ఒక అతిథి కథ కాదు

మూడేళ్ళ కిందట నేను పనిచేసిన ఒక సంస్థలో మాకొక బెంగాలీ బాస్ ఉండేది. ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చాలా సీనియర్ అధికారి. ఒకరోజు మాటల మధ్యలో ఆమె బెంగాల్ పైన తన అసహనమంతా బయటపెట్టింది. తాను స్వయంగా బెంగాలీ అయ్యుండి ఆమె బెంగాల్ ని ఎందుకంత ఈసడిస్తున్నదో అర్థం చేసుకోలేకపోయాను. ‘అదేమిటి మేడం అలా అంటున్నారు? ఇవాళ బెంగాల్ ఏమి ఆలోచిస్తున్నదో రేపు తక్కిన భారతదేశమంతా అదే ఆలోచిస్తుందని కదా అంటారు ‘ అన్నాను. ఆమె వ్యంగ్యంగా నవ్వింది. ‘ఎప్పటి మాట అది! మీరు పందొమ్మిదో శతాబ్ది పుస్తకాలు చదివి మాట్లాడుతున్నారు. అమర్త్య సేన్ రాసిన An Uncertain Glory చదవండి. ఇరవై ఒకటవ శతాబ్ది బెంగాల్ గురించి మీకు తెలీదు’ అందామె. ‘మీరు ఇటీవలి జనాభా లెక్కలు చూసారా? అంటే 2011 లెక్కలు. 2001 లెక్కలు,1991 లెక్కలు కూడా చూడండి. బెంగాల్లో స్త్రీల అక్షరాస్యత చూడండి. ఏమన్నా పెరుగుదల ఉందేమో చూసి చెప్పండి. ఉండదు. ఎందుకుంటుంది? దటీజ్ బెంగాల్ ‘ అందామె.

నిన్న సత్యజిత్ రాయ్ ‘ఆగంతుక్ ‘ (1991) చూసిన తర్వాత ఆమె ఆగ్రహానికీ, అసహనానికీ కారణం అర్థమయింది. ఆమె 1980 బాచ్ కి చెందిన ఐ ఏ ఎస్ అధికారి. రాయ్ ఈ సినిమా 1991 లో తీసాడు. ఇద్దరూ తమ సమకాలిక బెంగాల్ గురించే మాట్లాడుతున్నారు. ఇద్దరిలోనూ బెంగాల్ పట్ల ఒకటే ఆగ్రహం, ఒకటే అసహనం.

‘ఆగంతుక్’ సత్యజిత్ రాయ్ తీసిన చివరి చిత్రం. పూర్తిగా పండి పరిణతి చెందిన మనఃస్థితిలో ఆయన ఆ చిత్రం తీసాడు. పథేర్ పాంచాలి తీసిన దాదాపు అర్థ శతాబ్దం తరువాత. కేవలం జీవితాన్ని చిత్రించడం కాదు, జీవితాన్ని ఎందుకు చిత్రించాలో తెలిసిన వాడిగా తీసాడాయన. పథేర్ పాంచాలి ఒక కావ్యం. కాని ఆగంతుక్ ఒక నాటకం. ‘నాటకాంతం హి సాహిత్యం’ అనే నానుడి నిజమనుకుంటే ఒక కళాకారుడిగా రే పూర్తిగా సాఫల్యం సాధించాడని చెప్పాలి.

ఆ సినిమా వచ్చిన కొత్తలో, అంటే బహుశా 91 లోనో, 92 లోనో ఒకసారి ఓల్గాగారు ఆ సినిమా గురించి చెప్పారు నాకు. తాను ఎక్కడో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆ సినిమా చూసానని చెప్తూ, ఆ సినిమా కలిగించిన గాఢ భావోద్వేగం నుంచి ఇంకా తేరుకోని మనఃస్థితిలోంచే ఆమె ఆ సినిమా గురించి మాట్లాడారు. దాదాపు ముప్పై ఏళ్ళ తరువాత ఆ సినిమా చూడగలిగాను. ఆ సినిమా ఇప్పటికీ అంతే ఫ్రెష్ గా ఉండటమే కాకుండా, చివరికి వచ్చేటప్పటికి నా కంటతడి పెట్టించింది కూడా.

‘ఆగంతుక్’ సినిమా కథ ఏమిటి? అది ఒక అతిథి కథ కాదు. తన చుట్టూ ఉన్న బెంగాల్ సమాజం ఒక కూపస్థ మండూకంగా మారిపోతున్నదని గమనించిన ఆవేదనలోంచి చేసిన హెచ్చరిక అది. బెంగాల్ గర్వించదగ్గ వాటిలో బెంగాల్ అడ్డాలు అంటే బెంగాలీ మేధావుల సంభాషణలు ఒకటని ఒక మిత్రుడు అంటున్నప్పుడు కథానాయకుడికి ఆగ్రహం వస్తుంది. రెండున్నర వేల ఏళ్ల కిందట గ్రీస్ లో, ఏథెన్సులో వర్ధిల్లిన జిమ్నాషియాల గురించి తెలుసా నీకు అని అడుగుతాడు అతణ్ణి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఈ సినిమాలో రే మొదటిసారి గిరిజనుల గురించి మాట్లాడాడు. ఆదిమజాతుల గురించి, అనాగరిక సమాజాల గురించి మాట్లాడాడు. మాట్లాడం కాదు, అపారమైన ఆరాధన కనపరుస్తాడు. ‘నేనొక savage ని కాలేకపోవడం నా దురదృష్టం ‘ అంటాడు అందులో కథానాయకుడు. ఒకప్పుడు తాను చిత్రలేఖనం నేర్చుకోవాలనుకున్నానని చెప్తూ, కాని అల్టామీరా గుహల్లో బయటపడ్డ బైసన్ చిత్రాన్ని చూసిన తరువాత ఆ మోహం నుంచి బయటపడ్డానని చెప్తాడు. ఎందుకంటే, ఆ బైసన్ ని ఎలా చిత్రించాలో చెప్పగల గురువుగానీ, శిక్షణా సంస్థగానీ ప్రపంచంలో ఎక్కడా లేదంటాడు. తన జీవితకాల ప్రయాణం తరువాత రే గిరిజనుల గురించి ఇంత గాఢంగానూ, ఇంత నిస్సంకోచంగానూ మాట్లాడటం నిజంగా నన్ను చకితుణ్ణి చేసింది. ఈ సినిమా గురించి మాట్లాడిన వాళ్ళెవారూ ఈ అంశం గురించి మాట్లాడకపోవడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. కాని, రే, కేవలం గిరిజనుల గురించి మాట్లాడటమే కాదు, నానాటికీ సంకుచితమవుతున్న బెంగాలీ సమాజాన్ని బతికించగల రెండు శక్తుల్లో గిరిజనులు కూడా ఒకరని ఆయన భావించినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే, ఆ కథ చివరికి శాంతినికేతన్ దగ్గర్లో ఒక సంతాల్ పల్లెలో ముగుస్తుంది. అక్కడ కోల్ గిరిజనుల నృత్యం దగ్గరికి మనల్ని తీసుకువెళ్తాడు దర్శకుడు. కోల్ అనగానే ఒకప్పుడు బ్రిటిష్ సైన్యాల మీద ఒకసారి కాదు, నాలుగు సార్లు తిరగబడ్డ కోల్ గిరిజనులు నా మదిలో మెదుల్తుండగానే, దర్శకుడు కూడా, తన కథానాయకుడితో ఆ మాటే చెప్పిస్తాడు. అతడికి ఆతిథ్యమిచ్చిన బెంగాలీ గృహిణి కూడా ఆ నృత్యాన్ని చూస్తూ ఉండబట్టలేక తాను కూడా ఆ ఆదివాసులతో నడుం కలిపి నాట్యం మొదలుపెట్టగానే ‘ఈమె నా మేనకోడలే అని నాకిప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది ‘ అంటాడు ఆ కథానాయకుడు.

ఇక తన సమాజాన్నీ, సంస్కృతినీ బతికించగల శక్తిగా రే భావించిన రెండవ స్ఫూర్తి బెంగాలీ గృహిణి. మనిషిని మనిషిగా దగ్గరకు తీసుకోగల నిష్కపటమైన ఆమె ఆదరణ. ఆతిథ్యం. ఒక మనిషి నీ అతిథిగా, ఆగంతుకుడిగా నీ ఇంటి తలుపు తట్టినప్పుడు అతడెవరు అని అనుమానించని విశాల హృదయం. అతిథిని సాక్షాత్తూ భగవంతుడిగా భావించే ఒక సనాతన సంస్కృతికి ఆమె నిజమైన వారసురాలు, ప్రతినిధి. బెంగాలీ కుటుంబం పూర్తిగా కూపస్థమండూకంగా మారిపోకుండా కాచి రక్షించే ఏకైక ఆశ్రయం ఆమెనే.

కాని సినిమా అంతా చూసాక, బెంగాల్ నిజంగా మరీ అంత సంకుచితం కాలేదనే అనిపించింది. ఎందుకంటే అక్కడొక సత్యజిత్ రే ఉన్నాడు. తన సమాజాన్ని హెచ్చరించడానికి జీవితకాలం పాటు కళాసృష్టి కావిస్తూనే వచ్చాడు. నిజంగా కూపస్థమండూక సమాజమంటూ ఏదన్నా ఉంటే అది తెలుగు సమాజమే. ఇక్కడ సత్యజిత్ రే కూడా లేడు.

2-2-2021

Leave a Reply

%d bloggers like this: