చెప్పుకోదగ్గ అధ్యాయం

తాడికొండ మాకందించిన చదువులో స్కౌటింగ్ కూడా చెప్పుకోదగ్గ అధ్యాయం. అక్కడ మా గురుకుల పాఠశాలని ఆనుకునే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రీజనల్ ట్రైనింగ్ సెంటరు కూడా ఉంది. ఆ సెంటరులోనే ఒక్కొక్క తరగతి వారీగా మాకు శిక్షణ దొరికిందో లేదా మేముండే డార్మిటరీలవారీగా శిక్షణ దొరికిందో గుర్తులేదుగానీ వారం రోజులపాటు అక్కడ ట్రైనింగ్ కేంపు నడిచింది. ఆ ప్రాంగణంలోనే గుడారాలు వేసుకుని అందులోనే ఉండటంలో చెప్పలేని థ్రిల్లింత అనుభవించాం.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ శిక్షణలో భాగంగా మాకు స్కౌటు వుద్యమంలోని అన్ని ముఖ్య విభాగాల్నీ పరిచయం చేసారనే అర్థమవుతోంది. టెంట్లు వేయడం, తాళ్ళతో ముడులు పేనడం, అడవిలో ముందు వెళ్ళిన స్కౌటు బృందాలు వదిలిపెట్టిన ఆనవాళ్ళని బట్టి వాళ్ళు వెళ్ళిన దారిని పోల్చుకోవడం, సిగ్నలింగు, ఆటలు, పాటలు, అన్నీ ఇప్పటికీ నాలోపల గూడు కట్టుకున్నట్టే ఉన్నాయి. ‘దయాకర్ దాన్ భక్తీ కా, హమే పరమాత్మా దేనా’, భారత్ స్కౌట్స్ గైడ్స్ ఝుండా ఊంఛా రహేగా’ లాంటి ప్రార్థనాగీతాలతో పాటు, సి.ఎస్.రావుగారు నేర్పిన రకరకాల యెల్లింగులు కూడా నిన్నవిన్నట్టే ఉన్నాయి. ఆ శిక్షణలో మా అందరికీ ఎంతో నచ్చిన కార్యక్రమం కేంప్ ఫైర్. రాత్రి పూట ఆ టెంట్ల మధ్య నెగడి రగిలించుకుని దాని చుట్టూ మేం పాడుకున్న పాటలు, చెప్పుకున్న కథలు, నాట్యాలు ఆ పసితనంలో నా మనసుమీద చెరగని ముద్రవేసాయి. కాంప్ ఫైర్ మొదలుపెట్టేటప్పుడు జట్టునాయకుడు చేయి ముందుకు చాచి కాంప్ ఫైర్ మొదలుపెడుతున్నట్లుగా ప్రకటించడం, కార్యక్రమం అంతా అయిపోయేక, శిబిరాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటించడం ప్రతి ఒక్కటీ నా కళ్ళముందు కనిపిస్తున్నట్టే ఉంది. మరీ ముఖ్యంగా ఆ శిక్షణలో భాగంగా మేము విన్న జంగిల్ బుక్ కథలో మౌగ్లీ లో మమ్మల్ని మేం చూసుకోవడం నేను మర్చిపోలేను.

ఆ తర్వాత చాలా ఏళ్ళకిగానీ స్కౌటు ఉద్యమం పూర్తి ప్రాముఖ్యాన్ని నేను గ్రహించలేకపోయాను. రాబర్ట్ బేడెన్ పవల్ ప్రారంభించిన ఆ ఉద్యమంలో శారీరిక శిక్షణ ఎంత ఉందో మానసిక, నైతిక శిక్షణ కూడా అంతే ఉందని గ్రహించాక పాఠశాలలన్నింటిలోనూ స్కౌటింగ్ తప్పనిసరి అంశంకావాలని అర్థమయింది. నేను అదిలాబాదు జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పనిచేస్తున్నప్పుడు అక్కడి ఆశ్రమపాఠశాలల్లోనూ, వసతిగృహాల్లోనూ స్కౌటింగుని పూర్తిస్థాయిలో అమలు చేసాను. అప్పట్లో గిరిజన సంక్షేమ శాఖలో సూర్యనారాయణ అనే స్కౌటు ఆఫీసరు ఉండేవాడు. అతడు స్కౌటు శిక్షణలో ఆరితేరిన వ్యక్తి. వేలాదిమంది ఉపాధ్యాయుల్ని స్కౌటు మాష్టర్లుగా, గైడు కెప్టెన్లుగానూ తీర్చిదిద్దిన వ్యక్తి. అతడి సహాయంతో అదిలాబాదు జిల్లాలో ఉండే గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్ని, హాస్టళ్ళని ఏడాది పొడుగునా నడిచే స్కౌటు శిబిరాలుగా మార్చేసాం. హాష్టలు వార్డెన్లని స్కౌటు మాష్టర్లుగా పిలవడం మొదలుపెట్టాం. ప్రతి రోజూ పాఠశాల ప్రాంగణంలో స్కౌటు జెండా ఎగరేసి ప్రార్థనాగీతం పాడటంతో రోజు మొదలయ్యేది. హాష్టల్లో ప్రతిగదిలోనూ ఉండే పిల్లల్ని ఒక జట్టుగా రూపొందించి వాళ్ళ దిన చర్యలో స్కౌటింగ్ ని అంతర్భాగం చేసాం. నాకు తెలిసి, రాష్ట్రంలోగాని, దేశంలోగాని అలా ఒక జిల్లా మొత్తంలో ప్రతిరోజూ స్కౌటింగ్ అమలు చేసిన ప్రయోగం అదేమొదటిది అని చెప్పాలి. ఆ ప్రయోగం మొదలుపెట్టి నేనక్కడ ఒక పూర్తి ఏడాది కూడా గడవకుండానే బదిలీ మీద వెళ్ళిపోవలసి వచ్చింది. కానీ, స్కౌటింగ్ అన్నిటికన్నా ముందు ఒక నైతిక ఉద్యమం అని అక్కడే నాకు చాలా స్పష్టంగా ధ్రువపడింది.

అదే అనుభవంతో ఆ తర్వాత విశాఖపట్టణం జిల్లాలో కూడా ఆ ప్రయోగం కొనసాగించాను. ఆ తర్వాత నేనింక మరే జిల్లాలోనూ పనిచేయనందువల్ల ఆ ప్రయోగాన్ని కొనసాగించలేకపోయాను. కాని రాష్ట్రకార్యాలంలో పనిచేస్తున్నప్పుడు స్కౌటు ఉద్యమాన్ని రాష్ట్రంలోని అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలలకూ విస్తరింపచేయాలనుకున్నానుగాని, అనేక కారణాల వల్ల ఆ ఊహ కార్యరూపానికి నోచుకోలేదు.

కాని రెండు మూడు వారాల కిందట భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి నా దగ్గరికి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు గారు నన్ను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రొటెం స్టేట్ ఛీఫ్ కమిషనరుగా నియమించారని చెప్పినప్పుడు నా సంతోషానికి హద్దులేదు. ఆ సమయంలో, ఒక కొత్త బాధ్యత నాకు లభించిందన్న దానికన్నా, పసితనంలో ఒక కబ్ గా, స్కౌటుగా శిక్షణ పొందిన ఒక విద్యార్థికి రాష్ట్రస్థాయి బాధ్యతలు లభించాయన్నదే ఎక్కువ సంతోషాన్ని కలిగించింది. ఈ కొత్త బాధ్యత ఒక విధంగా తాత్కాలిక బాధ్యత. రానున్న మూడు నాలుగు నెలల్లో కొత్త కమీషనరు ఎంపిక కావలసి ఉంటుంది. ఆ ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఎంపికచేయడం వరకూ నా బాధ్యత కొనసాగుతుంది. కాని అసలు ఆ బాధ్యత నా భుజాలమీద మోపడంలోనే నా విద్యార్థి జీవితం నుంచీ నన్ను ప్రభావితం చేస్తూ వచ్చిన స్కౌటు ఉద్యమం నన్ను పూర్తిగా అనుగ్రహించింది అనిపించింది.

ఆ మాటే చెప్పాను, మొన్న శనివారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవం నాడు. అప్పటిదాకా స్కొట్స్ గానూ, గైడ్స్ గానూ వేరువేరుగా కొనసాగుతూ వచ్చిన రెండు ఉద్యమాలు 1950 లో ఒకే సంస్థగా విలీనమయ్యాయి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర శాఖకి మాన్య గవర్నరుగారు ఛీఫ్ పేట్రన్. అందుకని ప్రతి ఏటా నవంబరు ఏడవ తేదీన ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర గవర్నరు గారి సన్నిధిలో జరుపుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆ వేడుకలు రాజ్ భవన్ లో జరిగాయి. ఈ స్కౌటు ఉద్యమాన్ని మరింత బలపరచడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని ఆయన ముందు వాగ్దానం చేసాను.

‘సిద్ధంగా ఉండు’ అనేది స్కౌటు మూల సూత్రం. శారీరికంగా, మానసికంగా ఎటువంటి బాధ్యతనైనా స్వీకరించడానికి, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి, ఎటువంటి త్యాగానికైనా సదా సంసిద్ధంగా ఉండటం స్కౌటింగ్ ధ్యేయం. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఏ మేరకు విస్తరింపచేయగలిగినా నా గురుకుల పాఠశాల ఋణం ఎంతో కొంత తీర్చుకున్నట్టే.

10-11-2020

Leave a Reply

%d