నా నిద్రలేమి, నా మెలకువ

నా మొబైల్లో గూగుల్ న్యూస్ తెరిచినప్పుడల్లా ఏవేవో సెన్సేషనల్ వార్తలు, రాష్ట్రరాజకీయాలో, దేశరాజకీయాలో, సినిమా రాజకీయాలో వరసగా కనిపిస్తుంటాయి. డబ్బు, అధికారం, విచ్చలవిడితనం- ఆ వార్తలు చాలావరకు ఎవరో సగం చదివి వదిలిపెట్టిన డిటెక్టివ్ నవల్లో పేజీల్లాగా కనిపిస్తాయి. కొన్నాళ్ళకు నాకు అర్థమయింది. ఎప్పుడో ఏమీ తోచక, ఆ పేజీలేవో ఒకటో రెండో తెరిచి ఉంటాను, ఆ వార్తల్ని నా ముందుకు తెస్తున్న మెషీన్ లోని అల్గారిథం బహుశా నాకు అట్లాంటి పేజీలే ఇష్టమని నిర్ణయించుకుని నాకు అక్కర్లేకపోయినా ఆ పేజీలు నా ముందు పోగుపడేస్తోందని. అప్పుడు కావాలని ఒకటి రెండు కవిత్వం పేజీలు, ఒకటి రెండు చిత్రలేఖనం పేజీలు తెరిచాను. ఇప్పుడు ఆ అల్లావుద్దీన్ అద్భుతదీపం ప్రపంచంలోని ఎక్కడెక్కడి కవిత్వ వార్తల్నీ నాకోసం మోసుకొస్తోంది.

అట్లాంటి వార్తల్లో నాలుగు రోజుల కిందట middleeasteye.net అనే పత్రికలో ఆరబిక్ కవిత్వంలో, ప్రాచీన, మధ్యయుగాల, ఆధునిక కాలాలకు చెందిన 10 మంది కవుల గురించిన వ్యాసమొకటి ఉంది. ఒకప్పుడు శ్రీశ్రీ, ప్రాచీన కాలంలో సంస్కృతంలోనూ, మధ్యయుగాల్లో పారశీకంలోనూ, ఆధునిక యుగంలో స్పానిష్ లోనూ గొప్ప కవిత్వం వికసించిందని అన్నాడు. నేనేమనుకుంటానంటే, ఒకప్పుడు ప్రాచీన కాలంలో భారతదేశంలోనూ, మధ్యయుగాల్లో దూరప్రాచ్యంలోనూ, ఆధునిక యుగంలో మధ్యప్రాచ్యంలోనూ అద్భుతమైన కవిత్వం వికసిస్తోందని. మధ్యప్రాచ్య కవిత్వం పట్ల నా దాహం మరీ ఇటీవలి కాలానిది. మరీ ఇటీవలి కాలానికి చెందింది. ఈజిప్టు, అరేబియా, ఇరాక్, టర్కీ లాంటి పూర్వనాగరికతల నుంచే కాదు, సిరియా, లెబనాన్, ఇరాన్ లాంటి దేశాల నుంచి వచ్చే కవిత్వం కూడా మామూలు కవిత్వం కాదు. బాంబుల మధ్య సహజీవనం చేస్తున్న మనుషులు రాస్తున్న కవిత్వం అది. అందుకని, ఆ మిడిల్ ఈస్ట్ పోస్టు ఆతృతగా చదివాను. అందులో ప్రస్తావించిన ప్రతి ఒక్క కవి గురించీ మళ్ళీ మళ్ళీ విస్తృతంగా ఎలానూ శోధిస్తాను, చదువుతాను. కాని, ఇప్పటికి మాత్రం మరామ్-అల్-మస్రీ అనే కవయిత్రి కవిత్వం మాత్రం నన్ను కట్టిపడేసింది.

మరాం-అల్-మస్రీ సిరియాకి చెందిన కవయిత్రి. ఆమె తన ఇంటినీ, కుటుంబాన్నీ, దేశాన్నీ వదిలిపెట్టి ఒక ప్రవాసిగా ఫ్రాన్సులో జీవిస్తున్నది. ‘సిరియాకి చెందిన ప్రతి ఒక్కటీ వదిలిపెట్టేసాను, చివరికి ఆ భాష, ఆ ఆహారంతో సహా ‘ అని చెప్పుకుందామె ఒక ఇంటర్వ్యూలో. కాని, ఆమె కవిత్వం చదివితే, సిరియా ఆమెని వదిలిపెట్టలేదనీ, ఆమె ఊపిరిలో ఊపిరిగా మారిపోయిందనీ అర్థమవుతుంది. నాకోసం తెలుగు చేసుకోకుండా ఉండలేని ఆమె కొన్ని కవితలు కొన్ని, మీ కోసం.

~

1

నేను మనిషిని

నేను మనిషిని, పశువుని కాను

అంటో అరిచాడొక మామూలు మనిషి

అహ్మద్ అబ్దోహాబు.

భయమనే పంజరం నుంచి

బయటపడ్డ కైదీలాగా

వణుకుతున్న గొంతుకతో

అరిచాడు.

ఉబ్బిన కంఠనాళాలు

కోపోద్రిక్తనయనాలు.

అతడేమీ బాల్జానీ, హ్యూగోనీ

చదివినవాడు కాడు

మార్క్సూ, లెనినూ ఎవరో తెలియదతడికి

కాని ఆ రోజు మాత్రం

ఆ సాధారణ పౌరుడు

అహ్మద్ అబ్దోహాబు

అసాధారణమానవుడైపోయాడు.

2

నువ్వతణ్ణి చూసావా?

నువ్వతణ్ణి చూసావా?

తన బిడ్డని చేతుల్లో పెట్టుకుని

ఎంత ఠీవిగా, వెన్నెముక నిటారుగా

తలెత్తుకుని మరీ నడిచివెళ్ళాడని…

అట్లాంటి తండ్రి చేతుల్లో ఉన్నందుకు

ఆ బిడ్డ కెంత గర్వంగా,

సంతోషంగా ఉండేదో కదా,

బతికుంటే.

3

రోజువారీ జీవితం

రోజువారీ జీవితం:

రొట్టెల దుకాణం ముందు పొడవాటి వరస

బాంబుల పేలుళ్ళు.

ప్రతి ఒక్కరు పరుగుపెట్టారు

చెట్లు కూడా

వేర్లు పెరుక్కుని మరీ పరుగుపెట్టాయి.

ఒక్క ఆకలి తప్ప.

చుట్టూ ఏమవుతోందో పట్టించుకోకుండా

ఆకలి మటుకు

అక్కడే నిల్చుంది

రొట్టెల కోసం.

4

బిడ్డా నా తల్లీ

బిడ్డా, నా తల్లీ బాగా చదువుకో

దేశానికి కావాలి జాతినిర్మాతలు.

కాఫీ తాగుతావా?

టీ?

నువ్వు కచ్చితంగా పాసవుతావు,

డిప్లొమా తెచ్చుకుంటావు

అప్పుడు నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా

పెద్దపార్టీ ఇస్తాను

నువ్వు..ఇంజనీరుగా.. చాలా బావుంటుంది కదూ.

ఆ బిడ్డ కలలూ కలాలూ మూటగట్టుకుని

యూనివెర్సిటీకి బయలుదేరింది.

ఆమెదంటూ వాళ్ళమ్మకు చేరింది

ఒక బూటు మటుకే.

5

వాళ్ళని చూసాన్నేను

వాళ్ళని చూసాన్నేను

ఆ ఆడవాళ్ళని

నీలిరంగులో ముసుగుపడ్డ ఆ ముఖాల్ని

తొడల మధ్య పుండుతో

బంధించబడ్డ కలల్తో, నోరుమూయబడ్డ పదాల్తో

అలసిపోయిన చిరునవ్వుల్తో

ఆ ఆడవాళ్ళు.

వాళ్ళందర్నీ చూసాన్నేను

వాళ్ళ బోసిపాదాల్తో

వీథిలో నడిచిపోతూండగా

వెనక్కి వెనక్కి చూసుకుంటూ

తమనెవరేనా వెంబడిస్తున్నారేమోనని భయపడుతూ

ఏ పదధ్వనివిన్నా అది ఏ తుపాను కానున్నదోనని శంకిస్తో

వెన్నెల దొంగలు ఆ స్త్రీలు

మామూలు ఆడవాళ్ళ ముసుగులో నడిచిపోతున్నారు

అచ్చం వాళ్ళలాంటి జీవితమే నీదైతే తప్ప

నువ్వు వాళ్ళని గుర్తుపట్టలేవు.

6

కాథరిన్

తల్లి: జీనెట్టె

తండ్రి: జీన్ క్లాడ్

వయసు: 48

వృత్తి: గృహిణి

బహుశా ఆమెలో స్త్రీత్వం మరీ

పొంగిపొర్లుతున్నందుకేమో

ఆమె నిండా కోరికలే.

తెల్లని కాథరిన్ ని చూస్తే

తన జీవితానికేదో ఒక ధ్యేయం

లేనట్టే కనిపిస్తుంది.

కాని ఆమె ఒక స్త్రీ

సున్నిత హృదయురాలు

తన పిల్లల్ని ప్రేమించుకుంటూ

తన ఇల్లు చక్కదిద్దుకునే మామూలు గృహిణి.

ప్రేమకి నోచుకోనిది కాబట్టే

దానికోసం ప్రతి బాటసారి కళ్ళలోనూ

బస్సు డ్రైవరు కళ్ళలోనూ

వెతుక్కుంటుందామె.

ప్రతి పేవ్ మెంటు దగ్గరా ఒక మందహాసాన్ని

అడుక్కుంటుంది.

ప్రతి నగరకూడలిదగ్గరా

ఒక అద్భుతం సంభవిస్తుందేమోనని

ఆశపడుతుంది.

7

మానవసోదరులారా

ఓ మానవసోదరులారా

ఓ ప్రపంచమా

నాకొక బిడ్డ ఉండేవాడు

నేనతణ్ణి నా కడుపులో పెట్టుకున్నాను

వాడు నా దేహం పంచుకున్నాడు

నేనతణ్ణి నా రక్తమిచ్చి సాకాను

మమిద్దరం కలలు పంచుకున్నాం

నేనతడికోసం పాటలు పాడాను

వాడు కేరింతలు కొట్టాడు

నేనతడికోసం ఏడ్చాను

వాడు గుక్కపెట్టడం మానేసాడు

వాణ్ణి నా చంకనుంచి లాగేసారు

నేను పాడటం ఆపేసాను.

8

సిరియా బిడ్డలు

తెల్లని గుడ్డల్తో కప్పిన

మిఠాయిపొట్లాల్లగా

సిరియా బిడ్డలు.

వాళ్ళల్లో ఉన్నది చక్కెర కాదు

రక్తమాంసాలు

కలలు

ప్రేమ.

వీథులు మీ కోసం

ఎదురుచూస్తున్నాయి

సిరియా బిడ్డల్లారా

బడులు, తోటలు, సెలవులు

ఎదురుచూస్తున్నాయి.

పక్షులుగా మారి

నీలి గగనంలో

తారట్లాడటానికి

అంత తొందరేమొచ్చింది?

9

తలుపు తట్టిన చప్పుడు

తలుపు తట్టిన చప్పుడు

ఎవరు?

నా ఒంటరితనపు దుమ్మంతా

రగ్గుకిందకి తోసేసి

ముఖాన చిరునవ్వు పులుముకుని

తలుపు తెరుస్తాను

10

ఎంత మూర్ఖత్వం

ఎంత మూర్ఖత్వం:

తలుపు తట్టిన చప్పుడు

వినబడితే చాలు నా గుండె

తలుపు తెరిచేస్తుంది.

11

నన్ను ప్రేమించనివాళ్ళు

నన్ను ప్రేమించని వాళ్ళు

ఉప్పు కణికల్లాగా

ఇంతలోనే తళుకుమన్నారు

ఇంతలోనే కరిగిపొయ్యారు.

12

సిరియా

సిరియా నాకొక నెత్తురోడుతున్న గాయం

మరణశయ్య మీద ఉన్న మా అమ్మ.

కుత్తుక తెగ్గోసిన నా బిడ్డ.

అది నా పీడకల, నా ఆశారేఖ,

నా నిద్రలేమి, నా మెలకువ.

30-9-2020

One Reply to “”

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%