విశిష్ట ఉపాదానం

రెండు వారాల కిందట గంగారెడ్డి నుంచి పార్సెలు. Charles Baudelaire: Selected Poems, A French-English Bilingual Edition (2020), ‘ప్రకృతి ఒక ఆలయం: షార్ల్ బోద్ లేర్, కొన్ని కవితలు’ (2020). సూరపురాజు రాధాకృష్ణమూర్తిగారు మన కోసం ప్రతి వారం ఓపిగ్గా చేస్తూ వచ్చిన అనువాదాలు, రాస్తూ వచ్చిన పరిచయ వ్యాసాలు, ఇప్పుడు పుస్తక రూపంలో. ఇలియట్, షేక్ స్పియర్, సంత్ జ్ఞానేశ్వర్, అస్తిత్వవాద రచయితల గురించిన పరిచయాల తర్వాత ఆయన మనకోసం అందించిన అపురూపమైన కానుక.

రాధాకృష్ణమూర్తిగారు నాకు పరిచయమైన గత అయిదారేళ్ళుగా ప్రతి సారీ నేననుకునే మాట ఒకటే. ఈయన నాకు నలభయ్యేళ్ళ కిందట, కనీసం ముప్పై ఏళ్ళ కిందట ఎందుకు కనబడలేదు? వారణాసి లాంటి రాజమండ్రిలో నాకు పూర్వాంధ్ర సంస్కృత మహాకవుల కావ్యప్రపంచాల్ని పరిచయం చేయడానికి మా మాష్టారి ప్రసంగాలు ఉండేవి. లేదా ఆయన తానొక్కడూ గోదావరి ఒడ్డున కావ్యమృష్టాన్నం ఆరగిస్తూ చేయి విదిలించినప్పుడు అక్కడ రాలిపడ్డ ఉచ్చిష్టం ఉండేది, దానికోసమే ఎన్నో సాయంకాలాలు ఆయన్ని కనిపెట్టుకు ఉండేవాణ్ణి. కాని సెంట్ పీటర్స్ బర్గ్, ఏథెన్స్ , డబ్లిన్ లలాంటి రాజమండ్రిలో నాకు ఇంగ్లీషు, యూరపియన్ కవిత్వాల గురించి అట్లా పరిచయం చేసే మనిషెవరూ దొరకలేదు. ఫ్రెంచి, ఇటాలియన్, స్పానిష్, రష్యన్ కవిత్వాల గురించి నానాటికీ పెరిగిపోతుండే నా ఆకలిని దాహాన్ని ఉపశమింపచేసే రసజ్ఞుడెవరూ దొరకలేదప్పుడు.

మరీ ముఖ్యం, బోదిలేర్ గురించి. ఆధునిక తెలుగు కవిత్వం బోదిలేర్ కి చాలానే ఋణపడి ఉంది. బోదిలేర్ లేకపోతే, ఆధునిక ఫ్రెంచి కవిత్వం లేదు. బోదిలేర్ ని తమ యవ్వనకాలంలో చదవకపోయి ఉంటే, వెర్లేన్, మల్లార్మె, రేంబో లు వెర్లేన్, మల్లార్మే , రేంబో లుగా రూపొంది ఉండేవారు కారన్నాడొక విమర్శకుడు. బోదిలేర్ లేకపోతే ఆధునిక్ ఇంగ్లీషు కవిత్వం కూడా ఇప్పుడు మనకి కనిపిస్తున్న రీతిలో కనిపించి ఉండేది కాదు.

ఇంగ్లీషు కవిత్వంలోకి బోదిలేర్ రెండు సార్లు ప్రవేశించాడు, ఒకసారి, స్విన్ బర్న్ ద్వారా, మరొకసారి ఇలియట్ ద్వారా. తెలుగులో కూడా రెండు సార్లు ప్రవేశించాడు. మొదటిసారి స్విన్ బర్న్ ద్వారా శ్రీ శ్రీ రూపంలో. గత డెభ్భై ఏళ్ళుగా శ్రీ శ్రీ గురించీ, మహాప్రస్థానం గురించీ తెలుగులో రాయనివాళ్ళు లేరు, మాట్లాడని వాళ్ళు లేరు. కాని శ్రీ శ్రీ పైన బోదిలేర్ ప్రభావం గురించి, శ్రీ శ్రీ తప్ప, మరెవ్వరూ కనీసం ఒక చిన్న వ్యాసం కూడా రాసినట్టు నాకు కనిపించలేదు. బోదిలేర్ ని చదవకపోయి ఉంటే, శ్రీ శ్రీ ‘ప్రభవ’ లో పద్యాలు చాలా వరకు రాసి ఉండేవాడు కాడు. మహాప్రస్థానంలోని ‘బాటసారి’, ‘భిక్షువర్షీయసి’ , ‘ఉన్మాది’, ‘కేక’, ‘పరాజితులు’, ‘ఆకాశదీపం’, ‘చేదుపాట’, ‘దేనికొరకు’, వంటి కవితలు రాసి ఉండేవాడు కాడు. తిరిగి మళ్ళా బోదిలేర్ ఇలియట్ ద్వారా మోహన ప్రసాద్ మీదుగా తెలుగు సాహిత్యంలో మరొకసారి ప్రవేశించాడు. మోహన ప్రసాద్ ‘రహస్తంత్రి’ చాలావారకు బోదిలేర్ అడుగుజాడల్లో నడిచిన కవిత్వమే.

బోదిలేర్ ని చదవకపోతే మనకు ‘ఆధునికత’ (modern) కీ ‘ఆధునికతావాదం’ (modernism) కీ మధ్య తేడా తెలియదు. ఇప్పటికీ తెలుగులో ఆధునికత గురించి రాస్తున్న చాలామందికి ఈ సున్నితమైన భేదం ఎంతవరకూ తెలుసో నాకు అనుమానమే. ఆధునికత అని మనం వ్యవహరించేది సైన్సు, హేతువాదం, యాంత్రికీకరణ, ప్రజాస్వామ్యం, కొత్త సమాచార ప్రసార సాధనాలు మొదలైనవాటి ఆధారంగా వికసించిన ఒక మానవతా వాదం. దీని మూలాలు యూరోప్ లో వికసించిన ఎన్లైటెన్ మెంట్ యుగాదర్శాల్లో ఉన్నాయి. పదిహేడు, పద్ధెనిమిది శతాబ్దాల్లో వికసించిన ఎన్ లైటెన్ మెంట్ యుగాదర్శాల వెనక, పధ్నాలుగు, పదిహేను శతాబ్దుల సాంస్కృతిక పునరుజ్జీవన ఆదర్శాలు ఉన్నాయి. కాని ఎన్లైటెన్ మెంటు యుగాదర్శాలు పైకి హేతువాద ప్రాతిపదిక మీద మనిషి గురించి మాట్లాడుతున్నప్పటికీ, అవి ముసుగు వేసుకున్న మతాదర్శాలే అని అనుమానించడం ఆధునికతావాదం. ఎన్లైటెన్ మెంట్ ని సంశయించిన మొదటి స్వేచ్ఛాజీవి బోదిలేర్. ఆ తర్వాత కిర్క్ గార్డ్, డోస్టోవిస్కీలమీదుగా అస్తిత్వవాదులూ, మాడర్నిస్టులూ, సరీయలిస్టులూ, అబ్సర్డిస్టులూ అనేకమంది ఆ దారిలో యూరోప్ ను హెచ్చరిస్తూనే ఉన్నారు.

కాబట్టి ఆధునిక తెలుగు సాహిత్య విద్యార్థి ఈ మూలాల్ని, ఈ ప్రభావాల్నీ తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చదవవలసిన, అధ్యయనం చేయవలసిన రచయితల్లో బోదిలేర్ కూడా ఉంటాడు. కాని అతడి గురించి తెలుగులో మనకేమీ కనిపించదు. అతడి కవిత్వం కూడా ఇప్పటి దాకా ఎవరూ అనువదించినట్టు లేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు రాధాకృష్ణమూర్తి గారు బోదిలేర్ పైన వెలువరించిన ఈ పుస్తకం తెలుగు సాహిత్యానికి ఎంత విశిష్ట ఉపాదానమో చెప్పలేను.

ఇందులో ఆయన బోదిలేర్ జీవితం, కవిత్వాల గురించిన రెండు స్థూల పరిచయ వ్యాసాలతో పాటు, బోదిలేర్ మూడు సంపుటాలనుంచీ 18 కవితల్ని ఎంపికచేసి, అనువదించి, వాటిమీద వ్యాఖ్యానంతో కూడిన పరిచయ వ్యాసాలు పొందుపరిచారు. ఇది మామూలు కృషి కాదు. ఈ ఎంపికనే ఒక విధంగా బోదిలేర్ పైన ఒక సరికొత్త విమర్శ అని చెప్పవచ్చు. ఇలా ఎంపిక చేసిన కవితల ద్వారా ఆయన బోదిలేర్ జీవితాన్ని సరికొత్త narrative తో మనముందు ఆవిష్కరిస్తో ఉన్నారు. ఆ కవితల్ని ఎంచుకునేటప్పుడు ఆయన తక్కిన విమర్శకులు ముఖ్యంగా భావించే కొన్ని కవితల్ని పక్కన పెట్టేసారు. తక్కిన వ్యాఖ్యాతలు మరీ ముఖ్యంగా భావించని కొన్ని కవితల్ని ముందుకు తెచ్చారు. వ్యక్తిగానూ, కవిగానూ బోదిలేర్ అన్వేషణనీ, జీవన వైరుధ్యాల్ని తనకై తానుగా సమన్వయించుకునే క్రమంలో అతడు ఒక పూర్ణయోగం దిశగా ఎలా ప్రయాణించాడో చూపడమే ఆయన ఉద్దేశ్యం.

ఈ పుస్తకం చదవడం వల్ల బోదిలేర్ గురించి ఏమీ తెలియనివాళ్ళకి బోదిలేర్ పరిచయమవుతాడు. బోదిలేర్ గురించి ఎంతో కొంత తెలిసినవారికి బోదిలేర్ కొత్తగా కనిపిస్తాడు. బోదిలేర్ ని ఇప్పటికే క్షుణ్ణంగా చదివి ఉన్నవారికి, బోదిలేర్ మరింత లోతుగా పరిచయమవుతాడు. ఉదాహరణకి, పందొమ్మిదో శతాబ్దం బోదిలేర్ ని ఒక సైతానీయ కవిగా చూసింది. కాని ఇరవయ్యవ శతాబ్దం సగం గడిచేటప్పటికే అతణ్ణొక కాథలిక్ కవిగా, ధార్మిక కవిగా, సనాతన నైతిక కవిగా చూడటం మొదలయ్యింది. కాని, అక్కణ్ణుంచి పాశ్చాత్య విమర్శకులు ముందుకు పోలేకపోయారు. ఎందుకంటే, బోదిలేర్ ఆదిమపాపాన్ని నమ్మినంతగా, భగవదనుగ్రహాన్ని నమ్మినట్టుగా కనిపించలేదు వాళ్ళకి. కాని, పాశ్చాత్య విమర్శకులు ఎక్కడ ఆగిపోయారో, రాధాకృష్ణమూర్తిగారు అక్కణ్ణుంచి మొదలుపెట్టారు. ఆయన తన పుస్తకాన్ని ఇలా ముగించారు:

‘ లోకంలోని దీపాలన్నీ ఒకటొకటి ఆరిపోయాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్నిహోత్రం కూడా ఆరిపోయింది. లోకమంతా పెంజీకటి. ఇక ఏ వెలుగులో యాత్ర సాగాలి? అంతర్జ్యోతి. ‘గుండెల్లో నిండిన కాంతులు!’. బోదిలేర్ యోగి కాడు. ఆ యోగాన్ని భావించగలిగాడు అని మాత్రం చెప్పగలం’.(పే.182)

ఇంకా ఈ వాక్యాలు చూడండి:

‘తన కవితలపై అశ్లీలతా ఆరోపణలు చేసినపుడు బోద్ లేర్ వాదన, తన కవిత్వాన్ని సమగ్రతా దృష్టితో చూడవలె. అలా చూచినప్పుడు, ఈ సృష్టి సమస్తం ఏకసమాసం చేయబడిన ద్వంద్వాలన్నాడు. సైతాను లేకుండా క్రీస్తు లేడు. పాపం లేకుండా పూలు లేవు.’ (పే. 74)

‘ప్రవృత్తి నుండి నివృత్తి, నివృత్తి నుండి తిరిగి ప్రవృత్తి. ఈ రెండవ ప్రవృత్తి, మొదటి ప్రవృత్తి ఒకటి కావు. మొదటిది, చల్ల నీరు, రెండవది చల్లారిన నీరు.'(పే.30)

‘రూమీ, బషో, కబీరు, పోనీ బ్లేక్ కూడా. మార్మిక వాద కవులు అని ఒప్పుకుంటాం. కానీ బోద్ లేర్ కూడా మార్మిక వాద కవి అంటే నమ్మడం కష్టం గానే ఉంటుంది. ‘(పే.92)

గొప్ప విమర్శకుడు తాను పరిశీలిస్తున్న కవిని ఒక కావ్యసంప్రదాయంలో నిలబెడతాడు. అతడి ముందెవరున్నారో, తరువాత ఎవరున్నారో గుర్తుపడతాడు. రాధాకృష్ణమూర్తిగారి చేతుల్లో పడటం బోదిలేర్ అదృష్టం. ఈ సూత్రీకరణ చూడండి:

‘ఎలియట్ అసత్యనగరానికీ, డాంటే సత్యనగరానికీ నడుమ నిలిచింది బోద్ లేర్ కలల నగరం ‘ (పే.51)

రాధాకృష్ణమూర్తిగారు బోదిలేర్ మీద పరిచయ వ్యాసాలు ఒక అధ్యాపకుడి ఆసక్తితోనే మొదలుపెట్టారా లేక, ఇరవై ఒకటో శతాబ్దానికి కూడా బోదిలేర్ అవసరమేనా అన్నది నాకొక సందేహం ఉండింది. కాని, బోదిలేర్ రాసిన ‘హంస ‘ (The Swan) కవిత పైన రాధాకృష్ణమూర్తిగారి వ్యాఖ్యానం చదివాక నాకు ఆ సందేహం తీరిపోయింది. ఆయనిలా రాస్తున్నారు:

‘నేను దేశం విడిచి వెళ్ళడమే ప్రవాసం కాదు. దేశం నన్ను విడిచివెళ్ళడం కూడా ప్రవాసమే. ఏభై ఏళ్ళక్రితం నాకు తెలిసిన హైదరాబాదు యిప్పుడు లేదు..ఇప్పుడు ఇది నాకు పరదేశమే. .బోదిలేర్ పారిస్ లో ఉన్నా, అది తన పారిస్ కాదు, అతడి పారిస్ తనకు దూరమయింది. అతడు అస్థానికుడు. బోద్లేర్ యీ కవితలో అటువంటి అస్థాన కవి.’ (పే. 133)

బోదిలేర్ రాసిన హంస కవిత గురించి ఇటీవలి మరొక అనువాద-విమర్శకుడు కూడా ఇలా రాస్తున్నాడు:

..One need hardly stress the continuing resonance of that line (last line of the poem) in the twenty-first century-not only for the hapless millions uprooted by poverty and war, but for all those who feel left behind-exiled in the extended Baudelairean sense- by a society that moves inexorably onwards, destroying our old landmarks with such bewildering speed’

( The Flowers of Evil, Tr. Anthony Mortimer, 2016)

ఇందులో రాధాకృష్ణమూర్తి గారి అనువాద ప్రతిభ గురించి కూడా చెప్పవలసి ఉంది. ఆయన బోదిలేర్ ని పందొమ్మిదో శతాబ్ది ఎటువంటి ‘థ్రిల్’ తో చదివి ఉంటుందో, అటువంటి స్పందనని మనలో రేకెత్తించాలని ప్రయత్నించారు. అందుకు ఆయన వాడిన భాష, ఉపయోగించిన కొత్త పదబంధాలు, కూర్పు విశేషంగా ఉన్నాయి. వాటి గురించి మరింత వివరంగా మరోసారి మాట్లాడుకుందాం, కాని ఆ స్ఫురణలు మీకిప్పుడే అనుభవంలోకి రావాలంటే, ఈ ‘కేరళ కాంత’ అన్న కవిత చదవండి:

~

కేరళ కాంత

నీ పాదాలు నీ చేతులంత నీ కోమలం, ఏ తెల్లజాతి సుందరికైనా

నీ విశాల జఘనం, అసూయాకారణం

నీ ఒంపులు భావుక శిల్పికి ప్రియమధురం

విప్పగు నీ గొప్ప కన్నులు నీ నీల తనువు కన్న నీలం.

దేవుడు జన్మనిచ్చిన వెచ్చని నీలదేశంలో

నీ పని యజమాని పొగగొట్టం వెలిగించడం

కూజాలు కడిగి మంచినీరు నింపడం

మంచం పక్క పాడుదోమల్ని దూరంగా తరమడం.

ఊరి చివర అశ్వత్థవృక్షాలు ఉదయగానం చేసేవేళ

కొండ దిగి పనసపండ్లు,అరటిపండ్లు కొనితేవడం

దినమంతా నీ అరక్షిత పాదాలు నీవెటు నడిపిస్తే అటు నడుస్తాయి

నీలో నీవు పాతపాటలేవో కూని రాగాలు తీస్తూ.

సంజవెలుగు అవగుంఠనమై తలను కప్పినవేళ

ఒక చాపకు నీ తనువర్పిస్తావు

నీ కలల ప్రవాహంలో పక్షుల కలరవాలు

నీలాగే సుందరం సుమకోమలం.

సుఖంగా ఉన్న చినదానా, ఎందుకు మా ఫ్రాన్సు చూడాలని కోరిక

అక్కడ పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న కష్టాలు

అక్కడి నావికుల చేతుల్లో పెడతావా నీ బతుకు

నీకిష్టమైన చింతతోపులకు శాశ్వతంగా సెలవంటావా?

పలుచని దుకూలాల్లో అర్థనగ్న వేషంలో

మంచులో వడగళ్ళలో వణుకుతూ

ఇక్కడి స్వేచ్ఛ, విశ్రామం తలచుకొని దుఃఖిస్తావా

క్రూరంగా బిగిసిన కంచుకంలో.

నీ రాత్రి విందుకు మా వీథుల్లో ధూళిరేణువులు ఏరుకుంటావా

నీ పరదేశపు అందాల సుగంధాలు అమ్ముకుంటావా

మా కాలుష్యపుగాలుల్లో నీ చూపులు వెదుకుతూ

కనిపించని కొబ్బరితోటల ప్రేతాత్మలను!’

28-1-2021

Leave a Reply

%d bloggers like this: