తన చేతికర్రనే జతకత్తె

Reading Time: 2 minutes

గాంధీజయంతి రాత్రి ఆదిత్య కొర్రపాటి నాకొక లింక్ పంపించాడు, ‘పొద్దున్న మీరు పెట్టిన పోస్టులానే ఉంది ఇది కూడా చూడండి ‘ అంటో. యూట్యూబులో ఒక ప్రసంగం లింకు అది. అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఒక గోష్టిలో మధుకర్ ఉపాధ్యాయ్ అనే ఆయన గాంధీజీకీ, సంగీతానికీ మధ్య ఉన్న అనుబంధం గురించి చేసిన ప్రసంగం అది.

దాదాపు గంటన్నర పాటు సాగిన ఆ ప్రసంగం పూర్తిగా విన్నాను. వక్త కి గాంధీగురించీ తెలుసు, సంగీతం గురించి కూడా తెలుసు. బాగా తెలుసు. అందుకని ఆ అనుబంధాన్ని ఆయన గాంధీజీ జీవితం పొడుగునా గుర్తుపట్టడమే కాకుండా, ఎన్నో సూక్ష్మవివరాలతో మనముందుంచగలిగాడు.

మీలో మహాత్ముడి పట్ల, సంగీతం పట్ల ఇష్టమున్నవారందరూ ఈ ప్రసంగాన్ని వినాలని కోరుకుంటున్నాను.

రెండు కారణాల వల్ల: ఒకటి, గాంధీకీ, సంగీతానికీ మధ్య ఉన్న జీవితకాల అనుబంధాన్ని ఉదాహరణలతో తెలుసుకోవడానికి.

రెండవది, ఈ మధ్య చాలామంది మిత్రులు ఆన్ లైన్ ద్వారా సాహిత్య ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఒక వెబినార్ లో ఒక ప్రసంగం చెయ్యాలనుకుంటే ఎలా చెయ్యాలో ఈ ప్రసంగం ఒక నమూనా. ఒక ప్రసంగం చేయడానికి ముందు ఎంత హోమ్ వర్క్ చెయ్యాలో, ఎంతగా సంసిద్ధుడై శ్రోతలముందుకు రావాలో కూడా ఈ వక్తని చూసి నేర్చుకోవాలి.

నా వరకూ నాకు ఈ ప్రసంగం ద్వారా కొత్త విషయాలు చాలా తెలిసాయి. ఎంతో ఆసక్తికరమైన విషయాలు. రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక గోష్టిలో ఆయన్ని కూడా నాట్యం చేస్తారా అని అడిగినప్పుడు, ‘తప్పకుండా’ అని చెప్తూ, కాని నాట్యానికి ఒక జతకత్తె ఉండాలని, తన వరకూ తన చేతికర్రనే జతకత్తె అని చెప్తూ, దాదాపు ఇరవై నిమిషాల పాటు నాట్యం చేసాడనే ఒక సంఘటన. అలానే ఆయన 78 వ పుట్టినరోజు కోసం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ప్రత్యేకంగా ఒక మీరా భజన్ ని రాత్రికి రాత్రే ఆకాశవాణి రికార్డింగ్ థియేటర్ తెరిపించి ఆలపించి పంపడం, ఆ రికార్డు ని మర్నాడు సాయంకాలం ఆకాశవాణి ఢిల్లీ వారు ప్రసారం చేయడం, అదే గాంధీజీ చివరి పుట్టినరోజు వేడుక కావడం మరొక సంఘటన. 1927 లో హరిజన్ స్మారక నిధి కోసం ఆయన వారణాసి వెళ్ళినప్పుడు, ఆ నిధికి విరాళాలు పోగుచెయ్యడం కోసం ఆయన గౌహర్ జాన్ ని ఒక కచేరీ చేయమనడం, ఆమె చేసిన ఆ కచేరీ వల్ల, అంతదాకా ఒక వారానికి ఎంత సొమ్ము సమకూరిందో అంత సొమ్ము ఆ కచేరీ ద్వారా సమకూరడం మరొక విశేషం. అలాగే, రొమేరోలాని చూడటానికి ఫ్రాన్సు వెళ్ళినప్పుడు ఆయన్ని బితోవెన్ ఫిఫ్త్ సింఫొనీని పియానో మీద తన కోసం వినిపించమని కోరడం కూడా.

ఇక ప్రసంగం విన్న తరువాత కూడా నన్ను వదలని గీతాలు రెండు: ఒకటి, డొగీ మెక్ లీన్ ఆలపించిన స్కాటిష్ గీతం, మరొకటి సుబ్బులక్ష్మి దర్బారీ రాగంలో ఆలపించిన ‘హరీ తుమ్ హరో జన్ కీ పీర్..’

4-10-2020

Leave a Reply

%d bloggers like this: