ఒక క్లాసిక్

బ్రిటిష్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఎంపిక చేసిన యాభై సినిమాల్లోనూ, వందసినిమాల్లోనూ కూడా ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన Vertigo (1958) మొదటిస్థానాన్ని సంపాదించుకుంది. సుమారు యాభై ఏళ్ళ కిందటిదాకా పదకొండో స్థానంలో ఉంటూ వచ్చిన ఈ సినిమా 2012 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. అప్పటిదాకా ప్రపంచ సినిమాలో అత్యుత్తమ సినిమాగా పరిగణనకి నోచుకుంటూ వస్తున్న Citizen Kane రెండవ స్థానానికి జారిపోయింది.

ఏ కారణాల వల్ల Vertigo ఈ స్థానానికి చేరుకోగలిగిందా అని చాలా ఆసక్తిగా చూసాను. హిచ్ కాక్ సినిమాల గురించి, వాటిల్లో ఉండే సస్పెన్స్ గురించీ, మిష్టరీ గురించీ చాలానే విన్నానుగాని, ఆయన తీసిన సినిమా అంటూ నేను చూడటం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో నిజానికి ఉత్కంఠ కలిగించేది ఏమీ లేదు. కథలో మిష్టరీ ఏదైనా ఉంటే, దాన్ని తెలుసుకోడానికి సినిమా చివరిదాకా ఆగవలసిన పనిలేదు. రెండు వంతుల సినిమా పూర్తవగానే ఆ రహస్యమేదో మనకి చాలా సూటిగా, స్పష్టంగా చెప్పేస్తాడు దర్శకుడు. ఏ అపరాధ పరిశోధన కథలో అయినా కథ చివరిదాకా ఆగకుండానే మిష్టరీ విడిపోయాక ఆ కథలో ఇంక మనకి ఆసక్తి కలిగించేది ఏముంటుంది? కాని ఆ రహస్యమేదో తెలిసిపోయాక కూడా, ఆ సినిమా చూసిన మొదటి తరం గడిచిపోయాక కూడా, ప్రతి ఏడాదీ నెమ్మదిగా ప్రజాదరణలో పై పైకి ఎగబాకుకుంటూ ఈ సినిమా నేడు అత్యంత ప్రజాదరణకు నోచుకున్న సినిమాగా నిలబడుతున్నది. ఈ సినిమా వరకు మిష్టరీ ఏదైనా ఉంటే అదే. ఏ కారణం వల్ల ఈ సినిమా, నీలో ఎటువంటి ఉత్కంఠనూ లేవనెత్తలేని, ఒకవేళ లేవనెత్తినా, చివరికంటా నిలపలేని ఈ కథనం ఎందుకని ప్రేక్షకుల్ని ఇన్ని దశాబ్దాలుగా సమ్మోహితుల్ని చేస్తూ వున్నది?

Vertigo సినిమా చూసినంతసేపూ నేనేమీ అద్భుతానుభూతికి లోను కాలేదుగానీ, ఏ కారణాల వల్ల ఈ సినిమా ఈ స్థానానికి చేరుకుందన్న దాని గురించి మాత్రం కొంత ఉత్కంఠకు లోనయ్యాను. కథలో హత్య చేసిందెవరో చెప్పేసిన తరువాత కూడా దర్శకుడు మరొక నలభై నిమిషాల పాటు కథని ఎందుకు పొడిగించాడు? అంటే అతడి ఉద్దేశ్యం ఈ కథని ఒక అపరాధ పరిశోధన కథగా చెప్పడం కాదన్నమాట. మరేమి చెప్పాలనుకున్నాడు?

ఇదే ఈ సినిమాలోని అత్యంత ఆకర్షణీయమైన అంశం. గత యాభై అరవయ్యేళ్ళుగా చలనచిత్ర విమర్శకులు ఈ అంశాన్నే పరిశీలిస్తూ, రకరకాల ప్రతిపాదనలు చేస్తూ, వాదించుకుంటూ, తర్కించుకుంటూ ఉన్నారు. ఏ ఒక్కరూ కారణమిదీ అని ఇతమిత్థంగా తేల్చకుండా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ సినిమాని చలనచిత్రరంగానికి చెందిన హామ్లెట్ నాటకంగా అభివర్ణించవచ్చునేమో.

హామ్లెట్ కథ మనకి తెలుసు. తన తండ్రి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోమని చెప్పిన తరువాత తన పినతండ్రిని వధించడానికి అవకాశాలు దొరికి కూడా హామ్లెట్ ఆ అవకాశాల్ని వినియోగించుకోకుండా తనతో తాను వాదించుకుంటూ కాలయాపన చేస్తాడు. ఎందుకట్లా చేసాడన్న ప్రశ్న మీద గత అయిదు వందల ఏళ్ళుగా ప్రపంచం తలపట్టుకుంటూనే ఉంది. ఈ సినిమాదీ అదే ధోరణి. ఒక మిష్టరీ సినిమాగా దీన్ని చూపించాలనుకున్న దర్శకుడు కథ సగంలో ఉండగానే మిష్టరీ ఏమిటో చెప్పేసి ఆ తర్వాత మరింత దీర్ఘసమయం పాటు కథ ఎందుకు కొనసాగించాడు. అలా కొనసాగించడానికి అతడి అంతరంగంలో ఉన్నదేమిటి? ఎంత ఆలోచించినా అంతుపట్టని ఆ కారణం ఒక సమస్య అయితే, అటువంటి మిష్టరీ రహిత సినిమా పట్ల ప్రపంచానికి నానాటికి పెరుగుతున్న ఈ వ్యామోహానికి కారణమేమిటి?

సినిమా చూడటానికి ఎక్కువసేపు పట్టలేదుగానీ, ఈ కారణమేమిటో తెలుసుకోడానికి చాలానే శోధించాను. కాని, ఆ సినిమా గురించి చదివే కొద్దీ నేను మరింత చిక్కుదారుల్లో తప్పిపోతున్నానని అర్థమయింది. విమర్శకులు ప్రధానంగా చెప్తున్నదేమంటే, ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం హత్య కాదనీ, అబ్సెషన్ అనీ. ఎవరి అబ్సెషన్? కథానాయకుడిదా? దర్శకుడిదా లేక బ్రిటిష్ ప్రేక్షక సమూహానిదా? స్త్రీ దేహం పట్ల బ్రిటిష్ సమాజానికి పూర్వం ఎంత అబ్సెషన్ ఉండేదో తెలియదు గాని, 1950 తర్వాత, ఆ అబ్సెషన్ నానాటికీ తీవ్రమవుతూ ఉన్నదని మాత్రం చెప్పవచ్చు. రొమాంటిక్ కవులనాటికి ప్రేమ స్థాయిలోనూ, డి.ఎచ్. లారెన్సు నాటికి మోహంగానూ రూపుదిద్దుకుంటూ ఉన్న ఈ అబ్సెషన్ ఇప్పటికి మాత్రం పూర్తిగా దేహలాలసగా ఘనీభవించిందని చెప్పవచ్చు. తమకే అర్థం కాని ఈ గాఢవ్యామోహమేదో ఈ చిత్రంలో బ్రిటిష్ సమాజానికి కనిపిస్తూ ఉంది. అదేమిటో అర్థం చేసుకుందామని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు కాని, కారణాలు అర్థమయినంతమాత్రాన, ఆ ప్రవృత్తినుంచి తాము బయటపడిపోలేమని వాళ్ళకి తెలుసు.

Vertigo అంటే కళ్ళు తిరగడం, తల తిప్పడం, తల దిమ్మెక్కడం. ఇందులో కథానాయకుడికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తలతిరిగే జబ్బుంది. ఆ బలహీనత కథలో ఒక కీలకాంశం. కాని అది వాచ్యార్థమే అని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారికి స్త్రీ దేహాన్ని సమీపించినప్పుడు చెప్పలేనంత లాలస కలుగుతుంది. కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ కళ్ళు బైర్లు కమ్మటమనేది కేవలం ఆ కథానాయకుడి సమస్య మాత్రమే కాదు, హిచ్ కాక్ సమస్య కూడా. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ సమాజపు రహస్య సమస్య. తమకి అటువంటి ఒక సమస్య ఉందని బ్రిటిష్ సమాజానికి నిజంగా ఇప్పటికీ తెలుసా అని నా అనుమానం. తెలిసి ఉంటే ఈ సినిమాకి మొదటి ఓటు వేసి ఉండకపోదురు.

అణచుకున్నా అణగని ఈ తీవ్రలాలసానురక్తుడితో పాటు హిచ్ కాక్ లో ఒక కాథలిక్ కూడా ఉన్నాడు. అతడి అంతరంగంలో స్వర్గం, నరకం, నేరం, శిక్ష అనే ద్వంద్వాలు స్పష్టంగా ఉన్నాయి. ఉన్నాయనడానికి కథని ముగించిన తీరే ఒక సాక్ష్యం. పాపపుణ్యాలంటూ రెండున్నాయని బ్రిటిష్ సమాజం ఇంకా నమ్ముతున్నది. నమ్ముతున్నప్పటికీ, తన లాలసనుంచి బయటపడటానికి ఆ సమాజం సిద్ధంగా లేదనడానికి కూడా ఈ సినిమాకి ఏ ఏటికాయేడు పెరుగుతూ వస్తున్న జనాదరణనే నిరూపణ.

ఇంత స్పష్టంగానూ, నిస్సిగ్గుగానూ కనబడుతున్న హిచ్ కాక్ అంతరంగం వెనక పనిచేస్తున్న శక్తులేమై ఉంటాయని కూడా విమర్శకులు ఆలోచించిస్తూ ఉన్నారు. ఒక విమర్శకుడు వేసిన అంచనా ప్రకారం ఈ సినిమా వెనక పో, స్టీవెన్సన్, హాథోర్న్, మెల్విల్లీ, బ్రాంటీ సోదరీమణులు, మరీ షెల్లీ, విల్కీ కాలిన్స్, ట్రాకల్, హోఫ్ మన్, నెర్వాల్ లాంటి రచయితలతో మొదలుకుని, మాక్స్ ఎర్నెస్ట్, ఎమిలీ నోల్డె లాంటి చిత్రకారులతో పాటు వాగ్నర్, బ్రాహమ్స్, షూబర్ట్ లాంటి సంగీతకారులు కూడా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం పాశ్చాత్యప్రపంచమంతా ఉందన్నమాట. మరొక వర్గం విమర్శకులు దీన్ని ఇంత నిస్సిగ్గుగా చూడటానికి ఇష్టపడక, దీన్ని సామాజిక కోణం నుంచి పరిశీలించడం మొదలుపెట్టారు. వారి దృష్టిలో ఈ సినిమా male gaze కి సంబంధించిన కథనం. మగవాడు స్త్రీని ఎట్లా చూస్తాడు, ఎలా చూడటానికి ఇష్టపడతాడు, తన నేత్రానందానికి తగ్గట్టుగా అమెనెట్లా కత్తిరిస్తాడన్నదానికి సంబంధించిన కథ. మరికొందరి దృష్టిలో ఇది అసలు సినిమా అనే కళాపరికల్పనకే సంబంధించిన కథ. అంటే మనమొక కథనెట్లా అల్లుతాం, ఆ అల్లిన వలలోకి మన శ్రోతల్నో, ప్రేక్షకుల్నో ఎట్లా లాగుతాం, మనం ప్రేక్షకులుగా, శ్రోతలుగా మనముందు అల్లుతున్న కథల అల్లికలోకి ఎట్లా మనంతట మనమే పోయి ఇరుక్కుంటాం అన్నది ఈ కథాసారాంశం. కాని, వీరు ఎంతగా వివరించడానికి ప్రయత్నిస్తున్నా, అంతిమంగా, ఈ కథలో మనల్ని ఆకర్షిస్తున్నదేమిటన్న ప్రశ్న ప్రశ్నార్థంగానే మిగిలిపోతుంది.

కాని ఒక్కటి మాత్రం విస్పష్టంగా చెప్పవచ్చు.అదేమంటే, సాధారణంగా మనం రచయితలు తమ సర్వోత్కృష్ట కృతులేమిటో తమకి తెలిసే రాస్తారనుకుంటాం. కాని క్లాసిక్స్ నిజానికి రచయితలు రాసేవి కావు. వారు రాసిన రచనల్లోంచి ఒకటీ అరా ఎన్నుకుని పాఠకులు వాటిని క్లాసిక్స్ గా రూపొందిస్తారు. ఈ మాట సర్వోన్నత కృతులుగా మనం పేర్కొనే ప్రతి ఒక్క రచనకీ, శాకుంతలం నుండి హామ్లెట్ దాకా ప్రతి ఒక్క రచనకీ వర్తించేదే. అందుకనే నేడు మనం మహారచయితలుగా పరిగణిస్తున్నవారెంతోమంది తమ జీవితకాలంలో చిన్నపాటి ప్రశంసకిగానీ, సమీక్షకి గాని నోచుకున్నవారుగారు. రచయిత ఒక రచన చేస్తాడు. దాన్ని ఆ జాతి ఒక క్లాసిక్ గా మార్చుకుంటుంది. ఇందుకు మనకి తెలిసిన ఒక longitudinal ఉదాహరణ ఈ సినిమానే.

19-9-2020

Leave a Reply

%d bloggers like this: