
గుత్తి జోళదరాశి చంద్రశేఖర రెడ్డిగారు మొన్న సాయంకాలం తన స్వగ్రామం జోళదరాశిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది. గత ఏడాదిగా ఆయన్ని చూడలేకపోయాననీ, ఒక్కసారేనా కలిసి ఉండి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తూనే ఉంది. ప్రతి ఏడాదీ ఆయన ఆగస్టు ఏడవ తేదీన జరిపే కృష్ణరాయ పట్టాభిషేక దినోత్సవానికైనా నేను హైదరాబాదు రాగలనా అని అడిగారుగానీ, వెళ్ళలేకపోయాను. ఇక మరి ఆ మనిషి కనిపించరనీ, ప్రేమతో, అభిమానంతో కంపించే ఆ సాహిత్యహృదయస్పందనాన్ని మరింక వినలేననీ తలచుకుంటే కష్టంగా ఉంది. బహుశా నా ఊపిరి కూడా కొంత ఆయనతో వెళ్ళిపోయింది.
చంద్రశేఖర రెడ్డిగారిని మొదటిసారి కలిసింది ఇరవయ్యేళ్ళ కిందట. బెంగలూరు విశ్వవిద్యాలయంలో ఒక ప్రసంగానికి వెళ్ళినప్పుడు పఠాభి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన్ని మొదటిసారి చూసాను. కాని, ఆయనతో అనుబంధం హఠాత్తుగా కుదురుకున్నది మాత్రం 2009 లో. శ్రీ కృష్ణదేవరాయలు పట్టాభిషేకం జరిగి ఆ ఏడాదికి ఐదువందల ఏళ్ళయిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పట్టుబట్టి ఆ ఉత్సవాలు జరిపించారు. అందులో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆముక్తమాల్యద మీద మాట్లాడమని నా మిత్రుడు కవితా ప్రసాద్ నీ, నన్నూ అనుమాండ్ల భూమయ్య ఆహ్వానించారు. ఆ రోజు మేము సెక్రటేరియట్ లో ఏదో ఆఫీసు పని మీద చాలాసేపు ఉండిపోవలసి వచ్చింది. ఎంతమాత్రం సాహిత్య సుగంధం సోకని ఆ ఎండవేళ అలసటగా ఆ విశ్వవిద్యాలయంలో శ్రీకృష్ణదేవరాయల గురించి తలుచుకునే మనఃస్థితి ఎంతమాత్రం కుదరకుండానే నేనేదో మాట్లాడేను. అప్పటికి కొన్నాళ్ళుగా నా మనసులో ఉన్న ఊహాలు. ఆముక్తమాల్యద లో దాసరి కథ రాయలవారి ఆత్మకథనాత్మక నివేదన అని నాకొక ఊహ. అందులో రాక్షసుణ్ణి ఆయన వర్ణించిన తీరు యుద్ధరాక్షసిని వర్ణించినట్టుగానే అనిపిస్తుందనీ, తాను ప్రాణప్రదంగా భావిస్తున్న విష్ణుకీర్తన, అంటే తన కావ్యరచన, పూర్తి కాకుండానే ఆ యుద్ధ రాక్షసి తననెక్కడ కబళిస్తుందోనన్న వ్యగ్రత ఆయన అనుభవించాడనీ, అదంతా ఆ కథలో కనిపిస్తుందనీ అన్నాను. ఆ రోజు శ్రోతల్లో నా ఎదట కూచున్న చంద్రశేఖర రెడ్డిగారు ఆ మాటలు వింటూనే నాకు జీవితకాల స్నేహితులుగా మారిపోయేరు. అది మొదలు, ఎప్పుడు ఏ మాత్రం సమయం చిక్కినా ఆయన నన్ను కలుసుకోవాలనీ, ఏదో ఒక అంశం మీద నా మాటలు వింటూ వుండాలనీ పరితపించిపోయేవారు.
అటువంటి సహృదయ మిత్రుడు ఒక మనిషికి ఒక జీవితకాలంలో ఒకరు కూడా దొరకడం అరుదు. కాని చంద్రశేఖరరెడ్డిగారి పాండిత్యం, విద్వత్తు, సాహిత్య కృషి, అద్యయనాలతో పోలిస్తే నేనాయన ముందు ఎంత అల్పుణ్ణో నాకు స్పష్టంగా తెలుసు. అయినా ఆ ప్రేమ,ఆ సహృదయత, ఆ అభిమానధనం చూపించే ప్రలోభాన్ని నిలవరించుకోవటం కష్టం.
చంద్రశేఖరరెడ్డిగారు స్వయంగా కవి, విమర్శకులు, అనువాదకులు. ముఖ్యంగా తెలుగు కన్నడ సాహిత్యాల మధ్య ఆయనొక సేతువు. కన్నడ వీరశైవ కవుల వచనాల్ని ‘వచనములు’ పేరిట కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా అనువదింపచేసిన ప్రాజెక్టుకి ఆయనే సూత్రధారి. అందులో చాలా వచనాలకు ఆయన అనువాదకుడు కూడా. అవి కాక, సర్వజ్నుడి వచనాల్ని కూడా ఆయన తెలుగు చేసి ఆ పుస్తకాన్ని పరిచయం చేసే బాధ్యత కూడా నాకే అప్పగించారు. బహుశా, శ్రీకృష్ణదేవరాయల తర్వాత తెలుగు, కన్నడ కవిత్వాల్ని రెండు బాహువుల్తోనూ పొదువుకున్న రసజ్ఞుడు ఆయనే అనిపిస్తుంది నాకు.
మియాపూర్ లో వాళ్ళింటి ముంగిలో శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడమే కాక, తన ఇంట్లో ఒక చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసారు. ప్రతి ఏడాదీ ఆగష్టు ఏడవ తేదీన కృష్ణరాయల పేరిట ఒక సాహిత్య గోష్టి ఏర్పాటు చేసేవారు. అట్లాంటి సదస్సుల్లో నేను హాజరయిన చివరి సదస్సులో ఆముక్తమాల్యదలో వర్ష ఋతు వర్ణన గురించి నాతో ప్రత్యేకంగా ప్రసంగం ఏర్పాటు చేసారు. ఆ రోజు ఎనిమిది భాషలకు చెందిన కవులకు సత్కారం చేసారు. దిగ్దంతుల్లాంటి కవి పండితులున్న ఆ సభలో నన్ను ముఖ్యవక్తగా పిలవడం ఆయనకి నా పట్ల ప్రేమ వల్లనే అన్నది నేను మర్చిపోలేను. మరొకసారి తెలుగు విశ్వవిద్యాలయం వారు శ్రీకృష్ణదేవరాయల మీద మూడురోజుల సదస్సు నిర్వహిస్తున్నారని తెలిసి, అందులో మీకు ఆహ్వానం వచ్చిందా అనడిగారు. లేదన్నాను. వెంటనే ఆయన పోయి ఆ నిర్వాహకులతో ఏం మాట్లాడేరో తెలీదుగాని, ఏదో ఒక అంశం మీద మాట్లాడమని నాకు కూడా ఆహ్వానం వచ్చింది. దేని మీద మాట్లాడాలని అడిగాను. ‘మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఆ దాసరి కథ గురించే చెప్పమంటాను’ అన్నారాయన చిరునవ్వుతో. ‘అది కాదు, మరొకటేమన్నా సూచించండి’ అన్నాను. ‘ఇంతదాకా ఎవరూ మాట్లాడని అంశం మీద మాట్లాడండి’ అన్నారు. ఆ ఆహ్వాన కరపత్రం చూసాను. శ్రీకృష్ణదేవరాయల రాజనీతి గురించి ఎవరూ మాట్లాడుతున్నట్టు కనబడలేదు. ‘ఆముక్తమాల్యదలో రాజనీతి, విశిష్టాద్వైత ప్రభావం’ అనే అంశం గురించి మాట్లాడేను. ఆ ప్రసంగం గురించి ఆ రోజు ఆ సభలో ఉన్నవారెవరూ మాట్లాడలేదు గాని, చంద్రశేఖరెడ్డిగారు మాత్రం మరొకసారి నిలువెల్లా పరవశించిపోతో కనబడ్డారు.
ప్రేమ మనిషిని అంధుణ్ణి చేస్తుంది అనే మాట నిజం. ఆయనకి నా పట్ల ఉన్న ప్రేమ వల్ల ప్రతి ఒక్కదాని మీదా నేను మాట్లాడాలని కోరుకునేవారు. మరొకసారి కువెంపు శతజయంతి వేడుకల్లో కువెంపు భావకవిత్వం మీద నాతో మాట్లాడించడం అటువంటిదే. జోళదరాశి దొడ్డన గౌడ గారి పైన తాను రాసిన ‘బసవడు-శరణుడు’ పుస్తకానికి నాతో ముందు మాట రాయించడం అర్థం చేసుకోగలను. కాని తన గురువుగారు కవిభూషణ కప్పగల్లు సంజీవమూర్తిరావు గారు రాసిన ‘భగవద్గీతా సారం’ పుస్తకానికి నేను ముందు మాట రాయాలని ఆయన కనీసం రెండేళ్ళపాటు వేచి ఉండటం మాత్రం నేను ఊహించలేనిది. భగవద్గీత అనుష్ఠించవలసిందే తప్ప, ప్రసంగించవలసింది కాదని మా మాష్టారు చెప్పారనీ, నేను గీతకి ముందు మాట రాసే యోగ్యత లేనివాణ్ణనీ, నన్ను వదిలిపెట్టమని ఆయన్ని ఎన్నోసార్లు వేడుకున్నాను. ఎన్నో సార్లు ఆయన ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా ఉండిపోయాను. ఒకటి రెండు సార్లు విసుక్కున్నాను కూడా. కాని ఆయన పట్టువిడవలేదు. తన గురువుగారి పుస్తకంలో నా పేరు ఉండాలన్నది తన కోరిక అనీ, దాన్ని ఎట్లాగేనా తీర్చమనీ అడుగుతూ, చివరికి అనుకున్నది సాధించేరు.
చంద్రశేఖర రెడ్డిగారిది బళ్ళారి జిల్లాలో జోళదరాశి గ్రామం. పదహారణాల తెలుగు గ్రామం. కాని రాష్ట్రవిభజనలో ఆ ప్రజల మనోగతానికి భిన్నంగా ఆ గ్రామం పరాయి భాషా రాష్ట్రంలో కలిసిపోవలసి వచ్చింది. చంద్రశేఖరరెడ్డిగారి తండ్రి నారాయణరెడ్డిగారు పూర్తి తెలుగు భాషాభిమాని, భాషోద్యమకారుడు. అందుకని తన తండ్రిని స్మరిస్తూ ప్రతి ఏటా ఆయన తన స్వగ్రామంలో తెలుగు, కన్నడ, మరాఠీ భాషావేత్తలకు సత్కారం చేస్తూ వచ్చేరు. అందులో భాగంగా ఒక ఏడాది నాకు కూడా ఆ సత్కారాన్ని అందచేసారు. ఆ రోజు నాతో పాటు కుం.వీరభద్రప్పగారు, బొల్లి లక్ష్మీనారాయణ గారూ కూడా ఉన్నారు. సాహిత్య అకాదెమీ పురస్కార సమ్మానితులూ, కన్నడ, మరాఠీ సాహిత్యాల్లో సుప్రసిద్ధులూ అయిన వారి పక్కన నిలబడటానికి కూడా నాకు అర్హతలేదు. అయినా చంద్రశేఖరరెడ్డి గారి ప్రేమాభిమానాలు అటువంటివి.
ఆ పర్యటనలో భాగంగా ఆయన జోళదరాశిలో దొడ్డన గౌడ గారి ఇంటికి తీసుకువెళ్ళి చూపించారు. హంపీ తీసుకువెళ్ళి ఆ వైభవాన్ని దగ్గరుండి స్మరణ చేయించారు. శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన వారసులు అనెగొంది వాస్తవ్యులు ఇప్పటి శ్రీకృష్ణదేవరాయల వారిని కూడా పరిచయం చేసారు.
చూడండి, చంద్రశేఖరరెడ్డిగారిని తలుచుకుంటూ ఉంటే, శ్రీకృష్ణదేవరాయలు అనే పేరు ఎన్ని సార్లు పలుకుతూ ఉన్నానో. రాయలవారు చంద్రశేఖరరెడ్డిగారి జీవితంతో అంతగా పెనవేసుకుపోయారు.
చంద్రశేఖరరెడ్డిగారి మిత్రబృందం ఒక సజ్జన గోష్టి. ఆయనవల్ల నాకు వేదవతిగారు, కోడూరి పుల్లారెడ్డి, కోడూరి ప్రభాకర రెడ్డి వంటి రసజ్ఞులు పరిచయమయ్యారు. వారి వారి ఇళ్ళల్లో జరిగిన వివిధ సాహిత్య గోష్టులకి కూడా నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి నాతో ప్రసంగాలు చేయించడంలో ఆయనకి గొప్ప సంతోషం.
చివరి రోజుల్లో పార్కిన్ సన్ ఆయన్ని నిలవనివ్వని అశాంతికి గురి చేస్తూ ఉంటే, తొందరలో వెళ్ళిపోవాలని ఉంది అన్నారొక సారి. ఆ మాట నాకు చాలా కష్టంగా తోచింది. సాహిత్యాన్ని ప్రేమించి, ప్రాణప్రదంగా జీవించే ఇట్లాంటి మనుషులకి నివాసయోగ్యం కాకపోతే ఈ ప్రపంచానికి అర్థం ఏమిటి?
మొన్న తన స్వగ్రామంలో తన ఇంట్లో జరిగిన ఒక పెళ్ళిసందట్లో ఆయన ఎంతో సంతోషంతో కలయదిరిగారనీ, సాయంకాలం, తన కుమారుడు దగ్గరుండి స్నానం చేయించాక, కొద్దిసేపు విశ్రాంతిగా పడుకున్నారనీ, ఆ చిన్న కునుకులోనే అనాయాసంగా ఈ లోకాన్ని వదిలిపెట్టారనీ విన్నాను. జోళదరాశి చంద్రశేఖరరెడ్డి గారు పూర్ణజీవి, ధన్యులు.
2-1-2021