
నిన్న మచిలీపట్నం వెళ్ళి వస్తూ పెడన దగ్గర ఆగాను. పెడనలో కలంకారీ కళాకారుల్ని చూడాలని చాలాకాలంగా అనుకుంటూ ఉన్నాను. ఒకప్పుడు బందరు కలంకారీగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కలంకారీ కళ డెబ్బైల మొదట్లో పెడనకు తరలి వచ్చేసింది. హాండ్ బ్లాక్ ప్రింటింగు గా చెప్పదగ్గ కలంకారీ ఇప్పుడు దేశం మొత్తం మీద ఒక్క పెడనలో మాత్రమే మిగిలి ఉంది.
నిన్న మా వాళ్ళు నన్ను పెడనలో లక్ష్మీ కలంకారీ ఫాబ్రిక్సు వారి దుకాణానికి తీసుకువెళ్ళారు. ఆ ఫాబ్రికు అధినేత రవిగారు పాత్రికేయులు కూడా. ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టాడు. రెండేళ్ళ కిందట మదరసాలు చూడటానికి పెడన వచ్చానని గుర్తుచేసాడు. వాళ్ళ ఎంపోరియం చాలా పెద్దది. సుమారు రెండువందల రకాల డిజైన్లతో రరకాల ఫాబ్రిక్సు వారిదగ్గర ఉన్నాయి. ఆ వస్త్రాల్ని అలా ఎంపోరియంలో చూసినప్పుడు వాటి అందం తెలీదు. ఒక కలంకారీ దుప్పటి మంచం మీద పరిచినప్పుడు అందాకా ఎక్కడ దాగిఉందో తెలియని ఒక రాజసం మనముందు ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడో శతాబ్దాల కిందట మచిలీపట్నం ఒక సముద్ర వర్తక కేంద్రంగా ఉన్నప్పుడు ఆ కళ పర్షియానుంచి ఇక్కడ అడుగుపెట్టిందట. అందుకనే పర్షియన్ తివాసీలు, రగ్గులు, తెరలు, చీరలు, అల్లికల్లో ఉండే elegance అంతా ఈ కలంకారీలో కనిపిస్తుంది మనకి.
అక్కడ నాలుగైదు దుప్పట్లు, దివాను మీద పరిచే వస్త్రాలు కొనుక్కున్నాను. కాని నేను వచ్చింది ప్రధానంగా వాళ్ళ అద్దకం పని ఎలా ఉంటుందో చూద్దామని అని చెప్తే ఆయన తన వర్క్ షాప్ కి తీసుకువెళ్ళారు. అక్కడ పది మందిదాకా కళాకారులు వస్త్రాలమీద బ్లాకు ప్రింటింగు చేస్తున్నారు. తమముందు పరిచిపెట్టుకున్న వస్త్రాలమీద ఆ కళాకారులు ఎంతో కుశలంగానూ, ఓపిగ్గానూ, ఎంతో precision తోనూ అద్దకం చేస్తున్నారు. అందులో, రెండుమూడు రంగులుండే డిజైన్లు అద్దకం చేస్తున్న దృశ్యం మరీ అబ్బురపరిచేదిగా ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు డిజైన్ ప్రకారం ఒక రంగు మీద మరొక రంగు అద్దకం చేస్తున్నప్పుడు ఆ precision కంప్యూటరులో ప్రోగ్రాము చేసినదానికన్నా నిర్ధిష్టంగా ఉంది. వాళ్ళట్లా అద్దకం చేస్తుంటే ఉండబట్టలేక, నేను కూడా ఒక వస్త్రం మీద ఒక వరస బొమ్మలు అద్దకుండా ఉండలేకపోయాను.
ఒకప్పుడు నేను చార్మినారుదగ్గర బ్లాకు ప్రింటింగు చూసానుగాని, ఆ బ్లాకులు చాలా చిన్నవి. అక్కడ వైవిధ్యం కూడా చాలా తక్కువగా ఉంది. కాని ఇక్కడ బ్లాకులు చాలా పెద్దవి. ఆ డిజైన్లలో ఎంతో వైవిధ్యం ఉంది. ఆ మాటే రవిగారితో అంటే ఆయన ఆ బ్లాకులు డిజైన్ చేసే కళాకారుడు స్థానికంగానే ఉన్నాడని ఆయనదగ్గరకు తీసుకువెళ్ళాడు.
ఆ కళాకారుణ్ణి చూడటం నిజంగా నా భాగ్యం. ఆయన పేరు కొండ్ర గంగాధరం. ఆయన తన సోదరుడు నరసయ్యతో కలిసి గత ముప్పై నలభయ్యేళ్ళుగా బ్లాకులు తయారు చేస్తూ ఉన్నాడు. వుడెన్ బ్లాకుల రూపకల్పనలో ఈ రోజు దేశంలో ఉన్న అతి తక్కువ మంది అపురూపమైన కళాకారుల్లో ఆయన కూడా ఒకడు. పెడన కలంకారీకి కావలసిన మొత్తం బ్లాకులు తానే రూపొందిస్తానని ఆయన నాకు చెప్పాడు. ఆయన రూపొందించిన బ్లాకులకు గాను రెండు సార్లు ఆయన్ని భారతప్రభుత్వం సత్కరించింది. అక్కడ గోడమీద డా.అబ్దుల్ కలాం ఆయన్ను సన్మానిస్తున్న ఫొటో చూపించి, టెక్స్ టైల్స్ శాఖకి, చేనేతకళాకారులకి, ఆప్కో, లేపాక్షి మొదలైన హస్తకళాకారుల సమాఖ్యలకి తానే రకరకాల డిజైన్లు అందచేస్తూ ఉంటానని చెప్పాడు.
అక్కడ ఆయన ఇల్లు ఒక కళాకారుల శిబిరంలాగా ఉంది. పూర్వకాలపు పర్షియాలోనో, లేదా ముఘల్ చక్రవర్తుల కాలం నాటి ఢిల్లీలోనో, ప్రాచీన లక్నోలోనో మాత్రమే కనవచ్చే దృశ్యం అది. అక్కడ దాదాపు పది పదిహేనుమంది కళాకారులు వుడెన్ బ్లాకుల మీద డిజైన్లు రూపొందిస్తూ ఉన్నారు. గంగాధరం గారు ఆ ప్రక్రియ మొత్తం దశలన్నీ ఒక్కొక్కటీ ఓపిగ్గానూ, ఎంతో ఇష్టంగానూ, కించిత్ గర్వంతోనూ చూపించేడు. అన్నిటికన్నా మొదటిదశ పెద్ద పెద్ద టేకు చెట్లు తాను స్వయంగా రాజమండ్రి వెళ్ళి కొనుగోలు చేసుకోవడంతో మొదలవుతుంది. ఒక్కొక్కటీ కనీసం రెండువందల యాభై ఏళ్ళ వయసుగల టేకు చెట్ల కలప కొనుక్కుని వాటిని తనకి కావలసిన సైజుల్లో కోసిపెట్టుకుంటాడు. అట్లా కోసిన ముక్కల్ని ఒక్కొక్కదాన్నీ పైపైన చిత్రిక పట్టడం మొదటిదశ. అట్లా సాపు చేసుకున్న చెక్కలమీద టిటానియం వైటు పూత పూయడం రెండవ దశ. ఆ తర్వాత వాటిమీద తాము ముందే కాగితం మీద చిత్రించుకున్న డిజైన్ ని కాపీ చెయ్యడం రెండవ దశ. అట్లా చెక్కమీదకి ఆ నమూనాని బదలాయించిన తర్వాత ఆ నమూనాని దాని సూక్ష్మవివరాలన్నిటితోటీ ముద్రించుకోవడం మూడవ దశ. బహుశా ఆ మొత్తం రూపకల్పనలో అత్యంత నైపుణ్యం అవసరమైన దశ అదేనని చెప్పవచ్చు. ఆ పనిచేస్తున్న కళాకారులు ఫరుక్కాబాదునుండి ఎప్పుడో తమదగ్గరకు వచ్చి తమతోటే ఉండిపోయారని చెప్పాడు గంగాధరం. ఆ తర్వాతి దశలో ఆ నమూనాను చెక్కే పని ఉంటుంది. స్థానికంగా ఉండే కొందరు యువకుల్ని ఎంపికచేసుకుని వాళ్ళకు ఆ పనిలో తాను తర్ఫీదు ఇచ్చానని ఆయన చెప్పాడు. అక్కడ ఏడెనిమిది మంది యువకులు ఆ నమూనాల్ని ఆ చెక్కలమీద చెక్కుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతో ఏకాగ్రతతో ఆ చెక్కలమీద పువ్వుల్నీ, లతల్నీ, పక్షుల్నీ ఆవాహన చేస్తూ ఉన్నారు.
ఒకసారి డిజైన్ చెక్కడం పూర్తయ్యాక ఆ బ్లాకుల్ని మంచినూనెలో వారం రోజుల పాటు నానబెడతామని చెప్పారు. లోపల అట్లా నూనెలో నానబెట్టిన బ్లాకుల్ని చూపించాడాయన. పూర్తిగా నూనె ఓడుతున్న ఆ బ్లాకుల్లో జీవకళ ఉట్టిపడుతూ ఉంది. తాను ఈ విద్య తన పెదనాన్న దగ్గరనుండి నేర్చుకున్నాననీ, ఆయనతో పోలిస్తే తాను చాలా మామూలు కళాకారుణ్ణనీ అన్నాడు గంగాధరం. తాను చెక్కమీద చెక్కుతున్న నమూనాల్ని తన పెదనాన్న రాగిరేకలమీద చెక్కేవాడని చెప్తూ తాను ఎంతో పదిలంగా దాచుకున్న ఒక కాపర్ బ్లాకు తీసి చూపించాడు. ఆయన దగ్గర అటువంటి ఒక బ్లాకు ఉందని రవిగారికి కూడా తెలిసినట్టులేదు. ఆయన కూడా ఆశ్చర్యంగా ఆ బ్లాకుని మొదటిసారి చూస్తున్నాడు.
మీరింతదాకా ఎన్ని బ్లాకులు రూపొందించి ఉంటారని అడిగితే కొన్ని లక్షలుంటాయన్నాడు గంగాధరం. వుడెన్ బ్లాకు ప్రింటింగ్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అరుదైన కళ. ఎక్కడో చైనాలోనూ, పర్షియాలోనూ, భారతదేశంలో రాజస్థాన్ లోనూ మాత్రమే మిగిలిన కళ. అందుకనే చెన్నైకి చెందిన తారా బుక్స్ వారు తాము వస్త్రాలమీద రూపొందిస్తున్న పుస్తకాలకి బ్లాకులు డిజైన్ చెయ్యమని తననే అడుగుతారని గంగాధరం ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. మీరిప్పటిదాకా రూపొందించిన నమూనాలు ఒక ఆల్బం గా రూపొందించారా అని అడిగాను. లేదన్నాడు. కానీ, తాను రూపొందించిన చాలా బ్లాకుల మొదటి ప్రింట్లు కాగితాలమీద తీసుకుని భద్రపరుచుకున్నాని చెప్పాడు. వాటిని చూపిస్తారా అని అడిగితే దాదాపు వంద డిజైన్లు నా ముందు తెచ్చిపెట్టాడు. అవన్నీ ప్రతి ఒక్కటీ చూసాను. మేలిమి చిత్రలేఖనాలు అవి. ఏనుగులు, నెమళ్ళు, లతలు, పువ్వులు, పళ్ళు- ప్రతి ఒక్కటీ ఆయన చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి. బహుశా విలియం మోరిస్ వంటి డిజైనరు వాటిని చూసి ఉంటే ఆయన్ని ఇంగ్లాండు పట్టుకుపోయి ఉండేవాడు.
‘పదేళ్ళ తరువాత ఈ కలంకారీ అదృశ్యమైపోతుంది ‘ అన్నాడు రవిగారు. ‘ఎందుకు? మార్కెటు లేదా?’ అనడిగాను. ‘ఊహించలేనంత మార్కెటు ఉంది. దేశవిదేశాలనుంచి మాకు ఆర్డర్లు వస్తున్నాయి. కాని కళాకారులే లేరు. ఇప్పటి యువతరానికి ఈ విద్యనేర్చుకోవడంలోనూ, ఈ పనిలోనూ ఆసక్తి లేదు ‘ అన్నాడాయన. ‘ఈ గంగాధరం గారి తర్వాత ఈ కళని నిలబెట్టేవాళ్ళు నాకెవరూ కనబడటం లేదు’ అని కూడా అన్నాడు.
ఇటువంటి కళలో చేతుల్తో మాత్రమే చెయ్యగలపని ఎంత ఉంటుందో సృజనాత్మకంగా చెయ్యవలసిన పనికూడా అంతే ఉంటుంది. గంగాధరం artisan మాత్రమే కాదు, అన్నిటికన్నా ముందు artist. ఒక వస్త్రం మీద ఎటువంటి అలంకరణని ముద్రించాలి అన్నది అతడి మనోనేత్రానికి మాత్రమే గోచరిస్తుంది. ఒక కంపోజర్ పాటని స్వరపరిచినప్పుడు ఆ మాంత్రిక స్పూర్తి ఎక్కణ్ణుంచి వస్తుందో మనకు తెలియనట్టే ఈ వుడెన్ బ్లాకు డిజైనరు రూపకల్పన చేస్తున్న ఈ motif లూ, ఈ అమరికలూ కూడా మన ఊహకి అంతుబట్టేవికావు. శతాబ్దాలకిందటి ఏ పారశీక కళాకారులో, చిత్రకారులో అతడితో నిత్యం సంభాషణ కొనసాగిస్తూ ఉంటారనుకుంటాను. ఇక్కడ పొందుపరిచిన రెండుమూడు నమూనాలు చూడండి. ఆ నెమలి, ఆ ఏనుగు, ఆ కొంగలు- ఇవి కాగితం మీద గీసిన బొమ్మలు కావు, చెక్కమీద చెక్కిన శిల్పాలు, ఇంకాచెప్పాలంటే పాలరాతిమీద ముద్రించిన మనోజ్ఞస్వప్నాలు.
ఒక కూచిపూడి, ఒక కొండపల్లి, ఒక పెడన- ఆంధ్రసంస్కృతి ఎంత విలువైనదో, ఎంత ఉజ్జ్వలమైనదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.
15-5-2021