
ఆంధ్రదేశమంతటా నాకు ఆత్మబంధువులున్నారు. ఎక్కడికివెళ్ళినా అక్కడొక అక్క, చెల్లెలు ఉన్నారు. చిత్తూరు అనగానే అట్లా గుర్తొచ్చేది పలమనేరు బాలాజీ, వారిజలు. చిత్తూరు నుంచి పొద్దున్నే కుప్పం బయల్దేరినప్పుడు, చిత్తూరు దాటగానే మేము అడుగుపెట్టిన రోడ్డుని చూపిస్తూ నాతో ఉన్న లైజన్ ఆఫీసరు ప్రభాకర్ దీన్ని గుడియాత్తం రోడ్డు అంటారు అన్నాడు. నాకు వెంటనే-
కొంచెమిట్లా నడుద్దాం
రండి
లోయలో కూడా
వేడి టీ దొరుకుతుందిక్కడ
అనే వాక్యాలు గుర్తొచ్చాయి. బాలాజీ రాసిన ‘గుడియాత్తం రోడ్డు’ కవితలో వాక్యాలు. ఇవాళ ఎలాగేనా బాలాజీని కలవాలి, వాళ్ళింటికి వెళ్ళాలి అన్నాను ప్రభాకర్ తో. కానీ ఆ రోజంతా ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి రాత్రి ఏ తొమ్మిదింటికో గాని పలమనేరు చేరుకోలేకపోయాం. అట్లా అలసిపోయిన ఒక సాయంకాలమే కదా ఆప్తుల దగ్గరకి పోయి సేదతీరవలసింది!
వెళ్ళేటప్పటికి బాగా ఆకలి వేస్తూ ఉంది. వేడి వేడి అన్నం, వేరుసెనక్కాయల పచ్చడితో పళ్ళెం చేతికందించింది వారిజ. నాకెప్పటికీ ఒక కల, నేనొక దిమ్మరిగా, బుజాన ఒక బాగు తగిలించుకుని, పాసెంజరు బస్సులు ఎక్కుతూ దిగుతూ ఎక్కడ అలసిపోతే అక్కడ ఆత్మీయుల ఇంటి తలుపు తడతాను. అక్కడ ఒక తల్లి ఇట్లా వేడి వేడి అన్నం ముద్ద చేతికందిస్తుంది. ఆ రాత్రంతా వాళ్ళతో కవిత్వం గురించీ, పూలగురించీ, పక్షుల గురించీ మాట్లాడుకుంటూ గడిపెయ్యాలనీ, తెల్లవారగానే మళ్ళా మరొక చోటకి పయనమవ్వాలనీ ఒక కోరిక. అట్లాంటి ఒక అపురూపమైన రాత్రి అది. ఆ రోజు నిజంగానే పూలగురించీ, మొక్కల గురించీ మాట్లాడుకున్నాం. అక్కడొక అపురూపమైన వ్యక్తి తారసపడ్డాడు. ఆయన ‘వనవాసి’ నవల్లోని యుగళ ప్రసాద్ లాంటి మనిషి. ఎక్కడ చోటు దొరికితే అక్కడ మొక్కలు నాటడమే అతడి ఉద్యమం.
‘ఈయన కీలపట్ల హైస్కూల్లో పనిచేస్తున్నాడు. మీకు కీలపట్ల తెలుసా?’ అని అడిగాడు బాలాజీ. తెలియదు, ఆ పేరు మొదటిసారి వింటున్నాను.
‘కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు అక్కడే ఉన్నాడు. ఆయన్ను చూసే అన్నమయ్య కొండలలో నెలకొన్న కోనేటి రాయడి గురించి రాసింది’ అన్నాడు బాలాజి. ‘మీరు చిత్తూరు జిల్లాలో ఏమి చూసినా చూడకపోయినా, కీలపట్ల మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి’ అని కూడా అన్నాడు.
ఆ మాటలు నాలో గీపెడుతూనే ఉన్నాయి. హైకోర్టు కేసు వల్ల కౌంటింగు వాయిదా పడటంతో పోలింగు అయిపోగానే నేను తిరిగివచ్చెయ్యవలసి ఉంది. వెంటనే వచ్చెయ్యమని నా ఉన్నతాధికారులు మెసేజిలు పంపిస్తున్నారు కూడా. కాని కీలపట్ల చూడకుండా వెళ్ళెదెట్లా? మర్నాడు వారాంతం. ఎప్పణ్ణుంచో నాకు బ్రహ్మం గారి మఠం, తాళ్ళపాక చూడాలన్న కోరిక ఉండింది. కాబట్టి కీలపట్ల చూసుకుని కడప మీంచి తిరుగుప్రయాణం చెయ్యాలనుకున్నాను.
జిల్లపరిషత్తు కార్యాలయంలోనూ, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోనూ నా సమీక్షలు ముగిసేటప్పటికి బాగా పొద్దెక్కింది. అక్కణ్ణుంచి నేరుగా కీలపట్ల వెళ్ళేటప్పటికి సూర్యుడు నడినెత్తిమీదికి వచ్చాడు. కాని ఆ ఎండలో అక్కడ దేవాలయ ప్రాంగణంలో నన్ను కలవడానికి ఎందరో ఉపాధ్యాయమిత్రులూ, స్థానికులూ నా కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో టి.వి.పార్థసారథి రావు అనే విద్వాంసుడు, రచయిత కూడా ఉన్నారు. ఆయన ‘కీలపట్ల శ్రీకోనేటి రాయని చరితము’ (2014) అనే పుస్తకం నా చేతుల్లో పెట్టారు. కోనేటిరాయడంటే దేవుడు కొలనులో ఉంటాడేమో అనుకున్నాను. కాని ఆయన స్థలమూర్తి. కాని ఆ మూర్తి మనోహరంగా ఉంది. ‘వేంకటేశ్వరుడి విగ్రహం, ఈ విగ్రహం కొలతల్లో ఒకటే, కాకపోతే ఆ శిల్పం అలంకారసుసంపన్నం’ అన్నారు అర్చకులు. కాని కోనేటి రాయడు కూడా ఏమీ తీసిపోయేలా లేడు. మహరాజులాగా ఉన్నాడు. అర్చన, ఆశీర్వాదాల అనంతరం దేవాలయ ప్రాంగణం తిప్పి చూపించారు. ఆ ఆవరణలో ఒక కోనేరు ఉంది. కానీ నీళ్ళు అంతగా లేవు. ఆ దేవుడు అన్నమయ్యని ఎందుకని అంతగా ఆకర్షించాడు?
ఒకసారా? రెండుసార్లా? ఎన్నో సార్లు:
“కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు..”
“పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా, మమ్ము
ఎడయక బాయకుమయ్యా కోనేటిరాయడా..”
ఎప్పుడు విన్నా మదిలో వీణలు మోగించే ఈ కీర్తన:
~
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ
సురతబిన్నాణరాయ, సుగుణ కోనేటిరాయ
సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ
సరసవైభవరాయ సకలవినోదరాయ
వరవసంతములరాయ వనితలవిటరాయ
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ
గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ
సామసంగీతరాయ సర్వమోహనరాయ
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ
~
కామించి కోరితే కరుణ కురిపించిన కరుణాసముద్రుడు కాబట్టే ఆయన్ని అన్నమయ్య కోనేటి రాయుడని పిలిచి ఉంటాడు. అదీకాక కొండలరాయడు అనడం స్వభావోక్తి. కొండలలో నెలకొన్న కోనేటిరాయడం అనడంలోనే కదా కవిత్వముంది!
అక్కడ ఆ హైస్కూల్లో ఆ ‘యుగళ ప్రసాద్’మళ్ళా కలిసాడు. ఆ ఎండవేళనే అక్కడిక్కడే నాతో ఒక మొక్క నాటించాడు. అక్కణ్ణుంచి తిరిగి మదనపల్లి మీదుగా కడప బయల్దేరాను. ప్రయాణంలో, ఊరకే చూద్దామని, ఆ రోజు నా చేతుల్లో పెట్టిన కోనేటిరాయడి స్థలపురాణం తీసాను. ఆశ్చర్యం, ఒక అజ్ఞాత కవి రచించిన కొన్ని పద్యాలు అందులో కనిపించాయి.
ఆ కవి బహుశా పదిహేడు, పద్ధెనిమిది శతాబ్దాలకు చెందిన కవి కావచ్చు. ఆయన రాసిన ఒక అష్టకంలో లభ్యమవుతున్న అయిదు పద్యాలు మాత్రమే ఆ పుస్తకంలో ఉన్నాయి:
~
శ్రీలు మించిన మేడమీద వసించె ఉయ్యల శయ్యనూ
బాల! నిన్నటి నుండియును నిపాదమాన నిజంబురా
ఏలరో చెలిగోలరాదయ, ఏలరా కడు వేడ్కతో
ఈ లతాంగిని కీలుపట్టు కోనేటిరాయదయానిధీ!
నిండు చందురు వంటి మోమును నిగ్గుదేరెడి చెక్కులున్
కండచక్కెర వంటి మోవియు కల్కి ముద్దుల గుమ్మరా
అండనున్నది చేరనన్ గొని ఆదరమ్మున ఏలుడీ
ఎండకోర్వదు కీలుపట్టు కోనేటిరాయదయానిధీ!
జారుకొప్పును దువ్వి కస్తురి సారె బొట్టును దిద్దియున్
హార పయ్యద చక్కనొత్తి వొయారి గుబ్బల మెత్తనిన్
గోర చెక్కిలిగీడి ముద్దిడి కోమలాంగిని కూడరా
నేరుశాయక కీలుపట్టు కోనేటి రాయ దయానిధీ!
లలితరూపు విలాసవిభ్రమలల్ జిలుక్కు చిరంటిరా
వలలు జింకినదింత చక్కని వామనాంగని ఎత్తరా
చలమలెంటికి? నీదుకౌగిట సంభ్రమంబున మించె నీ
నెలమి యింతిని కీలుపట్టు కోనేటి రాయ దయానిధీ!
అంచయాన లతాంగి నిన్ను అహర్నిశంబులునాత్మలో
నుంచి చాల తలంచరా! దయనుంచరా! వలదెంచరా!
పెంచెరా మదనుండు వెన్నెల మించెరా! కడువేడ్కతో
నెంచి యేలర కీలుపట్టు కోనేటి రాయదయానిధీ!
~
ఈ పద్యాలకు ఆ పుస్తకంలో తాత్పర్యం కూడా ఇలా ఉంది.
~
కీలుపట్టు కోనేటిరాయా? ఓ దయాసముద్రుడా! సిరులునిండగానున్న మేడ నా నివాసము. నేను ఉయ్యాల శయ్యను. నీ నాయికను. నిజంగా నీ పాదసేవకు నిన్నటినుండి ఉన్నాను. ఈ లతాంగిని ఏలుటకు మోదముతో రావయ్యా! ఎండకోర్వని కోమల వామనాంగిని. నిండు చంద్రుని వంటి మోము, నిగ్గు తేలిన బుగ్గలు, కండ చక్కర వంటి దేహము, ముద్దులొలికే మగువతనంతో నీ చెంతకున్నాను. ఓ దయానిధీ, కీలుపట్టు రాయా! నీ కోసం నేను జారే సిగలను జారనీయక దువ్వి కొప్పు వేసుకుని కస్తురి బొట్టు దిద్దుకుని జారిపోతున్న పయ్యెదను సవరించుకుంటున్నాను. ఈ మృదు అంగనను కూడి చెక్కిలిగింతలతో ముద్దాడి నా వక్షములను మీటుమయ్యా! నన్ను వేరు చేయకు. నేను నువ్వు ఒకటే. వేరువేరు కాదు సుమా!
కోనేటిరాయా! శృంగార చేష్ట విభ్రమములతో నిన్నే జపించే భక్తురాలను. ఉత్తమోత్తమురాలను. చపలమెందుకు? కోరికలున్న చక్కని కాంతను. నీ కౌగిటలో మించే నెలతను. హంస నడకల వయ్యారిని. తీగవంటి సన్నని నడుము కలదాన్ని. అహర్నిశలు నీకై వేచి ఉన్నాను. నా మదిలో నిన్నే తలుస్తున్నాను. ఎదలో కోరికలు పెరిగాయి. వెన్నెల రాత్రి గడచిపోతూ ఉంది. కడువేడుకతో నా వలపును ఏలుటకు రావయ్యా! కోనేటిరాయా!
~
ఆ పద్యాలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. కీలపట్లలో నాకొక రత్నాల భరిణె దొరికినట్టనిపించింది.
8-5-2021