చండీదాస్ ప్రేమ గీతాలు

‘అమ్మఒడి’ కార్యక్రమం కోసం నెల్లూరు వెళ్ళినప్పుడు భాస్కరరెడ్డిగారిని, ప్రభాకరరెడ్డిని గారిని కలిసాను. సన్నిధి కుటుంబంగా పిలుచుకునే ఆ సత్సంగాన్ని ఎప్పుడు కలిసినా కొత్త శక్తి, సత్త్వమూ సమకూరుతుండటం నాకు అనుభవంలో ఉన్నదే. ఆ రోజు నేను వస్తానని తెలియడంతో ప్రభాకరరెడ్డి దంపతులు మిత్రులందరికీ పెద్ద విందు ఏర్పాటు చేసారు. ఏడాది తర్వాత ఇట్లా నలుగురూ కలిసి విందారగించడం ఇదే అన్నారు. ఆ కలయికని మరింత మధురం చేస్తూ మిత్రుడు పెరుగు రామకృష్ణ ఇటీవల సాహిత్య అకాదెమీ కోసం తాను అనువదించిన చండీదాస్ ప్రేమ గీతాలు పుస్తకం తీసుకువచ్చి నన్ను ఆవిష్కరణ చెయ్యమని అడిగాడు. ఆ మిత్రుల మధ్య, సుదీర్ఘవిరామం తర్వాత సంభవించిన ఆ సమావేశం, ఆ పుస్తకావిష్కరణ వల్ల కలిగిన సమోద్వేగం నాకు చాలా సంతోషం కలిగించాయి. మనుషులు జీవించి ఉండటమే గొప్ప వరమని భావించే ఈ రోజుల్లో, నలుగురు మనుషులు కూడి కవిత్వం గురించి మాట్లాడుకోవడం మరింత ఉత్కృష్టవరమనే అనుకోవలసి ఉంటుంది కదా.

డా. పెరుగు రామకృష్ణ కవిత్వ ప్రేమికుడు, నాలాగా ఇంటిపట్టున ఉండి తనలో తాను కవిత్వం చెప్పుకునేవాడు కాడు. ‘అన్నదమ్ముల వలెను జాతులు కలసి మెలసి మెలగవలెనోయ్’ అని మహాకవి చెప్పినమాటల్ని నిజం చేస్తూ, వివిధ భాషల, జాతుల, దేశాల కవులతో చెట్టపట్టాలు పట్టుకుని నడిచే ప్రపంచ పథికుడు.

‘చండీదాస్ ప్రేమ గీతాలు’ (2020) అనే ఈ పుస్తకం, దేబెన్ భట్టాచార్య అనే ఆయన వెలువరించిన Love Songs of Chandidas, The Rebel Poet-Priest of Bengal (1967) అనే పుస్తకంలోని కవితలకు అనువాదం. భారతీయ సాహిత్యంలోని ప్రతినిధి రచనల్ని కొన్నింటిని ఎంపిక చేసి వివిధ భాషల్లోకి అనువదింపచేయడానికి యునెస్కో సంకల్పించిన పథకంలో భాగంగా ఆ పుస్తకం వెలువడింది.

టాగోర్ కవిత్వం మీద చండీదాస్, విద్యాపతి అనే బెంగాలీ, మైథిలీ భక్తి కవుల ప్రభావం ఉందని తెలిసిన ఎన్నో ఏళ్ళకు గానీ వారి కవిత్వాన్ని చదివే అవకాశం లభించలేదు నాకు. అయితే చండీదాస్ విషయంలో, మరొకర్ని కూడా తలుచుకోవాలి. బెంగాల్ కు చెందిన ఆధ్యాత్మిక గురువు కుసుమ హరనాథ్ బాబా తన మిత్రులకీ, శిష్యులకీ, సన్నిహితులకీ ఎన్నో ఉత్తరాలు రాసేవారు. వాటిని ‘పాగల్ హరనాథ్ ‘ పేరిట మూడు సంపుటాలుగా వెలువరించారు. హరనాథ్ బాబా ని విశ్వసించే అనుయాయులు తమ దైనందిన జీవితంలో ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడో లేదా ఏదైనా స్ఫూర్తి కావాలనుకున్నప్పుడో, ఆ ఉత్తరాల సంపుటాల్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకుని ఏదో ఒక పుట దగ్గర తెరిచి అక్కడ ఏమి రాసి ఉంటే, తమకి ఆ రోజుకి బాబా అందిస్తున్న సందేశంగా దాన్ని భావిస్తుంటారు. నిజానికి ఇటువంటి పని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆధ్యాత్మిక సాధకులు చాలా పవిత్రగ్రంథాల విషయంలో చేస్తూ ఉండేదే. చివరికి పారశీక కవీంద్రుడు హాఫిజ్ కవిత్వాన్ని కూడా ఇటువంటి సందేశాల కోసం తెరిచేవారెందరో ఉన్నారు.

ఇరవయ్యేళ్ళ కిందట నేనొక తీవ్ర ఉద్వేగంలో కూరుకుపోయి ఉన్నప్పుడు, ఏ రోజుకి ఆ రోజు చెప్పలేనంతగా విచలితుణ్ణవుతూ ఉన్నప్పుడు, ఆ ‘పాగల్ హరనాథ్’ సంపుటాలు నా చేతుల్లోకి వచ్చాయి. నేనా ఉత్తరాల్ని పూర్తిగా చదవడమే కాకుండా, మరీ గాఢమైన భావోద్విగ్నతలో కూరుకుపోయినప్పుడల్లా ఆ ఉత్తరాలు నాకేమైనా సందేశమిస్తాయా అని అప్పుడప్పుడు ఆ పుస్తకాలు చేతుల్లోకి తీసుకుని, కళ్ళు మూసుకుని, ఏదో ఒక పేజీ తెరిచి చూసేవాణ్ణి. చెప్పవలసిందేమిటంటే, అలా ఎప్పుడు ఏ పేజీ తెరిచినా, ఆ భావుకుడు చండీదాస్ కవిత్వాన్ని తలుచుకుంటూ మాట్లాడిన మాటలే నా కళ్ళముందు కనిపించేవి.

ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తూ ఉంది. నేనప్పుడు లోనైన భావోద్వేగానికీ, చండీదాస్ కవిత్వానికీ, ఆ కవిత్వాన్ని అనుభవించి పలవరించే హరనాథ్ బాబా తలపులకీ అంత దగ్గరతనం ఎట్లా సాధ్యమయ్యిందా అని.

అలా నేను వెతుక్కున్న వాక్యాల్లో రెండు వాక్యాలు నేనిప్పటికీ మరవలేను. మొదటి వాక్యం, చండీదాస్ కవిత్వంలోని వాక్యమే, అది రాధ కృష్ణుడితో అంటున్న మాట: ‘నువ్వే నా రుగ్మతవీ, నా చికిత్సవీ కూడా’. రెండవ వాక్యం నన్ను నిశ్చేష్టుణ్ణి చేసిన వాక్యం. ఆ ఇంగ్లీషు వాక్యం ‘Love and price go hand in hand’- బహుశా నా జీవితమంతా నన్ను వెన్నాడుతూనే ఉంటుంది.

ప్రేమ బేరసారాలకీ, క్రయవిక్రయాలకీ అతీతమైందనుకుంటాం మనం. కాని పాగల్ హరనాథ్ ఏమంటున్నాడంటే ప్రేమని దానికి చెల్లించవలసిన మూల్యం నుండి విడదియ్యలేవని. నువ్వు ప్రేమ కోరుకుంటున్నావా, అయితే దాని కిమ్మత్తు చెల్లించడానికి సిద్ధంగా ఉండు అని.

మామూలుగా మనం ఇన్సూరెన్సు కంపెనీ వాడు మనకిచ్చే హామీని కాపాడుకోడం కోసం ఎప్పటికప్పుడు ఎంతో కొంత ప్రీమియం చెల్లిస్తూ ఉంటాం. ఆ పాలసీ కాలపరిమితి తీరినప్పుడల్లా దాన్ని మళ్ళా రెన్యూ చేసుకుంటూ ఉంటాం. ఒక ఇన్సూరెన్సు పాలసీ విషయంలోనే ఇంత ఒడంబడికని పాటించే మనం మన ఆత్మకి హామీనిచ్చే ప్రేమ విషయంలో మాత్రం రిక్తహస్తాలతో ఎదురేగుతాం. పైగా ప్రేమనే మనకు ప్రీమియం చెల్లించాలని కోరుకుంటాం. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వారే మన అనుబంధాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటూ ఉండాలని ఆశిస్తాం. కాని హరనాథ స్వామికి నిజం తెలుసు, ఆయన చాలా స్పష్టంగా చెప్పేసాడు, వెల చెల్లించకుండా ప్రేమ నిలవదు అని. ఆ వాక్యం వెనక చండీదాస్ ఉన్నాడనీ, చండీదాస్ వెనక సహజీయ వైష్ణవం ఉందనీ నాకు ఆ తర్వాత చాలాకాలానికిగాని తెలియరాలేదు. సరీగా ఇటువంటి మాటలే సూఫీలు కూడా మాట్లాడుతూ వచ్చారు. ప్రేమకి చెల్లించవలసిన వెల ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు. ఒక మనిషి తన శిరసు సమర్పిస్తే తప్ప ప్రేమ దొరకదని వాళ్ళకి తెలుసు. శిరసు ఒక రూపకాలంకారం. దానిలో అన్నీ వస్తాయి. పరువు, ప్రతిష్ట, స్వాభిమానం, తనదనే ప్రతి ఒక్కదానికీ శిరసు గుర్తు.

తన శిరసు మూల్యంగా చెల్లిస్తే తప్ప ప్రేమ లభించదనే మాటకి చండీదాస్ జీవితమే ఉదాహరణ. ఆయన బెంగాల్ లో, ఇప్పటి బీర్ భూమ్ జిల్లాలో ఒక పల్లెటూళ్ళో బసేలి గ్రామదేవత ఆలయంలో అర్చకుడిగా ఉండేవాడు. ఒక పురోహితుడిగా ఆ దేవతని పూజిస్తూనే తన ఊళ్ళో ఉన్న రామి అనే రజకస్త్రీతో ప్రేమలో పడ్డాడు. ఒకరోజు తాను పూజిస్తున్న దేవతని ప్రశ్నించాడు: ‘నీకన్నా నాకు రామి ఎందుకంత ముఖ్యంగా మనసుకి తోస్తోంది? పుట్టడం బ్రాహ్మణుడిగా పుట్టినా ఎందుకిట్లాంటి ప్రేమలో పడ్డాను?’ అని. ‘నువ్వు నీ ఇంద్రియాల్ని జయించాలంటే నీకు ఆమెని ప్రేమించడం తప్ప మరో దారి లేదు. ప్రేమించు ఆమెని. మరే దేవతా నీకు అనుగ్రహించలేనిదేదో ఆమె ప్రేమ నీకు అనుగ్రహిస్తుంది’ అంది ఆ దేవత.

ఇక ఆ తర్వాత చండీదాస్ కథ ఎటువంటి తుపాను సృష్టించి ఉంటుందో మనం ఊహించగలం. మధ్యయుగాల బెంగాల్ లో, కులాల అంతరాలు కరడుగట్టిన సమాజంలో ఒక దేవాలయ పూజారి తన ఊళ్ళోనే ఒక రజకస్త్రీతో ప్రేమలో పడటం, అది కూడా రహస్య ప్రేమగా కాకుండా కవిత్వంగా, గానంగా మారడం ఆ గ్రామం సహించలేకపోయింది. అతడిమీద ఊరంతా విరుచుకుపడింది. అతణ్ణి వెలివేసింది. ఆ సమయంలో అతడికి తోడుగా నిలబడింది అతడి సోదరుడు నకులుడు మాత్రమే. ఆ సోదరుడు చండీదాస్ ని తిరిగి గ్రామసమాజంలో కలుపుకోవడానికి ప్రాయశ్చిత్తకర్మలాగా ఒక విందు ఏర్పాటు చేసాడు. కాని ఆ విందులోని ఔచిత్యాన్ని రామి ప్రశ్నించింది. చండీదాస్ రాజీ పడుతున్నాడా అని ఎత్తిచూపింది. తీరా విందు మొదలయ్యేవేళకి, ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులంతా కూచుని విందు ఆరగిస్తున్న ఆ మందిరంలోకి రామి ప్రవేశించింది. ఆమె అక్కడ అడుగుపెట్టడం ఆ బ్రాహ్మణ సమాజాన్ని మరింత ఆగ్రహోదగ్రం చేసింది. మనకి లభిస్తున్న ఒక కథ అంతవరకే.

మరొక కథలో, ఆ విందు తర్వాత చండీదాస్ ని ఆ అర్చకత్వం నుంచి తీసేసారు. ఆ తర్వాత అతడేమైపోయాడో ఎవరికీ తెలియదు. ఇంకొక కథలో, చండీదాస్ ని అక్కడి నవాబు పిలిపించాడు. చండీదాస్ గానం విని నవాబు బేగం చండీదాస్ తో ప్రేమలో పడింది. నవాబు చండీదాస్ కి మరణ శిక్ష విధించాడు. రామి, బేగం ఇద్దరూ చూస్తూండగా వాళ్ళ కళ్ళెదుటే చండీదాస్ ని ఏనుగులతో తొక్కించేసాడు.

రకరకాల ఈ కథలన్నీ చెప్పే సారాంశమొకటే. చండీదాస్ ఒక స్తీతో ప్రేమలో పడ్డాడు, ఆ ప్రేమ కోసం తన శిరసునే మూల్యంగా చెల్లించాడనే.

చండీదాస్ ప్రేమకథలో ఉన్న ఈ ఉద్విగ్నత కేవలం సామాజికం మాత్రమే కాదు. అందులో అంతకు మించిన అంతస్సంగ్రామం ఉంది. చండీదాస్ తన ప్రేమ గురించి దేవతని ప్రశ్నించినప్పుడు ఆ దేవత మరొక మాట కూడా చెప్పింది: ‘నువ్వామెని పొందాలంటే ఆమెనెప్పటికీ పొందకూడదు’ అని. లేదా ‘నువ్వామెని పొందనంతకాలమే నీకు ఆమె పొందు అనుభవమవుతుంది’ అని. జెన్ బౌద్ధపు ప్రహేళికలాగా వినిపించే ఈ మాట వెనక సహజయాన బౌద్ధపు తాంత్రిక రహస్యాలన్నీ ఉన్నాయి. శాక్తేయ క్రతువులు ఉన్నాయి, చర్యాపదాలున్నాయి.

సహజ అంటే ప్రాకృతికం అని కాదు, ‘సహ+జ’ అంటే ఒకసారే పుట్టేది (co-emergent) అని. అంటే, సంసారమూ, కైవల్యమూ రెండూ వేరు వేరు కావు. ఈ దేహమూ, విదేహమూ కలిసే ప్రభవిస్తాయి, కలిసే అదృశ్యమవుతాయి. మరొక ఆరు శతాబ్దాల తరువాత ఈ రహస్యాన్నే మనకు అర్థమయ్యే secular పరిభాషలో టాగోర్ ఇట్లా గానం చేసాడు: ‘వైరాగ్యంలోని మోక్షం నాకు అవసరం లేదు. స్వాతంత్య్రం తన సహస్రబంధనాలతోనూ నన్ను కావిలించుకుని ఉంటుంది’ అని.

టాగోర్ ఇరయ్యవ శతాబ్దిలో జన్మించిన కాళిదాసు మాత్రమే కాదు, చండీదాసు కూడా. ఇంటిలోనే ముక్తి లభిస్తుందనే ఆయన సందేశం వెనక కబీరూ, రూమీ, సూఫీలు మాత్రమే కాదు, చండీదాసూ, సహజీయ వైష్ణవమూ, చర్యాపదాలూ కూడా ఉన్నాయని మనం మర్చిపోకూడదు.

అటువంటి చండీదాస్ కవిత్వం ఇన్నాళ్ళకు తెలుగులో వెలువడింది. అందుకు సాహిత్య అకాదెమీని, డా.రామకృష్ణనీ అభినందించక తప్పదు. ఆ సంపుటిలోంచి రెండు మూడు కవితలు మీ కోసం:

1

నేనెలా నడుచుకోవాలో

నాకు చెప్పి

ఏమి ఉపయోగం.

ఆ నల్లని శరీరం

నా దివారాత్రాలని

కమ్మేసింది

నా స్వప్నాల్లో

నిండిపోయింది.

చెదిరిన కురులను

సవరించడానికి కూడా

నా చేతులను కదపలేను

కృష్ణుడినే

నా నల్లని కురుల్లో

నిలుపుకున్నాను

అతన్నే పలకరిసూ

విహ్వలనై

విలపిస్తున్నాను

నా నల్లని కురులను

వదులుగా ముడేస్తాను

కన్నయ్య గుర్తొచ్చినప్పుడు

జారవిడుస్తాను.

నా చుట్టూ

నల్లదనమే పరుచుకుని ఉంది.

నల్లనయ్యను

ఎలా మరిచిపోను. (46)

2

కృష్ణా కృష్ణా

అని జపిస్తూ

నేనేమి పొందాను.

గాయపడిన హృదయం

పరాధీనమైన జీవితం

వేడెక్కిన ఆలోచనలు.

గోపబాలకుల గోకులంలో

అస్పృశ్యమే కానరాదు

ఎవరి జీవితానికి వారే మహరాజు.

యవ్వనవతుల విలాసాలు

ప్రియుల సాహచర్యంలో

వెలిగిపోతుంటాయి.

వీరందరి మధ్య

ఒంటరిదైన

రాధే కళంకిత.

రాకాసి దేవుడు

ప్రేమ నిండిన హృదయానికి

ప్రియుని స్పందననే

ఆలంబన చేసాడు.

జీవితం మీద

ఏ ఆశా లేదు.

వేడుకుంటున్నాను

ఎవరికీ, ఎప్పటికీ

రాధ

అని నామకరణం చేయకండి. (49)

3

నా వద్ద

కొంచెం సేపు కూర్చో మిత్రమా

శ్యాముడి వేణువు గూర్చి

నీకు చెప్పాలి.

పట్టపగలే

అందరూ చూస్తుండగానే

అది నన్ను దోచుకుంది.

నాకు సంబంధించిన

సమస్తం వశపర్చుకుంది.

నా హృదయాన్ని గాయపరిచి

నా జీవితాన్ని

విరహాగ్నికి

ఆహుతి చేసింది,

ఆశ్చర్యం

ఈ దైన్యమేమిటో

బోధపడట్లేదు.

ఇంత జరిగినా

మరిక దేనిపై

నా మనసు నిలుపలేకున్నాను.

నా మనసుకి నిలకడ లేదు.

వేణునాదం

నన్ను చెవిటిదాన్ని చేస్తోంది. (52)

17-1-2021

 

Leave a Reply

%d bloggers like this: