నిజమైన ఆస్తికురాలు

అమెరికా వెళ్ళినప్పుడు మొదట వాల్డెన్ చూసాక, నేను చూడాలనుకునే రెండవ చోటు, మసాచుసెట్స్ లో, అమ్హ్ రెస్ట్ లో , 280, మెయిన్ స్ట్రీట్ లో ఇప్పుడు మూజియంగా మారిన ఒకప్పటి ఎమిలీ డికిన్ సన్ ఇల్లు. ఆమె ఆ ఇంట్లోనే తన పూర్తి జీవితం దాదాపుగా ఏకాంతంలో గడిపింది. యాభై ఆరేళ్ళు. శ్వేతవస్త్రాల్లో, ఆ ఇంట్లో, బంధుమిత్రులెవర్నీ కలవకుండా తన ఇంటిమేడ మీద తన గదిలోనే ఒక్కర్తీ ఆమె ఏం చేస్తూ ఉండేదో ఎవరికీ తెలిసేది కాదు. ఆమె జీవించి ఉండగా, ఒక స్థానిక పత్రికలో పది కవితలు తప్ప మరేమీ అచ్చు కాలేదు. చెప్పుకోదగ్గ ఏ నాటకీయ సంఘటనా ఆమె జీవితంలో సంభవించలేదు.

కాని ఆమె జీవితం ఆమె మరణం తర్వాత మొదలయ్యింది. ఆమె మరణించిన తరువాత ఆమె చెల్లెలు ఒకరోజు తన అక్క వదిలిపెట్టిన వస్తువులు సర్దుతూండగా అందమైన పుస్తకాలుగా కుట్టిపెట్టుకున్న కవితల భాండాగారం బయటపడింది. దాదాపు అరవై పుస్తకాల్లో ఆమె రాసిపెట్టుకున్న 900 కవితలు, విడి విడి కాగితాల్లో మరొక తొమ్మిదివందల కవితలు బయటపడ్డాయి. ఆ కవితల్లోంచి మొదట 115 కవితలు ఎంపిక చేసి 1890 లో ప్రచురించారు. ఆ వెనువెంట మరికొన్ని కవితలు, మరికొన్ని కవితలు వెలుగు చూస్తూ వచ్చాయి. అంతవరకూ ఏమీ అర్థం కాని మూసి ఉన్న పుస్తకంలాంటి ఎమిలీ జీవితం ఒక ధ్యానమయ జీవితమనీ, ఆమె తనకై తాను ఒక ప్రశాంతమహనీయ లోకాన్ని సృష్టించుకుని అందులో జీవిస్తూ, ఆ లోకం తాలూకు వెలుగుల్ని మనకు వదిలిపెట్టివెళ్ళిపోయిందని ప్రపంచానికి తెలిసి వచ్చింది.

ఎమిలీ డికిన్ సన్ కవితల సంపుటాలు మొదటిసారిగా వెలువడ్డప్పుడు వాటిని ఆ మొదటి సంపాదకులు తమ ఇష్టం వచ్చినట్టు కత్తిరించారు, సరిదిద్దారు, ఆమె జీవించిఉండగా, తన తమ్ముడి భార్య సుసాన్ పట్ల ప్రకటించిన గాఢప్రేమోద్వేగం నలుగురికీ తెలియకూడదన్న ఉద్దేశ్యంతో సుసాన్ అనే పేరు ఎక్కడ వచ్చినా ఆ పేరు కనబడకుండా చేసారు. ఆ విధంగా రూపురేఖలు మార్చుకున్న కవితలు కాక, అసలు ఎమిలీ డికిన్ సన్ స్వహస్తాల్తో రాసుకున్న కవితలు యథాతథంగా 1955 దాకా ప్రపంచం ముందుకు రాలేదు. అంటే ఒక కవయిత్రి రాసుకున్న కవిత్వం పూర్తిగా వెలుగు చూడటానికి దాదాపు ఒక శతాబ్ద కాలం పట్టిందన్నమాట!

కాని ఇప్పుడు ఎమిలీ డికిన్ సన్ ఇప్పుడు అమెరికన్ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే అగ్రశ్రేణి కవయిత్రుల్లో ఒకరు. నా వరకూ నాకు ఆమె కవయిత్రి మాత్రమే కాదు, ఒక మిస్టిక్ కూడా. పూర్తి భగవన్మయ జీవితం జీవించిన ఆధ్యాత్మిక సుసంపన్నుల్లో ఆమెని మొదటి వరసలో లెక్కవేసుకుంటాను. ఏ కాలంలోనైనా పూజారులు ప్రతిపాదించే మతాన్నీ, క్రతుకాండనీ అంగీకరించకుండా తన అంతరాత్మ సాక్షిగా భగవద్వాణిని వినిపించే ప్రవక్తలకోవకి చెందిన కవయిత్రి ఆమె. ఒక తేనెటీగలో భగవద్విలాసాన్ని చూడగలిగిన దార్శనికురాలు. సదా సంశయంతో, మృత్యువుతో తలపడుతూ, ఎప్పటికప్పుడు ఒక పక్షి కూజితంతోనో, ఒక వింతవెలుగుతోనో ఆత్మ అనశ్వరత్వాన్ని ప్రకటిస్తూ వచ్చిన నిజమైన ఆస్తికురాలు.

డికిన్ సన్ కవిత్వాన్ని చదువుకోవడం దానికదే ఒక ధ్యానం. ఆమె కవిత్వంలో కనవచ్చే అడ్డగీతలు, వ్యాకరణరీత్యా సమ్మతం కాని పదప్రయోగాలు, అడుగడుగునా కనవచ్చే పెద్ద అక్షరాలు సంపాదకుల్ని చాలాకాలం తికమక పెట్టాయి. కాని డికిన్ సన్ కవిత్వాన్ని ఇష్టపడే ఒక సంపాదకురాలు అన్నట్లుగా, డికిన్ సన్ కవిత్వం దానికదే ఒక భాష. ఆ ఇంగ్లీషు ప్రత్యేకమైన ఇంగ్లీషు. నేను చదివినంతవరకు, షేక్ స్పియర్, తర్వాత డికిన్ సన్, బహుశా కొంతవరకూ హాప్కిన్స్- వాళ్ళ ఇంగ్లీషు అవాజ్మానసలోకపు సరిహద్దుల్ని స్పృశించిరాగల ఇంగ్లీషు.

నా ఇరవయ్యవ ఏట నుంచీ డికిన్ సన్ ని చదువుతూనే ఉన్నాను. ఇప్పటికీ పూర్తిగా చదివానని చెప్పలేను. ఆమె పేరు మీద అచ్చయిన 1755 కవితల్లో చాలా వరకూ ఇంకా చదవనేలేదు. కాని ఆ కవితలన్నీ ఏకబిగిన చదవడం అసాధ్యం. ఎందుకంటే ఏ ఒక్కటీ పది పన్నెండు పంక్తులకి మించని ఆ కవితల్లో ఏ ఒక్క కవిత చదివినా ఒక ఋతువంతా గడిచిపోతుంది, ఆ వెలుగుని నాలో ఇంకించుకోడానికి. ఆమె నే ఒక కవితలో ఇలా అంటున్నది:

ఒక గరికపచ్చ మైదానాన్ని సృష్టించుకోవాలంటే

ఒక తీగకావాలి, తేనెటీగ కావాలి-

ఒక పుష్పం, ఒక భ్రమరం

పారవశ్యం.

తేనెటీగలు మరికొన్ని ఉంటే

పారవశ్యమొక్కటే చాలు.

ఆమె కవిత్వసంపుటిలోని ఏ ఒక్క కవిత అయినా చాలు మనమొక మంత్రమయలోకాన్ని సృష్టించుకోడానికి. రెండు మూడు కవితలు చాలు, మనల్ని మనం పూర్తిగా మర్చిపోడానికి.

నా మాటలకి నిరూపణగా ఈ కవితలు చూడండి:

1

నాదొక ఊహాసౌధం (1862)

నాదొక ఊహాసౌధం-

వాచ్యప్రపంచంకన్నా సుందరమైన నివాసం-

ఆ గదికి లెక్కపెట్టలేనన్ని కిటికీలు-

మేలిమి-దర్వాజాలు-

దేవదారు కలపతో కట్టిన గదులు-

బయటివాళ్ళ చూపులకు చిక్కని చోటు-

ఎన్నటికీ చెక్కుచెదరని దాని

పైకప్పు ఆకాశమే-

అక్కడ అడుగుపెట్టేవాళ్ళు-అత్యంత సజ్జనులు-

ఇక అక్కడ నేను చేసే పని అంటావా-ఇదే-

నా చిట్టిచేతులు రెండూ చాపి

స్వర్గం చేరదీసుకోవడమే.

2

ఎవరు విజయం చేజార్చుకుంటారో (1859)

ఎవరు విజయం చేజార్చుకుంటారో

వాళ్ళకి విజయం సుమధురం

పట్టలేనంత పాకులాట ఉంటే తప్ప

అమృతం అంగిలి దిగదు.

నేడు విజయధ్వజం

చేతబూనినవాళ్ళలో

విజయానికి నిర్వచనమివ్వగలవాడు

వాడొక్కడే-

అక్కడ కుప్పకూలి-మరణిస్తున్న-

ఆ పరాజితుడి చెవుల చెంత

దూరంగా వినిపించే జయధ్వానం

కలతపెట్టేంత స్పష్టంగా వినిపిస్తుంది.

3

నేనొక అనామకురాల్ని, నువ్వెవరు? (1861)

నేనొక అనామకురాల్ని, నువ్వెవరు?

నువ్వు- కూడా-అనామకురాలివేనా?

అయితే మనమిద్దరం భలే జంట!

ఎవరికీ చెప్పొద్దు-వాళ్ళు ఊరంతా చాటేస్తారు-తెలుసా!

ఎవరో ఒకరిగా -గుర్తింపు పొందడం-దుర్భరం

నలుగురికీ తెలియడమంటే-కప్పల్లాగా-

చిత్తడిలో చిక్కుకుని

బిగ్గరగా బెకబెకలాడటం!

4

ఆశ ఒక రెక్కల పక్షి (1861)

ఆశ ఒక రెక్కల పక్షి-

ఆత్మమీద వచ్చి వాలుతుంది-

పదాలతో పనిలేకుండానే పాడుతుంది

ఆపకుండా-అవిరామంగా-

గాల్లో-వినబడుతుంది-మధురంగా-

ఆ గాలివాన ఎంత చెడ్డది

నలుగురినీ సేదదీర్చే-

ఆ చిన్నిపిట్టని కించపరుస్తుంది.

గడ్డకట్టిన రాత్రుల్లో విన్నాను-

అపరిచిత తీరాల్లోనూ-

అయినా- ఒక్కసారి కూడా-పొరపాటునైనా

రొట్టెతునక కూడా యాచించలేదు-అది నన్ను.

5

హేమంతకాలపు అపరాహ్ణాల్లో (1861)

హేమంతకాలపు అపరాహ్ణాల్లో

వ్యాపించే చిత్రమైన వెలుగు-

కిందకు అదిమిపెడుతుంది-మనల్ని

పైకిలేపే దేవాలయసంగీతంలాగా-

అదొక దివ్యగాయం-

కోత కనిపించదు

అర్థాలు సంతరించుకునే చోట-

అంతరార్థం కదలాడుతుంది.

ఒకరు చెప్తే తెలిసేది కాదు-

కాని అక్కడ నిస్పృహనిట్టే పోల్చుకోవచ్చు-

గాల్లో తేలి వచ్చే

గంభీర శాసనక్లేశం-

అది వచ్చినప్పుడు-ప్రకృతి చెవి ఒగ్గుతుంది-

నీడలు-ఊపిరి బిగబడతాయి-

అది వెళ్ళిపోయేటప్పుడు-మరణించినవాళ్ళచూపుల్లాగా

కడు దూరం.

6

కోమలంగా, గంభీరంగా (1862)

కోమలంగా, గంభీరంగా

ప్రకృతి నా చెవిలో చెప్పిన మాట-

ప్రపంచానికి నేను రాస్తున్న లేఖ ఇది

కాని ప్రపంచం నాకు జవాబివ్వదు-

ఆ సందేశాన్ని కొనితెస్తున్న హస్తాలేవో

నేను చూసి ఎరగను-

ఆమె పట్ల ప్రేమతో-ఇష్టంతో-మిత్రులారా

నన్ను కూడా- ఇంచుక ఆలించండి.

7

భరించలేనంత బాధ ఒకటి అనుభవించాక (1863)

భరించలేనంత బాధ ఒకటి అనుభవించాక, ఒకింత మామూలుగా అనిపిస్తుంది

నరాలు సమాధుల్లాగా చేష్టలుడిగి స్తబ్ధుగా కూచుంటాయి-

గడ్డకట్టిన హృదయం ప్రశ్నిస్తుంది ‘అతడేనా? ఇదంతా పడ్డది

అదికూడా నిన్ననా లేకా యుగాల వెనకనా?’

యాంత్రికంగా అడుగులు పడుతుంటాయి-

కొయ్యకాళ్ళతో నడిచినట్టు

నేలమీదనో, గాలిలోనో లేదా మరెక్కడైనా

ఎలా ఉన్నారన్నదాంతో సంబంధం లేకుండా

స్ఫటికంలాంటి సంతృప్తి, శిలాసదృశం-

ఇది సీసంలాంటి సమయం

ఇది దాటి బతికితే, గుర్తుంటే,

చలికి గడ్డకట్టుకుపోతున్నవాళ్ళు హిమపాతాన్ని తల్చుకున్నట్టు

ముందు-వణుకు-అప్పుడు మగత-ఆ మీదట విముక్తి-

8

చెప్పవలసిన సత్యం మొత్తం చెప్పు (1868)

చెప్పవలసిన సత్యం మొత్తం చెప్పు, కాని మోతాదు తగ్గించి చెప్పు-

చుట్టు తిప్పి చెప్పడంలో ఒక సౌలభ్యముంది

సత్యం కలిగించగల మహిమాతిశయ విస్మయం

మన దుర్బల సంతోషాలు పట్టలేనంత ప్రకాశం.

ఒకింత మృదువుగా వివరిస్తే పిల్లలకి

మెరుపులు బోధపడ్డట్టు

సత్యం వెలుగు నెమ్మదిగా వెల్లడికావాలి

ఒక్కపెట్టున గోచరిస్తే మనుషులు అంధులైపోతారు.

9

వసంతంలో కనవచ్చే వెలుగులాంటిది (1864)

వసంతంలో కనవచ్చే వెలుగులాంటిది

ఏడాదిపొడుగునా

మరెప్పుడూ కనిపించదు

ఫాల్గుణమాసం వచ్చిందో లేదో

దూరంగా ఏకాంతపర్వతపంక్తిమీద

ఒక వెలుగు వ్యాపిస్తుంది

అది తర్కానికి చిక్కదు

మనసుకు మాత్రమే తెలుస్తుంది.

ముందు పచ్చికబయల్లో కనిపిస్తుంది

ఇంతలో దూరంగా చెట్లమీద వాలుతుంది

సుదూరమైన కొండవాలులోంచి

అది నాతో మాటాడుతున్నట్టే ఉంటుంది.

ఇక అప్పుడు దిగంతాలు సాగినప్పుడు

అపరాహ్ణాలు గడిచిపోతున్నప్పుడు

చిరుసవ్వడికూడా చేయకుండా

అది తరలిపోతుంది, మనం మిగిలిపోతాం.

అప్పుడు మన సారాంశమేదో

మనం కోల్పోయినట్టనిపిస్తుంది.

మన ప్రార్థనాస్థలం కాస్తా

సంతగా మారిపోయినట్టనిపిస్తుంది.

10

మన అంతస్సత్వానికీ, దుమ్ముకీ మధ్య (1864)

మన అంతస్సత్వానికీ, దుమ్ముకీ

మధ్య సంవాదమే మృత్యువు.

‘అన్నీ కట్టిపెట్టు’ అంటుంది మృత్యువు, నా

నమ్మకాలు నాకున్నాయంటుంది ఆత్మ.

మృత్యువు నమ్మదు, వాదన కొనసాగిస్తుంది

ఆత్మ వెనుతిరిగిపోతుంది

వెళ్ళిపోతూ, తన మాటలకి సాక్ష్యంలాగా

జీర్ణవస్త్రం వదిలిపెట్టిపోతుంది.

30-5-2021

Leave a Reply

%d