పల్లెటూరి కవిగాయకుడు

నా చిన్నప్పుడు తాడికొండ స్కూల్లో నేను చదివిన పుస్తకాల్లో నా జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేసిన రెండు పుస్తకాల గురించి నేను తరచూ చెప్తూనే ఉన్నాను. అందులో ఒకటి వ్యంకటేశ మాడ్గూళ్కర్ రాసిన సుప్రసిద్ధ మరాఠీ నవల ‘బనగర్ వాడి’, మరొకటి, తెలుగు పాఠకులకి అంతగా పరిచయం లేని బెంగాలీ నవల, తారా శంకర్ బెనర్జీ రచన ‘కవి’. ఇద్దరూ జ్ఞానపీఠ పురస్కారం పొందినవాళ్ళే. ఆ రెండు నవలల్లోనూ బనగర్ వాడి తర్వాత రోజుల్లో నా సామాజిక కార్యక్షేత్రాన్ని నిర్వచించిందని నేనెన్నో సార్లు తలుచుకుంటూ ఉన్నాను. కాని, అంతకన్నా కూడా నన్ను గాఢంగా ప్రభావితం చేసిన పుస్తకం, నా ఆంతరంగిక కాల్పనిక ప్రపంచాన్ని సంపద్వతం చేసిన పుస్తకం ‘కవి.’

నేనా పుస్తకం తాడికొండ వెళ్ళిన కొత్తలోనే అంటే బహుశా 1973 లోనే చదివి ఉంటాను. అంటే నా పది, పదకొండేళ్ళ వయసులో. అంత లేతవయసులో అటువంటి రచన చదివి ఉండటం, పూర్వకాలపు గురుకులాల్లో ఎనిమిదితొమ్మిదేళ్ళ వయసులో, ఉపనయనం పూర్తికాగానే, మేఘసందేశ కావ్యం చదువుకోవడం లాంటిది. అంత లేత వయసులో మేఘసందేశ కావ్యం చదువుకున్నవాళ్ళు కవులు కాకుండా ఉండటం అరుదు అని రాసాడు శేషేంద్ర శర్మ ఒకచోట. ఎందుకంటే ఆ వయసులో మేఘసందేశం చదువుకున్నవాళ్ళల్లో ఆయన కూడా ఒకడు కాబట్టి. నాకు అంత అదృష్టం లేకపోయింది. కాని సరస్వతిదేవి నాతో మేఘసందేశానికి బదులు కవి నవల చదివించింది.

ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత, అంటే దాదాపు యాభై ఏళ్ళ తరువాత, ఆ నవల ని మరొకసారి చదివాను. ఈ పుస్తకం నా చేతుల్లోకి చాలాకాలం కిందటనే వచ్చినప్పటికీ, మరొకసారి తెరిచే సాహసం చేయలేకపోయాను. నా పసితనంలో ఆ నవల నా మనసులో గీసిన ఆ రసరమ్య చిత్రం ఎక్కడ చెరిగిపోతుందో, ఇప్పుడు ఆ రచన చదివినప్పుడు అది మామూలు పుస్తకమే అనే భావన కలుగుతుందేమో అనే సంకోచంతో ఆ పుస్తకం మొదటి పేజీ కూడా తెరవలేకపోయాను. కానీ, ఇక ఉండబట్టలేక, ఇప్పుడు మరొకసారి ఆ పుస్తకం తెరవగానే ఎక్కడా ఆపలేకపోయాను. చాలా వాక్యాలు నా చిన్నప్పుడు చదివిన జ్ఞాపకంలో ఇంకా సజీవంగానే ఉన్నాయని గుర్తుపడుతూ ఆ చిన్నప్పటి మనోజ్ఞ చిత్రాన్ని మరొకసారి పోల్చుకుంటూ ఆ నవల మొత్తం చదివేసాను.

కాని ఆ పసితనాన నాకు తెలియని రెండు విశేషాలు ఇప్పుడు నాకు తెలిసి నాకు మరింత సంతోషం కలిగింది. మొదటిది, ఆ నవల్లో కథానాయకుడు ఎరుకల తెగకు చెందిన వాడు. బందోపాధ్యాయ ఆ నవల రాసేనాటికి, అంటే 1941 నాటికి, ఎరుకల తెగ వంగదేశంలోనూ, ఆంధ్ర దేశంలోనూ కూడా నేరస్థ తెగల జాబితాలో చేరిన తెగ. అటువంటి తెగకు చెందిన ఒక యువకుడి జీవితాన్ని తీసుకుని తారాశంకరుడు ఏకంగా ఒక నవల రాసాడంటే నాకిప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకుగానీ, అటువంటి తెగకు చెందిన ఒక యువకుడు కవిగా, రచయితగా మారి తన ఆత్మకథను తాను చెప్పుకోలేకపోయాడు. తారాశంకర్ బందోపాధ్యాయ ‘కవి’ నుంచి లక్ష్మణ్ గయక్వాడ్ ‘ఉచల్యా’ దాకా భారతదేశంలో గిరిజన సమూహాలు చేసిన ప్రయాణమంతా ఉందని చెప్పవచ్చు. తెలుగులో అటువంటి తెగల గురించి కేశవరెడ్డి రాసిన ‘చివరి గుడిసె’ తప్ప చెప్పుకోదగ్గ రచన ఏదీ ఇప్పటిదాకా రానే లేదు. కాని కేశవరెడ్డి కథాంశం వేరు. ఒక యానాదినో లేదా ఒక ఎరుకల యువకుడినో ఒక కవిగా చిత్రించే అదృష్టం తెలుగులో ఇప్పటిదాకా ఏ రచయితకీ కలగనే లేదు.

ఇక రెండవది, కవి నవల వంగదేశంలోని బీర్ భూమ్ ప్రాంతానికి చెందిన రచన కావడం. నేనిప్పటిదాకా వంగదేశంలో అడుగుపెట్టలేదు. కానీ, ఎప్పుడేనా బెంగాల్లో పర్యటించవలసి వస్తే, అన్నిటికన్నా ముందు బీర్ భూమ్ జిల్లాలో తిరుగాడాలని ఉంది. ఎందుకంటే అది కవిగాయకుల జిల్లా. పదకర్తల భూమి. పద్మావతీ చరణచారణ చక్రవర్తి జయదేవుడు పుట్టిన కెందుబిల్వం బీర్ భూమ్ లోనే ఉంది. బెంగాలీ భక్తికవి, పదకర్త చండీదాస్ బీర్ భూమ్ కి చెందినవాడే. ఇక ఆధునిక భక్తి కవి, వాగ్గేయకారుడు టాగోర్ నెలకొల్పిన శాంతినికేతనం బీర్ భూమ్ జిల్లాలోని బోల్పూర్ ప్రాంతంలోనే ఉంది. ఆ ప్రాంతంలో సంచరించే బావుల్ గాయకుల నుంచే తాను తన జీవనతత్త్వశాస్త్రాన్ని రూపొందించుకున్నానని టాగోర్ చెప్పినమాటలు మనకి తెలుసు. ఇప్పుడు తారాశంకర్ బెనర్జీ, ఆయన నవలా కూడా బీర్ భూమ్ ప్రాంతానికి చెందినవే అని తెలియడం నాకు చెప్పలేని పులకింత కలిగించింది.

నా చిన్నతనాన ఆ పుస్తకం ద్వారా ఆ వంగదేశపు పదకర్తలందరూ నా హృదయాన్ని తాకారనీ, నాలోని కవిని నిద్రలేపారనీ నాకిప్పుడు బోధపడుతున్నది. కవి నవల్లో కథానాయకుడు నితాయీ ఒకప్పుడు తానున్నచోటునుంచి వెళ్ళిపోడానికి నిశ్చయించుకుని, తనకున్నవన్నీ వదిలిపెట్టెయ్యడానికి సిద్ధపడికూడా, తాను సేకరించి దాచుకున్న పదకర్తల సాహిత్యాన్ని వదిలిపెట్టిపోలేకపోతాడు. ఎంతమంది పదకర్తలు! ఎంత సుసంపన్న ప్రజా సాహిత్యం!

కవి నవల్లో అప్పుడు తెలియందీ, ఇప్పుడు బాగా అసంతృప్తి కలిగించిందీ ఏదన్నా ఉంటే, ఆ పేలవమైన అనువాదం మాత్రమే. పిలకా గణపతిశాస్త్రి తారాశంకరుడి కవిత్వానికి చాలా అన్యాయం చేసాడు. నిజానికి ఈ పుస్తకం సూరంపూడి సీతారామో, మద్దిపట్ల సూరినో, కనీసం అబ్బూరి రామకృష్ణారావునో అనువదించి ఉండవలసిన రచన.

ఆ కవిత్వం, ఆ వంగదేశపు జానపద కవిగాయకుల కీర్తనల్లోని ఆ మాధుర్యమేమిటో కవి సినిమా చూస్తేనేగాని నాకు ఆనవాలు దొరకలేదు. కాని, నా పసితనాన, ఆ నవల చదివినప్పుడు బహుశా నేను ఆ మాటల్నీ, ఆ పాటల్నీ దాటిన మహనీయ మనోజ్ఞలోకాన్నొకదాన్ని నాకై నేను నిర్మించుకున్నట్టున్నాను. అది అనువాదాలకు అతీతమైన ప్రపంచం. ఆ రైలు స్టేషనూ, ఆ గుల్ మొహర్ చెట్టూ, ఆ రైలుపట్టాలు ఒకదానితో ఒకటి కలిసిపోయే దిగంత రేఖమీంచి నెత్తిన పాలబిందె పెట్టుకుని నడిచివచ్చే చిన్నరాణీ నా హృదయంలో ఇప్పటికీ చెక్కుచెదరకుండానే ఉన్నారు. ఆ పసితనాన ఆ పల్లెటూరి కవిగాయకుడితో నేనెంతగా మమేకపోయానో ఇప్పుడు అర్థమవుతోంది.

ఇప్పుడు ఆ నవల ని మీకు అందచేయలేను గాని, ఆ సినిమా మాత్రం అందుబాటులో ఉంది. చూడండి. చిన్నచిన్న మార్పులు చేసినప్పటికీ ఆ సినిమా దాదాపుగా మూలవిధేయంగానే ఉంది. ఒక మనిషి కవి కావాలని కోరుకోవడంలోని సంఘర్షణ ఎటువంటిదో తెలియజేస్తున్నది.

3-2-2021

Leave a Reply

%d bloggers like this: