ఒక సాధన కథ

మూడు నాలుగేళ్ళ కిందట సోమయ్యగారి ఇంటికి వెళ్ళినప్పుడు, అప్పుడే మోక్షానందస్వామి వారి ఇంటికి వచ్చి వెళ్ళారనీ, ఆయన అనువదించిన ‘విశుద్ధి మగ్గ’ పుస్తకం రెండు సంపుటాలు నాకోసం కూడా ఇచ్చి వెళ్ళారనీ చెప్పారు. సోమయ్యగారికి ఆయన్ని గంగారెడ్డి పరిచయం చేసాడు. ఆ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో ఆర్ట్స్ అండ్ లెటర్స్ వారి స్టాల్లో బౌద్ధ సాహిత్యం కొత్త అనువాదాల పరంపర చూసినప్పుడు, వాటిలో అధికభాగం మోక్షానందస్వామి పాలీ నుంచి చేసిన అనువాదాలే కావడంతో కూడా నాకు ఆయన పట్ల ఆసక్తి పెరిగింది. ఆ అనువాదాలు ఎంతో సూటిగానూ, తేటగానూ ఉన్నాయి. ఆ మాట సోమయ్యగారితో చెప్తే,ఆయన ఆంజనేయరెడ్డిగారితో చెప్పి, ఆ పుస్తకాలు అప్పటిదాకా వచ్చిన వన్నీ, ఒక సెట్టు నాకు పంపించారు. ‘బుద్ధుడి దీర్ఘసంభాషణలు’, వినయపిటకానికి చెందిన ‘పాచిత్తియ పాలి’, ‘పారాజిత పాలి’మొదలైన పుస్తకాలు సరళసుందరమైన తెలుగులో లభ్యం కావడం నాకు చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది.

అప్పణ్ణుంచీ ఆ మహనీయుణ్ణి ఒక్కసారేనా కలుసుకోవాలని అనిపిస్తూ ఉండింది. మొన్న అదిలాబాదు వెళ్ళినప్పుడు ఆయన్ని ఎలాగేనా దర్శించాలన్న కోరికతో గంగారెడ్డిని అడిగితే స్వామితో మాట్లాడి మేము అదిలాబాదు వెళ్ళేటప్పుడో, వచ్చేటప్పుడో ఒకసారి ఆయన ఆశ్రమాన్ని సందర్శించేందుకు ఏర్పాటు చేసాడు.

కాని ఆయన్ని సాయంకాలం నాలుగింటికి కలవాలనుకున్నవాళ్ళం రాత్రి తొమ్మిదింటికి గాని కలవలేకపోయాం. ఆదిలాబాద్ హైదరాబాద్ హైవే మీద ఆర్మూర్ దగ్గర్లో మోర్తాడ్ అనే గ్రామంలో ఊరికి దూరంగా ఆయన మోక్షానంద బుద్ధ విహార అనే ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ రాత్రి ఆయన మా కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ ఆశ్రమంలో ఒక పక్క ధ్యానంకోసం, ప్రవచనాల కోసం పెద్ద హాలు ఉంది. మరొకపక్క రెండు గదుల చిన్న ఇంట్లో ఆయన ఒక్కరూ పూర్తి పరివ్రాజక జీవితం జీవిస్తూ ఉన్నారు. ఆవరణలో ఒక పక్క చిన్న తోట, మొక్కలూ ఉన్నాయి.

మేం వెళ్ళేటప్పటికి ఆయన ఏదో బౌద్ధ గ్రంథాన్ని అనువదించుకుంటూ ఉన్నారు. ఆ రాత్రి మా కోసం గంగారెడ్డి మిత్రుడొకాయన రొట్టెలూ, కూరా తెచ్చిపెట్టాడు. కాని స్వామి అప్పటికే తన సాయంకాలం ఆహారం తీసుకుని ఉన్నారు. మా అల్పాహారం కోసం ఆయన తానున్న గదిలోనే చోటు చూపించారు. మేము కూచోడానికి చదరలు పరిచారు. మంచినీళ్ళు ఏర్పాటు చేసారు. బహుశా ఆయన ఇంక నిద్రకి ఉపక్రమించే సమయం అది. కాని, ఆయన ఆ రాత్రి దాదాపు మరొక గంట సేపు ఓపిగ్గా మా కోసం కూచుని, నేనడుగుతూ ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఉన్నారు.

నేనాయన్ను కలవాలనుకున్నప్పుడు నాకు ఆయన్ని ఏదో ఒకటి ప్రశ్నించాలనో, లేదా ఏదో తెలుసుకోవాలనో ఉద్దేశ్యం ఏమీ లేదు. బౌద్ధ సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకు రావడానికి చేస్తున్న కృషి పట్ల ఆరాధన ఒక్కటే నా మనసులో ఉండింది. కాని ఆ రాత్రి ఆయనతో మాట్లాడిన తరువాత, నా జీవితంలో నేను మొదటిసారి ఒక నిజమైన బౌద్ధ సన్యాసిని కలుసుకున్నానని అనిపించింది. కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఒకప్పుడు బుద్ధుడి దగ్గరికి తన శిష్యుల్ని పంపించి న బావరి నివసించిన అస్సక జనపదంలో ఇన్నాళ్ళకు మరొక బౌద్ధ పండితుడు నివసిస్తున్నాడని అర్థమయింది. ఏ శ్రీలంకలోనో, జపాన్, వియత్నాంలలోనో లేదా కనీసం అమెరికాలోనైనా ఇటువంటి బౌద్ధ భిక్షువు ఉండి ఉన్నట్లయితే ఈ పాటికి ఆ ఆశ్రమం అంతర్జాతీయ తీర్థస్థలిగా మారిపోయి ఉండేది. కాని మోక్షానంద తనని తాను ఇంకా సాధకుడిగానే పోల్చుకుంటున్నారు. తన విరక్త జీవితంలో తానింకా చేరుకోవలసిన గమ్యానికి చేరుకోవలసి ఉందనే అనుకుంటున్నారు.

ఆ రాత్రి ఆ ఆశ్రమం ఆవరణలో నేనాయాన్ని ఒకదాని వెనక ఒకటి ప్రశ్నలు అడుగుతూ ఉండగా మా చుట్టూ పుష్యమాసపు చలిగాలి. నేను చలికి వణుకుతున్నట్టు గమనించినట్టున్నారు. ‘మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబుగా నేనొక పుస్తకం ఇస్తాను. అది నేనింతదాకా చేసిన ప్రయాణం గురించిన కథనం. ‘నా సాధన కథ ‘. మీకు ఇష్టమయితే ఆ పుస్తకం తీసుకువెళ్ళి చదవండి.’ అన్నారు. అయిదు నిమిషాలు గడిచాక ‘మళ్ళా మాటల్లో పడి మర్చిపోతామేమో, ఆ పుస్తకం ఇప్పుడే మీకిస్తాను’ అని లోపలకి వెళ్ళి తీసుకువచ్చి ఇచ్చారు. దానితో పాటు బుద్ధుడి దీర్ఘ సంభాషణల్లో ఒకటైన ‘శ్రామణ్యఫలసూక్తం’ కి తాను చేసిన అనువాదం చిన్నపుస్తకం కూడా. ‘నా సాధన కథ పుస్తకం గురించి ఎవరూ ఇప్పటిదాకా ఏమీ చెప్పలేదు నాకు. నేను మీ రచనలు చదువుతూ ఉంటాను. మీకు ఆ పుస్తకం చదివితే ఏమనిపించిందో తెలుసుకోవాలని ఉంది’ అని కూడా అన్నారు.

నేను ఇంటికి రాగానే వెంటనే ‘నా సాధన కథ’ (2016) ఆతృతగా చదివేసాను. కావటానికి నూటయాభై పేజీల చిన్న పుస్తకమే అయినప్పటికీ అది ఒక ఒక పరివ్రాజకుడి ఆత్మకథ. అంతకన్నా కూడా ఒక సత్యాన్వేషకుడి, సౌందర్యారాధకుడి జీవితయాత్రాకథ. ఆయన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడూ, ఆ పుస్తకం చదువుతున్నప్పుడూ కూడా నా మనసులో వియత్నమీస్ బౌద్ధ సాధువు థిచ్ నాట్ హన్ నే మెదులుతూ ఉన్నాడు. మోక్షానంద కూడా థిచ్ నాట్ హన్ లానే కవి. ఆయన ప్రయాణం కూడా భావకవిత్వం నుంచి బౌద్ధ కవిత్వం దాకా నడిచిన అన్వేషణ. ఆయన భావుకత్వం తామరపూలు పూసిన కొలనులాంటిది. ఆ వాక్కు శుభ్రవాక్కు. అందులో శుభ్రత, స్వచ్ఛతలతో పాటు, ఒక సౌందర్యపు మిలమిల కూడా ఉంది. అంత చక్కటి తెలుగు, అంత భావస్ఫోరకమైన వ్యక్తీకరణ ఇప్పటి రచయితల్లో చాలా అరుదుగా కనిపించే విశేషాలు.

ఆరోజు ఆయన నాకు స్థూలంగా చెప్పిందీ, ‘నా సాధన కథ ‘లో వివరంగా రాసిందీ-ప్రధానంగా ఆయన తనలోకి తాను చూపు సారించుకుని తనను తాను ప్రక్షాళనం చేసుకుంటూ వస్తున్న వైనం. ఆయన చెప్పినదాని ప్రకారం ఆయనలో గృహస్థ, అద్వైత, బౌద్ధ సంస్కారాలు మూడూ బలంగా ఉన్నాయి. మూడూ ఆయన్ని తమ వైపు పట్టి లాగుతూనే వచ్చాయి. గృహస్థ సంస్కారానికి ఆయన భగవద్గీతను ప్రమాణంగా తీసుకున్నారు. గీత నువ్వు గార్హస్థ్య జీవితం జీవిస్తూనే విముక్తుడివి కావచ్చని చెప్తుంది. అద్వైత సంస్కారం ప్రధానంగా శాక్తాద్వైతం గా ఆయన్ని ఆకర్షించింది. రామకృష్ణపరమహంస-వివేకానంద స్వామి సాహిత్యం రూపంలో ఆ సంస్కారం ఆయన్ని గాఢంగా ప్రభావితం చేసింది. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు సన్న్యాస జీవితం వైపు ఆయన్ని మరల్చడంలో వివేకానంద రచనలే ప్రముఖ పాత్ర వహించాయి. కాని, ఆ రెండు సంస్కారాల మధ్యా, అంటే గృహస్థ, సన్యాస జీవితాల మధ్య ఊగిసలాడుతున్నప్పుడు, తలెత్తిన ప్రశ్నలకూ, ఎదుర్కొన్న సంక్షోభాలకూ ఆ రెండు సంప్రదాయాల్లోనూ ఆయనకు ఊరట లభించలేదు. ప్రశ్నలన్నీ సద్దుమణిగి, చిత్తమడిగే చోటు ఆయనకి బుద్ధుడి మాటల్లో కనిపించింది. బౌద్ధ సాహిత్యం చదువుకుంటూ, ఆ మార్గంలో ఆనాపాన సతి సాధన చేస్తూ, తనని తాను ఒక బౌద్ధ భిక్షువుగా భావించుకుంటూ వచ్చారు. అయితే, ఒక గురువు ద్వారా దీక్ష పొందడం సముచితంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో దీక్ష స్వీకరించి తన పేరు Bhante Dhammarakkhita గా మార్చుకున్నారు. కాని ఇప్పటికీ ఆయన మోక్షానంద స్వామిగానే ఎక్కువ మందికి తెలుసు.

ఈ ప్రయాణంలో గృహస్థ, సన్న్యాస సంస్కారాల మధ్య ఆయన పడ్డ నలుగులాటలో ఆయన్ని ఎక్కువ కలతకు గురిచేసిన సంస్కారం మరొకటి ఉంది. దాన్ని ఆయన తన లౌకిక సంస్కారంగా గుర్తుపట్టారు. రెండు సార్లు ఆ సంస్కారం ఆయన్ని కిందకు దిగలాగింది. ఆయన సాధన కథలో ఆ రెండు సంఘటనలూ ఆసక్తి కరమైన అధ్యాయాలు. ఇక్కడ కూడా ఆయన నాకు థిచ్ నాట్ హన్ ను తలపుకు తెస్తున్నారు. ఒక యోగి ప్రేమలో పడితే ఏమవుతుందో థిచ్ నాట్ హన్ మనతో పంచుకోడానికి ఏకంగా ఒక పుస్తకమే రాసాడు.

మన చుట్టూ ఎంతో ఆధ్యాత్మిక, భక్తి వాజ్మయం, గుళ్ళూ, గోపురాలూ, మందిరాలూ, తెల్లవారిలేస్తే ప్రతి ఛానల్లోనూ గొంతెత్తి వినిపించే ప్రవచనకారులకు కూడా తక్కువ లేదు. కాని నిజమైన సాధకులూ, నిజమైన సత్యాన్వేషకులూ మనకి కనిపించడం దాదాపు అరుదు. అది కూడా ప్రచారానికి దూరంగా, పూర్తి విరక్త జీవితం గడుపుతూ, తామింకా సత్యం వెతుక్కుంటూనే ఉన్నామనీ, సాక్షాత్కారం పొందామని పూర్తిగా చెప్పలేమనీ చెప్పుకునే వినయసంపన్నులు ఇంకా అరుదు. మోక్షానంద స్వామి అటువంటి నిజమైన ఆధ్యాత్మిక హృదయుడనీ, మన కాలంలో మన మధ్య జీవిస్తున్న మహనీయ బౌద్ధ పండితుడనీ, ఆర్తితోనూ, ఆందోళనతోనూ సతమతమవుతున్న మనకి ఎంతో కొంత వెలుగు చూపించగల సాధకుడనీ చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. ఆయన తెలుగు వాడైనందుకు గర్వంగా కూడా ఉంది.

‘నా సాధన కథ ‘నుంచి కొన్ని వాక్యాలు:

~

ఆ పరతత్త్వం అన్ని నిర్వచనాలకు అతీతమైంది. దాన్ని మనం ఏ రూపంతో ధ్యానించినా ఆ రూపం ద్వారా దానితో సంబంధం ఏర్పడుతుంది. సాపేక్ష ప్రపంచంలో ఈ రూపాల వలన నశ్వరమైన ప్రయోజనం కలిగిగే కలగవచ్చు గాని అవన్నీ నామరూపాల పరిథిలోనే కావటం వలన ఆయా సంస్కారాలను ప్రోగుచేయటం వలన వాటితో ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందటం సాధ్యం కాదు.

దుఃఖాన్ని పూర్తి అంతం చేయడానికి మార్గాన్ని అన్వేషించిన బుద్ధుడు పై కారణాలవల్లనే నామరూపాలన్నిటినీ నిరాకరించి నిర్వాణాన్ని ఆరిపోయిన దీపంలాంటిదన్నాడు. మానవీయమూ, దివ్యమూ అయిన అన్ని బంధనాలను వదలినప్పుడే దుఃఖం పూర్తిగా తొలగిపోతుందన్నాడు.

మానవుడు తన కర్మను బట్టి స్వర్గలోకాలను, నరకలోకాలను, ప్రేతత్వాన్ని, జంతుజన్మలను పొందుతాడని బౌద్ధం చెప్తుంది. భౌతికమైన ఈ భూమి మీద ఉన్న మనం స్వర్గనరకాలను కూడా ఇటువంటి భౌతికలోకాలుగానే ఊహించుకుంటాం. కాని అవి మన చేతనకు సంబంధించినవి. మానసికమైన ఆయా సుఖదుఃఖస్థితులు.

కర్మ అంటే పని. మానవుడు తాను చేసిన పుణ్యపాపకర్మల వలననే ఆయా సుఖదుఃఖస్థితులను పొందుతాడు. కర్మలు అనేకం. వాటి ఫలాలు కూడా అనేకమే. కొన్ని శీఘ్రంగా ఫలించవచ్చు. కొన్ని ఆలస్యంగా ఫలించవచ్చు. మనం పట్టుదలతో ప్రయత్నించి కర్మను మార్చుకోవచ్చు అనికూడా బౌద్ధం తెలుపుతుంది.

బుద్ధుడు జాతికి కాక శీలానికే గొప్పతనాన్ని ఇచ్చాడు. జ్ఞానాన్ని పొందటానికి అన్ని వర్ణాల వారికీ అర్హత ఉందన్నాడు. సంఘంలో అందరికీ ప్రవేశం కల్పించాడు.సూక్ష్మదేహాలతో మహాత్ములు, దేవతలు ఉండటాన్ని బౌద్ధం అంగీకరిస్తుంది. వారి అరూప ధాతువులన్నీ సూక్ష్మలోకాలే. కాని ఈ సృష్టికి కర్త, నియంత అని చెప్పబడే దేవుని గురించి అది ఏమీ చెప్పదు.

అణువు నుండి బ్రహ్మాండం వరకు అన్నిటిని మనస్సుతో తెలుసుకుంటున్నాం. అన్నింటిని తెలుసుకునే ఈ మనస్సును దేనితో చూడాలి? అంటే మనస్సుతోనే చూడాలి. ముందుగా ఎటువంటి భావనలను ఏర్పరచుకోకుండా చూడాలి. ఈ శరీరంలో ప్రాణం ఉంది, మనస్సు ఉంది. మనస్సును ప్రాణంలో లీనం చేసినప్పుడు అది తనలోకి తాను ఉపసంహరించుకుంటుంది. ముక్కు ద్వారా శ్వాస నడిచినంతసేపు బహిర్ముఖంగా ఉన్న మనస్సు అప్పుడు తనలోకి తాను ప్రవేశిస్తుంది. తన్ను తాను చూసుకుంటుంది. ఒకవేళ శ్వాసతో రామ అనో, శివ అనో ఇంకా ఏదైన అద్వైత మంత్రాన్నో జోడించి ధ్యానించినప్పుడు ముందుగానే మనం మన చైతన్యంపై రాముణ్ణో, శివుణ్ణొ లేదా అద్వైత భావననో ఆపాదిస్తున్నామన్నమాట. అప్పుడు మన దర్శనం కూడా ఆ భావనను అనుసరించే ఉంటుంది. గ్రంథాల్లో చదివి, లేదా ఇతరులద్వారా విని సత్యాన్ని గురించి ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకుని సాధన చేయవద్దన్నాడు బుద్ధుడు. ఎందుకంటే అప్పుడు నీ దర్శనం నీ విశ్వాసాన్నిబట్టే ఉంటుంది. నీ విశ్వాసంతో పనిలేకుండా సహజంగా నీలో ఉన్న శ్వాసను అనుసరించమన్నాడు బుద్ధుడు. ఒక విధంగా బుద్ధుడు చెప్పింది మానసిక శాస్త్రమే. అది శ్వాసతో మొదలై నిర్వాణంతో ముగుస్తుంది.

‘ఇది దుఃఖం, ఈ దుఃఖానికిది కారణం, దాన్ని ఇలా నిరోధించవచ్చు, ఆ నిరోధాన్ని పొందటానికి అనుసరించవలసిన మార్గం ఇది’ అని స్పష్టంగా చెప్పాడు. ‘నీ సుఖానికి, దుఃఖానికి, బంధానికి, మోక్షానికి కర్తవు నీవే. దేవునుకి ఇందులో ఎటువంటి పాత్రా లేదు’ అన్నాడు బుద్ధుడు. (పే. 155-156)

మరి మీరు కృష్ణునికి సంబంధించి, జగన్మాతకు సంబంధించి చాలా అనుభవాలను పొందారు కదా! అవన్నీ భ్రాంతులా అని ఎవరైనా అడగవచ్చు. మనస్సుకు ఉండే శక్తులు అపరిమితమైనవి. పరిశుద్ధమైన మనస్సుపై మనం ఏ రూపాన్ని ఆరోపిస్తే అది ఆ రూపాన్ని ధరిస్తుంది. ఆ రూపంతో మనతో వ్యవహరిస్తుంది. అందువలన వాటిని భ్రాంతులు అనడం వీలుకాదు. అయితే దుఃఖాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే మానవీయమైనవిగాని, దివ్యమైనవిగాని అన్ని రకాల బంధనాల నుండి విముక్తం కావలసిందే. భార్యాపిల్లల మీద చిక్కుకున్న మనస్సు బంధానికి కారణమైనట్లే, దేవతల మీద చిక్కుకున్న మనస్సుకూడా సత్యసాక్షాత్కారానికీ, ముక్తికి ఆటంకంగా మారుతుంది. (పే. 108)

9-3-2021

Leave a Reply

%d bloggers like this: