ఏమై పోయాయి ఆ పద్యాలు?

కొణిదెన నుంచి అద్దంకి బయల్దేరాం. అద్దంకి తెలుగు కవిత్వానికి పుట్టినిల్లు. అక్కడ తొలి తెలుగు పద్యం లభించిందనీ, అక్కడ ఆ పద్యానికి పట్టం కట్టారని చాలా కాలం కిందట విన్నాను. అందుకని ఆ పద్యాన్ని ప్రతిష్టించిన చోటుకి తీసుకువెళ్ళమని మా రీజనల్ జాయింట్ డైరక్టరు రవీంద్రనాథ రెడ్డిగారిని చాలా కాలంగా అడుగుతూ ఉన్నాను. ఇన్నాళ్ళకు ఆ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం దొరికింది.

మాకు జ్యోతి చంద్రమౌళిగారు దారి చూపిస్తూ ఉన్నారు. ఆయన అద్దంకి మీద కూడా ఒక పుస్తకం రాసారు. ‘అద్దంకి చరిత్ర’ అనే ఆ పుస్తకం చాలా రోజుల కిందటే రవీంద్రనాథ రెడ్డిగారు నాకు అందచేసారు. ఆ రోజు చంద్రమౌళిగారు మమ్మల్ని అద్దంకి ఊరి మధ్యలో ఉన్న చాళుక్యకాలం నాటి శివాలయానికి తీసుకువెళ్ళారు. ఆ శివాలయంలో ఒక గోడమీద చిన్న అలమారులో ఎరాప్రగడ సాహిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ దేవాలయంలో ఒక పక్క దేవతల విగ్రహాలు ఉన్నాయి. పూర్తిగా పసుపు పూసి, బొట్లు పెట్టిన ఆ విగ్రహాల్ని చూపిస్తూ చంద్రమౌళిగారు ‘ఇవన్నీ శాసనాలే, కాని వీటినిట్లా విగ్రహాలుగా మార్చేసారు, చెప్పినా వినరు, ఎవరికీ అర్థం కాదు ‘ అంటూ వాపోయారు.

అప్పుడు మమ్మల్ని ఆ దేవాలయానికి ఆనుకుని రోడ్డు పక్క నెలకొల్పిన పద్యస్తంభం దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. అక్కడ ఒక వైపు తొలి తెలుగు పద్యం దొరికిన శాసనం నమూనాని, దాని కింద ఆ పద్యం మూలరూపాన్ని, ఇప్పటి తెలుగు రూపాన్ని రాసి ప్రతిష్టించి ఉన్నారు. దాని పక్కన ఎర్రాప్రగడ విగ్రహం కూడా ఉంది. ఆ పద్యాన్ని రాసి ప్రతిష్టించిన స్తంభానికి ఒక పక్క పద్యం, మరొక వైపు ఆ పద్యానికి తెలుగు తాత్పర్యం, ఇంకొక వైపు ఆ శాసనం ప్రాధాన్యత వివరిస్తూ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు రాసిన వాక్యాలు కూడా ఉన్నాయి.

లోపల ఉత్సాహమూ, ఉద్వేగమూ కట్టలు తెంచుకుని పోంగులెత్తూ ఉండగా, ఆ స్తంభం చుట్టూ కలయదిరిగాను. ప్రకాశం జిల్లా రచయితల సంఘం చొరవతో ఏర్పాటు చేసిన ఆ పద్యస్తంభం బహుశా భారతదేశంలోనే అద్వితీయమైంది అనుకుంటాను. అత్యంత ప్రాచీన భాషలైన సంస్కృతం, పాళీ, తమిళ, కన్నడ సాహిత్యాలకు కూడా ఇటువంటి అదృష్టం పట్టలేదనుకుంటాను.

అది తొలి తెలుగు పద్యం దొరికిన చోటు. సా.శ. 848 లో పండరంగడు అనే సేనాని వేయించిన శాసనం అది. వేంగి చాళుక్య రాజయిన గుణగవిజయాదిత్యుడి సేనానిగా పండరంగడు నెల్లూరు, కందుకూరు మొదలైన ప్రాంతాల్లో పన్నెండు బోయకొట్టాల్ని జయించిన సందర్భంగా నిలబెట్టిన శాసనంలో పద్యం అది. ఒక విజేత రాయించిన పద్యం. అప్పటిదాకా తెలుగు భాష స్థితిగతులు ఏమిటోగాని, ఆ రోజు తెలుగు భాష విజేతల భాషగానూ, రాజభాషగానూ మారింది.

అది ఇంతదాకా మనకి లభ్యమవుతున్న తొలితెలుగు పద్యం. తరువోజ అనే తెలుగు దేశిఛందస్సులో ఉన్న పద్యం.

గమనించవలసిందేమంటే, ఆ పద్యం మనకి లభిస్తున్న తొలిపద్యమే అయినప్పటికీ, ఒక భాష ఎంతో ఉచ్చ దశకి చేరుకుని ఉంటే తప్ప అట్లాంటి పద్యం అటువంటి ఛందస్సులో పుట్టడం సాధ్యం కాదు. అంటే అప్పటికే తెలుగు ఛందస్సులూ, పద్యరచనా, పదజాలమూ, భావప్రకటనా ఎంతో అత్యున్నత పరిణతికి చేరుకుని ఉండాలి.

ఉదాహరణకి, ఇంగ్లీషు కవిత్వం తీసుకుందాం. ఇంగ్లీషులో ప్రధానమైన ఐయాంబిక్ పెంటామీటర్ చూడండి. మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ లో మొదటి రెండు పాదాలూ చూద్దాం.

Of Mans First Disobedience, and the Fruit

Of that Forbidden Tree, whose mortal taste

ఇందులో ప్రతి పాదమూ అయిదు మాత్రాగణాల పంక్తి. ప్రతి రెండు పాదాలకీ అంత్యప్రాస ఉంటుంది. ఆ అయిదుగణాలకీ మరొక్క గణం అదనంగా చేరితే, ఆ బరువుని ఇంగ్లీషు కవిత్వం తట్టుకోలేదు. అప్పుడు దాన్ని మనం ఎపిక్ హెక్సామీటర్ అనీ, హోమరిక్ హెక్సామీటర్ అనీ అంటాం. ఇలియడ్, ఒడెస్సీలు రాయడానికి గ్రీకు భాషలో హోమర్ రాయడానికి ఐతిహాసిక పద్య ఛందస్సు అది. ఇంగ్లీషులో అటువంటి ఆరుగణాల పద్యపంక్తిని ఐయాంబిక్ గణాలతో రాసినప్పుడు దాన్ని అలెగ్జాండ్రిన్ అంటారు. ఉదాహరణకి లాంగ్ ఫెలో రాసిన ఒక గీతంలో మొదటి పంక్తి చూడండి:

Now had the season returned, when the nights grow colder and longer,

మొత్తం యూరోప్ అంతా గాలించినా కూడా ఆరుగణాల పద్యపాదాలకి అదనంగా మరొక్క గణం కూడా అదనంగా కనిపించదు. అదే తెలుగు కవిత్వం తీసుకుంటే, తెలుగు వృత్తపద్యాలు దాదాపుగా చాలావరకూ ఏడుగణాల పద్యపాదాలు. చూడండి:

‘అవనీ| చక్రము| పాదఘా|తహతి| నల్లాడం|గ, నత్యు|చ్చ భై..’ (మత్తేభం)

‘హారివి|చిత్రహే|మ కవ|చావృతు|డున్నత| చాప చా|రుదీ..'(ఉత్పలమాల)

‘సాలప్రాం|శు నిజో|త్జ్వలత్క|వచు, శ|శ్వత్కుండ|లోద్భాసి|తున్ (శార్దూలం)

‘అనుప|మ కార్ము|కాదివి| విధాయు|ధవిద్య|లయందు| గోవిదుం|..’ (చంపకమాల)

ఇలా ఏడుగణాలు మాత్రమే కాదు, ఇందులో ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం ప్రాసగా నాలుగు పాదాల్లోనూ పునరావృతి కావలసి ఉంటుంది. ప్రతి పాదంలోనూ మొదటి అక్షరానికి కొన్ని అక్షరాల తరువాత మరొక సరూపాక్షరం యతిగా పొదగవలసి ఉంటుంది. (సంస్కృతం, కన్నడం, పారశీకం, ఇంగ్లీషుల్లో కూడా అయితే యతి లేదా ప్రాస ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది)

ఇంత గంభీరమైన ఛందస్సు ప్రపంచ సాహిత్యంలోనే మరే భాషలోనూ లేదు అనుకుంటే, తెలుగు మహిమ ఇక్కడితో ఆగిపోలేదు. కేవలం ఏడుగణాల పద్యపాదాలే కాదు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు గణాల పద్యపాదాలతో కూడుకున్న మహాఛందస్సులు మహాస్రగ్ధర, మానిని, కవిరాజవిరాజితం, లయగ్రాహి, లయవిభాతి లాంటి ఛందస్సులు కూడా తెలుగులో అతి సహజంగా ఒదిగిపోతాయి. అటువంటి ఎనిమిది గణాల ఛందస్సులో తరువోజ కూడా ఒకటి.

అయితే తరువోజ తక్కిన ఛందస్సులకన్నా మరింత గంభీరమైన ఛందస్సు. ఎందుకంటే, ఇందులో ఎనిమిది గణాలతో కూడిన నాలుగు పాదాలు, ప్రతి పాదానికీ ద్వితీయాక్షర ప్రాసతో పాటు, ప్రతి పాదంలోనూ, మొదటి అక్షరానికి, మూడవ, అయిదవ, ఏడవ గణాల మొదటి అక్షరాలతో యతి కుదరాలి. అంటే నాలుగు పాదాల పద్యంలో పన్నెండు విశ్రామ స్థానాలూ, పదహారు సరూపాక్షరాలూ ఉండాలన్నమాట!

ఇప్పుడు చూడండి, తెలుగులో మనకి లభిస్తున్న తొలి పద్యం ఎలాంటిదో:

పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు

బలగర్వమొప్పంగ బైలేచి సేన

పట్టంబు గట్టించి ప్రభుపండరంగు

బంచిన సమత్త పదువతో బోయ

కొట్టంబుల్వణ్ణెణ్డు గొణివేంగినాణ్టిం

గొళల్చి యాత్రిభువనాంకుశబణనిల్పి

కట్టెపు దుర్గంబు గడుబయల్సేసి

కందుకూర్బెజవాడ గావించె మెచ్చి.

అంటే ఇటువంటి ఒక పద్యం శాసనానికి ఎక్కించే వేళకి ఇంగ్లీషు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్, జపనీస్, హిందీ, బెంగాలీ వంటి భాషలేవీ ఇంకా తలెత్తనే లేదు. మనం గమనించవలసిన మరొక అంశం, ఈ పద్యం ఒక కవి ఎవరో కొద్దిమంది రసజ్ఞులకి చదివివినిపించడానికి రాసింది కాదు. ప్రజలు నలుగురూ వినేలా, చదువుకునేలా నడిరోడ్డు పక్కన ఒక దేవాలయంలో నిలబెట్టిన విజయస్తంభం. అంటే ఏమిటి? అప్పటికే ఆ ప్రజలకి అటువంటి పద్యాలతో పరిచయం ఉండి ఉండాలనే కదా, అటువంటి పద్యరూపంలో శాసనం వేయిస్తే నలుగురికీ తెలుస్తుందనే కదా, అర్థమవుతుందనే కదా! మరి ఎవరా తెలుగు ప్రజలు? ఎక్కడికి పోయారు వారు?

ఈ విషయం మీద మరికొంత ఆలోచిద్దాం. తరువోజ ఒక ఛందస్సుగా పదకొండో శతాబ్ది తరువాత శాసనాల్లో కనబడకుండా పోయింది. జయంతి రామయ్య గారి ‘శాసన పద్యమంజరి ‘ లో కూడా తరువోజలు ఆరు మాత్రమే ఉన్నాయి. అందులో నాలుగు గుండ్లకమ్మ ఒడ్డున, అంటే, అద్దంకి, కొణిదెనల్లో దొరికినవే. మనకి లభిస్తున్న మొదటి కావ్యాల్లో కూడా నన్నయ, నన్నెచోడుడు మాత్రమే తరువోజని విరివిగా వాడారు. తిక్కనగారు, స్త్రీపర్వంలో వివిధ ఛందస్సుల్లో పద్యాలు చెప్తున్నపుడు మాత్రమే తరువోజని ఒకటి రెండు సార్లు ఉపయోగించారు. అంటే ఏమిటి? తరువోజ ప్రధానంగా నన్నయకు పూర్వపు ఛందస్సు అనే కదా. అంటే మనకి లభిస్తున్న కావ్యసాహిత్యం కన్నా ముందే వికసించి రాజఛందస్సుగా విరాజిల్లిన ఛందస్సు అనే కదా. మరి అటువంటి ఛందస్సులో పద్యాలు చెప్పుకున్న ఆ జాతి జనులు ఎంత పొడగరిమానవులై ఉండాలి!

ఒక పద్యంలో నాలుగు సార్లు ఒక అక్షరం నిర్దిష్ట స్థానాల్లో తిరిగి తిరిగి వస్తోందంటే, ఆ భాష మాట్లాడేవాళ్ళు ఎంత గంభీరమైన వక్తలయి ఉండాలి! నన్నయగారి తరువోజలు క్షుణ్ణంగా చదివితే మనకి ఒక సంగతి బోధపడుతుంది. అదేమంటే, తన పాత్రలు వడివడిగానూ, నాటకీయంగానూ, సుదీర్ఘంగానూ మాట్లాడవలసిన సందర్భాల్లోనే ఆయన తరువోజని వాడుకున్నారు. సభాపర్వంలో ద్రౌపదిని సభకి తీసుకురావడానికి వెళ్ళిన కంచుకి ఆమెతో చెప్తున్న మాటలు చూడండి:

ధనసంపదలు నిజధరణి రాజ్యంబు

దనయులం దమ్ముల దన్నును నిన్ను

దనర జూదంబాడి ధార్తరాష్ట్రులకు

ధర్మతనూజుండు దానోటువడియె

వనజాక్షి కౌరవవరుపని నిన్ను

వడిదోడుకొని పోవవచ్చితినిపుడ

చనుదెమ్ము కౌరవేశ్వరునికడకనిన,

జలజాయతాక్షి పాంచాలి ఇట్లనియె. (సభా: 2:207)

గుక్కతిప్పుకోకుండా మాట్లాడే తెలుగువాడి స్వభావానికి బహుశా ద్విపదకన్నా, సీసపద్యంకన్నా తరువోజనే తగిన ఛందస్సు అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది?

నన్నెచోడుడు కూడా తరువోజ ని ఇలాగే వాడుకున్నాడు. ఆయన పద్యం చూడండి:

బాలవు; నీకు నిప్పట గోలె నీ త

పంబిది గైకొని పారమేదింప

బోలదు వలదని బుద్ధులు చెప్ప

బోయిన మా మాట బోవక మమ్ము

నేలిదముగ జేసి యెస్సని వోయె

దేని, నక్కడ నీవ యెరుగుదు; నిన్ను

వాలయముగ నాగ వచ్చునె? ఇంత

వలవంతతన మాడువారికి తగునె? ( కుమార:6:21)

దేన్నైనా సరే బిగ్గరగా నలుగురూ వినేలా చాటుకునే తెలుగువాడికి తగ్గ ఛందస్సు తరువోజ అని తిక్కనగారికి కూడా తెలుసు. ఆయన పద్యం చూడండి:

కురురాజు మొదలైన కొడుకులనెల్ల

గోల్పోవుటిప్పుడు గోవింద కలిగె

నరిగితి సంధిసేయగ రాకయున్న

నటయప్డు నీ చెప్పుటైనది కాదె

పరమహితంబుగ పలికిరి గంగ

పట్టియు, విదురుండు పాటించి పెక్కు

వెరవుల నొత్తిన విననైతి నావి

వేకుల చూపేల వృథవోవనేర్చు (స్త్రీ: 2: 157)

అంటే, మాట్లాడటానికే కాదు మొర పెట్టుకోవడానికి కూడా తరువోజ ని మించిన ఛందస్సు లేదనే కదా!

మళ్ళా మళ్ళా ఆ పద్య స్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేసాను. ఎటువంటి పద్యం! ఎటువంటి ఛందస్సు! పండరంగడు జైనుడు. తెలుగుని పద్యభాషగా తీర్చిదిద్దినవాళ్ళూ, తెలుగు ఛందస్సు రూపకర్తలూ జైనులే అనడంలో సందేహం లేదు. ఏమై పోయాయి ఆ పద్యాలు? ఆ కావ్యాలు? ఎక్కడ అదృశ్యమైపోయారు ఆ రసజ్ఞసమూహాలు?

అప్పుడు ఆ పద్యస్తంభం పక్కనే ఉన్న ఎర్రాప్రగడ విగ్రహం వైపు తిరిగాను.

9-1-2021

Leave a Reply

%d bloggers like this: