విద్యా కానుక

నిన్న మా అన్నయ్య ఫోన్ చేసాడు. మా చిన్నప్పటి సంగతులు, నలభయ్యేళ్ళ కిందటి జ్ఞాపకాలు, తలుచుకున్నాడు. చిన్నప్పుడు, మా ఊళ్ళో, బళ్ళు తెరిచే రోజుల్లో, ఆ వానచినుకుల మధ్య, మాకు కొత్త నోటు పుస్తకాలు దొరికేవి కావు. మా ఊళ్ళో ఉండే అరవసాయిబు దుకాణంలో ఒకటీ అరా దొరికే నాసిరకం రూళ్ళపుస్తకాలే మాకు ఎంతో అపురూపంగా ఉండేది. మా నాన్నగారు గ్రామరికార్డులు రాసుకోడానికి ప్రభుత్వం ఇచ్చే కాగితాలు ప్రొఫార్మాలు మార్చినప్పుడల్లా ఆ పాతకాగితాలు ప్రభుత్వం రికార్డులు రాయడానికి ఇంక పనికిరాకుండా ఉండిపోతే వాటితోనే బొత్తుగా పుస్తకాల్లాగా కుట్టి ఇచ్చేవారు. అవే మాకు నోటు పుస్తకాలు. ఇంక గంపెడంత సంసారానికి కొత్త బట్టలు కొనాలంటే మా ఊళ్ళో ఉండే గిరిజన కార్పొరేషన్ లో చవగ్గా దొరికే తాను ఒక్కటే శరణ్యం. అందులోంచే మా కొత్తబట్టలు. పదవతరగతి దాకా నాకు తాడికొండ స్కూలు యూనిఫారం ఉండేది. కాని ఇంటర్మీడియేటులో చేరినప్పుడు, యూనిఫారం ఇవ్వరుకాబట్టి రెండు మూడు జతలే నాకంటూ దుస్తులుండేవి. వాటి రంగులు అప్పటికే వెలిసిపోయి ఉండేవి. ఒకరోజు నా పరిస్థితి చూసి మా అక్క నాకొక కొత్త జత టెరికాట్ చొక్కా, పాంటూ కుట్టించింది. ఇంటర్మీడియేటు రెండేళ్ళూ ఏ పండగ వచ్చినా అదే కొత్త జత నాకు.

ఒక పల్లెటూరి దిగువ మధ్య తరగతి కుటుంబం కథ ఇది. మా కన్నా దిగువ స్థాయి ఆర్థిక పరిస్థితిలో ఉండేవాళ్ళకి అవి కూడా లేకపోవడం మాకు నిత్యసత్యం. అటువంటి పరిస్థితుల్లో గిరిజన సంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు గిరిజన బాలబాలికలకి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలూ, దుస్తులూ ఇచ్చే ఒక పథకం ఉందని తెలిసినప్పుడు నాకెంతో సంతోషం కలిగింది.

ముప్పై ఏళ్ళకు పైగా గిరిజన సంక్షేమశాఖలో జిల్లా స్థాయినుంచి రాష్ట్ర స్థాయిదాకా ఎన్నో బాధ్యతలు నిర్వహించాను. కానీ, ఒక్క ఏడాది కూడా పిల్లలకి ఇవ్వవలసిన ఆ పాఠ్యపుస్తకాలు, ఆ నోటు పుస్తకాలు, ఆ డ్రెస్సులూ సకాలంలో ఇవ్వలేకపోయాం. ప్రతి ఏడాదీ అనుకునేవాళ్ళం, బళ్ళు తెరిచే రోజు పిల్లవాడు బడికి రాగానే, ఒక బాగు వాడి చేతుల్లో పెట్టాలని, అందులో కొత్త పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోటుపుస్తకాలు మొదలైనవన్నీ ఉండాలని. కాని ప్రతి ఏడాదీ షరా మామూలే. పిల్లలకి ఇవ్వవలసిన ఆ కనీస సామగ్రి అక్టోబరు, నవంబరు గడిచినా కూడా అందేది కాదు. రెండు మూడు లక్షల మంది పిల్లలకి ఇవ్వవలసిన ఆ సామగ్రి పంపిణీ మీదనే మొత్తం ఒక శాఖ అంతా పనిచేస్తున్నా కూడా ఏ ఒక్క ఏడాదీ ఏ ఒక్క సామగ్రీ కూడా సకాలంలో ఇవ్వలేకపోయాం.

నిన్నటిదాకా.

కొన్ని కలలుంటాయి. అవి నిజమవుతాయని కూడా మనం ఊహించలేం. కాని అవి నిజమైనప్పుడు మాత్రం కలా, నిజమా అని తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోతాం. అట్లాంటి మరొక కల గురించి చెప్తాను. 2003 లో అనుకుంటాను, ప్రేం చంద్రా రెడ్డి మాకు డైరక్టరు గా వచ్చారు. ఆయన మాతో మాట్లాడుతూ, మీ శాఖలో మీరు చెయ్యాలనుకుంటూ కూడా అసాధ్యంగా భావించి చేపట్టకుండా ఉన్న ఆలోచనలేమన్నా ఉన్నాయా అనడిగారు. అప్పట్లో పిల్లలకి పదవతరగతి తర్వాత ఇచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు ఎప్పుడూ సకాలంలో అందేవి కావు. ఏ ఏడాది చూసినా ఎప్పుడో రెండు మూడేళ్ళ కిందటి స్కాలర్ షిప్పులే మంజూరు చేస్తూండేవాళ్ళం. కొన్నిసార్లు పిల్లలు కాలేజి చదువు పూర్తయి వెళ్ళిపోయాక వాళ్ళ స్కాలర్ షిప్పులు మంజూరు అయ్యేవి. ఆయన ఆ ప్రశ్న అడిగినరోజుల్లోనే ఏటిఎం లు కొత్తగా మన జీవితంలో భాగమవుతూ ఉన్నాయి. నేనన్నాను కదా ‘ఒక కోరిక ఉంది సార్, మనం ఏటిఎంలోకి పోయి ఒక కార్డు స్వైపు చేసి డబ్బు మార్చుకున్నట్టుగా ఒక గిరిజన బాలిక ఏటి ఎం లోకి వెళ్ళి కార్డు స్వైపు చేసి తన స్కాలర్ షిప్పు తాను మార్చుకోవాలి అని ‘ అన్నాను. అది అప్పటికి నేను కోరగల అతి పెద్ద గొంతెమ్మ కోరిక.

అయిదేళ్ళు పట్టలేదు ఆ కల నిజం కావడానికి.

కానీ పిల్లలు బడిలో చేరే రోజే వాళ్ళకి కావలసిన సామగ్రి అంతా ఒక బాగులో పెట్టి చేతికదించాలన్న కల నిజం కావడానికి మాత్రం ఇన్నేళ్ళు పట్టింది.

ఇందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారిని మనసారా అభినందిస్తున్నాను. ఇది నిజంగా ‘జగనన్న విద్యా కానుక.’

రెండు లక్షల మంది గిరిజన విద్యార్థులకే ఎప్పుడూ ఏ సామగ్రీ సకాలంలో పంపిణీ కాని రోజులనుండి, నేను నా ప్రభుత్వోద్యోగంలో, 42 లక్షల మంది విద్యార్థులకి వారి విద్యాసామగ్రి మొత్తం ఒక స్కూలు కిట్ గా అందించగలిగే రోజులదాకా ప్రయాణించాను. కొత్త పాఠ్యపుస్తకాలు, మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సు, ఒక బెల్టు, చక్కటి స్కూల్ బాగు. ఇక అన్నిటికన్నా ముఖ్యం, ఇప్పటిదాకా పిల్లలకి టెక్స్టు పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. కాని ఇప్పుడు మొదటిసారిగా నోటు పుస్తకాలు కూడా అందుతున్నాయి. కలిగిన ఇంటి పిల్లలు కాన్వెంటుకి వెళ్తే వాళ్ళ బాగుల్లో నోటుపుస్తకాలు, కాపీ రైటింగు పుస్తకాలు ఎన్నో ఉంటాయి. కాని మన ప్రాథమిక పాఠశాలల్లో చదివే పిల్లలకి మనం పాఠ్యపుస్తకాలు తప్ప మరేమీ ఇచ్చేవారు కాదు. ఈ సారి మొదటిసారిగా ఒకటవ తరగతినుండి అయిదవతరగతి దాకా ప్రతి ఒక్క సబ్జెక్టుకీ ఆకర్షణీయంగా రూపొందించిన వర్క్ బుక్స్ ఇస్తున్నాం. ఇలా ఇవ్వబోతున్నామని చెప్పినప్పుడు భారత ప్రభుత్వ విద్యాశాఖ తాము కూడా మొదటిసారిగా కొంత గ్రాంటు ఆ పుస్తకాలకోసం మంజూరు చెయ్యకుండా ఉండలేకపోయారు.

650 కోట్ల కర్చుతో కూడిన ప్రాజెక్టు. మొన్న సాయంకాలానికే మొత్తం నిధులు విడుదల అయ్యాయంటే ముఖ్యమంత్రి ఈ పథకానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ‘నేను దీన్ని కర్చుగా భావించడంలేదు, పిల్లలమీద, వాళ్ళ భవిష్యత్తు మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాను ‘అన్నారాయన.

పేదపిల్లల మీద పెట్టిన పెట్టుబడి.

నిన్న ఎవరో ఒక కవి మిత్రుడు నాకొక మెసేజి పంపించాడు. ‘ఈ కరోనా కాలంలో ఈ పథకం మీద ఇంత కర్చు అవసరమా? అది కూడా విద్యాసంవత్సరం సగం అయిపోయాక? ‘ అని. కాని, కరోనా కాబట్టే, ఈ వ్యయం మరింత సార్థకం. లక్షలాది పేదతల్లితండ్రులకి ఇది మాటల్లో చెప్పలేనంత సాయం. నేనతడికి జవాబిచ్చాను. ‘మిత్రమా, విద్యకి సంబంధించి కర్చు పెట్టిన ఏ ఒక్క రూపాయి కూడా ఎప్పటికీ వృథా కాదు ‘అని.

అందుకు నా జీవితమే నాకు సాక్ష్యం. నా చిన్నప్పుడు ప్రభుత్వమే గనక నన్ను చదివించి ఉండకపోతే నేనింత దూరం ప్రయాణించి ఉండే వాణ్ణే కాను.

9-10-2020

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s