
నా మొదటి కవితా సంపుటి నిర్వికల్ప సంగీతంలో ప్రపంచ సాహిత్యం నుంచి కొన్ని కవితల అనువాదాలు కూడా పొందుపరిచాను. అందులో అమెరికన్ కవితకు ప్రతినిధిగా ఎమిలీ డికిన్ సన్ కవితను అనువదించాను. అప్పటికి నాకు వాల్ట్ విట్మన్ కవిత్వం తెలిసి ఉన్నా కూడా డికిన్ సన్ కవితనే ఎందుకు ఎంపికచెయ్యాలనిపించిందో తలుచుకుంటే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. మరీ ముఖ్యంగా, ఈ కవిత:
నేను మరణించినప్పుడు ఒక ఈగ ఎగరడం విన్పించింది
అప్పుడు గదిలో పరచుకొన్న నిశ్శబ్దం
సముద్రపు తుపానుల పీడనంలో
గాల్లో ఆవరించిన నిశ్శబ్దం లాంటిదే.
చుట్టుపక్కల కళ్ళు చూస్తున్నాయి
శ్వాసలు చిక్కనయ్యాయి
ప్రభువు గదిలో ప్రత్యక్షమయ్యేదాకా
అదట్లా ఎగురుతూనే ఉంది.
నా ఆస్తులకి వీలునామా రాసేసాను
ఇవ్వగలిగిన మేరకి చేవ్రాలు
చేసేసేను-అప్పుడు
కనబడింది ఆ ఈగ.
దీపకాంతికీ నాకూ మధ్య
అనిశ్చితంగా ఆటంకంగా నీలంగా దాని ధ్వని
కిటికీలు మూసుకొన్నాయి
ఇక చూద్దామన్నా చూడలేకపోయాను.
ఇటువంటి కవిత్వాన్ని రాసిన వారిని పాశ్చాత్య ప్రపంచంలో మిస్టిక్ అంటారు. కొన్నిసార్లు విజనరీ అని కూడా అంటారు. ఇంగ్లీషు కవిత్వంలో విలియం బ్లేక్ అట్లాంటి కవి. కాని డికిన్ సన్ కవిత్వం బ్లేక్ కవిత్వం కన్నా సాంద్రం. ఇప్పుడు ఆ కవిత్వాన్ని ఈశ్వరీయ కవిత్వంగా లెక్కవేస్తున్నప్పటికీ, ఆ ఈశ్వరుడు, చర్చి వివరించగల ఈశ్వరుడు కాడు. ఆ ప్రభుదర్శనం ఆమె స్వయంగా సాధించుకున్నది, ఆమె సొంతం. తనకీ, తన దేవుడికీ మధ్య మరొక మధ్యవర్తి అవసరం లేదామెకి. ఒక తోటతోనూ, తోటలో పాడే ఒక పిట్టతోనూ ఆమె నేరుగా స్వర్గానికి ప్రయాణించగలదు. సుప్రసిద్ధమైన ఈ కవిత చూడండి:
కొందరు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తారు
నా ప్రార్థనలు ఇంట్లోనే-
బృందగానానికి ఒక భరద్వాజ పక్షి
మోకరిల్లడానికి పూలతోట-
కొందరు శ్వేతవస్త్రాలు ధరించి ప్రార్థిస్తారు
నాకు నా రెక్కలు చాలు-
చర్చిలో గంటలు మోగించినట్టుగా
ఇక్కడ నా చిన్ని పిట్ట-పాడుతుంది.
సుప్రసిద్ధ ప్రసంగీకుడు, భగవంతుడు ప్రవచిస్తాడు-
ఆ ప్రవచనం మరీ పెద్దదేమీ కాదు
కాబట్టి రేపెన్నటికో స్వర్గానికి చేరుకునే బదులు
నేనిప్పుడే ఆ దారిన సాగిపోతాను.
అందుకనే హెరాల్డ్ బ్లూమ్ ఆమె కవిత్వాన్ని The Gospel of Emily Dickinson అన్నాడు. అయితే ఆ సువార్తలో అంతా శుభవార్తలే లేవనీ, అపారమైన నిస్పృహ, దుఃఖం, ఒంటరితనం, చెప్పలేని బాధ, వేదన లేకపోలేదని కూడా ఆయన అన్నాడు. కాని ఆ వేదన బరువు వల్ల, ఆమె ఒక తేనెటీగ గురించి రాసినా కూడా ఒక స్వర్గం నేలకు దిగినట్టే ఉంటుంది. బహుశా, ఆండాళ్, మీరా, అక్కమహాదేవిలకు ఎమిలీ డికిన్సన్ బాగా అర్థమవుతుందనిపిస్తుంది.
ఆమె రాసిన కవితలనుంచి ఎవరు ఏ సంకలనం చేసినా అది ఆమె కవిత్వానికి వారి వ్యాఖ్యానం అనే చెప్పవచ్చ్చు. ఎందుకంటే ఏ ఒక్క సంకలనం మరొక సంకలనంలా ఉండదు. తాను జీవితమంతా ఆమె కవిత్వాన్ని చదువుతూ వస్తున్నా, పాఠం చెప్తున్నాకూడా, ఇప్పటికీ ఏ కవితలు ఎంచాలంటే తాను తడబడుతూనే ఉంటానని రాసుకున్నాడు హెరాల్డ్ బ్లూమ్.
నా వరకూ నాకు ఆమె కవిత్వమంటే అపారమైన నీలిమ, ఉషోదయవేళ కొందలమీద పరుచుకునే అరుణిమ, వేసవిమైదానాల మీద ఎగురుతుండే తేనెటీగలు, తోటని నిద్రలేపే పక్షికూజితాలూనూ. నిస్సారంగానూ, నిరర్థకంగానూ జీవితం గడుస్తోందని తోచినప్పుడల్లా డికిన్ సన్ కవిత ఒక్కటి తెరిస్తే చాలు, జీవితాన్ని లోతుగా జీవించిన అనుభూతి కలుగుతుంది. ఆ ఇంగ్లీషుని అనువదించడం కష్టం. అది ధ్యానమయలోకంనుంచి, తపోమయలోకం నుంచి పలికిన మంత్రమయవాణి కాబట్టి. అయినా మీతో పంచుకోకుండా ఉండలేక, ఇవిగో, మరికొన్ని కవితలు.
1
ఆత్మ తన సాంగత్యమేదో తాను ఎంచుకుంటుంది
ఆత్మ తన సాంగత్యమేదో తాను ఎంచుకుంటుంది
ఆ మీదట తలుపులు మూసేస్తుంది
ఆ దివ్య వైశాల్యంలోకి
మరొకరు చొరబడలేరు.
కిందన గుమ్మం దగ్గర
రథచక్రాలు ఆగడం గమనిస్తుంది
తన ఎదట ఒక చక్రవర్తి సాగిలపడ్డా
ఆమె నిశ్చలత్వం చెక్కుచెదరదు.
విస్తృతప్రజానీకం నుంచి
ఆమె ఎవరో ఒకరిని ఎన్నుకుంటుంది
ఆ తర్వాత ఒక శిలలాగా
తన ధ్యానంలో తాను నిమగ్నమైపోతుంది.
2
వీథిలో వెళ్తుండగా
వీథిలో వెళ్తుండగా సగం తెరిచిన తలుపు-
క్షణకాలపు వెచ్చదనం-
వెల్లడైన ఔదార్యం, సాంగత్యం
నన్ను నేను మర్చిపోయాను.
ఇంతలోనే మూసుకున్న తలుపు
ఆ దారిన నడుస్తున్న నేను-
నన్ను రెండింతలు కోల్పోయాను
కానీ ఏదో మెలకువ గోచరించింది.
3
సౌందర్యం కోసం తపించి
సౌందర్యంకోసం తపిస్తూ మరణించాను
ఇంకా సమాధిలో కుదురుకుంటూ ఉండగానే
పక్కన మరొక సమాధిలో
సత్యం కోసం మరణించినవారొకరు తారసపడ్డారు.
నెమ్మదిగా ప్రశ్నించాడాయన ఎందుకు
వచ్చిపడ్డావిక్కడికని, సౌందర్యం కోసమన్నాను
నేనేమో సత్యం కోసం, రెండూ ఒకటే
మనమిద్దరం సోదరులం అన్నాడతడు.
ఇద్దరు రక్తసంబంధీకులు కలుసుకున్నట్టు
ఆ రాత్రంతా మేము మాట్లాడుకుంటూ గడిపేం
నెమ్మదిగా పచ్చిక మా పెదాల దాకా పెరిగి
మా పేర్లు కప్పడిపోయేదాకా.
4
తేనెటీగల ఝుంకారం
తేనెటీగల ఝుంకారం సద్దుమణిగింది
ఇంతలోనే మరొక మర్మరధ్వని
భావికాలానిది, భవిష్యవాణిలాగా
పక్కపక్కనే పెల్లుబికింది.
ప్రకృతి మందహాసం సద్దుమణిగాక
వినిపించే ఋతుచక్రమంద్రగానం.
పవిత్రగ్రంథం చివరిపుటలకి చేరుకున్నాక
మళ్ళా ఆదికాండం మొదలవుతున్నది.
5
ఆత్మ అనుభవించే దివ్యాస్తిత్వ క్షణాలు
ఆత్మ అనుభవించే దివ్యాస్తిత్వ క్షణాలు
ఆమెకి ఏకాంతంలోనే సిద్ధిస్తాయి
స్నేహితులూ, ప్రపంచమూ కూడా
చెప్పలేనంత దూరంగా జరిగిపోయాక.
లేదా ఒక్కొక్కప్పుడు ఆమెనే
సుదూర శిఖరాలు అధిరోహిస్తుంది
ఆ సర్వశక్తిమత్వం
మామూలుగా గుర్తుపట్టగలిగేది కాదు.
అక్కడ మర్త్యత్వం తుడిచిపెట్టుకుపోవడం
సాధారణం, కాని
సుందరం ఆ సాక్షాత్కారం
అనితర దుర్లభం.
అనంతత్వం గోచరించేది
ఏ కొద్దిమందికో, బాగా దగ్గరివాళ్ళకి.
అమర్త్యత్వపు
అపార మహత్తర సారాంశమది.
6
తేనెటీగ మర్మర ధ్వని
తేనెటీగ మర్మరధ్వని
నా మీద మత్తుమందు చల్లుతుంది
ఎందుకని ఎవరన్నా అడిగితే
చెప్పడంకన్న మూగబోవడం
మేలనిపిస్తుంది.
కొండమీద ఎర్రరంగు
నా మనసుని దోచుకుంటుంది
ఎందుకని ఎవరన్నా గొణిగితే
చూసుకో, దేవుడున్నాడిక్కడ
అని చెప్తానంతే.
తూర్పు తెల్లవారగానే
నా గుండె వేగంగా కొట్టుకుంటుంది
అదెట్లా అని అడిగావనుకో
నన్ను చిత్రించిన చిత్రకారుడు
మటుకే చెప్పగలడంటాను.
7
చాలాసార్లు నేను శాంతిపొందాననుకున్నాను
చాలా సార్లు నేను శాంతిపొందాననుకున్నాను
శాంతి ఇంకా సుదూరంగా ఉండగానే;
కడలి నడుమ నౌక విరిగిన మనుషులు
తీరం చేరువలోనే ఉందని తలచినట్టు.
నిజంగా రేవు పట్టణం చేరేలోపల
ఎన్ని ఊహాతీరాలు క్రమిస్తున్నట్టు
నాకై నేను చెప్పుకుంటూ ఉంటానో
విహ్వలంగా, దుర్బలంగా.
8
వాద్యకారులు పూర్తి సంగీతాన్ని వినిపించే ముందు
వాద్యకారులు పూర్తి సంగీతాన్ని వినిపించే ముందు
స్వరాలు తడుములాడుకున్నట్టుగా
అతడు నీ ఆత్మని తడిమిచూసుకుంటాడు
నిన్ను నెమ్మదిగా నిశ్చేష్టపరుస్తూపోతుంటాడు
ఆపైన వినిపించబోయే స్వరాలతో
నీ మీద సుకోమలంగా విరుచుకుపడబోయేముందు
నీ పెళుసు స్వభావాన్ని మెత్తబరుస్తుంటాడు.
అప్పుడు మరింత దగ్గరిగా, నెమ్మదిగా
నీ శ్వాస చిక్కబడటానికి సమయం చిక్కుతుంది
నీ ఆలోచనలు శాంతిస్తుంటాయి.
అప్పుడు ఒకే ఒక్క పిడుగుతో
నీ నగ్నాత్మని వక్కలు చేసేస్తాడు
ఝుంఝూమారుతాలు అరణ్యాల్ని తమ పంజాతో చుట్టబెడుతున్నప్పుడు
విశ్వమెంత నిశ్చలం.
9
మన ప్రయాణం ముందుకు సాగింది
మన ప్రయాణం ముందుకు సాగింది
రహదారి చీలిన చిత్రమైన చోటకి
మన అడుగులు చేరుకున్నాయి
ఆ తర్వాత ఉన్నదంతా అనంతం.
మన నడక వేగంలో ఒక హటాత్ విస్మయం
బరువుగా ఈడుస్తున్నవి పాదాలు.
నగరాలు ముందున్నాయి, కాని
ఈ లోపు మృతజీవుల అరణ్యాలు.
పునర్యానం అసాధ్యం
నడచివచ్చిన దారి మూసుకుపోయింది
ఎదురుగా అనంతత్వపు శ్వేతఛత్రం
ప్రతి గుమ్మందగ్గరా భగవంతుడు.
10
నాకు తెలిసిన వార్తలంటూ ఉంటే
నాకు తెలిసిన వార్తలంటూ ఉంటే
అమరత్వలోకం నుంచి
అనుదినం వినవచ్చే సందేశాలే.
నేడుగాని రేపుగాని
నేను చూడగలిగినదంతా
బహుశా అనంతత్వమే.
నేను కలుసుకోబోయే ఒకే ఒక్కడు
భగవంతుడు, ఇంతదాకా
నడచి వచ్చిన వీథి నా అస్తిత్వమే.
ఇంతకు మించిన మరోవార్త,
సుందరదృశ్యం చూడవలసినదుంటే
మీకు చెప్పకుండా ఉండను.
1-6-2021