ప్రియసన్నిధి

జర్మన్ రొమాంటిసిజం నుంచే బ్రిటిష్ రొమాంటిసిజం, ఆ తర్వాత ప్రపంచంతా సంభవించిన రొమాంటిక్ ఉద్యమాలు తలెత్తాయి. తెలుగులో కృష్ణశాస్త్రి తో మొదలైన భావకవితా ఉద్యమం వెనక షెల్లీ, కీట్సు ఉంటే, వారి వెనక వర్డ్స్ వర్త్, కోలరిడ్జి, ఆ ఇద్దరి వెనకా, జర్మన్ మహాకవులు గొథే, షీలర్ ఉన్నారు.

ఒకప్పుడు స్పెంగ్లర్ పాశ్చాత్య నాగరికతను విశ్లేషిస్తూ, ప్రాచీన కాలానికి లుక్రీషియస్, మధ్యయుగాలకి దాంతే, ఆధునిక యుగానికి గొథే ప్రతినిధులన్నాడు. ఆధునిక మానవుడు స్వభావరీత్యా Faustian. కానీ, ఆ సంక్షుభిత, సందిగ్ధ మానవుడి అంతరంగంలో ఒక lyrical మానవుడున్నాడని గొథేని చదివితేనే అర్థమవుతుంది. అందుకనే గొథే రచనలన్నీ అదృశ్యమయినా కూడా ఆయన గీతాలొక్కటీ చాలు, ఆయన్ని మహాకవిగా గుర్తించడానికి అన్నారు విమర్శకులు.

ఆ గీతాలు కొన్నింటినేనా తెలుగు చేయాలనే ఉత్సాహంతో, మొదటగా, ఇదిగో ఈ గీతం The Nearness of the Beloved (1795). దీనికి షూబర్ట్ తో సహా ఎందరో సంగీతకారులు స్వరకల్పన చేసారు:

~

The Nearness of the Beloved

I think of you, when I watch the sunlight glimmer

Over the sea:

I think of you, when the moonbeams shimmer

Over the stream.

I see you there, when the dust swirls high

On the far road,

When the traveller shivers, in deepest night,

As it narrows.

I hear you, when with a dull roaring

The waters rise.

Often in silent groves I go walking

When all is quiet.

I stay with you, however far you are,

To me you’re near!

The sun sets: soon above me are the stars.

Would you were here!

ప్రియసన్నిధి

సాగర తటమున సాయంసంధ్యాచకచ్చకితమున

చూతును నిన్నే.

వసంత కాలపు జ్యోత్స్నా రజతము కురిసే వేళల

తలపుల నువ్వే.

ధూళి ధూసరిత సుదూరపథమున ఎగసిన దుమ్మున

కాంతును నిన్నే.

గాఢరాత్రమున వణికెడు పాంథుని తడబడు పదముల

నువ్వే నువ్వే.

ఉదధికెరటములు అలసిన సమయపు దుర్బల ఘోషన

విన్నది నిన్నే.

నిశీధి వేళల నిర్జన వనమున ప్రశాంతమనమున

నిలతును నేనిట.

దగ్గరనున్నా దవ్వులనున్నా పక్కన నువ్వే

చెంతను నేనే.

తరలెను సూర్యుడు, మెరయును మింటను తారకగణములు,

నువ్వే ఉంటే!

~

నాలుగు మాత్రాగణాల్ని అయిదు గణాలకు మార్చిన మరొక వెర్షన్:

~

సంద్రాన సంజలో మెరిసేటి వెలుగులో

కనుగొంటి మనసార నిన్నే

వాసంతసరితపై కురిసేటి చంద్రికల

తలచితిని చెలువార నిన్నే

దూరాన తోవలోపైకెగయు దుమ్ములో

పొడగంటి నొకమారు నిన్నే

చిక్కనగు రాత్రిలో చలికికొంకరపోవు

పాదచారివికూడ నువ్వే

అలసిసొలసిన జలధిబలహీనఘోషలో

విన్నాను చెవులార నిన్నే

సడిలేని తోటలో జడిలేని మనసుతో

శాంతమున నిలిచితిని నేనే.

నువ్వెంత దూరాన ఉండినా, నేనుందు

నీచెంత, నా చెంత నువ్వూ.

ఇనుడస్తమించగామెరయు తారకగణము

ప్రేమార నువ్విక్కడుంటే.

28-6-2021

Leave a Reply

%d bloggers like this: