విముక్తుడు

Reading Time: 6 minutes

నేనింతదాకా అమెరికా చూడలేదు. చూడాలన్న ఆసక్తి కూడా లేదు. కాని ఎప్పుడేనా అమెరికా వెళ్ళవలసి వస్తే కనీసం వారం రోజులేనా న్యూ ఇంగ్లాండ్ లో సాహిత్య యాత్ర చెయ్యాలని ఉంది. పద్ధెనిమిదో శతాబ్ది చివరి రోజుల్లో అక్కడ అమెరికన్ స్వాతంత్య్ర పోరాటం జరిగింది. వారు ఏ విలువలకోసం, నమ్మకాల కోసం, ఆశయాలకోసం పోరాటం చేసారో వాటిని అన్వేషిస్తో పందొమ్మిదో శతాబ్దిలో అమెరికన్ రినైజాన్సు సంభవించిన ప్రాంతం అది. వాల్ట్ విట్మన్ నుండి రాబర్ట్ ఫ్రాస్ట్ దాకా, ఎమర్సన్ నుండి ఎమిలీ డికిన్ సన్ దాకా అమెరికన్ ఆత్మని పట్టుకున్న రచయితలు, కవులు, భావుకులు వర్థిల్లిన ప్రాంతం అది. ఆ భావుకులు రాజకీయ విముక్తి కోసం కాదు, మానసిక విముక్తి కోసం పోరాడేరు. ఇప్పటికీ అమెరికా అంటే నా దృష్టిలో ఆ పందొమ్మిదో శతాబ్ది రచయితలు సృష్టించిన సాహిత్యమే. ఆ తర్వాత పందొమ్మిదో శతాబ్ది మధ్యకాలం నుంచి ఇరవయ్యవ శతాబ్ది దాకా ఆఫ్రికన్-అమెరికన్ రచయితలు, ప్రధానంగా దక్షిణాది రచయితలు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.

అమెరికా అనగానే నాకు ముందు గుర్తొచ్చేది స్వాతంత్య్రదేవతా విగ్రహం కాదు. వాల్డెన్ సరస్సు. ఒక్కొక్క దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి ఒక్కొక్క ప్రతీక మిగిలిపోతుంది. ఫ్రెంచి విప్లవానికి గోడలు బద్దలు గొట్టిన బాస్టిలీ జైలు లాగా, భారతస్వాతంత్య్ర సంగ్రామానికి దండియాత్రలాగా అమెరికన్ విముక్తి విప్లవానికి బోస్టన్ టీ పార్టీ ఒక గుర్తుగా మిగిలిపోయిందని మనకు తెలుసు. కానీ, ఒకసారి రాజకీయంగా స్వతంత్రమయ్యాక అమెరికా ఎటువంటి జీవనపథాన్ని ఎంచుకోవాలి? ఏమి కావాలని కోరుకోవాలి? ఒక అమెరికన్ పౌరుడు అభిలషించగదగ్గ జీవనశైలి ఏది? సరిగ్గా ఈ ప్రశ్నలకు సమాధానంగా వాల్డెన్ సరస్సు కనిపిస్తుంది.

హెన్రీ డేవిడ్ థోరో (1817-1862) ని ఒక ఋషి అని నా ముందు ఎంతో మంది అన్నారు. కాని ఆయన రచనలు చదువుతూ ఆ ఋషిత్వాన్ని ఎవరికి వారు గుర్తుపట్టడంలో గొప్ప సంతోషం ఉంది. ఒక మనిషి ఎలా జీవించాలని వైదిక ఋషులు, బౌద్ధ శ్రమణులు, జెన్ సాధువులు, గ్రీకు స్టోయిక్కులు, తొలి క్రైస్తవులు భావించారో అటువంటి జీవితం జీవించాడు ఆయన. స్వతంత్రుడయిన మనిషి, రాజకీయంగా మాత్రమే కాదు, బౌద్ధికంగానూ, మానసికంగానూ కూడా, విముక్తుడు ఎలా ఉంటాడో థోరో జీవితం, రచనలు రెండూ చెప్తాయి. ఆయన జీవితాదర్శాలేమిటో తనగురించి తాను రాసుకున్న దానికన్నా, ఆయన్ని స్మరిస్తూ ఎమర్సన్ రాసిన వ్యాసంలో మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ‘థోరో ‘ (1862) అనే వ్యాసంలో ఎమర్సన్ ఇలా అంటున్నాడు:

‘అతడు ప్రతి ఒక్క ఆచారాన్నీ తరచి తరచి చూసాడు. ఒక ఆదర్శవంతమైన పునాది దొరికితే దాన్ని బట్టి తన జీవితాచరణని కొనసాగించాలనుకున్నాడు. అతడు కరడుగట్టిన ప్రొటెస్టంటు. కాని అతడి జీవితమంతా త్యాగాలమయం. అంత త్యాగభరిమైన జీవితాలు మనం చూడగలిగినవి ఆట్టే లేవు. అతడు ఫలానాదంటూ ఏ వృత్తికీ కట్టుబడలేదు. పెళ్ళిచేసుకోలేదు. ఒంటరిగానే జీవించాడు. ఒక్కరోజు కూడా చర్చిలో అడుగుపెట్టలేదు. ఎన్నికల్లో ఓటు వెయ్యలేదు. ప్రభుత్వానికి పన్నుకట్టడానికి ఇష్టపడలేదు. నిరాకరించాడు కూడా. ఒక్కసారి కూడా మాంసాహారం ముట్టలేదు. మద్యం సేవించలేదు. పొగాకు ఉపయోగాలేమిటో తెలియదు అతడికి. ప్రకృతి సంచారకుడేగాని ఒక్కసారి కూడా తుపాకి పట్టలేదు, వలలు పన్నలేదు. అతడు తన భావధారలోనూ, ప్రకృతి ఆరాధనలోనూ మాత్రమే విద్యార్థిగా కొనసాగాడు. సంపదలు ఎలా కూడబెట్టుకోవాలో తెలియదు అతడికి. జీవితమంతా నిరుపేదగా జీవించాడు. అలాగని దీనంగా కాదు..అతడికి తాను పోరాడవలసిన ప్రలోభాలేవీ లేవు. ఏ ఆకలీ, ఏ మోహమూ అతణ్ణి బాధించలేదు. కులీనవిలాసాలు, ఇల్లు, ఆకర్షణీయమైన వస్త్రాలు, అలవాట్లు-వీటన్నిటినీ అతడు దూరంగా నెట్టేసాడు…’వాళ్ళ భోజనం ఎంత ఖరీదైతే వాళ్ళకంత గర్వం. నా భోజనం ఎంత చౌకగా దొరికితే నాకంత గర్వం ‘ అని చెప్పుకున్నాడు. ఒకసారి భోజనాల బల్ల దగ్గర ‘నీకు ఇష్టమైన కూర ఏమిటి? అనడిగితే ‘చేతికి ఏది దగ్గరగా ఉంటే అది ‘అని జవాబిచ్చాడు. ‘

థోరో ఎన్నడూ కాఫీగానీ, టీ గానీ, శీతలపానీయాలుగానీ, హాట్ డ్రింక్స్ గానీ ముట్టలేదు. ఎందుకని అడిగితే ‘మంచినీళ్ళ రుచికన్నా మించింది లేదు ‘ అని చెప్పేవాడు. అటువంటి వాడు ఒక మంచినీటి సరస్సు ఆరాధకుడిగా మారడంలో ఆశ్చర్యమేముంది? మసాచుసెట్స్ లోని కంకార్డ్ దగ్గరుండే వాల్డెన్ సరస్సు దగ్గర అతడు రెండేళ్ళ పాటు ఒక్కడూ జీవించాడు. 1845-1847 మధ్యకాలంలోని ఆ అనుభవాలను, ఒక ఏడాది పాటు ఋతుపరిభ్రమణంలో ఆ సరస్సు అతడికి ఎలా గోచరించిందో, ఆ సరస్తీరంలో తానెట్లా జీవించాడో 1849 లో వాల్డెన్ పేరిట ఒక పుస్తకంగా వెలువరించాడు.

వాల్డెన్ సుప్రసిద్ధగ్రంథమే అయినప్పటికీ, ఇప్పటిదాకా ఎవరూ తెలుగు చేసినట్టు నేను చూడలేదు. అందుకని మీ కోసం, ఆ రచనలోంచి కొన్ని పేరాలు ఇలా అందిస్తున్నాను:

1

ఏ ప్రాకృతిక ప్రదేశానికైనా అత్యంత శోభనిచ్చేది ఒక సరసు అని చెప్పవచ్చు. అది భూమితాలూకు నేత్రం. దానిలోకి చూస్తూ ఏ సందర్శకుడేనా తన స్వభావప్రకృతి ఎంత లోతైనదో అనుభూతి చెందవచ్చు. ఆ సరస్తీరాన పెరిగే చెట్లు ఆ సరసుని అంటిపెట్టుకుని ఉండే కనురెప్పలు. వాటి చుట్టుపక్కల ఉండే అడవులూ, కొండలూ ఆ కనురెప్పల పైన పరుచుకున్న కనుబొమ్మలు.

2

సెప్టెంబరులోగాని, అక్టోబరులోగాని, అట్లాంటి ఏ రోజైనా వాల్డెన్ చక్కటి అడవి అద్దంలాగా కనిపిస్తుంది. అంతకన్నా స్వచ్ఛంగా, నిర్మలంగా, అదే సమయంలో అంతకన్నా విశాలంగా, ఒక సరసులాగా ఈ భూమ్మీద మరే ప్రదేశమూ అలరారుతుందని చెప్పలేం. ఆకాశగంగ. దానికొక కంచెతో పనిలేదు. రాజ్యాలూ, జాతులూ పుడతాయి, నిష్క్రమిస్తాయి. కాని ఆ సరసు చెక్కుచెదరదు. దాని మిలమిల ఎన్నటికీ తరిగిపోదు, అరిగిపోదు. ప్రకృతి ఎప్పటికప్పుడు ఆ అందానికి నగిషీ పెడుతూనే ఉంటుంది. ఏ దుమ్ము, ఏ ధూళి, ఏ సుడిగాలి కూడా ఆ అకలంక సౌందర్యాన్ని కలతపరచలేదు. ఆ అద్దం మీద ఏ మసకపడ్డా, ఏ మరక పడ్డా సూర్యకాంతి ఇంతలోనే తుడిచేస్తుంది. దుమ్ము తుడిచే ఆ గుడ్డని కాంతితో నేసిన వస్త్రం అనవచ్చు. ఆ సరసుమీద వదిలిన ఏ ఊపిరిమసకనీ అది అక్కడ నిలవనివ్వదు. పైగా తన కాంతిని మేఘసముదాయంగా మార్చి ఆ సరసుమీద ప్రవహింపచేస్తుంది, ఆ సరోవరవక్షస్థలం మీద ఆ మేఘసౌందర్యం మరింత ప్రభావంతంగా ప్రతిఫలిస్తుంది.

3

ఏ జలరాశిని చూసినా అది తన చుట్టూ ఉండే వాతావరణంలోని ఉత్సాహ ఉద్వేగాల్నే ప్రతిఫలిస్తుందనుకుంటాను. ఎప్పటికప్పుడు అది పైనుంచి తన జవసత్త్వాల్నీ, సంతోష సంచలనాల్నీ తనలోకి ఇంకించుకుంటూ ఉంటుంది. నింగికీ నేలకీ మధ్య ఆ జలరాశి ఒక మధ్యవర్తి. నేలమీద పచ్చికబయళ్ళూ, చెట్లకొమ్మలూ మాత్రమే గాలికి కదులుతాయి. కాని కొలనునీళ్ళు మొత్తం చిరుగాలికి సితారా సంగీతం వినిపిస్తాయి. మందపవనం ఆ సరసుని ఎక్కడ తాకిపోతుంటుందో ఆ మిలమిలని బట్టి నేను గుర్తుపట్టగలను. మనం ఆ సరోవర ఉపరితలంలోకి చూపులు సారించగలగడం గొప్ప విశేషమనిపిస్తుంది.అట్లా ఆ సరోవరతలాన్ని ఎంతసేపేనా పరికిస్తూ, ఎక్కడ ఆ జలరాశికన్నా సూక్ష్మశరీరమొకటి దాన్ని గిలిగింతలు పెట్టిపోతున్నదో చూస్తూండటంలో ఒక సంతోషముంది.

4

నువ్వున్న చోటు నుంచి చూసినా కూడా వాల్డెన్ ఒక సారి నీలంగానూ, మరొకసారి ఆకుపచ్చగానూ కనిపిస్తుంది. నేలకీ, నింగికీ మధ్య పరుచుకుని అది ఆ రెండింటి రంగుల్నీ పుణికి పుచ్చుకున్నట్టుండేది. కొండకొమ్ము మీంచి చూస్తే అది అకాశం రంగుని ప్రతిఫలిస్తుండేది. అలాకాక దగ్గర్నుంచి చూస్తే పచ్చటిరంగులో, ఆ ఇసుక జాలు కనబడుతుండేది. ఒక లేతాకుపచ్చ వన్నెతో దూరంగా జరిగే కొద్దీ చిక్కని ముదురాకుపచ్చ వర్ణం సంతరించుకుండేది. కొన్ని కొన్ని వెలుగుల్లో కొండకొమ్ము మీంచి చూసినప్పుడు కూడా అది ఆకుపచ్చగానే కనిపించేది. చుట్టూ ఉండే పసరుదనం అట్లా ప్రతిబింబిస్తోందని కొందరన్నారుగాని, ఇసుక ఒడ్డు పక్కన కూడా అది ఆకుపచ్చగానే కనిపించేది. వసంతాగమనవేళ, ఆకులజొంపాలు ఇంకా పూర్తిగా తెరుచుకోకముందు అది నీలమూ, ఇసుక తాలూకు పసుపురంగూ మిశ్రితమై గోచరించేది… మరొకసారి అక్కడొక నిరుపమానమైన, వర్ణించడం సాధ్యంకాని ఒక నీలిమ తళుక్కుమనేది. బాగా పదునుపెట్టిన కత్తివాదరల్లోనూ లేదా బాగా నేతనేసిన పట్టువస్త్రాల్లోనూ కనిపించే నిగనిగ. ఆ నీలం ఆకాశం కన్నా మరింత శ్యామసుందరంగానూ, తరగలు ఎగిసిపడుతున్నప్పుడల్లా ఒకసారి ఆకుపచ్చగానూ మరొకసారి నీలంగానూ మార్చిమార్చి కనబడేది.

5

నా యవ్వనప్రాయంలో నేనా సరసులో పడవ వేసుకుని మధ్యదాకా పోయి అప్పుడు వెనక్కి వాలి ఆ వేసవి పూర్వాహ్ణాల్లో పగటికలలు కంటో ఎన్నో గంటలకు గంటలు గడిపేవాణ్ణి. ఆ మందపవనం ఆ పడవను ఎక్కడకు నెడితే అక్కడకు పోయేవాణ్ణి. నేనట్లా కలల్లో తేలిపోతో ఉండగా, పడవ ఏ ఇసుకజాలునో తగులుకోగానో కళ్ళు తెరిచి చూసేవాణ్ణి. నన్ను విధి ఏ కొత్త తీరాలకు నెట్టిందా అని పరికించేవాణ్ణి. ఈ లోకంలో నేను చేపట్టగల అతి పెద్ద పని, అత్యంత ఆకర్షణీయమైన పని అట్లా సోమరిగా గడపడమే అనిపించేది. ఏ రోజైనా అత్యంత విలువైన సమయం పూర్వాహ్ణమే అనుకుంటే, అట్లాంటి ఎన్నో పూర్వాహ్ణాలు నేనట్లా నాకోసం దొంగిలించుకున్నాను. అప్పట్లో నేను వేయి సువర్ణ పూర్వాహ్ణాల మేరకు సుసంపన్నుణ్ణి. ఆ వేసవి రోజుల్ని నేనెంతో దిలాసాగా కర్చుపెట్టేసాను. కాని నాకేమీ పశ్చాత్తాపం లేదు. వాటిని ఏదో ఒక కార్ఖానాలోనో, లేదా ఏ పాఠశాలగదుల్లోనో గడపలేకపోయినందుకు నాకేమీ విచారం లేదు.

6

ఎంతసేపు ఏకాంతంలో గడిపితే అంత ఆరోగ్యానికి మంచిదనిపిస్తుంది నాకు. ఎంత మంచి స్నేహితులుగానీ, ఎక్కువసేపు ఎవరిసాంగత్యంలోనైనా గడపడం చాలా విసుగ్గానూ, అలసటపెట్టేదిగానూ అనిపిస్తుంది. ఒంటరిగా ఉండటమే నాకు ఇష్టం. ఏకాంతాన్ని మించిన సాన్నిహిత్యం నాకిప్పటిదాకా కనిపించలేదు. .. నా ఇంట్లో నాకు గొప్ప సాంగత్యం తోడుగా ఉంటుంది, మరీ ముఖ్యంగా పొద్దుటివేళ, ఎవరూ మన ఇంటి తలుపు తట్టనప్పుడు. నేను చెప్తున్నది అర్థం కావడానికి బహుశా మరికొంత వివరంగా చెప్పలేమో. ఊరికే గలగలనవ్వే ఆ చెరువు, ఆ మాటకొస్తే వాల్డెన్ సరసు ఎంత ఏకాంతాన్ని అనుభవిస్తున్నాయో నేనూ అంతే ఏకాంతాన్ని అనుభవిస్తాను. ఆ కొలనుకి స్నేహితులెవరున్నారు చెప్పండి? కాని మీరు పరికించి చూస్తే ఆ నీలిసరోవరం మీద తేలియాడుతూ నీలి దెయ్యాలు కాదు, నీలి అప్సరసలు కనిపిస్తారు. సూర్యుడు కూడా ఒక్కడే. అప్పుడప్పుడు మరీ మబ్బుపట్టినప్పుడు ఒకడు కాడు, ఇద్దరు కనిపిస్తారనుకోండి, కాని ఆ రెండో సూర్యుడు వట్టి భ్రమ అని మనకి తెలిసిపోతూంటుంది. దేవుడు కూడా ఒక్కడే. కాని దెయ్యమో? సైతాను ఎప్పటికీ ఒంటరిగా మనలేడు, అతడికి చాలా పెద్ద సమాజం కావాలి. ఇంకా చెప్పాలంటే అతడే ఒక సైన్యం. నా సంగతి వేరు. ఆ పచ్చికబయల్లో వికసించిన ఆ పసుపుపచ్చటి పువ్వు, ఆ గడ్డిపువ్వు, ఒక చిక్కుడాకు, గడ్డిదుబ్బు, జోరీగ, తేనెటీగ ఎంత ఒంటరినో నేనూ అంతే ఒంటరిని. నేను కూడా ఒక్కణ్ణీ కాను. ఆ కొండవాగు, ఆ గాలికోడి, ఆ ధ్రువనక్షత్రం, ఒక మలయపవనం, ఒక వసంతవాన, తొలిమంచుసోన, కొత్త ఇంట్లో కొత్తగా గూడుకట్టుకున్న సాలీడు ఒంటరివైతే నేనూ ఒంటరినే.

7

నా జీవితాన్ని ప్రకృతితో సమానంగా సరళంగానూ, అంత నిష్కపటంగానూ రూపొందించుకోవడానికి ప్రతి ప్రత్యూషమూ ఒక ఉల్లాసమయ ఆహ్వానం. గ్రీకుల్లానే నేను కూడా ఉషోదేవతకి వీరారాధకుణ్ణి. రోజూ పొద్దున్నే లేచి ఆ సరసులో స్నానం చేస్తాను. అది నా ప్రభాత ప్రార్థన. నా జీవితంలో నేను చేయగలిగిన మంచిపనుల్లో అదొకటి. ఒక చీనా చక్రవర్తి స్నానం తొట్టె మీద రాసి ఉండేదట: ‘ప్రతి రోజూ మీ జీవితం మళ్ళా కొత్తగా మొదలుపెట్టండి, మళ్ళా, మళ్ళా, ఎప్పటికీ’ అని. నేను ఆ మాటలు నమ్ముతాను. ఎందుకంటే ప్రభాతాలు మన పూర్వ మహాయుగాల్ని, గడచిపోయిన కృతయుగాల్ని మనకోసం మళ్ళా పట్టుకొస్తాయి. పొద్దున్నే కిటికీలు తెరుచుకుని, తలుపులు బార్లా తెరిచి గుమ్మం దగ్గర కూచున్నప్పుడు, ఆ ఇంట్లో ఒక దోమ కంటికి కనిపించకుండా గీపెడుతున్న చప్పుడు వింటున్నప్పుడు నాకది ఒక మహా యశోవైభవ గానం లానే అనిపిస్తుంది. అదొక హోమరీయ కావ్యగానం. దానికదే గాల్లో సంచలిస్తున్న ఒక ఇలియడ్, ఒక ఒడెసీ. ఎందుకంటే ఆ మర్మరధ్వనిలో దాని కోపతాపాలూ, సంచారసల్లాపాలూ సంపూర్ణంగా వినిపిస్తున్నవి. దానిలో ఏదో వైశ్విక మహత్యం నిండి ఉన్నది. దానికదే ఒక గంభీర ప్రకటన. నువ్వు దాన్ని పక్కకు నెట్టేసేదాకా అది ఈ ప్రపంచ జవసత్త్వాల్ని ప్రకటిస్తూనే ఉంటుంది.

ఏ రోజుకైనా ప్రభాతమే దాని అత్యంత స్మరణీయ సమయం. అది వైతాళిక వేళ. అది మనలో నిద్రమత్తు అణగిపోయేవేళ. తక్కిన రోజు పొడుగునా, రాత్రీ మనలో కునికిపాట్లు పడేదేదో ఆ సమయాన మాత్రం పూర్తిగా రెక్కలు విప్పుకుని ఉంటుంది. ఎవరో మన పక్కన నిలబడి లేవమని నసపెడుతుంటే లేవడం కాక, మన లోపల ఏదో కొత్త జాగృతి, కొత్త స్ఫూర్తి, కొత్త ఆశయోద్వేగంవల్ల లేవమో ఆ రోజు రోజనిపించుకోదు. ఫాక్టరీ గంటల గణగణవల్ల కాక, ఏదో దివ్యసంగీతం స్థిరంగా మోగుతో మన చుట్టూ గాలంతా ఒక సుగంధం అల్లుకుని ఉండగా అంతదాకా మనం ఏ ఉన్నత జీవితానికి ఎడమై నిద్రిస్తూ ఉన్నామో ఆ జీవితం లోకి లేవడమే లేవడం. అప్పుడు చీకటి కూడా వెలుగులానే ఫలప్రదమవుతుంది.

తాను ఇంతదాకా మలినపర్చుకున్న, మసకపరుచుకున్న జీవితం కన్నా మరింత పవిత్రమైన, ఒక పూర్వ ఉషస్సుని ప్రతి రోజూ మనకోసం తిరిగి కొత్తగా వెంటబెట్టుకొస్తున్నదని ఏ మనిషి నమ్మలేడో అతడు మరింత అంధకారలోకాల్లోకి జారిపోతున్నట్టే లెక్క. మన ఇంద్రియ జీవితం కొంతసేపు సద్దుమణిగాక, ప్రతి రోజూ మనిషి ఆత్మ, ఇంకా చెప్పాలంటే అతడి దేహావయవాలు కొత్తగా ప్రాణంపోసుకునే వేళ అది. తనకోసం మరింత శుభప్రదమైన జీవితాన్ని ఆవిష్కరించుకోగలమని నమ్మే సమయం అది. మనం గుర్తుపెట్టుకోదగ్గవన్నీ ఆ ప్రత్యూషవేళ, ఆ ప్రభాతవాతావరణంలోనే ప్రాణం పోసుకుంటాయి. ‘అన్ని శుభసంకల్పాలూ ప్రాతఃకాలవేళనే మేలుకుంటాయి ‘ అని వేదాలు ఘోషిస్తున్నాయి. కళలు, కవిత్వం మనుషుల కార్యాలన్నిటిలోనూ కలకాలం నిలిచేవన్నీ అప్పుడే పురుడు పోసుకుంటాయి. వీరులూ, కవులూ ఉషోదేవి సంతానం. వాళ్ళది సూర్యోదయసంగీతం. ఎవరి భావధార సూర్యసంచారంతో అడుగులు వెయ్యగలదో అతడికి రోజంతా ప్రభాతమే. అప్పుడు అతడికి గడియారాలతో పని లేదు. ఎవరి వైఖరి ఎలా ఉన్నా పర్వాలేదు. ప్రభాతం నేను జాగృతమయ్యేవేళ. అప్పుడు ఆ ఉదయం ఉదయించేది నాలోనే. నిద్రమత్తు విదిలించుకోవడమే నిజమైన నైతిక సంస్కరణ…

లక్షలాది మంది పొట్టకూటికోసం నిద్రలేస్తారు. ఆ లక్షమందిలో ఒక్కడు మాత్రమే ప్రతిభాశీల పరిశ్రమకోసం మేలుకుంటాడు. ఇక కవితాత్మక, దివ్య జీవనం కోసం మేలుకునేవాడు కోటికి ఒక్కడు కూడా ఉండడు. మేలుకుని ఉండటమంటే సజీవంగా ఉండటం. పూర్తి జాగృతమానవుణ్ణి నేనిప్పటిదాకా చూడనేలేదు..

మనం మనల్ని మెలకువగా ఎట్లా ఉంచుకోవాలో, ఎలా జాగృతపరుచుకోవాలో సాధన చేస్తూండాలి. ఏవో యాంత్రిక సాధనాలతో కాదు, ఎప్పుడు తెల్లవారుతుందా అనే ప్రగాఢమైన ఆకాంక్షతో, మనం మన నిద్రలో ఆ ప్రత్యూషాన్ని ఎక్కడ తప్పిపోతామో అన్న ఆతృతలో మనం కాలం గడపాలి..మన దైనందిన జీవితాన్ని శ్రేష్టంగా గడపడమే అన్నిటికన్నా గొప్ప కళ.

8

నేనక్కడికి వెళ్ళిన తొలి వేసవి పుస్తకాలేమీ చదవలేదు. అందుకు బదులు చిక్కుడు పాదులకి గొప్పు తవ్వుకుంటూ గడిపాను. కాదు, చాలాసార్లు అంతకన్నా విలువైనరీతిలో కాలం గడిపాను. చాలాసార్లు ఆ నిమిషాన్ని వదులుకుని మరే పనీ చెయ్యాలనిపించని సమయాలు చాలానే ఉన్నాయి. నా జీవితానికి వీలైనంత ఖాళీ జాగా వదిలిపెట్టుకోవడమంటే నాకు చాలా ఇష్టం. చాలా సార్లు వేసవి ఉదయాల్లో సరసుదగ్గర నా స్నానం పూర్తయ్యాక, అప్పుడప్పుడే ప్రభాత కాంతి పరుచుకుంటున్న గుమ్మం దగ్గర జారగిలి సూర్యోదయందాకా, ఆ తర్వాత మధ్యాహ్నం దాకా ఆ పైన్ చెట్లనీడన, హికరీ చెట్లనీడన, సుమాక్ చెట్ల నీడన ఏదో చెప్పలేని పారవశ్యంలో నిరాఘాట ఏకాంతంలో నిశ్చలంగా గడిపేసేవాణ్ణి. చుట్టూ పక్షులు పాడుతోనో, లేదా నిశ్శబ్దంగా ఇంట్లో ఈ మూలనుంచి ఆ మూలకి కలయతిరుగుతూనో ఉండేవి. సూర్యుడు ఎప్పటికో పడమటి గవాక్షంవైపు జరిగిపోయినప్పుడో లేదా దూరంగా ఎవరో బాటసారి బండిచప్పుడు వినిపించినప్పుడో కాలం గడిచిపోయిందని నాకు హఠాత్తుగా గుర్తొచ్చేది. రాత్రివేళల్లో సస్యాలు పెరిగినట్టు ఆ ఋతువుల్లో నేను పెరిగాను. చేతుల్నిండా ఏదో ఒక పనితో గడిచినదానికన్నా ఆ కాలాలు ఎంతో విలువైనవి. అట్లా గడిచిన కాలం నా జీవితంలో తీసేయదగ్గ కాలం కాదు సరికదా, నేను పొందవలసిన దానికన్న అధికంగా పొందిన కాలం అని చెప్పవచ్చు. ప్రాచ్యదేశాల వాళ్ళు అన్ని పనులూ వదిలిపెట్టి ధ్యానం చెయ్యడం గురించి మాట్లాడతారే అదేమిటో అప్పుడు తెలిసొచ్చింది. చాలావరకూ కాలం ఎలా గడిచిపోయేదో నాకు తెలిసేది కాదు. నా పనిని తగ్గించడానికా అన్నట్టు కాలం గడిచేది. ఉదయం ఇంతలోనే సాయంకాలం అయిపోయేది. చెప్పుకోదగ్గదేదీ చేయకుండానే కాలం గడిచిపోయేది. పక్షుల్లాగా పాడుకుంటూ తిరగలేదన్నమాటేగానీ, నేను కూడా నా నిరంతరాయమైన భాగ్యాన్ని చూసుకుంటూ నాలోనేను ఒకటే మురిసిపోతుండేవాణ్ణి. నా గుమ్మం ముందు హికరీ చెట్టు మీద కూచుని పిచుక తనలో తాను పాడుకున్నట్టే నేను కూడా నా కులాయంలో కుదురుకుని ఏదో ఒకటి అస్పష్టంగా గొణుక్కునేవాణ్ణి లేదా ఆ పక్షికి ఎక్కడ వినబడుతుందోనని నాలోనేనే గొంతులో కుక్కుకునేవాణ్ణి…నాతోటి నగరవాసుల దృష్టిలో ఇది పరమసోమరితనం, సందేహం లేదు. కాని పక్షుల దృష్టిలోంచీ, పువ్వుల ప్రమాణాల ప్రకారం చూస్తే నేనెందులోనూ కొరతపడ్డది లేదు.

17-5-2021

Leave a Reply

%d bloggers like this: