివి కావు. బ్రహ్మంగారి శిష్యులు, అనుయాయులు రాసిన గీతాలు కూడా ఇందులో ఉన్నాయి. చాలా గీతాలకు కర్త ఎవరో తెలియదుగాని, నిశితంగా పరిశీలిస్తే బ్రహ్మంగారి ముద్ర ఉన్న గీతాలను గుర్తుపట్టడం కష్టమేమీ కాదు.

బ్రహ్మంగారి గీతాల్లో మరే తెలుగు పదకర్త సాహిత్యంలోనూ కనిపించని విశిష్టత ఏదో మనల్ని చప్పున ఆకర్షిస్తుంది. కొండవీటి వెంకటకవి గారు ఆ విశిష్టతకు కారణాలు అన్వేషిస్తూ, అది మాత్రాఛందస్సు ప్రధానమైన దేశికవితలోనూ, ముఖ్యంగా ఆ పదాల పల్లవుల్లోనూ ఉందన్నారు. నిజమే, బ్రహ్మంగారి పదాల పల్లవులు తెలుగు నేలను చీల్చుకువచ్చినవి:

‘చెప్పలేదంటనక పొయ్యేరు-నరులార గురుని

చేరి మొక్కితె బతుకనేర్చేరూ’

‘ఈ జన్మమిక దుర్లభమురా, ఓరి

సాజన్మ సాకార సద్గురునిగనరా’

‘ఏ కులమని నను వివరమడిగితే

ఏమని తెల్పుదు లోకులకు-పలు

గాకులకు, దుర్మార్గులకు

ఈ దుష్టులకు’

‘నందామయా గురుడ నందామయా

ఆనందదేవికి నందామయా’

‘ఊదే తిత్తుల పైగా నుండే

ఉన్మతి తెలియర – ఓరన్నా

తిత్తులు నడుమ చక్షులమీదను

చీకటి కొట్టర – ఓరన్నా’

ఇలా అన్ని గీతాల్నీ ఎత్తి రాయవలసి ఉంటుంది. ఈ గీతాలు, ఈ బాణీలు, ఈ ఎత్తుగడలు తెలుగు కవిత్వంలో పదిహేడో శతాబ్దానికి ముందు కనం, తర్వాత కూడా కనలేం. ఈ పలుకుబడి అనితర సాధ్యం. ఒక్కపల్లవిలోనే మందలింపు, అనునయం ఎట్లాపలికాయో చూడండి:

‘చిల్లర రాళ్ళకు మొక్కుచు నుంటే

చిత్తము చెడునుర ఒరే ఒరే

చిత్తమునందున చిన్మయ రూపుని

చూచుచు నుండుట సరే సరే.’

కాలజ్ఞాత తత్త్వాలు మళ్ళీ మళ్ళీ చదవగా నాకేమనిపించిందంటే, ఈ కవిత్వం తెలుగులో వచ్చిన మొదటి apocalypse కవిత్వం. అంటే యుగాంతం గురించి హెచ్చరించిన మొదటి కవిత్వం. ఆ తర్వాత మళ్ళా తెలుగులో వచ్చిన యుగాంత కవిత్వం మహాప్రస్థానం మాత్రమే. అయితే శ్రీ శ్రీ వెనక ఇటాలియన్ ఫ్యూచరిస్టులు ఉన్నారు. ఈ ప్రపంచం ఇప్పుడున్న రూపంలో తుడిచిపెట్టుకు పోవాలనీ, నవప్రపంచం ఆవిర్భవించాలనీ మహాప్రస్థానం కోరుకుంది.

ఈ యెగిరిన ఇనుపడేగ

ఈ పండిన మంటపంట

ద్రోహాలను తూలగొట్టి

దోషాలను తుడిచిపెట్టి

స్వాతంత్య్రం

సమభావం

సౌభ్రాత్రం

సౌహార్ద్రం

పునాదులై ఇళ్ళు లేచి

జనావళికి శుభం పూచి-

శాంతి, శాంతి, కాంతి, శాంతి

జగమంతా జయిస్తుంది!

ఈ స్వర్గం నిజమవుతుంది!

ఈ స్వప్నం నిజమవుతుంది!

ఇప్పుడున్న ఈ అస్తవ్యస్త అవ్యవస్థ తుడిచిపెట్టుకు పోవడంలో తన పాత్ర కూడా ఉందని మహాప్రస్థాన కవి అంటాడు. కొత్త ప్రపంచం, మరో ప్రపంచం తన చేతుల్తో తాను నిర్మిస్తానంటాడు. జగన్నాథ రథ చక్రాలు భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అంటాడు. కాని ఆయన కన్నా మూడు వందల ఏళ్ళకి ముందు వీరబ్రహ్మం ఇలా అంటున్నాడు:

శివగోవింద గోవింద

హరి గోవింద గోవింద

నడివీథి నా ముందు నాటింతురా కొల్మి

నడిమండలమందు నాటింతురా

సంధి తెలియనట్టి బందె కుక్కల బట్టి

బంధించి బాకుల కుమ్మింతురా

ఏడు తిత్తులు పట్టి పూరింతురా

నాడుల నడిమింట భేదింతురా

దండిగా నా గురుని అండ జేరుక పెద్ద

కొండలన్నియు పిండిగొట్టింతురా

కోపమనె బొగ్గు కొల్మిలో బోయించి

చాపమనె యినుము పెట్టింతురా

చేపవంటి అగ్గి చూపులో వెలిగిన

దీపమంటి జ్యోతి తిలకింతురా

నాలుగు సంధులు నాటింతురా-శివ

నామధారుల బట్టి పాటింతురా

నీమమెరుగని జనుల భూమిపాలుగ జేసి

హోమాగ్ని ముందాటనాడింతురా

ఆరుమతములకు అమరిన నా కొల్మి

ఈరేడు లోకాల వెలిగింతురా

వాడలో నా కొల్మి జాడ తెలిసి యుంటె

నీడలేని చోట నిలిపుంతురా

వృక్షములు పక్షులు ఉండేవి ఇచ్చోట

అరవక మునులుండే అడవిలోన

అరచి కోకిల పల్కు లానందమై యుంటె

కాకికూతల భీతి గదురనీకేలా

బలమైన గురుధ్యాన ప్రహరిగోడబెట్టి

బృందావన మేసి చిందుద్రొక్కి

అందు పోతులూరు ఆటలాడుచునుంటె

సందు చూపుల దొంగ జడుపు నీకేలా.

ఎటువంటి గీతం ఇది! దీన్ని మహాప్రస్థాన గీతాలతో పోలుస్తున్నప్పుడు మనం చూడవలసింది ఆ గీతాల్లోని తాత్త్వికతను కాదు. ఇది యోగమార్గానికి చెందిన గీతం, అది సామ్యవాదానికి చెందిన గీతం. చూడవలసింది ఆ దర్శన సారూప్యతని, నిప్పులు కక్కే ఆ భాషని. తోటి మనుషులకు తాను విముక్తినివ్వగలననే ఆ ఆత్మవిశ్వాసాన్ని.

బ్రహ్మం గారి కి పూర్వం ఇటువంటి కవిత్వాన్ని ఏష్యములు అనేవారట. ఆముక్తమాల్యదలో బ్రహ్మరాక్షసుడు దాసరికి ఇటువంటి ఏష్యములు వినిపించాడు అని కృష్ణదేవరాయలు రాశాడు. అది దివ్యజ్ఞానం. కానీ బ్రహ్మంగారు తన కవిత్వాన్ని ‘వీరవాక్యం’ అన్నాడు. ఆయన ‘వీర’ బ్రహ్మం. అంతదాకా యోగబ్రహ్మం, దివ్యబ్రహ్మం, జ్ఞానబ్రహ్మం మాత్రమే తెలిసిన సమాజానికి ఆయన వీరబ్రహ్మాన్ని పరిచయం చేసాడు. అంటే ఆయన కూడా బ్రహ్మ జ్ఞానం గురించే మాట్లాడేడుగాని, అది వీరత్వం తో కూడుకున్న, వీరత్వంతో మాత్రమే సాధించగలిగిన బ్రహ్మజ్ఞానం, తాను మాత్రమే నిర్మించగల ‘పరబ్రహ్మ నిర్మాణం.’

కాని ఆ కవిత్వంలో ఎంత అగ్ని ఉందో అంత అమృతం కూడా ఉంది. అపురూపమైన వెన్నెల కురిసే ఈ పాట వినండి:

చందమామ చందమామ చందమామా-ఈ

సంధి తెలిపే జాణలెవరె చందమామా

కాయమనే పుట్టలోన చందమామా-పాము

మాయగానే మెలగుచుండు- చందమామా

జంటనాదస్వరములూది చందమామ-పామును

వెంటనే పెకలించవలెను-చందమామా

తొమ్మిది వాకిళ్ళు మూసి చందమామా-పామును

నెమ్మదిగా పట్టవలెను-చందమామా

దేహి దేహాలనందు చందమామా-పాము

తెలియకుండా చుట్టుకున్నది-చందమామ

అజపా గాయత్రి చేత చందమామా-పాము

అఖండ కళలతో వెలుగు చుండు-చందమామ

రామయను కట్టుకట్టి చందమామా-పామును

యుక్తి చేత పట్టవలెను-చందమామ

పాము బట్టే యోగి ఎవరె చందమామా-పర

బ్రహ్మఋషి యౌ సిద్ధగురుడె-చందమామా

ప్రసిద్ధ తమిళ సిద్ధ కవి పాంపత్తి చిత్తియార్ ని తలపుకు తెస్తున్న గీతమిది. సిద్ధకవులు, నాథకవులు, చర్యాగీతకవులు, బుల్లేషా, కబీరు వంటి సూఫీకవుల గురించి తెలుసుకున్న ఎంతో కాలానికి గాని నా ఇంటిపెరడులోనే నెలకొన్న చింతామణిని గుర్తించలేకపోయాను. తక్కిన తెలుగు గీతకవులంతా ఒక ఎత్తూ, వీరబ్రహ్మం ఒక్కడూ ఒక ఎత్తు.

9-5-2021

Leave a Reply

%d bloggers like this: