
అకిరా కురొసవా తీసిన చిత్రాల్లో రెండింటికి బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టి స్ట్యూట్ జాబితాలో చోటు దొరికింది. Seven Samurai , Roshomon. కాని నాకు Dersu Uzala చూడాలనిపించింది. ఎందుకంటే కొన్నేళ్ళ కిందట ఆచార్య రఘురామరాజు నాకు ఆ సినిమా సిడి ఇచ్చారుగాని నేను చూడలేకపోయాను. ఇన్నాళ్ళకు ఆ సినిమా చూడగలిగాను.
Dersu Uzala (1975) సోవియెట్ రష్యా, జపాన్ సంయుక్తంగా నిర్మించిన సినిమా. జపనీస్ భాష కాని మరొక భాషలో కురొసొవా తీసిన ఒకే ఒక్క సినిమా. అలాగే 70 ఎం ఎం లో అతడు తీసిన ఒకే ఒక్క సినిమా అట కూడా. వ్లదిమీర్ అర్సెన్యేవ్ అనే ఒక పరిశీలకుడు, పర్యాటకుడు రష్యన్ దూరప్రాచ్యంలోని సికోటే అలీన్ అనే భూభాగాన్ని పరిశోధించినప్పటి తన అనుభవాల్ని 1923 లో పుస్తకరూపంలో ప్రచురించాడట. ఆ పుస్తకం పేరు కూడా Dersu Uzala నే. అది ఒక నామవాచకం. తన పర్యటనలో తనకి పరిచయమైన ఒక స్థానికుడి పేరు అది. చీనా, రష్యా సరిహద్దుల్లో నివసించే గోల్డులనే కొండజాతికి చెందిన ఒక స్థానికుడి పేరు అది. అతడు అర్సెన్యేవ్ పరిశోధనలకి సహకరించడమే కాకుండా రెండు మూడు సార్లు అతణ్ణి ప్రాణాపాయం నుంచి తప్పించేడు కూడా. ఈ సినిమాకి కూడా అదే ఇతివృత్తం.
రష్యన్ నేలకి సంబంధించిన కథ కాబట్టేమో ఈ సినిమా కురొసొవా తక్కిన సినిమాల కన్నా భిన్నంగా ఉండటమే కాకుండా, ఇక్కడ కథ చెప్పడానికి కురొసొవా ప్రత్యేకమైన శైలిని వాడాడనిపించింది. ఇంకా చెప్పాలంటే ఒక టాల్ స్టాయి తరహా ఇతివృత్తాన్ని చెహోవ్ తరహా కథనంతో మేళవించాడనిపించింది. కథాగమనంలోని ఉద్ధృతిలోగాని, అసంశోధిత ప్రాకృతిక సీమల వైశాల్యాన్ని పట్టుకోవడంలోగాని, అగాధమూ, అసీమితమూ అయిన మానవప్రకృతి పట్ల మన కుతూహలాన్ని రేకెత్తించడంలోగాని, సన్నివేశాల్ని దృశ్యమానం చెయ్యడంలోనూ, ప్రతి ఒక్క చిన్న వివరాన్నీ నిర్దుష్టంగా మనముందుంచుతూ, మనం వాస్తవాన్నే చూస్తున్నామన్న భ్రమ కలిగించడంలోగాని టాల్ స్టాయి సిద్ధ హస్తుడు. కురొసొవా దాదాపుగా టాల్ స్టాయి ఎత్తులకి చేరుకుంటున్నాడా అనిపించేంతగా చాలా దృశ్యాల్నీ, సంఘటనల్నీ చిత్రించాడు.
కాని చిత్రంలోని నిజమైన మహిమ ఆ కళాకౌశలంలోనూ, భ్రమగొల్పేటంత నిర్దోషవాస్తవికతలోనూ లేదు. అది చెప్పవలసిన దాన్ని మృదువుగా, కొన్నిసార్లు గుసగుసగా మాత్రమే చెప్పడానికి సంకోచించని understatement లో ఉంది. తాను చెప్తున్నదాని కథగా చెప్పకపోతే ప్రేక్షకుడు తన వెంట నడవడేమోనన్న భయాన్ని వదిలిపెట్టి, తాను పుస్తకంలో చదివినదాన్ని ఒక దృశ్యంగా తన కళ్ళముందు మళ్ళా సాక్షాత్కరింపచేసుకోవడానికి నిజాయితీగా ఓపిక పట్టడంలో ఉంది. ఇది సరిగ్గా చెహోవ్ లక్షణం. ఎందుకంటే సినిమా చూడటం పూర్తయ్యాక, దాదాపుగా ఒక డాక్యుమెంటరీ తరహా చిత్రీకరణని మనం పూర్తిగా చూశాక, నువ్వేమి చూసావు, ఆ కథ ఏమిటి అని అడిగితే మనమేదో ఒకటి చెప్పవచ్చుగాని, మన సమాధానం మనకే తృప్తినివ్వదు.
ఒక కథ విన్నాక ఆ కథా సారాంశం ఏమిటి అనడిగితే ఒకటిరెండు వాక్యాల్లో చెప్పగలిగితే దాన్ని మనం ఆ కథ తాలూకు plot అంటాం. భిన్న సంస్కృతులకు చెందిన ఇద్దరు మానవుల మధ్య భాషలకూ, ప్రాంతాలకూ, నాగరికతలకూ అతీతంగా వికసించిన ఒక ఆత్మీయత గురించిన సినిమా ఇది మనం చెప్పవచ్చు. కాని ఆ వాక్యం ఆ సినిమాని ఏ విధంగానూ పట్టివ్వలేదు. ఒక మంచి కథకి ఉండే ఆదిమధ్యాంతాలు ఆ సినిమాకి కూడా లేకపోలేదు. కాని ఆ సినిమా మనకి కలిగించే అనుభవాన్ని ఒక కథకి కుదించలేం. ఈ రహస్యం చెహోవ్ కి తెలుసు. అందుకనే ఆయన తన కథలకి plot ఉండదని చెప్పుకున్నాడు. ఉదాహరణకి, నీ చిన్నప్పటి స్నేహితుడో, స్నేహితురాలో చాలా కాలం తర్వాత ఒక వారాంతం నీ ఇంటికి వచ్చారనుకుందాం. ఆ రెండు రోజులూ మీరిద్దరూ కలిసి ఏదో ఒక ఊరికో లేదా ఏదో చూడదగ్గ స్థలానికో వెళ్ళారు. ఎక్కడెక్కడో గడిపారు. ఎప్పటెప్పటి జ్ఞాపకాలో గుర్తుచేసుకున్నారు. ఎవరెవరినో పలకరించారు. రెండు రోజుల తర్వాత మళ్ళా మీ ఇంటికి వచ్చేసి ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రెండు రోజుల జీవితానుభవాన్నీ ఒక ప్లాటుగా కుదించడమెట్లాగు? ఇద్దరు స్నేహితులు తమ ప్రస్తుతం నుంచి గతంలోకి చేసిన పునఃప్రయాణం అని అంటే సరిపోతుందా? లేదు. మీరిద్దరూ గడిపిన ఆ రెండురోజుల్లో ప్రతి ఒక్క క్షణం మీకెంతో విలువైనవి. ఏ ఒక్క క్షణాన్నీ మీరు మరవలేరు. ఏ ఒక్కక్షణాన్ని పక్కన పెట్టినా ఆ అనుభవానికి చెప్పలేనంత వెలితి ఏర్పడుతుంది. దాన్ని పూడ్చలేమనిపిస్తుంది.
చెహోవ్ దృష్టిలో కథ ఒక సంగీత కృతిలాంటిది. ఆ కృతి సారాంశాన్ని గాయకుడి ప్రతి ఒక్క గమకంలోనూ మనం అనుభూతి చెందవలసి ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఆ కథని మనం ప్రతి ఒక్క దృశ్యంలోనూ చూడవలసి ఉంటుంది. మామూలుగా మనం మానవసంబంధాలు అంటామే, అవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఇద్దరు మనుషుల మధ్య ఆత్మీయత కంటికి కనిపించే విశేషంకాదు. అది వారి కలయికల్లోనూ, విడిపోవడాల్లోనూ, వారు కలిసి నవ్వుకున్న నవ్వుల్లోనూ, వారు ఆపుకోలేకపోయిన కన్నీళ్ళలోనూ మటుకే చూడగలుగుతాం. అందులోనూ ఆ ఇద్దరిలోనూ ఒకరు మరొకరికి ప్రాణదానం చేసిన వ్యక్తి అయి ఉంటే? తన జీవితాన్ని కాపాడిన ఆ మనిషి పట్ల ఆ రెండవ మనిషి తన పూర్తి ఆత్మీయతను ఎప్పటికీ పూర్తిగా ప్రకటించలేడు. ఆ సంఘటన జరిగిన తరువాత వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా ఆ కలయికలో పార్థివత్వం కొంతా, అపార్థివత్వం కొంతా వెలుగునీడల్లాగా దోబూచులాడుతూనే ఉంటాయి. ఆ ఇంద్రజాలమంతటినీ కురుసొవా ఈ సినిమాలో పట్టుకోగలిగాడు.
ముఖ్యంగా తమ అన్వేషణలో భాగంగా అర్సెన్యేవ్, దెర్సు ఉజాలా టండ్రాల అంచుల్లో ఒక గడ్డకట్టిన సరోవరాన్ని పరిశీలిస్తో ఉండగా, తీండ్రించిన మంచుతుపానులో తాము నడిచి వచ్చిన దారి గుర్తులు చెరిగిపోయినప్పుడు, ఆ రాత్రి ఏమి చెయ్యాలో, ఎలా గడపాలో తాము ఆ రాత్రిని దాటి బతుకుతారో లేదో కూడా తెలియని ఆ అగమ్యమనఃస్థితిలో దెర్సు తన ఆదిమానవుడి పరిజ్ఞానంతో అక్కడ గడ్డికోసి కప్పువేసి అర్సెన్యేవ్ ని కాపాడిన దృశ్యం ఆ చిత్రానికి సహజంగానే పతాకసన్నివేశం. కాని ఆ తర్వాత మరొకసారి ఆ బృందమంతా ఒక ప్రవాహమ్మీద పోతున్నప్పుడు దెర్సు మరొకసారి అర్సెన్యేవ్ ని కాపాడతాడు. కాని తాను ప్రమాదంలో చిక్కుకుంటాడు. అప్పుడు అర్సెన్యేవ్ బృందమంతా కలిసి దెర్సుని కాపాడతారు. కాని ఈ రెండు సన్నివేశాలూ ఒకదానికొకటి సమానం కావు. మొదటి సన్నివేశంలో అర్సెన్యేవ్ ను దెర్సు కాపాడినప్పుడు అది భగవంతుడికో లేదా మానవాకృతి ధరించిన ప్రకృతికో మాత్రమే స్ఫురించగల ఊహ, సాధ్యం కాగల ప్రయత్నం అనిపిస్తుంది. రెండో సన్నివేశం మామూలుగా ఏ మానవబృందానికైనా సాధ్యమయ్యే పనినే అనిపిస్తుంది. ఇది నిజానికి ఇద్దరు మనుషుల మధ్య కథగా కనిపిస్తున్నప్పటికీ, సభ్యప్రపంచానికి ఆవల ఉన్న ఆ మనిషి, నాగరిక ప్రపంచానికి చెందిన విద్యాధిక మానవుడికన్నా చాలా ఎత్తులోనూ, చాలా ప్రజ్ఞావంతుడిగానూ కనిపించేటట్టు మనకి స్ఫురింపచెయ్యడంలోనే ఈ సినిమా విశేషమంతా ఉంది.
Dersu Uzala చూడటం ఒక అనుభవం. అది టాల్ స్టాయి రాసిన Master and Man (1895) కథ చదవడం లాంటిది. చెహోవ్ రాసిన Steppe (1888) చదవడం లాంటిది. అది ఇద్దరు నిండైన మానవులతో మనం కూడా కలిసి ప్రయాణించడం లాంటిది. తన జీవితం పట్లా తన ప్రాణం పట్లా తనకుండే ఇష్టాన్ని ఒక మనిషి అంతే ఇష్టంతో, ఇంకా చెప్పాలంటే అంతకన్నా మించిన ఇష్టంతో, తన తోటి మనిషి జీవితం పట్లా, ప్రాణం పట్లా చూపిస్తో ఉంటే విభ్రాంతనేత్రాలతోనూ, వినమిత శిరసుతోనూ చూడటం లాంటిది. అంతిమంగా ఏ కళాకారుడైనా రాయవలసిందీ, చిత్రించవలసిందీ, మతానికీ, ప్రాంతానికీ, భాషలకీ, సరిహద్దులకీ అతీతంగా మనిషికీ, మనిషికీ మధ్య వికసించవలసిన స్నేహమే అని తెలియడం అది. ఒక నరుడికీ, ఒక వానరుడికీ మధ్య తటస్థించిన స్నేహాన్ని ఆదికవి ఎందుకంత ఐతిహాసికంగా గానం చేసాడో మనకి బోధపడక తప్పని సమయమది.
20-9-2020