మార్దవ సంవేదన

కోర్టు ధిక్కార అభియోగం కింద విచారణ కోసం ఎదురుచూస్తూ మొన్నొక రోజంతా గడపవలసివచ్చింది. కాని సరిగ్గా ఇలాంటి వేళలే నా పాలిట వరప్రసాదాలు. రోజంతా మరొక ఆలోచనలేకుండా, మరొకరితో మాట్లాడవలసిన పనిలేకుండా హైన్రిక్ హైనిని పూర్తిచేసేసాను.

Songs of Love and Grief (1995). వాల్టర్ డబ్ల్యూ ఆరెండెట్ అనువాదం. కొని చాలా ఏళ్ళే అయింది. అప్పుడూ అప్పుడూ ఒకటీ అరా గీతాలు మాత్రమే చదువుతూ వచ్చినవాణ్ణి ఇప్పుడు పూర్తి సంపుటం చదువుకోగలిగాను. ఈ సంపుటానికి ఒక హైని పండితుడు సమకూర్చిన ముందుమాట ఇంతకు ముందు కూడా చదివానుగాని, ఇప్పుడు మరింత శ్రద్ధగా చదవగలిగాను.

ఏ భాషలోనైనా ఆ భాషకు చెందిన ప్రథమశ్రేణి కవులు మరొక భాషకు అంత తొందరగా పరిచయం కారు. ఒక భాషనుంచి మరొక భాషకి మొదట్లో అనువాదమయ్యేది ద్వితీయ శ్రేణి కవులూ, ద్వితీయశ్రేణి కవిత్వం మాత్రమే. ఏ కవి తన భాషలోని సంగీతాన్నీ, మాధుర్యాన్నీ పూర్తిగా తన కవిత్వంలో నింపుకుంటాడో ఆ కవి మరొక భాషకి ఎన్నటికీ పూర్తిగా పరిచయం కాలేడు. ఉదాహరణకి పోతననే తీసుకోండి:

నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు కృపారసంబు పై

జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా

జిల్లెడి మోము వాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెనో

మల్లియలార మీ పొదలమాటున లేడు కదమ్మ చెప్పరే

ఈ పద్యానికి ఇతివృత్తం సంస్కృతమూలమే అయినప్పటికీ, ఈ పద్యం సంస్కృత భాగవతంలో లేదు. ఈ పద్యం పూర్తిగా తెలుగు కవి పద్యం. ఈ మాధుర్యాన్ని చివరికి సంస్కృతంలోకి కూడా అనువదించలేం. మరీ ముఖ్యంగా ‘మల్లియలార ‘అనే ఆ సంబోధనలోని ఆ లాలిత్యం, ఆ ఆత్మీయత ఎంత ప్రయత్నించీ మరో భాషలోకి తేలేం.

కావటానికి ఇంగ్లీషు కూడా జెర్మానిక్ భాషనే అయినప్పటికీ, ఆ రెండు భాషల మధ్యా ఒక సముద్రమంత దూరం ఉందని హైని లాంటి వాడిని అనువదించవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది. గత శతాబ్ద కాలంగా ఎందరో హైనిని ఇంగ్లీషులోకి అనువదిస్తూనే ఉన్నారు, విఫలమవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆ గీతాల్లో భావం కన్నా, ఆ కాకువు చాలా ముఖ్యం. ఆ నుడికారం, ఆ పదధ్వని, ఆ పదాలు జర్మన్ శ్రోతల్లో రేకెత్తించగల మార్దవ సంవేదనలు ఇంగ్లీషు ద్వారా నాలాంటి సుదూర శ్రోతని చేరడం చాలా కష్టం. అందుకనే పుస్తకానికి ముందుమాట రాసిన పండితుడు హైని కవిత్వం ఇంగ్లీషు పాఠకులకి గ్రీటింగు కార్డుల కవిత్వంలాగా కనిపించే ప్రమాదం లేకపోలేదు అన్నాడు.

కాని ఆ ఇంగ్లీషు మేలిముసుగులోంచి హైని కవిత్వమనే జర్మన్ సుందరి సౌందర్యాన్ని నేను లీలామాత్రంగానైనా, స్పష్టాస్పష్టంగానైనా పోల్చుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ కొద్దిపాటి జాడ చాలు నన్ను వివశుణ్ణి చేయడానికి!

ఎందుకంటే ఆ కవిత్వంలో హైని ‘జర్మన్’ అని అన్నచోటల్లా నేను ‘తెలుగు’ అనుకుంటూ వచ్చాను. ఈ గీతం చూడండి:

సుదూర
కాలం కిందట నాకో

సొంత
దేశముండేది

అక్కడ
చెట్లు, పూలు నిత్యం

కదలాడేవి
నా కలల్లో.

అప్పుడు
నన్ను జర్మన్ లోనే

ముద్దాడేవారు,
ప్రేమిస్తే

ప్రేమించామని,
జర్మన్ లోనే

చెప్పేవారు,
అదంతా కల.

ఆ పుస్తకం శీర్షికలో ప్రేమా, శోకమూ రెండూ ఉన్నా, అధికభాగం ప్రేమ గీతాలే. శోకం ఉంటే అది కూడా ప్రేమించి తెచ్చుకున్న శోకమే చాలావరకు. జర్మన్ భాషలో అంత ప్రేమనీ,అంత దుఃఖాన్నీ నింపిపెట్టిన కవులు అంతకు ముందూ లేరు, ఆ తర్వాతా లేరు. ఇంతకీ ఎవరిని ప్రేమించి కవి ఇంత దుఃఖాన్ని కొల్లగొట్టుకున్నాడని పరిశోధకులు గత వందేళ్ళుగా పరిశోధిస్తూనే ఉన్నారుగాని, అదంతా నిజంగా జీవితంలో సంభవించిన ప్రేమ కాదు, కవి తన స్వప్నలోకంలో, తన పాటలకోసం తనకుతాను పెట్టుకున్న దుఃఖం మాత్రమేనని ఈ మధ్యనే తెలుసుకుంటున్నార

ఆ పుస్తకం మొత్తం చదివేటప్పటికి, హైని నిజంగా ప్రేమించింది ఒకే ఒక్కరిని, అది జర్మన్ భాషని మాత్రమేనని అర్థమయింది. ఇక జడ్జిగారు నన్ను లోపలకి పిలిచేటప్పటికి నేను కూడా తెలుగు భాషని ప్రేమించడమెట్లా అన్న ఊహల్లో తేలిపోతూ ఉన్నాను.

30-6-2021

Leave a Reply

%d bloggers like this: