రష్యన్ హేమంతం

చలికాలపు ఉదయం: ఇవాన్ ఐవా జోవ్స్కీ (1817-1900)

ఒక్కొక్క కవికి ఒక్కో ఋతువు సొంతం. ఆ వెలుగులోనే, ఆ రంగులోనే అతడి గళం సుస్వరంతో వినబడుతుంది, సుస్పష్టంగా వినబడుతుంది. కృష్ణశాస్త్రిది వసంత ఋతువు. శిశిరహేమంతాలు ఆయనకు పడవు. ‘శీతవేళ రానీయకు, రానీయకు, శిశిరానికి చోటీయకు, చోటీయకు’ అని అననే అన్నాడు. కాళిదాసుది గ్రీష్మ ఋతువు. వేసవి రోజుల్లో దినాలు ‘పరిణామ రమణీయా’లయ్యే సుఖం తెలిసినవాడాయన. భావకవులది చాలా వరకు మేఘసందేశకాలం. నడివానాకాలం కృష్ణరాయలది, దువ్వూరి రామిరెడ్డిది. వాల్మీకి అన్ని ఋతువుల్నీ వర్ణించినా, శరత్కాలమే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైందనే రహస్యం నేనింతకుముందే మీకు చెప్పేసాను. జపనీయ హైకూ కవులదారిన శిశిరాన్ని ప్రేమించడానికి ప్రయత్నించినవాళ్ళల్లో సంజీవదేవ్ ఉంటాడు. రవీంద్రుడూ, చినవీరభద్రుడూ ఫాల్గుణమాసపు కవులని మీకిప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇక హేమంతం ఒక్కటీ మిగిలింది. హేమంతాన్ని హృదయానికి పొదువుకున్న కవులు ఆండాళ్ కాక మరెవరన్నా ఉన్నారా అంటే నాకు పుష్కిన్ గుర్తొస్తాడు.

ఆయన హేమంతం గురించి రాసాడో, శిశిరం గురించి రాసాడో తెలియకుండా ఇంగ్లీషు అనువాదకులు winter అనే పదమే వాడుతుంటారు. రెండు ఖండాల మేరకు పరుచుకున్న రష్యన్ నేలమీద ఇది హేమంతం, ఇది శిశిరం అని గీతగీయడం కష్టమే. ఆకులు పండి రంగు తిరిగితే అమెరికన్ కవులకు హేమంతం. కాని రష్యన్ హేమంతం మొదలవుతూనే మంచుకూడా మొదలవుతుంది. ఆ మంచుదారుల్లో స్లెడ్జి బళ్ళమీద పయనించడంలో సంతోషమేమిటో పుష్కిన్ కి మటుకే తెలుసు.

అసలు హేమంత శిశిరాల్ని ఇష్టపడటంలోనే రష్యన్ స్వభావానికి సంబంధించిందేదో ఉంది. అదేమిటో తెలియదు గాని, ప్రతి రష్యన్ కవీ తన కాలమే వసంత యుగోదయంగా భావిస్తాడు. జార్ పాలననుంచి బోల్షివిక్కు పాలన మొదలైనప్పుడూ వసంతం మొదలయినట్టే, స్టాలిన్ మరణించి ఇనుపతెర తెగినప్పుడూ వసంతోదయమే. ప్రతి కవీ తానప్పటిదాకా గడ్డకట్టే చలికాలంలో గడిపాననీ, అప్పుడే మంచుకరిగి సూర్యరశ్మి పరుచుకోవడం మొదలయ్యిందనీ అనుకుంటాడు. ఒక్క పుష్కిన్ తప్ప. బహుశా పుష్కిన్ లోని సమ్మోహకత్వం ఇక్కడే ఉంది. ఆయన తన చుట్టూ మంచు రాలుతోందని గుర్తుపట్టడమే కాదు, ఆ కాలాన్ని ఇష్టపడతాడు కూడా. తాను జీవిస్తున్న కాలాన్ని ప్రేమించడంలోనే ఆయన జీవితేచ్ఛ మనల్ని సంభ్రమపరిచేంతగా, మోహపరిచేంతగా ఆకట్టుకుంటుంది.

Everyman సిరీస్ లో పుష్కిన్ Selected Poems (1997) సంకలనం చేసిన బ్రిగ్స్ అనే విమర్శకుడు, ఆ సంకలనాన్ని ఒక శీతాకాలపు కవితతో మొదలుపెట్టాడు. ఆ కవిత చదవగానే నాకు స్పృహ తప్పింది. చూడండి, కథలాంటి కవిత, ఆ ఉత్కంఠభరితమైన కవిత:

~

హేమంతం. ఈ గ్రామసీమలో ఇప్పుడు మనమేం చెయ్యాలి? పొద్దున్నే తేనీటితో పలకరించబోతున్న పరిచారకుణ్ణి

ప్రశ్నల్తో ముంచెత్తుతాను. బయట చల్లగా ఉందా? మంచు కురవడం ఆగిపోయిందా?

కప్పుకోడానికేమన్నా ఉందా? బయటకి వెళ్ళొంచంటావా?

చిన్నపాటీ స్వారీ చెయ్యొచ్చా లేకపోతే

రోజంతా పక్కలోనే గడిపెయ్యాలా

ఏదో ఈ పాత పత్రికలు తిరగేస్తేనో లేదా

పొరుగింటి పెద్దమనిషితో కబుర్లాడుతోనో గడిపెయ్యాలా?

కొత్త మంచు, ఎట్లానో లేస్తాం, అడుగు బయట పెడతాం, ఎక్కణ్ణుంచో సన్నని డెక్కల చప్పుడు,

తొలివేకువ వేవెలుగు. చేత కళ్ళాలు, వెంట వేటకుక్కలు,

పేలమంచు దారుల్లో కళ్ళు చికిలిస్తూ ముందుకు సాగుతాం.

పొద్దెక్కేదాకా గ్రామసీమల్లో కలయతిరుగుతాం. ఇక, ఒకటో రెండో తప్పించుకున్న కుందేళ్ళని వదిలిపెట్టి

ఇంటిదారి పడతాం.

ఇదీ జీవితం! రాత్రవుతూనే ఎక్కడో మంచుతుపాను ఊళపెడుతుంది

కొవ్వొత్తి రెపరెపలాడుతుంది, నా గుండె ముడుచుకుపోతుంది. అంతా వట్టిదనిపిస్తుంది,

విసుగేస్తుంది. నెమ్మదిగా రక్తనాళాల్లో విషమెక్కుతుంటుంది.

ఏదన్నా చదువుదామని చూస్తాను. లేదు, అక్షరాలు అలుక్కుపోతాయి-ఆపేస్తాను.

ఆలోచనలు యోజనాలు దాటి సాగిపోతాయి, పుస్తకం మూసుకుపోతుంది. లేచి కూచుంటాను,

కలం పట్టుకుంటాను, నా కావ్యకన్యను అనునయించడం

మొదలుపెడతాను. ఆమెకి నిద్రముంచుకొస్తూంటుంది. మాటల మీద పట్టు తప్పి ముద్దముద్దగా వినబడుతుంటాయి.

లయ నా మరొక పరిచారిక, చిత్రమైన పిల్ల,

దానిమీద నా పెత్తనం సాగదు, మాటలు సరిగా కూడవు. కవితాపంక్తులు చల్లగా భారంగా ఈడ్చుకుంటో సాగుతాయి.

నా కావ్యతంత్రి చికాకు తెప్పిస్తుంది.

ఒకరితో ఒకరం కలహించుకోవడం మొదలుపెడతాం.

అక్కడ, ఆ డ్రాయింగు రూములో

ఏం మాట్లాడుకుంటే మాకు పొద్దుపోతుంది? చక్కెర కర్మాగారాల గురించా? పురపాలకసంఘాల ఎన్నికలా?..

మా ఆతిథేయి బయట వాతావరణమెట్లా ఉంటుందో పోల్చే ప్రయత్నం చేస్తూంటుంది,

కుట్లూ, అల్లికలూ మధ్య అప్పుడప్పుడు కార్డులు తెరిచి

జోస్యం చెపుతూంటుంది. అబ్బ విసుగు ఎంత యాతన!

నగరానికి దూరంగా ఇక్కడ రోజులెంత భారంగా ఈడుస్తాయి!

కాని ఇక్కడ ఏమీ పాలుపోని ఈ పల్లెటూళ్ళో

కనుచీకటి పడుతున్నప్పుడు

మరేంచెయ్యాలో తెలీక మేము అష్టాచెమ్మా ఆడుతున్నప్పుడు,

బహుశా ఇంటిముందొక బండి వచ్చి ఆగుతుంది. అకస్మాత్తుగా

అర్థరాత్రి అతిథులు దిగివస్తారు.

ఒకామే, ఆమె ఇద్దరు కూతుళ్ళూ (బొద్దుగా, చూడచక్కనివాళ్ళు)

వాళ్ళొస్తూనే మా చుట్టూ ఏదో కదలిక, కొత్త జీవితం!

ఒక్కసారిగా నవ్య ఉత్సాహంతో ప్రపంచం పొంగిపొర్లుతుంది.

ముందు ఒకటీ అరా తటపటాయిస్తో వాలుచూపులు, అప్పుడింక నెమ్మదిగా

సంభాషణలు, సాయంకాలం కాగానే ఆ అక్కా చెల్లెలూ పాటలు, వెచ్చని నవ్వులు, నునువెచ్చని నాట్యాలు,

భోజనాల దగ్గర గుసగుసలు,

సోమరి చూపులు, దీర్ఘవిలోకనాలు, వేళాకోళాలు,

అట్లానే మరికొంత సేపు మరికొంత సేపు ఆ మేడమెట్ల మీద నాతో ఆమె..

చివరికి ఎట్లాగైతేనేం, ఆ సాయంసంధ్యలో మేడమీద, ఆమె చేరువవుతుంది.

ఆ మెడవొంపు, ఒకింత ఆచ్ఛాదన పక్కకు తొలిగిన వక్షం,

ఆ కపోలాల్ని తాకుతూ మంచుతుపాను.

కాని నాకు తెలుసు, ఉత్తరగాడ్పులు రష్యన్ గులాబీని గాయపరచవు!

ఆ మంచురాత్రి భగ్గుమనే వెచ్చని ముద్దు, పొగలు కక్కే కవోష్ణదేహం.

ఓ ప్రేమాన్వితా! ఓ రజతహిమానీ సదృశ రష్యన్ బాలికా! నవశాబకా…

~

ఈ కవిత గురించి రాస్తూ సంపాదకుడు ముందుమాటలో అన్నాడు కదా ‘మొత్తం మీద ఈ కవిత పుష్కిన్ గురించిన మంచి ఉపోద్ఘాతం. అతడి జీవితం, రష్యా, ప్రకృతి, కవిత్వం, ప్రేమ, శృంగారం-అతడి కవిత్వమంతా దాదాపుగా వీటిల్లో ఏదో ఒక శీర్షిక కింద ఒదిగిపోయేదే.’

ఇంతకీ ఈ కవితలో ఆ మేడమీద, ఆ సాయంకాలపు సంధ్యవేళ ఉత్తరాన్నుంచి మంచుగాలి వీస్తున్నప్పుడు, ఆ కవోష్ణదేహం పొగలు కక్కడం మొదలుపెట్టాక, ఆ రాత్రి ఏమై ఉంటుంది? చెప్పనవసరం లేదనుకుంటాను. కాని, ఆ రాత్రి గడిచిన మర్నాడు, ఆ హేమంత ప్రభాతమెట్లా ఉంటుందో, మరొక కవితలో కనబడుతుంది.

ఆశ్చర్యంగా, ఆ కవితని నా కన్నా ముందే శ్రీ శ్రీ తెలుగు చేసిపెట్టేసాడు. చూడండి:

~

చలికాలపు ఉదయం

హేమంతం సూర్యకాంతి! ఎంత మంచి దివసం!

ఇంకా నిద్రపోతావేం! ఇది చక్కని ఉదయం!

సఖీ, సుభగముఖీ, చాలు సిగ్గులేని మగత

ఆవలింత మాను, నిదుర కనులు తెరువుసుంత!

ఉత్తర దిగ్గగ సంపయి చుక్కలాగ వెలుగుమా

ఉత్తర దిక్ప్రభాత శిఖనెదుర్కొనుము ప్రియతమా!

నిన్నరాత్రి (నీకు తెలుసు) సుడిగాలుల కేకలో

పొగమంచుల పొరలు కమ్మి ఆకాశపు రేకుల్లో

పచ్చని ఒకే మచ్చలాగా చందమామ చల్లగా

పరితాపపు ప్రతిమలాగ ప్రాణసఖీ నీవు

కూర్చున్నావపుడు, ఇపుడో, కిటికీ తెరిచి చూడు

నీలినీలి నింగికింద రంగు తివాసీ వలెనే

నీరెండలలో మిలమిలలాడి సొగసులాడి మంచు

నిద్రిస్తున్నది!నల్లని వస్తువన్నదే లేదు

చెట్లు మాత్రమే నల్లగ కాస్త కాస్త కనిపించును

పొగమంచుల మడతలలో ఆకుపచ్చ సరుగుచెట్లు

అల్లవిగో! మంచుకింద నది కంటున్నది కలలు!

ప్రాణసఖీ, గుర్రాన్నీ బండినీ పిలిపిస్తే

మరీ మంచిదనుకుంటా ప్రయాణానికిదే అదను

పదపోదాం ప్రణయినీ, ఉషఃకాల హిమానీ మృదు

పథాలలో నీవు నేను, గుర్రపు డెక్కల చప్పుడు

వింటూ, బండీ గంటలు వింటూ పోదాం పదపద

ఎవరులేని ఎవరురాని పొలాలలో తిరుగుదాం

ఆకురాలి శూన్యమైన అరణ్యాల కరుగుదాం

నాకెంతో సుఖమిచ్చే నది వొడ్డుకు కదులుదాం.

27-12-2020

Leave a Reply

%d