నివ్వెర పరిచిన పదం

Reading Time: 2 minutes

సారంగపాణి రాసిన పదాల్లో జాతీయ పదాల పేరిట వర్గీకరించినవి ప్రధానంగా ఆనాటి సామాజిక స్థితిగతులకు అద్దం పడతాయి. మరీ ముఖ్యంగా రాయలసీమను కలచివేసిన కరువుకాటకాల యథార్థ చిత్రం ప్రజల భాషలో ఆ పదాల్లో చిత్రణకి వచ్చింది. కరువులో తినడానికి తిండిలేని ఒక రైతు కుటుంబం ఇంటికి ఒక యాచకుడు భిక్షకోసం వచ్చినప్పుడు అతడికి ఏమీ ఇవ్వలేకపోతున్న ఆ తల్లి వేదన చూడండి:

~

కిన్నరవాస్తా నిలబడుకుంటె-

గింజలేద్డ దైతం యాడ

అన్ని లేవె, యెందొల్లడ బెట్టిన

అగిత్తెమ తెల్లొరకతల్కె

వరచాలేమంటని యెగబెట్టెనొ-

దరయీ నిక్కెరం శేశిరి నరకలు

శరవల్లో శాపలు శారేశిరి-

శాలల్లో కర్ర బయిటి కెల్లలే

కొలువులంట సూస్తె అబము సుబములె-

కొంపలిడిసి యెల్లలేకుండడమే

చలిగి వొగిరికై నంతపాతలె-

సారశములే సిగ్గుపాట్లు జెప్పితె

ఉప్పుగల్లదె ముత్తికేభలు పిరం-

వుపాశమున్నా ఏమంటడగరు

యిప్పుడే చంతలో యెగబగలైతె-

యీ కాపిరమిట్లా ఎల్ దోయను

మూనాలయ శంగిటేశి ఏపికి-

ముశిలిది లెయిలా సంటిద్దిగలా

పానంలే గొడ్ల సూన్నశింగేం-

పందెన్నో గూటి గూటి బొబ్బొభో

ఈడ యెల్లుకుంటేగా దరమం-

ఇన్నాలల్లె పోసపోతె కులుకుదు

నాడిస్తి నెసగబెట్టిన తైదలు-

నా శారతో మీకిసోస మేడది

వోరా ఇద్దర చందాగించను-

వారాయన కీయాల కెంటికై

కూరాకంటెనె సదలయ్యోరికి-

బారబొసుకొనె శిలికె శిక్కలె

ఏగిలేస్తె బుట్టి సంగనేసక-

యిట్లా వుడకాడిస్తే మాసల

బోగమీది కొల్లబోలె యేలు నీ-

రాగమేణుగోపాలుడె యినాలె

~

ఈ పాటకి ఆచార్య గల్లా చలపతిగారు చేసిన అన్వయం, తాత్పర్యం ఈ విధంగా ఉన్నాయి (సారంగపాణి పదాలు, పరిష్కరణ: ఆచార్య గల్లా చలపతి, తి.తి.దే, 2013, పే.267)

~

(భిక్ష వేయలేని పేదరాలైన ఒక ఇంటి యజమానురాలు యాచకుడు వచ్చి యాచించినప్పుడు అతనితో తన దైన్యపు స్థితిని చెప్పడం ఈ పదం వర్ణించింది).

కిన్నర వాయిస్తూ నిలబడి ఉంటే గింజలు ఎక్కడినుండి తెస్తాం? ఇక్కడ ఏమీ లేవు. ఏందో లొడపెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇది అగిత్యం కాకపోతే తెల్లవారకతలికే వచ్చావే!

వర్షాలు ఏమని కురవకుండా మానేశాయో వర్తకులు (సరుకుల) ధరలు పెంచేశారు. చెరువులలో చేపలన్నీ పట్టేశారు. పొలాల్లో కర్రలు (పైరు మొలకలు) బయటికి రాలేదు.

ఉద్యోగాలకు వెళదామని చూస్తే ప్రయోజనం కనబడటం లేదు. ఇండ్లు విడిచి (ఎక్కడికీ) వెళ్ళలేకుండా ఉన్నాం. చలికి కప్పుకోడానికి కూడా చినిగిపోయిన పాతగుడ్డలే. చెప్పుకోడానికి సిగ్గు అడ్డం వస్తూ ఉంది.

ఉప్పుగల్లు కూడా ముత్యాల వలె ప్రియమైపోయింది. (ధర ఎక్కువయింది). ఉపవాసమున్నా (పస్తులుండినా) ఎలా ఉండారని ఎవ్వరూ అడగరు, ఇప్పుడే సంతలో సరుకుల ధరలు ఇలా పెరిగిపోతూ ఉంటే ఇంక ఈ కాపురాన్ని ఎలా గడుపుకోగలం?

కుక్కకు సంగటి వేసి మూడు రోజులైంది. ఇంట్లో ముసలిది (అమ్మగావచ్చు, అత్త గావచ్చు, అవ్వ గావచ్చు) మంచంలో పడి లేవలేకుండా ఉంది. చంటిబిడ్డ చంక దిగడం లేదు. గొడ్లకు (పశువులకు) తాగడానికి నీళ్ళు లేవు ( లెదా పశువులు ఊపిరి లేకుండా ఉన్నాయి) పశువులను చూడాలంటే సిగ్గుగా ఉంది (మేతవేయలేకపోయామే అనే దిగులు). గూటిలో కోళ్ళు (కూడా) బొబ్బొబ్బో అని (మేతలేకపోవడం వల్ల) అరుస్తున్నాయి.

ఇక్కడ వెసులుబాటు ఉంటే గదా ధర్మం చేయగలం, ఇంతకు మునుపులాగా అనుకొంటే వీలుగాదు. ముందు వచ్చినప్పుడు నా చేత్తో చేరెడు మంచి రాగులు ఇచ్చాను కదా. మీకు కృతజ్ఞత లేదు.

తెల్లవారితే చాలు బుట్ట సంకన పెట్టుకుని మనుష్యుల్ని ఇలా ఉడకాడిస్తా (బాధపెడతూ) ఉండారు. బోగం వీథి కొల్లబోలేదు. నువ్వు పాడే పాట వేణుగోపాలుడే వినాలి.

~

ఈ పదం నన్ను నివ్వెర పరిచింది. ఇందులో పలుకుబడి, వ్యథార్థ జీవన యథార్థ దృశ్యం మాత్రమే కాదు, తాను దానధర్మాలు చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు ఆ ఇల్లాలు పడుతున్న ఆందోళన ని కవి అనితరసాధ్యంగా చిత్రించాడు.

ఇంతదాకా నిరాదరణకీ, అణచివేతకీ లోనైన వివిధ వివిధ ప్రాంతీయ , సామాజిక అస్తిత్వాల గురించి కవిత్వం రాస్తున్నవారు చదవవలసిన పదాలివి. ఇటువంటి పదకర్త గతంలో లేడు, ఇప్పుడు కూడా ఏ భారతీయ భాషలోనూ కనబడడు.

16-4-2021

Leave a Reply

%d bloggers like this: