తాళ్ళపాక

బ్రహ్మంగారి మఠం నుంచి సిద్ధవటం మీదుగా మేం తాళ్ళపాక వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం కావొస్తూంది. మేము నేరుగా సిద్దేశ్వరస్వామి గుడి ముంగటకు చేరుకున్నాం. ఆ ఎర్రని ఎండలో మా కోసం స్థానికులు, ఉపాధ్యాయులు, విలేకరులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఊరి పెద్దమనుషుల్లో ఒకాయన యోగేశ్వరరెడ్డి అనే ఆయన మాకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికాడు.

అన్నమయ్య తండ్రి సిద్ధేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేసేవాడట. అన్నమయ్య బాలుడిగా నడయాడిన ఆలయప్రాంగణం అది. అక్కణ్ణుంచి మమ్మల్ని చెన్నకేశవ స్వామి ఆలయానికి తీసుకువెళ్ళారు. అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడి ప్రేమలో పడేటంతదాకా ఆ చెన్నకేశవస్వామికి అర్చకుడిగా ఉండేవాడట. అన్నమయ్య కొలిచిన దేవుడు అనగానే ఆ చెన్నకేశవస్వామి మరింత అందంగా కనిపించాడు. ఆ ఆలయం ముంగిట సుదర్శనచక్రానికి కూడా ఒక దేవాలయం కట్టారు. అటువంటి దేవాలయం మరెక్కడా లేదు అని అక్కడివాళ్ళు చెప్పారు. చెన్నకేశవస్వామి ఆలయం ముందు మరొక వైపు, ఒకప్పుడు అన్నమయ్య నివసించిన ఇంటికి గుర్తుగా, ఇప్పుడు అక్కడ అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పారు. సంకీర్తన భంగిమలో చెక్కిన నల్లరాతి ఆ శిల్పం దగ్గర అందరం ఫొటోలు తీసుకున్నాం. ఆ తర్వాత అన్నమయ్య ధ్యానమందిరానికి తీసుకువెళ్ళారు.

నేను తాళ్ళపాక వెళ్ళాలనుకోడానికి ప్రధాన కారణం అప్పుడు అన్నమయ్య 518 వ వర్థంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బహుశా తాళ్ళపాకలో కూడా ఏవైనా నిత్యసంకీర్తనలు, గానసమారోహాలూ జరుగుతూ ఉండవచ్చునని నాకెందుకో ఒక ఊహ కలిగింది. ఆ ఉత్సవాల సందర్భంగా తిరుమలలోనూ, తాళ్ళపాకలోనూ కూడా సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసారుగాని, అవి సాయంకాలం పూట మాత్రమే జరుగుతాయనీ, అది కూడా ప్రధాన రహదారిమీద ఉన్న అన్నమయ్య విగ్రహం దగ్గరే జరుగుతాయనీ చెప్పడంతో నిరాశకి లోనయ్యాను.

ఆ తర్వాత యోగేశ్వర రెడ్డి మాకు ఒక విందు ఏర్పాటు చేసారు. అన్నమయ్యను తలుచుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికీ అలా ఆతిథ్యమివ్వడం వారి కుటుంబసంప్రదాయమని చెప్పారు. ఎంతో ఆప్యాయతతో ఆయన దగ్గరుండి కొసరి కొసరి తినిపించాడు. ఆ తర్వాత తాళ్ళపాకలో ఉన్న హైస్కూలు చూడటానికి బయల్దేరాం. కాని ఈ లోపల పత్రికా విలేకరులు నన్ను ఏదైనా మాట్లాడమన్నారు.

అంతకుముందే వాళ్ళు ధ్యానమందిరంలో పెచ్చులూడిపోతున్న పైకప్పు చూపించి టిటిడి మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. నేను ఆ విషయమే గుర్తు చేసి వారికిట్లా చెప్పాను: ‘తాళ్ళపాకను రక్షించుకోవలసింది టిటిడి కాదు. తెలుగు ప్రజలు. ఇది అందరి ఆస్తి. వారసత్వం, సంస్కృతి. ఇంగ్లాండులో షేక్స్పియర్ పుట్టిన ఊరి చూడ్డానికి సందర్శకులు విరగబడుతుంటారు. ఆస్ట్రియాలో మొజార్టు పుట్టిన సాల్జ్ బర్గ్ ప్రపంచ పర్యాటక కేంద్రం. చీనాలో లిబాయి అనే కవి మా ఊళ్ళో పుట్టాడంటే మా ఊళ్ళో పుట్టాడంటూ రెండు రాష్ట్రాలు కోర్టుకెళ్ళాయి. నేను తాళ్ళపాక అనగానే ఊరంతా సంకీర్తనలు జరుగుతూ ఉంటాయనీ, భక్తులూ, గాయకులూ ఒకరిమీద ఒకరు తోసుకుపడుతుంటారనీ ఊహించుకున్నాను. ఈ ఊరు ఇలా ఉన్నదంటే ఇది తెలుగువాళ్ళ రసజ్ఞతా లోపం. దేవుడు కొండమీద మాత్రమే ఉన్నాడనుకున్నంతకాలం ఈ ఊరు ఇలాగే ఉంటుంది. దేవుడు గీతంలోనూ, గానంలోనూ కూడా ఉంటాడని నమ్మినప్పుడు మాత్రమే ఈ ఊరు ప్రపంచపటంలోకి ఎక్కుతుంది ‘ అన్నాను ఉద్వేగంగా.

నా మాటల్లోని భావోద్వేగం ముందు నన్నే చలింపచేసింది. నా మాటలింకా కొనసాగించాను. ‘అన్నమయ్య ఒక మహాసముద్రం. టాగోర్ ని చూడండి. ఆయన విశ్వకవి. ఆయన జీవితకాలంలో రాసింది రెండువేల అయిదువందల గీతాలు మాత్రమే. కాని రవీంద్ర సంగీత్ ఒక ఉద్యమం. ప్రతి ఒక్క గాయకుడూ, గాయికా టాగోర్ పాటలు పాడటం తమ సుకృతమనుకుంటారు. అన్నమయ్య ముప్పై నాలుగువేల కీర్తనలు రాసాడని ప్రతీతి. మనకి లభిస్తున్నవే దాదాపు ఇరవై వేలదాకా ఉన్నాయంటారు. ఆ కీర్తనల రేకులే రెండువేలకు పైగా ఉన్నాయి. మరి అటువంటి కవిని మనం ఏ విధంగా స్మరించుకోవాలి? తెలుగునాట ప్రతి ఇంటా అన్నమయ్య కీర్తనలే వినిపిస్తూ ఉండాలి కదా. తిరుపతి వెళ్ళే ప్రతి భక్తుడూ కనీసం అన్నమయ్య పాట ఒకటేనా పాడుకోగలిగి ఉండాలి కదా. మీరు టిటిడి వైపు చూస్తున్నారు. నేను తెలుగు జాతి రసజ్ఞతా లోపం వైపు చూస్తున్నాను’ అన్నాను.

ఏమి చేస్తే తాళ్ళపాక ప్రపంచ సాహిత్య పర్యాటకస్థలం కాగలుతుంది? మహారాష్ట్రలో సంత్ జ్ఞానేశ్వర్ పుట్టిన అలండి నుంచి ప్రతి ఏటా ఒక వార్కరి యాత్ర జరుగుతుంది. గాయకులు జ్ఞానేశ్వరుడి అభంగాలు ఆలపిస్తూ పండరిపురం పయనమవుతారు. ప్రతి ఏటా తాళ్ళపాకనుంచి ఒక గాయకసందోహం తిరుమల యాత్ర సాగిస్తే ఎలా ఉంటుంది? స్థానిక రాజకీయనాయకుడొకాయన ప్రతి ఏటా అన్నమయ్య నడిచిన దారి అని చిన్నయాత్ర కొండదారిన సాగిస్తాడట. దాన్ని సంగీత యాత్రగా, కవిత్వ యాత్రగా మార్చవచ్చు. ప్రతి ఏటా తిరవైయ్యారులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరిగినట్టే తాళ్ళపాకలో కూడా పదివేలమంది గాయకులో, పదిలక్షలమంది గాయకులో అన్నమయ్య కీర్తనలు ఆలపించవచ్చు.

నిజానికి అన్నమయ్య ఇంకా తెలుగు సాహిత్యప్రపంచంలోకే పూర్తిగా ప్రవేశించలేదు. మనం వింటున్న అన్నమయ్య కీర్తనలు ఆ కొన్నే, అవి కూడా ఎవరో ఒకరిద్దరు గాయకులు పాడి ప్రచారంలోకి తెచ్చినవే. అన్నమయ్య సంకీర్తనాభాండాగారం మెట్లమీదనే ఉన్నాం మనమింకా. కనీసం ముందుగదిలోకి కూడా ప్రవేశించలేదు. వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి ముందు తరం మహనీయులు, వేటూరి ఆనందమూర్తి, రవ్వా శ్రీహరి వంటి మన కాలపు మహాపండితులు మనకోసం తలుపులు బార్లా తెరిచిపెట్టినప్పటికీ మనమింకా గుమ్మం దగ్గరే తచ్చాడుతున్నాం. ఇక్కడ నా మిత్రులు తాడేపల్లి పతంజలి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నున్నా నరేష్ వంటివారు ఏదో ఒక మిషన అన్నమయ్యను మనకి సదా గుర్తు చేస్తోనే ఉన్నప్పటికీ మనం ఆ సముద్రం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

నిజమైన తెలుగు అంటే అన్నమయ్య తెలుగు. ఆ పాటలు మనం పిల్లలకి ఉగ్గుపాలతో రంగరించి నేర్పవలసినవి. సంస్కృతి అంటే అన్నమయ్య సంగీతి. ఉదాహరణకి ఈ గీతం చూడండి:

~

పలుకుతేనెల తల్లి పవళించెను

కలికితనముల విభుని కలసినది గాన.

నిగనిగని మోముపై నెరులు కెలకుల చెదర

పగలైన దాక చెలి పవళించెను

తెగని పరిణతులతొ తెల్లవారిన దాక

జగదేకపతి మనసు జట్టిగొనెగాన

కొంగుజారిన మెరుగు గుబ్బలొలయగ తరుణి

బంగారు మేడపై పవళించెను

చెంగలువ కనుగొనల సింగారములు తొలక

అంగజగురునితోడ అలసినది కాన.

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై

పరవశంబున తరుణి పవళించెను

తిరువేంకటాచలధిపుని కౌగిట కలసి

అరవిరై నును చెమటనంటినది కాన.

~

సాహిత్యం అందించగల అత్యుత్తమ రసానుభూతి మన హృదయాల్లో సాత్త్వికోదయం కలిగించడమే అయితే ఇంతకుమించిన గొప్ప సాహిత్యం మరొకటిలేదు. అప్పుడే రేకులు విప్పిన ఎర్రతామరపూవులోని లాలిత్యంలో, ఊపిరిసోకితేనే కందిపోతుందేమోననేటంత సౌకుమార్యంలో ముంచి తీసిన గీతమిది.

ఈ పాట ఎప్పుడు రాసాడు అన్నమయ్య? పదిహేనో శతాబ్ది చివరి భాగంలో. అప్పుడు ఒకవైపు సంగమ రాజవంశం పితృహంతకులతోటీ, భ్రాతృహంతకులతోటీ ధ్వంసంపై పోయి ఉంది. ఇంకొకవైపు గజపతుల తో యుద్ధాల్లోనూ, మరొకవైపు తురుష్కుల దండయాత్రలతోనూ తెలుగు సమాజం అల్లకల్లోలంగా ఉంది. అటువంటి పంచాగ్ని మధ్యంలో ఈ పుష్పయాగం చేసాడు అన్నమయ్య.

ఆ గీతసంచయంలో మనమింతదాకా విన్నవి ఏ పాటి? ఈ పాట విన్నారా మీలో ఎవరేనా?

~

అపుడేమనె నేమనుమనెను

తపమే విరహపు తాపమనె.

పవనజ ఏమనె, పడతి మరేమనె

అవనిజనిను నేమనుమనెను

రవికులేంద్ర భారము ప్రాణంబనై

ఇవలనెట్ల దరియించేననె.

యింకా నేమనె, యింతి మరేమనె

కొంకక ఏమని కొసరుమనె

బొంకుల దేహము పోదిది వేగనె

జింకవేట యిటు చేసెననె.

నను నేమనె, ప్రాణము మనకొకటనె

తనకు నీ వలెనె తాపమనె

మనుకులేశ ప్రేమపు మనకూటమి

ఘనవేంకటగిరి కంటిననె.

~

ఈ పాట విన్నారా?

~

వెలినుండి లోనుండి వెలితికాకుండి

వెలిలోను పలుమారు వెదకేవె గాలి

పండువెన్నెలలకునుప్రాణమగు గాలి

నిండు కొలకులలోన నెలకొన్న గాలి

బొండుమల్లెల తావి పొడవైన గాలి

యెండమావుల పోలి తేలయ్య గాలి.

కొమ్మావి చవికెలో కొలువుండు గాలి

తమ్మికుడుకుల తేనె దాగేటి గాలి

యిమ్మయిన చలువలకిరవైన గాలి

కుమ్మరింపుచు వేడి కురిసేవె గాలి.

తిరువేంకటాద్రిపై తిరమైన గాలి

సురతాంతముల జనుల చొక్కించు గాలి

తొరలి పయ్యెదలలో దూరేటి గాలి

విరహాతురలనింత వేచకువె గాలి.

~

వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే ఏవేవో ఆలోచనలు నా మనసులో మొలకెత్తడం మొదలయ్యింది. ఒక యాత్ర చెయ్యాలనిపించింది. జపాన్ లో బషో నడిచిన దారిలో ఇప్పుడు మళ్ళా యాత్రికులు యాత్రలు చేస్తున్నట్లుగా అన్నమయ్య తిరుగాడిన క్షేత్రాలన్నీ కలుపుకుంటూ కాలినడకన ఒక సాహిత్య సంగీత యాత్ర చెయ్యాలనిపించింది.

ఆ కలల్లో సోలిపోతూండగానే తిరుగుప్రయాణంలో చిన్న కునుకుపట్టింది. మధ్యలో ఎవరో భుజం తట్టి లేచి చూడమన్నట్టు అనిపించి ఒక్క ఉదుటున కళ్ళు తెరిచాను. కారు ఒక పెద్ద కనుమదారిన ప్రయాణిస్తూ ఉంది. చిట్వేలు నుంచి రాపూరు వెళ్ళే తోవలో ఉన్నామన్నాడు వినోద్. ఏమి కనుమదారి అది! అన్నమయ్య ఈ దారిన వెళ్ళి ఉంటాడా అనుకున్నాను. ఆయన సంకీర్తనలు వెతికితే ఇలాంటి దారిన వెళ్ళే ఉంటాడనడానికి ఇదిగో ఈ సాక్ష్యం దొరికింది:

~

సొంపుల నీ వదనపు సోమశిల కనుమ

యింపులెల్ల చేకొనగ నిల్లు నీ పతికి.

కలికి నీ పిరుదనే గద్దెరాతి కనుమ

మొలనూళ్ళ లతలనే ముంచుకొన్నది

కలయ పోకముడినే కట్లువడ్డది

అలరు విలుతుదాడి కడ్డము నీ పతికి.

ఇదివొ నీ కెమ్మోవి ఎర్రశిల కనుమ

కదిసి లేజిగురుల కప్పుకొన్నది

వదలకింతకు తలవాకిలైనది

మదనుని బారికి మాటువో నీ పతికి.

కాంత నీ చిత్తమే దొంగలసాని కనుమ

యింతటి వేంకటపతికిరవైనది

పంతపు నీ గుబ్బలే గుబ్బలికొండకనుమ

మంతనాల కనుమాయ మగువ నీ పతికి.

10-5-2021

Leave a Reply

%d bloggers like this: