నన్నెచోడుడు తిరుగాడిన నేల

వారం రోజుల కిందట ప్రకాశం జిల్లాలో పాఠశాలలు చూసుకుంటూ కొణిదెన అనే ఊళ్ళో అడుగుపెట్టాం. అక్కడొక ప్రాథమిక పాఠశాల ఉంది. ‘నాడు నేడు’ కింద ఆ పాఠశాలలో పనులన్నీ పూర్తయ్యి, పెయింటింగు పనులు కూడా పూర్తయ్యి చక్కగా కనిపిస్తూ ఉంది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులతో, తల్లిదండ్రుల్తో కూచుని మాట్లాడుతూ ఉండగా, మా పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరక్టరు రవీంద్రనాథ రెడ్డిగారు, ‘ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది సార్, అదిగో ఆయన్ని అడిగితే చెప్తారు ‘ అని ఒకాయన్ను పరిచయం చేసారు. ఆయన పేరు జ్యోతి చంద్రమౌళి. గతంలో భాషోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారట. ‘ప్రకాశం జిల్లా చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈయన్నే అడుగుతారందరూ ‘ అన్నారు మరెవరో. ‘మీదీ వూరేనా?’ అనడిగాను. ‘కాదు సార్, అద్దంకి. మీరివాళ ఇటు వస్తున్నారని తెలిసి కలుద్దామని వచ్చాను ‘ అన్నారాయన. ‘చెప్పండి సార్, ఈ ఊరి ప్రాధాన్యత ఏమిటి?’ అనడిగాయన్ను ఆయన్ని.

ఆయన గొంతు సవరించుకున్నాడు. ‘ఇది నన్నెచోడుడి ఊరు’ అన్నాడాయన.

ఉలిక్కిపడ్డాన్నేను.

సంభ్రమం ఆవరించింది నన్ను. ‘ఈ ఊరా? ఈ ఊరిపేరేమిటి’ అనడిగాను.

‘కొణిదెన. పూర్వం కొట్యదొన, కొట్టియదొన అని పిలిచేవారు. కాలక్రమంలో కొణిదెన గా మారింది ‘ అంటో ‘కొణిదెన చరిత్ర: ప్రాచీన వైభవం ‘(2014) అనే తన రచన నా చేతుల్లో పెట్టారు. కాని అప్పటికే నా వళ్ళంతా పులకలెత్తుతూ ఉంది.

నా సాహిత్య జీవితం రాజమండ్రిలో మొదలయ్యింది. నన్నయ గురించి వింటూ, మాటాడుకుంటూ పెరిగాన్నేను. ఇన్నాళ్ళకు నన్నెచోడుడు తిరుగాడిన నేలమీద, ఆ గాలిలో నిలబడ్డానన్న ఊహే నాకు పట్టలేనంత సంతోషాన్ని కలిగిస్తూ ఉంది.

‘ఇక్కడ పదకొండో శతాబ్ది ఆలయాలు, శాసనాలు ఉన్నాయి. చూద్దురుగాని, రండి ‘ అంటో నన్ను ఆ ఊళ్ళో నెలకొని ఉన్న శంకరశ్వామి ఆలయ ప్రాంగణానికి తీసుకువెళ్ళాడు. అక్కడ వేణుగోపాల స్వామి, వీరభద్ర, శంకరస్వామిగా పిలవబడుతున్న బల్లీశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల మధ్య ప్రాచీన శాసనాలు కొన్ని స్తంభాల్లాగా నిలబడి ఉన్నాయి.

చంద్రమౌళిగారు ఆ దేవాలయాల చరిత్ర, ఆ శాసనాల వివరాలు చెప్పడం మొదలుపెట్టారు.

సామాన్య శకం పదకొండో శతాబ్దిలో కొణిదెన రాజధానిగా తెలుగు చోడుల శాఖ ఒకటి పరిపాలన చేసింది. వారిని పొత్తపిచోడులు, పాకనాటి చోడులు అని కూడా పిలుస్తారు. మరొకవైపు గుంటూరు సీమను వెలనాటి దుర్జయులుగా ప్రసిద్ధి చెందిన వెలనాటి చోడులు పరిపాలించారు. కొణిదెన చోడులు దాదాపు మూడు శతాబ్దాల పాటు కొణిదెన రాజధానిగా పరిపాలించినప్పటికీ ఎక్కువకాలం వెలనాటి చోడులకీ, కాకతీయులకీ సామంతులుగానే పరిపాలించారు. స్వతంత్రంగా పరిపాలించింది కొద్దికాలమే అయినప్పటికీ, తెలుగు భాషకి అపారమైన సేవ చేసారు. తెలుగు పద్యాల్లో శాసనాలు రాయించిన తొలిరాజవంశాల్లో ఒకరు. జయంతి రామయ్యగారు సంకలనం చేసిన ‘శాసన పద్యమంజరి’ మొదటి భాగంలోని 88 శాసనాల్లో 11 శాసనాలు కొణిదెన శాసనాలే కావటం గమనించాలి. అటువంటి రాజవంశంలో పుట్టిన వాడు కావడం వల్లా, ఆ ప్రాంతంలో మల్లికార్జున పండితారాధ్యులు సంచరించినందువల్లా నన్నెచోడుడు కావ్యకర్త కావడంలో ఆశ్చర్యం లేదు.

నన్నెచోడుడంటూ ఒక కవి అసలున్నాడా లేడా అని సుమారు యాభై ఏళ్ళ పాటు తెలుగు సాహిత్య విమర్శకులు, చరిత్రకారులు, శాసన పరిశోధకులు ఒకరితో ఒకరు తీవ్రంగా తలపడ్డారు. అదంతా మానవల్లి రామకృష్ణకవి అనే పండితుడు, చరిత్ర పరిశోధకుడు కుమారసంభవ కావ్యాన్ని వెలుగులోకి తీసుకువస్తూ, ఆ కవి సామాన్య శకం 940 ప్రాంతం వాడనీ, కాబట్టి నన్నయ కన్నా పూర్వమే తెలుగు కావ్య రచన చేపట్టినవాడనీ ప్రతిపాదించడంతో పెను తుపాను మొదలయ్యింది. అప్పణ్ణుంచీ, నన్నెచోడుడి కాలం వివాదాస్పదంగా ఉంటూనే వచ్చింది.

వీరేశలింగం గారి అభిప్రాయం ప్రకారం నన్నెచోడుడు 1150-70 ప్రాంతంలో కుమారసంభవం రచించాడు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి దృష్టిలో 1120 ప్రాంతం వాడు. చాగంటి శేషయ్యగారి దృష్టిలో 1028-1078 ప్రాంతానికి చెందినవాడు. కొర్లపాటి శ్రీరామమూర్తి గారి దృష్టిలో నన్నెచోడుడంటూ ఒక కవి లేనేలేడు, అదంతా మానవల్లి రామకృష్ణ కవి గారి కుట్ర, ఆయనే పాత తాటాకుల మీద కుమారసంభవ కావ్యం రాసి దాన్ని నన్నెచోడుడి కావ్యంగా ప్రచారం చేసారు, అదంతా నన్నయని ఆదికవి స్థానం నుంచి పక్కకు జరపడానికి చేసిన ప్రయత్నం.

అయితే ఈ వాదవివాదాలన్నీ సద్దుమణిగాక, నన్నెచోడుడంటూ నిజంగానే ఒక కవి ఉండేవాడనీ, ఆయన కుమారసంభవమనే ఒక కావ్యాన్ని రచించిన మాట వాస్తవమేననీ తెలుగు సాహిత్య చరిత్రకారులు అంగీకరించడం మొదలుపెట్టాక కూడా, ఆయన కాలం గురించిన సందేహాలట్లానే ఉండిపోయాయి. నన్నెచోడుడి కాలం గురించి మాట్లాడేవాళ్ళు నన్నయకు అనుకూల ప్రతికూల వర్గాల్లో ఎవరో ఒకరయి ఉన్నంతకాలం ఈ చిక్కు ముడి వీడదు.

కాని, ఇదిగో, ఇన్నాళ్ళకు, ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా చరిత్రకారుడు జ్యోతి చంద్రమౌళిగారు కొణిదెన శాసనాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నన్నెచోడుడు 11 వ శతాబ్దికి చెందినవాడిగానూ, నన్నయకు వయసులో చిన్నవాడైన సమకాలికుడిగానూ తీర్మానించారు. చంద్రమౌళిగారి అంచనా ప్రకారం నన్నెచోడుడు కుమారసంభవ కావ్యాన్ని సా.శ 1070-90 మధ్యకాలంలో రాసి ఉండవచ్చు. వేంగీచాళుక్యుల తరఫున వెలనాటి గొంకరాజుకీ, కొణిదెన చోడులకీ మధ్య జరిగిన యుద్ధంలో గొంక రాజు చేతుల్లో నన్నెచోడుడు మరణించాడు. ఆ యుద్ధం తరువాత గొంకరాజు 1096 లో వేయించిన శాసనం అందుకు సాక్ష్యం. చంద్రమౌళిగారు మరొక ఆసక్తి కరమైన అంశం కూడా రాసుకొచ్చారు. యుద్ధంలో మరణించే సమయానికి నన్నెచోడుడి కుమారసంభవ కావ్యం ఇంకా వెలుగు చూడలేదనీ, గొంకరాజు దగ్గర మంత్రిగా పనిచేస్తున్న కొమ్మన అనే ఆయన ఆ కావ్యాన్ని భద్రంగా సంపాదించి వెలుగులోకి తీసుకువచ్చాడని మంచన తన కేయూరబాహు చరిత్రలో రాసాడని చెప్పారు. అదే నిజమైతే తెలుగు సాహిత్య చరిత్రలో అదొక అపూర్వమైన ఘట్టం. యుద్ధంలో తమ చేతుల్లో మరణించిన రాజుని కవి గా గుర్తించి అతణ్ణి అమరుడిగా తీర్చిదిద్దిన వైనం.

మహాభారతాన్ని తెలుగు చేస్తున్నప్పుడు నన్నయ దాన్ని కావ్యపద్ధతిలో అనుసృజించిన సంగతి మనకు తెలుసు. కాని కాళిదాసు కావ్యంగా రచించిన కుమారసంభవాన్ని నన్నెచోడుడు ప్రబంధంగా తెలుగు చేసాడు అన్నది చంద్రమౌళిగారి ప్రతిపాదన. అసలు ప్రబంధ నిర్మాణమనేది తెలుగు సాహిత్యానికి అద్దంకి సీమ అనుగ్రహించిన కానుకగా మనం చెప్పుకోవచ్చు. ఎర్రాప్రగడ ప్రబంధ పరమేశ్వరుడని మనకు తెలుసు కదా.

కుమార సంభవం అనేక విధాలుగా ఉత్కృష్టమైన రచన. తెలుగు కన్నడ సాహిత్యాల, సాహిత్యసంప్రదాయాల అంచులు ఒకదానితో ఒకటి కలుస్తున్న మేరలో పుట్టిన కావ్యం అది. తెలుగు సాహిత్యంలో నన్నయ ప్రయత్నాన్ని కవిత్రయం కవుల్లో మరి ఇద్దరు మాత్రమే కొనసాగించారు. నన్నయనుండి అనంతర తెలుగు కవులు గ్రహించింది ఆయన శైలి, అక్షర రమ్యతల్ని మాత్రమే. కావ్యనిర్మాణ సంవిధానానికి మాత్రం తెలుగు కవులు నన్నయ కన్న నన్నెచోడుడికే ఎక్కువ ఋణపడి ఉంటారు. ఆయన తనది ‘వస్తు కవిత ‘అని చెప్పుకున్నాడు. ఆ ‘వస్తు’ అర్థం ఏమిటో మనకి ఇంకా స్పష్టంగా తెలియదు. కాని అతడి భావనలో, కావ్యనిర్మాణ పద్ధతుల్లో నవ్యత మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల అతడు చాలా ఆధునికంగా కూడా కనిపిస్తూ ఉంటాడు. పద్యనిర్మాణంలో, వర్ణనల్లో, ప్రాచీన ఛందస్సుల్ని తన కాలానికి తగ్గట్టుగా మలుచుకోవడంలో అతడి నైపుణ్యానికి మనం ముగ్ధులం కాకుండా ఉండలేం. తన కావ్యశైలిని అతడిట్లా వర్ణించుకున్నాడు:

సరళముగాగ భావములు జానుదెనుంగున నింపు పెంపుతో

బిరిగొన, వర్ణనల్ ఫణితి పేర్కొన నర్థములొత్తతిల్ల బం

ధురముగ బ్రాణముల్ మధు మృదుత్వరసంబున గందళింప న

క్షరములు సూక్తులార్యులకు గర్ణరసాయన లీల గ్రాలగాన్

(భావాలు సహజంగానూ స్పష్టంగా అందరికీ తెలిసే తెలుగులో రాస్తాను. వర్ణనలు, మాటలు ప్రసిద్ధంగానూ అర్థం అంటి ఉండేటట్లుగా చెప్తాను. కావ్యం ప్రాణంతో ఒప్పారే విధంగా తేనెలో ముంచి మృదువైన మాటల్తో వర్ణిస్తాను. అక్షరాలు, సూక్తులు విద్వాంసులు చెవులారా గ్రోలే విధంగా గానం చేస్తాను)

నన్నయ చెప్పుకున్న ‘అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తినిధి ‘ ఈ కవి కూడా తన కావ్యంలో కనిపిస్తాయని చెప్పుకుంటున్నాడన్నమాట. అయితే నన్నయది ప్రసన్న కథాకలితార్థ యుక్తి, నన్నెచోడుడిది బంధురప్రబంధ ఫణితి.

కావ్యాన్ని ఒక రత్నాల అంగడివీథితో పోలుస్తూ ఇలా చెప్తున్నాడు:

మృదురీతి సూక్తులింపొదవింప మేలిల్లు

భావమ్ము నెలమి ప్రీత్యావహముగ

మెరుగుల కన్నులు మిరుమిట్లు పోవంగ

కాంతి సుధాసూతి కాంతి చెనయ

వర్ణనలెల్లచో వర్ణన కెక్కంగ

రసములు తళుకొత్తి రాలువార

దేసిమార్గంబులు దేశీయములుగా న

లంకారముల తా నలంకరింప

నాదరించి విని సదర్థాతిశయమున

బుధులు నెమ్మనమున నిధులు నిలుప

వలవదే సమస్త వస్తుకవీశ్వర

నూత్న రుచిర కావ్యరత్న వీథి.

మామూలుగా కవులు కావ్యాల్ని రాజులకి అంకితమిస్తారు. నన్నెచోడుడు తానే ఒక రాజు. ఆయన తన కావ్యాన్ని తన గురువు మల్లికార్జునుడికి అంకితమిచ్చాడు. తన గురువుపట్ల భక్తి చాటుకోవడంలో ఆయన ఒళ్ళెరగడు. చూడండి:

కరణామిత్రు, నమిత్రు, మిత్రు, నుతలోకజ్ఞుం, గళాభిజ్ఞు, సా

గరగంభీరు, నదూరు, దూరగతజాఘన్యున్, జగన్మాన్యు, భూ

సురవంశాద్యు, నభేద్యు, భేద్యు, సుమనఃశుద్ధున్, మనఃశుద్ధు, వి

స్తరిత శ్లోకు, నలోకు, లోకు, శివసంసక్తున్, విముక్తున్, మహిన్ (5:176)

నన్నెచోడుడు అన్ని వర్ణనలు చేసినప్పటికీ, అన్ని ఋతువుల్నీ వర్ణించినప్పటికీ అతడు ప్రధానంగా వసంత ఋతుకవి. వసంతాన్ని ఒక పూలబండితో పోలుస్తూ చెప్పిన ఈ పద్యం చూడండి:

పంకరుహంబులు బండికండులు, చంప

కంబులు నొగ, లుత్పలంబు లిరుసు,

కరవీరములు బలు కాడి, చాదులు సను

గొయ్య, లశోకముల్ గోడిపీట

సిందువారంబులు సీలలు, కేతకుల్

మెట్టులు, మొల్లలు మెట్టు గుదెలు

పొగడలు పలుపులు, పున్నాగములు పగ్గ

ములు, సహకారముల్ పూను కాడి

కురవకానీక మాలంపు కోల, కైర

వములు మునుకోల, కోకముల్ వాహనములు

గా వసంతుడు సూతుడై పూవు తేర

నెరయ కుసుమాయుధంబులు నినిపి తెచ్చె.

(వసంతుడు సారధిగా పూల బండిలో పువ్వులనే ఆయుధాలు నింపి తీసుకువచ్చాడు. ఆ పూలబండికి తామరపూలు బండి కట్టులు. సంపెంగలు నొగలు. కలువపూలు ఇరుసులు. గన్నేరుపూలు కాడి. జాజిపూలు బండికి రెండుపక్కలా నిలబెట్టిన కొయ్యలు. అశోక పుష్పాలు మోపుడు కొయ్య. సిందువార పుష్పాలు సీలలు. మొగలిపూలు బండి అటూ ఇటూ ఊగిపోకుండా కట్టే కర్రలు. మొల్లపూలు మెట్టు కుదెలు. పొగడపూలు ఎడ్ల మెడకి కట్టే పలుపు తాళ్ళు. పున్నాగపూలు పగ్గాలు. తియ్యమామిడి పూలు ఎడ్లమీద మోపే బండి కాడి. గోరింట పూలు యుద్ధ దండం, తెల్లకలువలు చర్నాకోల, ఇక గుర్రాలు చక్రవాకాలు.)

కాని ఆ మధ్యాహ్నవేళ ఆ శంకరస్వామి గుడి దగ్గర వెయ్యేళ్ళ కిందటి ఆ ఆలయాన్నీ, అక్కడ ఎండకు ఎండి వానకి తడుస్తున్న ఆ శాసనాల్నీ చూసినప్పుడు నాకు సంతోషాన్ని మించిన దిగులు కలిగింది. ఉత్తర ఐర్లాండులో ఇటువంటి ఒక శాసనమే కనక బయటపడితే పురాతన సెల్టిక్ తెగల గురించి పాడుకుంటూ ఒక ఏట్సు, ఒక సీమస్ హీనీ లాంటి కవులు పరవశించిపోయి ఉండేవారు. జపాన్ లో ఇటువంటి ఒక మందిరం బయట పడి ఉంటే ఆ స్థలంలో ప్రతి ఏటా ఒక జాతీయ పద్యోత్సవం జరుపుకుని ఉండేవారు. కనీసం కమ్యూనిస్టు చైనాలో నైనా ఇటువంటి చారిత్రిక స్థలం ఉండి ఉంటే అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేసుకుని ఉండేవారు. కాని ఇది తెలుగు నేల. ఈ జాతికి చరిత్ర అక్కర్లేదు, సాహిత్యం అక్కర్లేదు.

6-1-2021

Leave a Reply

%d bloggers like this: