మాధూకరభిక్ష

మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు మురళి మనమొకసారి సుండిపెంట బయ్యన్న దగ్గరకి కూడా వెళ్దాం సార్ అన్నాడు. మురళి చెంచు గిరిజనాభివృద్ధి సంస్థలో సహాయప్రాజెక్టు అధికారి. నేనక్కడ పనిచేసినప్పుడు నా సహోద్యోగి. అప్పణ్ణుంచీ మా అనుబంధం ఉద్యోగజీవితాన్ని దాటి కూడా కొనసాగుతూనే ఉంది.

సుండిపెంటలో ఊరి బయట, అడవి అంచులో ప్రభుత్వం కొందరు చెంచు వారికి అటవీ హక్కుల చట్టం కింద కొంత భూమి పంపిణీ చేసింది. దాదాపుగా అడవిలాంటి ఆ భూమిని కుడుముల చిన్న మూగెన్న అనే ఒక చెంచు రైతు సాగులోకి ఎలా తెచ్చాడో అదంతా నేను ఇంతకు ముందు నా అనుభవంలో వివరంగా రాసేను. అతడి కుటుంబంలోనూ, ఆ సమాజంలోనూ వచ్చిన ఆ పరివర్తనలో అతడికి బయ్యన్న ఎలా తోడుగా ఉన్నాడో కూడా రాసాను.

ఇప్పుడు మురళి ప్రస్తావిస్తున్నది ఆ బయ్యన్న గురించే. బయ్యన్న అంటే భైరవుడు. చెంచు వాళ్ళ ఇలవేల్పు, కులదైవం. ఆయన వాళ్ళ జీవితాల్లో అంతర్భాగం. ఆయన్ని తలచకుండా, ఆయనకి మొక్కకుండా వారే పనీ చేయరు. తనకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో బయ్యన్నకి ఒక విగ్రహం పెట్టి, తాను వేసిన మొక్కజొన్న మొదటి పంట కోసినప్పుడు పూజచేస్తూ, ఆ పూజకి నన్ను కూడా పిలిచినప్పుడు మొదటిసారి ఆ పొలానికి వెళ్ళాను. ఆ రోజు పూజ చేసాడేగాని, బయ్యన్నకి ఊరేగింపు చెయ్యలేదని బయ్యన్న ఎట్లా అలిగాడో అదంతా ఆ రోజు నేను కళ్ళారా చూసిన అనుభవం లో రాసేను.

అందుకని ఈసారి మురళి పిలిచినప్పుడు మూగెన్నను చూడటం కన్నా బయ్యన్నను చూడటం మీదనే నాకు ఎక్కువ ఆసక్తి ఉండింది. దేవుడూ, మనిషీ కలిసి అంతదగ్గరగా గడపడం ఒక్క ఆదిమసమాజాల్లోనే సాధ్యమనిపిస్తుంది.

ఈసారి కూడా మాతో పాటు ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారి కూడా ఉన్నాడు. మేము ఆ పొలంలో అడుగుపెడుతూండగానే అది పొలం కాదు తోట అని ఇట్టే తెలిసిపోతూ ఉంది. బయ్యన్న జీవితంలో కూడా మార్పు వచ్చింది. ఇంతకు ముందు వట్టి విగ్రహం, కాని ఇప్పుడు చుట్టూ ఒక మందిరం, పైన ఒక కప్పు, బయన్నకి ఎండనుంచీ, వాననుంచీ ఒక నీడ దొరికింది. ఆ విగ్రహానికి నిలువెల్లా పూలు అలంకరించి ఉన్నాయి. మాకోసమే ఎదురుచూస్తున్న మూగెన్న మాతో పూజ చేయించాడు. కొబ్బరికాయ కొట్టించాడు.

పూజ పూర్తికాగానే నేనా పొలంలో నాలుగడుగులు వేసాను. ఒకప్పుడు అడవి. ఇప్పుడు అక్కడ పదెకరాల మామిడితోట. దాదాపు అయిదువందల మామిడిచెట్లు ఏపుగా పెరిగాయి. ఈసారి పంట బాగానే దిగిందనిచెప్పాడు. మచ్చలేని బంగనపల్లి. నేనా తోటలో అడుగుపెట్టాను. ఒక చెట్టుని ఆప్యాయంగా స్పృశించాను. పక్కనొక గ్రీన్ హౌస్ కూడా ఉంది. దేవాలయం కోసం పూలు పెంచాలనుకుంటున్నాను అని చెప్పాడు. కనుచూపు మేరదాకా మామిడితోట. ఆ పైన చుట్టూ రాతికంచె. కంచె చుట్టూ కూడా ఏదైనా కూరగాయలు పెంచి ఉండవచ్చు కదా అన్నాను. ‘ఎక్కడ సామీ, అడవి పందులూ, ఎలుగు బంట్లూ నన్ను వదిలిపెడితేనా? మొన్న ఒక చిరుత కూడా కంచె దూకింది ‘ అన్నాడు మూగెన్న. అవును, అవి అతణ్ణి ఎలా వదిలిపెడతాయి? నిన్నటిదాకా తమ మిత్రుడు. తమతోటే కలిసి మసిలాడు. ఇప్పుడు తమనుంచి వేరుగా కంచెకట్టుకుంటే ఎలా భరిస్తాయి?

తిరిగి మళ్ళా బయ్యన్న వైపు అడుగులు వేసాం. అక్కడొక ట్రాక్టరు. ‘అది మీరే ఇచ్చారు సామీ. ఇరవయ్యేళ్ళ కిందట’ అన్నాడు మూగెన్న. నేను నమ్మలేకపోయాను. ‘అవాళ నేను మిమ్మల్ని కమాండరు అడిగాను. కాని బండి ఇస్తే నేను తాగి నడుపుతానని మీరు నాకు ట్రాక్టరు ఇచ్చారు. ఆ ట్రాక్టరే నాకు అన్నం పెట్టింది, ఈ పొలాన్నిచ్చింది, ఈ తోటనిచ్చింది’ అన్నాడు.

ఆదిమసమాజాలు వ్యావసాయిక సమాజాలుగా పరివర్తన చెందడంలో ఎంత సంఘర్షణ ఉంటుందో ఆ ఇతిహాసమంతా మూగెన్న ఒక్కడి జీవితంలో చూడవచ్చు. ఒకప్పుడు అతడు విల్లంబులు పట్టుకుని వేటకు వెళ్ళడం చూసాను. ఏదీ దొరకని రోజున తాగి నామీదకు గొడవకు రావడం కూడా నాకు గుర్తుంది. ధనుర్బాణాలనుంచి పొలం, బోరు, మోటారు, ట్రాక్టరు, మామిడి, మోనోక్రోటోఫాసు దాకా ప్రయాణించిన జీవితం అది.

‘సంతోషంగా ఉంది మూగెన్నా, ఇంక వస్తాను’ అని సెలవు తీసుకోబోతుండగా, ‘ఒక్క నిమిషం ఆగండి సామీ, తేనె తిందురుగాని’ అన్నాడు. అక్కడ బయ్యన్న గుడి ముంగిట కుర్చీలు వేసాడు. తోటలోంచి పెద్ద ఆకులు కోసుకొచ్చాడు. తాను నిన్ననో మొన్ననో పట్టి తెచ్చిన పుట్టతేనెపట్టు ప్లాస్టిక్ డబ్బాలో దాచినట్టున్నాడు, ఆ డబ్బా తీసుకొచ్చాడు. ఆ డబ్బాలోంచి తేనెపెర తీసి ఆ ఆకులో పెట్టి నాకు అందించాడు.

నేనా తేనె తింటూ ఉండగా తన భార్యా పిల్లల్నీ పరిచయం చేసాడు. నేను కిందటి సారి వచ్చినప్పుడు అతడి తల్లి ఉండింది. ఆ రోజు తమమీద అలిగిన బయ్యన్నను ఆమెనే శాంతింపచేస్తూ ఉండింది. ఈసారి ఆమె బదులు మూగెన్న కూతురు నన్ను ఆశ్చర్య పరిచింది. ఇప్పుడామె నంద్యాలలో బి.టెక్ చదువుతున్నదట. సివిల్ ఇంజనీరింగ్. గత మూడుదశాబ్దాల్లో మొదటిసారిగా ఇంజనీరింగ్ చదువుతున్న ఒక చెంచు బాలికను చూసాను. ఆ రోజు ఆ తేనె ఎక్కువ తీపిగా ఉన్నదో, ఆ వార్త ఎక్కువ తీపిగా ఉన్నదో చెప్పలేను.

ఆ తేనె తింటూ ఉండగా నాకు ఎన్నడో ముప్పై ఏళ్ళకిందట మహానంది అడవుల్లో బసవాపురం చెంచుగూడేనికి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. ఆ రోజు నాకు బుగ్గి లో మగ్గబెట్టిన కందమూలాలు, పుట్టతేనెతో కలిపి పెట్టారు. ఇన్నాళ్ళకు మళ్ళా అటువంటి ఆతిథ్యం.

నా చేతుల్లో ఉన్నది తేనెపెర కాదు, నిండుగా పూచిన ఒక అడవి, కోటి భ్రమరపరిభ్రమణాలు. ఎన్ని వేల తేనెటీగలో ఎన్ని ఋతువులో ఒక అడవిమొత్తం గాలించి తెచ్చుకున్న మకరందమది. ఆ అడవి ఒక ఆదిమానవుడి ద్వారా తిరిగి నన్ను చేరి నాలో ఒక భాగమైపోయిందనిపించింది.

ఒక సాంఘిక శాస్త్రజ్ఞుడు ఆ రైతునీ, ఆ తోటనీ చూస్తే ఆ పరివర్తన వెనక ఉన్న సామాజిక చలనాల్నీ, ఉత్పత్తి సంబంధాల్నీ వివరించడానికి పూనుకుంటాడు. ఆహారసేకరణ దశనుంచి ఆహార ఉత్పత్తి దశదాకా సాగిన ప్రస్థానాన్ని విశ్లేషిస్తాడు. కాని నాలాంటి వాడు అక్కడ బయ్యన్నని చూడాలనీ, ఆయన నాతో కూడా మాట్లాడితే బాగుంటుందనీ కోరుకుంటాడు. భగద్విభూతి ఏ రూపంలో తాకుతుందో తెలియక, ప్రతి క్షణం ఒళ్ళంతా, మనసంతా మెలకువగా, ఏ క్షణాన్నీ తప్పిపోనివ్వకుండా, వాన చినుకుని ఒడిసిపట్టుకోవడం కోసం చకోరం వేచి ఉన్నట్టుగా, వేచి ఉంటాడు. అప్పుడు వినిపిస్తుంది, కనిపిస్తుంది, అనిపిస్తుంది, ఏదో ఒక రూపంలో దైవ సన్నిధి. ఒక epiphany.

ఆ రోజు నాకు లభించిన ఆ మాధూకరభిక్షలాగా.

25-6-2021

One Reply to “”

  1. “భగవద్విభూతి ఏ రూపంలో తాకుతుందో తెలీక, ప్రతి క్షణం ఒళ్ళంతా, మనసంతా మెలకువగా” …..వచనమనిపించే కమ్మని కవిత్వమిది

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading