ఒక ఇల్లు కట్టుకోవాలి

మళ్ళీ ఇల్లు మారాం. 2016 లో హైదరాబాదు నుంచి విజయవాడ వచ్చేసానని రాసాను గాని, అది ఇప్పటికి పూర్తిగా నిజమయ్యింది. కుటుంబమంతా విజయవాడ తరలివచ్చేసాం. ఈసారి ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడికి. ఈ ఉద్యోగ జీవితానికి ఇదే చివరి మజిలీ కావాలని అనుకుంటున్నాను.

ఇలా ఇళ్ళు మారినప్పుడూ, ఉద్యోగాలూ మారినప్పుడూ ఇస్మాయిల్ గారి కవిత గుర్తొస్తూంటుంది. ఆయన చిరకాలంగా పనిచేసిన పి.ఆర్. కాలేజినుంచి అనంతపురం బదిలీ అయినప్పుడు, ఇలా రాసుకున్నారు:

బదిలీ అయితే

బరబర ఈడ్చిన ట్రంకుపెట్టెలా

క్షోభించింది మనస్సు.

ఇది జరిపేందుకు చేసింది కాదు.

నా జీవితం కూడా జరిపేందుకు చేసింది కాదు. కాని, జీవితమంతా ఊరునించి ఊరికి, ఉద్యోగం నుంచి ఉద్యోగానికి, ఇంటినుంచి ఇంటికి మారుతూనే ఉన్నాను. ఈసారి హైదరాబాదు నుంచి పూర్తిగా తరలి వచ్చెయ్యడానికి నాకున్న అతి పెద్ద బరువూ, బాధ్యతా నా పుస్తకాలే.

ఆ పుస్తకాల్ని ఏం చెయ్యాలన్నది పెద్ద ప్రశ్న. ఇరవయ్యేళ్ళ నగర జీవితంలో ఎన్ని పుస్తకాలు పోగు చేసుకున్నాను! గడచిన ఇరవయ్యేళ్ళకు పైగా నాలో నేనొక గూడు కట్టుకుని, ఆ గూడంతా పుస్తకాలతో నింపేసాను. ఇప్పుడు ఆ పుస్తకాలు ఎక్కడకు తీసుకువెళ్ళాలి? ఇన్నాళ్ళూ ఆ పుస్తకాలకోసమే హైదరాబాదులో ఇంటి అద్దె చెల్లిస్తూ ఉన్నాను.

ఆ పుస్తకాలు చూడగానే నాకో కథ గుర్తొచ్చింది. ప్రసిద్ధ సూఫీ వేదాంతి ఆల్ ఘజలీ గొప్ప పండితుడూ, బహుగ్రంథకర్తా కూడా. ఆయన తన అన్వేషణలో భాగంగా ఎన్నో నగరాలు సంచరిస్తూ గడిపాడు. అట్లాంటి ప్రయాణాల్లో ఆయన కూడా రెండు గాడిదల బరువు పుస్తకాలు కూడా ఉండేవిట. ఒక రోజు ఆయన తన ప్రయాణంలో ఆ గాడిదలతో పాటు ఒక ఎడారి ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా, దొంగలు ఆయన మీద పడి, ఆ గాడిదల్నీ, ఆ పుస్తకాల్నీ కూడా దోచుకుపోయేరట. చాలా ఏళ్ళ తరువాత మరొక సూఫీ సాధువు ఆల్ ఖిదాయి అనే ఆయన, ఆల్ ఘజలీని కలిసినప్పుడు, ఆ సంఘటనని గుర్తు చేస్తూ ‘ఘజలీ, ఎంత అదృష్టవంతుడివి! ఆ రోజు ఆ దొంగలే కనుక ఆ పుస్తకాలు కొల్లగొట్టుకోకపోయి ఉంటే నువ్వెప్పటికీ సూఫీ సాధువుగా మారి ఉండేవాడివే కావు. ఆ పుస్తకాలకి దాస్యం చేస్తూనే ఉండేవాడివి’ అన్నాడట.

అట్లాంటి కొన్ని సందర్భాలుంటాయి. నీకు నిజంగా ఏది అవసరమో ఏది కాదో తేల్చుకోక తప్పని సందర్భాలు. చిన్నప్పుడు మా ఊళ్ళో అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. అర్థరాత్రి ఏదో ఒక తాటాకు ఇంటికి నిప్పంటుకునేది. అందరూ హడావిడిగా ఆ ఇంటిదగ్గరకి పరుగెత్తేవారు. ఈ లోపే తమ ఇళ్ళల్లో విలువైనవేవో బయటికి తెచ్చేసుకునేవారు. అట్లాంటప్పుడు మా నాన్నగారు తాను ప్రాణప్రదంగా చూసుకునే ప్రభుత్వ రికార్డు, భూమి లెక్కలు, తన కరణీకం దస్త్రాలు బయటకి తెచ్చేసుకునేవారు. మా అమ్మ ఆవుల్ని బయటకు తెచ్చుకుందామనుకునేదిగాని, అంత సమయం చిక్కదనే భయంతో లేగదూడల్ని మాత్రం ముందు బయటికి తెచ్చేసుకునేది. మా బామ్మగారు తాను జీవితకాలం పారాయణం చేసుకుంటూ ఉండే భగవద్గీత బయటకి తెచ్చుకునేవారు. ఇప్పుడు నేను కూడా ఈ నా పుస్తకాల్లో ఏవి వెంట తెచ్చుకోవాలి ఏవి వదిలిపెట్టేయాలన్న ఆలోచనలో పడ్డాను.

ఆ పుస్తకాలన్నీ మరో మారు చూసాను. అటూ ఇటూ రెండు సంచుల బరువు నింపితే ఇరవై గాడిదలు మోసేటంత పుస్తక సంచయం. అందులో విద్య, తత్త్వశాస్త్రం, సాహిత్య అలంకార శాస్త్రాలు, మనస్తత్వ శాస్త్రాలు, రాజనీతి రచనలు, ఆర్థిక, సామాజిక శాస్త్రాలు, మార్క్స్, ఎంగెల్స్ సంకలిత రచనలు, లెనిన్, మావో సే టుంగ్ పూర్తి సంపుటాలు, ప్లేటో, అరిస్టాటిల్, హిడెగ్గర్, నీషే, పోస్ట్ మాడర్నిజం- వాటన్నిటినీ నిర్మోహంతో వదిలిపెట్టేయగలననిపించింది. కథలు, కథాసంకలనాల్ని కూడా వదిలిపెట్టేయగలిగాను. ఆధునిక తెలుగు సాహిత్యం, కొత్త పుస్తకాలు కూడా వదిలిపెట్టేయడం లో ఏమీ ఇబ్బంది లేదనిపించింది.

కాని వదిలిపెట్టలేనివి ఏవి? వేదాలు, ఉపనిషత్తులు, బుద్ధుడి దీర్ఘసంభాషణలు, రీడర్స్ డైజెస్ట్ బైబిలు, అల్లా 99 నామాలు. ఇవన్నీ కలిపి ఒక సంచీలో పట్టేస్తాయి. కానీ నా మోహాన్ని తెంచుకోలేనిది కవిత్వం విషయంలోనే. ‘మీ దగ్గర లేని కవిత్వం లేదే. ప్రపంచమంతా ఇక్కడే ఉంది’ అన్నాడు ఆదిత్య, నేనేరుకుంటున్న పుస్తకాలు చూసి. చీనా జపాన్, కొరియా కవిత్వం, భారతీయ భక్తి కవులు, పారశీక సూఫీ కవులు, మహత్తరమైన యూరపియన్ కవిత్వం, అమెరికన్ కవులూ, వారు ప్రపంచమంతా శోధించి ఏరి తెచ్చిన అనువాదాలూ, ఆఫ్రికన్ కవిత్వం, ఆదిమజాతుల గీతసముచ్చయం The Technicians of the Sacred- ఆ కవిత్వం వదులుకోడం మాత్రం నాకు చాతకాలేదు. అవన్నీ మూటలు కడితే అప్పటికే పన్నెండు పెట్టెలు తయారయ్యాయి. బహుశా, ఎవరో ఒకరు నా నుంచి కొల్లగొట్టుకుపోతే తప్ప ఈ కవిత్వాన్ని వదులుకోలేననిపించింది.

నాకు చీనా మహాకవి దు ఫు గుర్తొచ్చాడు. ఆయన జీవితమంతా యుద్ధక్షేత్రాల్లోనే గడిపాడు. తన కుటుంబానికి దూరంగా ఒక ప్రవాసిగా, ప్రాచీన చీనాలో ఒక సరిహద్దునుంచి ఒక సైనికుడిగా మరొక సరిహద్దుకి సాగుతూనే ఉన్నాడు. ఆయనపుట్టింది లొయాంగ్ ప్రాంతంలో. తన కాలం నాటి యువకుల్లానే ప్రభుత్వోద్యోగం కోసం పరితపించాడు. ప్రభుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదుగానీ, చాలాకాలం రాజధాని చాంగాన్ లో జీవించాడు. లొయాంగ్ నుంచి చాంగాన్ దాదాపు పదిహేనువందల కిలోమీటర్ల దూరం. ప్రాచీన చీనాలో ఆ దూరమంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణించినట్టే. ఆ తర్వాత ఆన్ షూ తిరుగుబాటు తలెత్తినప్పుడు చాంగాన్ వదిలిపెట్టి చెంగ్ డూ వైపు వెళ్ళిపోయాడు. చాంగాన్ నుంచి చెంగ్ డూ కి ఆరువందల కిలోమీటర్ల దూరం. అక్కడ కొన్నాళ్ళు ప్రశాంతంగానే గడిపాడు. కాని మనసు స్వగ్రామం వైపు లాగుతూనే ఉండింది. చివరికి తన యాభయ్యేళ్ళ వయసులో యాంగ్సే నదిమీదుగా లొయాంగ్ ప్రాంతానికి ప్రయాణం మొదలుపెట్టాడు. మధ్యలో మళ్ళా ఎవరో ఒకరు అతణ్ణి ఆపేస్తూ వచ్చారు.ఏదో ఒక పదవీ బాధ్యత అప్పగిస్తో అతడి పునర్యానాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. చెంగ్ డూ నుంచి లొయాంగ్ కావటానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, అతడు తన స్వగ్రామానికి ఎన్నటికీ తిరిగి చేరుకోలేకపోయాడు. తన యాభై ఎనిమిదవ ఏట మార్గమధ్యంలోనే ఈ లోకం నుంచే నిష్క్రమించాడు.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, దు ఫూ కవిత్వం చదివినప్పుడు మనకి ఈ దూరాలు తెలియవు. అతడొక నిర్ధనుడిగా, దిమ్మరిగా, చిరిగిపేలికలైన దుస్తులు ధరించి అగమ్యంగా సంచరించే ప్రవాసిగా కనిపిస్తాడు. కాని అతడి కవిత్వం మొత్తం ఇంగ్లీషులోకి అనువదించిన స్టీఫెన్ ఓవెన్ ఏం చెప్తాడంటే, దుఫు అట్లా ఒక యుద్ధభూమినుంచి మరొక యుద్ధభూమికి, ఒక భూగోళం నుంచి మరొక భూగోళానికి ప్రయాణిస్తున్నప్పుడు కూడా అతడి కవిత్వం అతడి వెంటనే ఉండేదనీ, అదంతా కలిపి అరవై చాపచుట్టల నిడివి కి గ్రంథస్తమై ఉండేదనీ, అతడు తాను భయంలో, ఆందోళనలో, ఊపిరి బిగబట్టుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ ప్రయాణించానని రాసుకున్నప్పుడు కూడా, అతడి వెనక ఎవరో ఒకరు ఆ అరవై చాపచుట్టల నిడివి కవిత్వాన్నీ మోసుకుంటూ వెంటవస్తూనే ఉన్నారనీ.

నేను ఆల్ ఘజలీ ని కాదు. అలాగని దు ఫూ ని కూడా కాదు. నేనిప్పటిదాకా రాసిందంతా ఒక పెన్ డ్రైవ్ లో సరిపోతుంది. కాని ఇరవై మూటల ఈ పుస్తకసంచయం మాట? ఇందులో ఆరుమూటలు మళ్ళా చిత్రకళకి సంబంధించిన పుస్తకాలే. చీనా జపాన్ చిత్రకళ, డావిన్సి, మైకెలాంజిలో, చిత్రకారుల జీవితాల మీద వసారి రాసిన పుస్తకాలు, ఇంప్రెషనిస్టులు, షెజానె, వాన్ గో ఉత్తరాలు, జాన్ బెర్జర్, సంజీవదేవ్ – వాటిని ఏదన్నా పాఠశాలకో, కళాశాలకో ఇచ్చేద్దామనుకున్నానుగానీ, నా కూతురు తనకి కావాలని అడిగింది. నా కూతురుకి ఇళ్ళూ, పొలాలూ, తోటలూ, బంగారమూ ఎలానూ ఇవ్వలేను, కనీసం ఈ చిత్రకళాభాండారమన్నా ఇవ్వలేకపోతే ఎలా?

చిత్రకళా సంచయాన్ని పక్కన పెట్టినా కూడా పన్నెండు మూటల కవిత్వ సంచయం మిగిలే ఉంటుంది. ఏమి చెయ్యాలి దాన్ని? ఈ అవస్థలో నాకు రాహుల్ సాంకృత్యాయన్ తలపుకి వచ్చాడు. ఆయన టిబెట్ నుంచి కంచరగాడిదల మీద మోసుకొచ్చిన ఏడెనిమిది వందల బౌద్ధ తాళపత్రగ్రంథాలు ఇప్పటికీ బీహార్ మూజియంలలో మూలుగుతూనే ఉన్నాయి.

ఇన్నాళ్ళూ తలపు లేదుగానీ, ఇప్పుడొక ఇల్లు కావాలనిపిస్తున్నది. బహుశా మా ఊళ్ళోనో లేదా మా ఊరికి పక్కనున్న వణకరాయి గ్రామంలోనో ఒక ఇల్లు కట్టుకోవాలి. అక్కడ ఒక మిద్దె ఇల్లు కట్టుకున్నాక, చెంచు వాడు తన మేకల్ని పక్కా ఇంట్లో పెట్టి తాను నిట్రాతి గుడిసెలో కాపురమున్నట్టుగా, నేను నా పుస్తకాల్ని ఆ మిద్దె ఇంట్లో పెట్టి పక్కనొక పాక వేసుకుని బతుకుతాను.

21-2-2021

Leave a Reply

%d bloggers like this: