
వైశాఖమాసపు చివరిరోజులు. నడి మధ్యాహ్నపు ఎండ తీక్ష్ణంగా ఉంది. బౌద్ధ స్తూపాల్ని చూడాలంటే ఇక్కణ్ణుంచి పైకి ఎక్కాలి అన్నాడు మిత్రుడు. ఆ ఎండలో ఆ కొండ ఎక్కగలనా అనుకున్నాను. కాని ఎక్కి తీరాలి. నడవడం కష్టమయితే, నెమ్మదిగా మోకాళ్ళమీద పాకుతూనే అయినా పైకి వెళ్ళి ఆ చైత్యాన్ని, ఆ గుహాలయాల్ని, ఆ ధర్మస్తూపాన్ని చూసి తీరాలి అనుకున్నాను. నెమ్మదిగా అడుగులు ముందుకేసాను. కాని నాలుగడుగులు నడవగానే అడివి నన్ను రెండుచేతుల్తో దగ్గరకు లాక్కుంది. అది ఏ పూల సుగంధమోకాని, ఆ తీయదనం నా వంటికంతటికీ తెలుస్తూ ఉంది. నెమ్మదిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను.
జీలకర్ర గూడెం! ఎన్నేళ్ళ కింద విన్నానీ మాట. దాదాపు నలభై ఏళ్ళ కిందట, త్రిపురగారి నోటివెంట. ఆయన 80లోనో, 81 లోనో కొన్నాళ్ళు ఏలూరులో ఉన్నారు. అప్పుడు తాను ఈ బౌద్ధ క్షేత్రాన్ని చూసానని మాకు చెప్పడం గుర్తుంది. అప్పణ్ణుంచీ, జీలకర్రగూడెం వెళ్ళాలని. ఇన్నాళ్ళకు సాధ్యపడింది.
నేననుకున్నంత కష్టం పట్టలేదు, కొండ ఎక్కడానికి. కాని, ఒకసారి పైకి చేరిన తరువాత, ఆ సౌందర్యమే వేరు. ఎటుచూసినా నీలిదిగంతంతో పెనవైచుకున్న కొండలవరస. ఆకాశంలో పూలు విప్పారినట్టు మేఘాలు. అక్కడ ఆ కొండ మీద వరసగా రకరాకల స్తూపాలు. అక్కడ చైత్య గృహం. అందులో పాలరాతిలో మెరిసిపోతున్న స్తూపం. ఇప్పటికి రెండువేల రెండువందల ఏళ్ళకింద థేరయాన బౌద్ధులు సుత్తపిటకం నుంచి బుద్ధుడి బోధనల్ని స్మరిస్తూ ఆ స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉంటారు. వారిని తలుచుకుంటూ నేను కూడా ఆ స్తూపం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసాను.
ఆ దిబ్బకు కొద్దిగా దిగువన గుహాలయాలు, చైత్యాలయాలు ఉన్నాయి. వాటిని చూడగానే అజంతా గుర్తొచ్చింది. ఆ తర్వాత తెలిసింది, గుంటుపల్లిని ఆంధ్రా అజంతా అని పిలుస్తారని. అజంతా చూసినప్పుడు, ఆ గుహాలయాల్ని అక్కడ నెలకొల్పాలని సంకల్పించిన ఆ బౌద్ధ శ్రమణుడెవరో అతడి సౌందర్యదృష్టికి నమోవాకాలు అర్పించకుండా ఉండలేకపోయాను. ఎదురుగా వాఘిరా నది. వర్షావాస దినాల్లో కొండమీంచి చూసినప్పుడు ఎదురుగా ఆ లోయ, కనిపించే దిగంతానికి గొడుగుపట్టే ఆకాశం, ఆ గుహ అంచులమీంచి వాన ధారలు కడుతుండగా, ఆ శ్రమణులు ఈ అశాశ్వతమైన లోక సౌందర్యాన్ని చూస్తో ఎంతగా పరవశిస్తూ ఉండేవారా అనుకున్నాను. ఇప్పుడు గుంటుపల్లి గుహాలయాల్ని చూసినప్పుడు కూడా అదే అనిపించింది.
క్రీ.పూ 3-2 శతాబ్దాలంటే ఏమిటి? బుద్ధుడు నిర్వాణం చెంది కనీసం రెండు మూడు శతాబ్దాలు కూడా గడవలేదు. అంత త్వరగా, ఆ వాక్కు ఇంతదూరం ఎలా ప్రయాణించింది? ఎందుకు ప్రయాణించింది? ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న ఆ సాధుసన్యాసులు ఎవరు? వారు ఈ ప్రపంచాన్ని త్యజించారా లేక ఈ లోకసౌందర్యానికి మరింత సన్నిహితులు కావాలనుకున్నారా? ఇక్కడ బౌద్ధ ప్రార్థనలు కనీసం వెయ్యేళ్ళ పాటు క్రీ.పూ 3 వ శతాబ్దం నుంచి క్రీ.శ 8 వ శతాబ్దందాకా వినిపించేవట. ఆ తర్వాత దిగువన వేంగీ సామ్రాజ్యం వర్ధిల్లింది. జీలకర్రగూడెం నుంచి పెదవేగి దాకా ఈ మార్గంలో దాదాపు పదిహేను శతాబ్దాల చరిత్ర కప్పడిపోయి ఉంది.
‘మీరు చారిత్రిక ఇతివృత్తంతో కథ రాస్తానని వాగ్దానం చేసారు. ఎప్పటికిస్తున్నారు’ అని అడుగుతారు సాయి పాపినేని నెలకొకసారైనా. ఇదుగో, ఇటువంటి స్థలాలకు వస్తే, ఒక కథ ఏమిటి, ఒక నవలనే రాయాలనిపిస్తుంది. కానీ తీరా రాయడానికి కూచుంటే మొదటి వాక్యమే ముందుకు సాగిపోదు. ఎందుకంటే, మన చరిత్ర గురించి, మన గతం గురించి మనకేమీ తెలియదు. ఇదుగో, ఇక్కడ చైత్య గృహానికి రెండువేల ఏళ్ళ కిందట ఒక ఉపాసిక మెట్లు కట్టించిందట. ఆ ఉపాసిక ఎవరు? ఎందుకామె బుద్ధుడి చరణాల్ని ఆశ్రయించింది? ఆమె నర్తకినా, గణికనా, విదుషినా? ఎవరై ఉంటుంది? ఆమె చైత్య గృహానికి మెట్లు కట్టించాలని ఎందుకనుకుంది? అప్పుడే, అంటే థేరయానం ఇంకా మహాయానానికి తావు ఇవ్వకముందే ఒక స్త్రీ బౌద్ధ సంఘంలో ఎలా ప్రవేశించింది?
సాయిపాపినేని గారు, ఈమని శివనాగిరెడ్డిగారు తెలుగు వాళ్ళ సంపద. మొన్న సాయిపాపినేనిగారు ఫోన్ చేస్తే ఒకటే మాటన్నాను, ‘అయ్యా, కొన్ని సాయంకాలాలేనా మీ దగ్గరకు వచ్చి కూచుని మీరు ఏమి చెప్తే అది వింటూ ఉండాలనుకుంటున్నాను. ‘ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలు’ అప్పుడేనా నా మనోనేత్రంముందు సాక్షాత్కరించడం మొదలుపెడతాయి’ అని.
సాయిగారూ, ఇప్పుడు ఆ విస్మృత ఉపాసిక ఎవ్వరో తెలుసుకోవాలని ఉంది. ఎప్పుడు రమ్మంటారు మీ దగ్గరికి?
6-6-2021