తెలుగువాడి గుండెచప్పుళ్ళు

Reading Time: 4 minutes

మూడు నాలుగేళ్ళ కిందట ‘నాచ్చియార్ తిరుమొళి’ గురించి రాసినప్పుడు మిత్రురాలు సుగుణ ధాటిక తరిగొండ వెంగమాంబను గుర్తుచేసుకుంటూ ‘కృష్ణమంజరి’ గురించి చెప్పారు. అప్పటిదాకా తరిగొండవెంగమాంబ గురించి నాకంతగా తెలియదు. కృష్ణమంజరి గురించి వినలేదు. కాని సుగుణగారు ఆ మంజరి గురించి చెప్పడమే కాక ఆ కీర్తన మొత్తం పాడి నాకు మెసెంజర్లో పంపించారు. అది విన్నప్పుడు పూర్వకాలపు పల్లెటూళ్ళల్లోనూ, సమష్టి కుటుంబాల్లోనూ, తెల్లవారు జామువేళల్లో భగవంతుణ్ణి స్మరించుకునే స్త్రీలు కళ్ళముందు సాక్షాత్కరించారు. ఎప్పుడైనా ఒకసారి తరిగొండ వెళ్ళాలనీ, వెంగమాంబ కవిత్వాన్ని నాకై నేను మనసారా చదువుకోవాలనీ అప్పుడే తీర్మానించుకున్నాను.

ఇన్నాళ్ళకి ఆ అవకాశం వచ్చింది. ఈ మధ్య మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలకు చిత్తూరు జిల్లా పరిశీలకుడిగా రాష్ట్ర ఎన్నికల సంఘం నన్ను నియమించింది. ఆ సందర్భంగా మండల కేంద్రాలు, పోలింగు స్టేషన్లు, పాఠశాలలు సందర్శిస్తో గుర్రం కొండ మండలానికి వెళ్ళినప్పుడు తరిగొండ అక్కడకు దగ్గరలోనే ఉందని తెలిసింది.

తరిగొండ మరీ పెద్ద ఊరేమీ కాదు. అక్కడ దైవం లక్ష్మీ నరసింహుడు. సౌమ్య మూర్తి. ప్రసన్న మూర్తి. ఆ ఆలయ ప్రాంగణంలోనే వెంగమాంబ మూర్తి కూడా కొలువై ఉంది. ఆలయంలోపల అభయ ఆంజనేయస్వామి కూడా ఉన్నాడు. మేము వెళ్ళేటప్పటికే సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చి ఉన్నాడు. ఎండ ప్రతాపం చూపిస్తో ఉంది. కాని అంత ఎండలోనూ ఆ గుడిలో అడుగుపెట్టగానే చల్లని చందన సుగంధం మమ్మల్ని మృదువుగా తాకింది. ఆలయ అర్చకులు మా కోసం ఎదురుచూస్తున్నారు. ‘ఈ నరసింహుడు వెంగమాంబ ఆరాధ్య దేవత, తిరుపతి వెంకటేశుడు ఆమె అభిమాన దేవత’ అన్నారు అర్చకులు. రోజూ పొద్దున్నే ఇక్కడ ఆమె సుప్రభాత సేవ చేసి, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వెనగ్గా ఉన్న బిలం నుంచి తిరుమల వెళ్ళి రాత్రి స్వామి వారికి ముత్యాల హారతి సమర్పించేది. మీకు ఎప్పుడేనా వీలుంటే ఆ ముత్యాల హారతిని దర్శించండి. వెంగమాంబ స్ఫూర్తి ఏమిటో మీకు అనుభవానికి వస్తుంది ‘అన్నారు ఆ అర్చకులు. కాని అంత ఎండలో విప్పారిన తామరపువ్వులాంటి ఆ గుడిలో అడుగుపెట్టేటప్పటికే వెంగమాంబ స్ఫూర్తి ఎటువంటిదో నాకు అనుభవానికి వచ్చింది.

తరిగొండ వెంగమాంబ (1730-1817) తెలుగు పదకర్తల్లో మొదటి వరసలో ఉండే కవయిత్రి మాత్రమే కాదు, తెలుగు వైష్ణవ భక్తి కవుల్లోనూ ముందు వరసలో నిలబడే మహనీయురాలు. మామూలుగా తెలుగు సాహిత్య చరిత్ర కారులు 17, 18 శతాబ్దాల్ని క్షీణ సాహిత్య యుగంగా పేర్కొంటూ ఉంటారు. అందుకు కారణం వాళ్ళు తెలుగు సాహిత్యాన్ని పద్యకవుల దృష్టిలోంచీ, రాజవంశాల చరిత్రలోంచీ చదవడం. కాని తెలుగు సాహిత్యాన్ని భాషా పరిణామ దృష్టిలోనూ, సామాజిక పరివర్తన దృష్టిలోనూ చదివినప్పుడు, 17, 18, 19 శతాబాలు ఎంతో విలువైన కాలంగా కనిపిస్తాయి. ప్రాచీన తెలుగు సాహిత్యానికీ, ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్యానికీ మధ్య అనుకూల మైన సేతువు నిర్మిచిన కాలం అది. రాజాస్థానాలకూ, రాజస్తుతికీ మాత్రమే పరిమితమైన తెలుగు కవిత్వాన్ని ప్రజలమధ్యకు తీసుకురావడానికి అద్భుతమైన కృషి చేసిన కవులు ఎందరో విలసిల్లిన కాలం అది. అందులోనూ ముఖ్యంగా ఆంధ్ర వైష్ణవ పదకర్తలు నిర్వహించిన పాత్ర అసామాన్యం. ఆ పాత్రను ఇప్పటిదాకా సరిగ్గా అంచనా వేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు కాని అటువంటి విశ్లేషణ ఒకటి మొదలుపెడితే అందులో వెంగమాంబ చేసిన కృషి గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయమే రాయవలసి ఉంటుంది.

ఆమె వేంకటాచల మహాత్మ్యమనే పద్యకావ్యం రాయడమే కాకుండా భాగవతంలోని దశమస్కంధాని ద్విపదగా తిరిగి రచించింది. కాని ఆమె తెలుగు సాహిత్యానికిచ్చిన అపురూపమైన కానుకగా ఆమె యక్షగానాల్ని చెప్పవలసి ఉంటుంది.

పద్యం, పదం, వచనం అనే మూడు సాహిత్య రూపాల్లోనూ పద్యం ప్రభుతకీ, వ్యవస్థకీ చిహ్నం. ఒక జాతి, కాలం రాజకీయంగా సువ్యస్థితంగా ఉన్నప్పుడు పద్యం వికసిస్తుంది. అలాకాక అది పూర్తిగా ప్రజాస్వామికీరణ చెందినప్పుడు వచనం వర్ధిల్లుతుంది. ప్రభుసమ్మితమైన సాహిత్యం ప్రజాసమ్మితమైన వచనానికి మళ్ళేదారిని పదం సుగమం చేస్తుంది. ఆ దృష్టిలో చూసినప్పుడు ప్రతి పదకర్తా ఒక రాజకీయ విప్లవకారుడనే చెప్పవలసి ఉంటుంది. ఆ పదకర్త దైవాన్నే స్తుతించినప్పటికీ, రాజకీయంగా ఎటువంటి పాత్రనీ నిర్వహించకపోయినప్పటికీ అతడు విప్లవకారుడే. ఎందుకంటే అతడు పద్యం తాలూకు ప్రభుతని వదులుచేస్తున్నాడు. భాషానిర్బంధాల్ని సడలిస్తున్నాడు. పదిమందీ ఆ సాహిత్యఛత్రం కిందకు చేరటానికి వీలుగా చోటు చూపిస్తున్నాడు. తెలుగులో ఇటువంటి కర్తవ్యాన్ని నిర్వహించిన పదకర్తల చరిత్ర ఒకటుంది. దాన్ని మనం పునర్నించుకోవలసిన అవసరం ఉంది. కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక కృష్ణమాచార్యుడనే ఒక కవి చెప్పిన సింహగిరి వచనాలతో ఈ ప్రత్యామ్నాయ సాహిత్య చరిత్ర మొదలవుతుంది. అతడు చూపిన దారిలో అన్నమయ్య పదకవిత్వాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చాడు. సంగమ రాజ్యకాలం తరువాత సాళువ వంశ కాలంలో తలెత్తిన అరాచకాలకు ఖిన్నుడై, రాజుకేంద్రంగా ఉండే వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఆయన దేవుడు కేంద్రంగా ఉండే ఒక వ్యవస్థను ప్రతిపాదించడమే కాక తన మొత్తం కుటుంబాన్ని ఆ సామాజిక కర్తవ్యానికి అంకితం చేసాడు.

అన్నమయ్య తరువాత పదిహేడు, పద్ధెనిమిది శతాబ్దాల్లో ఆ కృషిని ముందుకు తీసుకువెళ్ళినవాళ్ళల్లో వీరబ్రహ్మం, వెంగమాంబ, సారంగపాణి వంటి పదకర్తలు ఉన్నారు. వారు ప్రజల భాషలో, ప్రజల పలుకుబడిలో కవిత్వం చెప్పారు. అన్నమయ్యవి రాగప్రధానమైన గీతాలు కాగా వీరిది తాళప్రధానమైన గేయకవిత్వం. ముఖ్యంగా వెంగమాంబ యక్షగానాల్లోని దరువులు తెలుగువాడి గుండెచప్పుళ్ళు. ఆ దరువుల్లో, ఆ తాళవిన్యాసంలో ఆమె తెలుగు కవిత్వంలో మనం అంతకు ముందు చూడని కొత్త గతిసంగతులు చూస్తాం. ఉదాహరణకి ఈ సంవాద దరువు చూడండి:

~

పరమేశ్వరుడు:

చెలియా, నేనెంతో నిన్ను వేడితి కదవే బాలా

నే వేడితి కదవే బాలా

బాలా:

వేడితివో, వీడితివో, విడనాడితివో, పోపోరా

పరమేశ్వరుడు:

మక్కువలర నీ వలలో నే చిక్కితి కదవే

నే చిక్కితి కదవే బాలా

బాలా:

చిక్కితివో, దక్కితివో, అటు

పొక్కితివో? పోపోరా!

పరమేశ్వరుడు:

కులుకులాడి వనుచు నిన్నే వలచితి గదవే బాలా

నే వలచితి గదవే బాలా

బాలా:

వలచితివో, కొలిచితివో, దాని

దలచితివో, పోపోరా!

పరమేశ్వరుడు:

మారుకేళి కిప్పుడు నిన్నే కోరితి గదవే

నే కోరితి కదవే? బాలా!

బాలా:

కోరితివో? మీరితివో? హా! వే

సారితివో? పోపోరా!

పరమేశ్వరుడు:

తరిగొండా హరితోడే? నిన్నూ మరగితి గదవే?

నే, మరగితి గదవే? బాలా!

బాలా:

మరిగితివో? పెరిగితివో? ఏడ

తిరిగితివో? పోపోరా!

~

వెంగమాంబ కృతుల్లో ప్రధానమైన అలంకారం ఈ తాళం. అందుకు తగ్గట్టుగా కుదిరే ప్రాసలు, అనుప్రాసలు, యమకం. అంతదాకా తీగచుట్టులాగా సాగే పద్యం నుంచి కవిత్వాన్ని విడుదల చేసి ఆమె భాషతో నాట్యం చేయించింది. ఈ దరువు చూడండి:

~

ఆడెనే, కృష్ణుడాడెనే

పాడుచు ఆ గోపకులందరు,తన

వేడుక చూడగ వింతగ నగుచూ

తతకిట తకఝుం, తధిమి ధిమిత యని

గతులు, చొల్లులతులితముగ మెరయా

అలరుచు చిరుగజ్జెలు, నూపురములు

ఘలు ఘలు ఘలు ఘలు ఘల్లని మ్రోయా

ధాణు ధణుం ధణు ధణిత యనుచు గీ

ర్వాణులు నభమున వరుసగ పొగడా

మణిభూషణములు మరి మరి కదలగ

ఘణఘణ మని మొలఘంటలు మొరయా

తారి తకిణ ఝుం తకకిణ తకఝుం

తారి తకిట తకతాతై యనుచూ

వరతరిగొండ నివాసుడు వేంకట

గిరి నిలయుండగు కృష్ణుడు చెలగీ

~

చాలా చోట్ల ఆమె మీరాలాగా పాడుతుంది, ఆడుతుంది. కాని మీరాలాగా తనను తాను మర్చిపోయే పారవశ్యం కాదు ఆమెది. ఆమెకి తన భావావేశాలమీదా, భావవ్యక్తీకరణ మీదా గొప్ప అదుపు ఉన్నది, ఆ సంయమనం వల్ల ఆమె కృతులు ఎంతో శుభ్రవాక్కుగా వినిపిస్తాయి. ఒక్కొక్కపువ్వే ఏరి దేవుణ్ణి అలంకరించినట్టుగా ఆమె ఒక్కొక్కపదాన్ని ఏరి కూర్చి ఎక్కడ తగుతుందో చూసి అక్కడే అలంకరిస్తుంది. ఈ కృతి చూడండి:

~

అలుక యేల చేసెనే

అలుక యేల చేసెనే? నే-నందుకేమి సేతునే

ఎలమి తరిగొండా నృహరిహితుని నేనేమంటినే?

పదములొత్తనంటినా?-నే-భక్తి సేయనంటినా

ముదము మీర కెమ్మోవిని ముద్దుబెట్టనంటినా?

సురటి విసరనంటినా? -నే-సుమములు ముడువనంటినా

అరుదైనా చందనము మేన అలదనోపనంటినా?

పుప్పొడి చల్లనంటినా?-నే-విభూతి యలదనంటినా?

అప్పటప్పటికి బడలిక దీరా అధరామృత మీయనంటినా?

విడెము లియ్యానంటినా?-నే-వేడుక చేయానంటినా?

కడలేని మోహమున-నే-బిగి కౌగిలియ్యానంటినా?

నీవే నా మేల్ చెలియవే!-మరి-నీవందేమి వింటివే

ఆ విధమెల్లా తెలుపావే! హరునీ నన్నూ గూర్పావే!

~

ఈ కీర్తనలోని సౌశీల్యం, మర్యాద, పదప్రయోగంలోని ఔచిత్యం- ఆమె మన ఎదట కూచుని ఈ పాట పాడుతున్న భ్రమకలుగచేస్తున్నాయి.

సుగుణ గారు ఆండాళ్ ని వినగానే వెంగమాంబ గుర్తొచ్చారని చెప్పారుగాని, నిజానికి వెంగమాంబ అవ్వైయ్యారుతో పోల్చదగ్గ కవయిత్రి. ఆమె కృష్ణ మంజరి ‘వినాయక అగవళ్’ వంటి కృతి. మంజరి అంటే పూల గుత్తి. మంజరి అంటే ప్రాసలేని ద్విపద కూడా. అందులోనూ ఆమె నడవడిక అంతే మృదువుగా కనిపిస్తున్నది. చూడండి:

హరి నేను నీ సొమ్ము-నైతి నీవింక

గైకొనదగియుంటె-కైకొను కృష్ణ!

పోగొట్టవలసితే-పోగొట్టు దీని

కేనింత ప్రార్థింప-నేలనే కృష్ణ!

నీవు వేసిన దిక్కు-నేనుందు; హాని

లాభంబు లెవరివో-లక్షింపు కృష్ణ!..

తరిగొండ ప్రసన్న నరసింహస్వామి గుడి ముంగిట నిల్చుని మరొకసారి వెంగమాంబకు మనసారా నమస్సులర్పించాను. కొందరి దృష్టి చరిత్ర మీద ఉంటుంది, చరిత్ర నిర్మించడం మీద ఉంటుంది. మరికొందరి దృష్టి చరిత మీద ఉంటుంది. తమని తాము సంస్కరించుకునే ప్రయత్నంలో తమకు తెలియకుండానే వారు కొత్త చరిత్ర సృష్టిస్తారు. వెంగమాంబ రెండవతరహాకి చెందిన మనిషి, కవి.

14-4-2021

Leave a Reply

%d bloggers like this: