ఏమి రాగాలు! ఏమి భావాలు!

రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ వారు నిన్నణ్ణుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవాన్ని ప్రారంభించారు. అటువంటి ఉత్సవం జరపడానికి కూచిపూడి సిద్ధేంద్రయోగి కళాక్షేత్రంకన్నా సముచితమైన ప్రాంగణం మరొకటి ఎక్కడుంటుంది?

నిన్న పొద్దున్న ఆ వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా దాదాపు మూడు గంటల పాటు కూచిపూడి సంప్రదాయ నృత్యరీతుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల నాట్యప్రదర్శనలు ఏర్పాటు చేసారు. ప్రసిద్ధ కూచిపూడి కళాకారుడు, నాట్యాచార్యుడు చింతా రవిబాలకృష్ణగారు తన నట్టువాంగం బృందంతోనూ, తన విద్యార్థులతోనూ నిర్వహించిన ఆ నాట్యమాలికా ప్రదర్శన నేను ఎన్నటికీ మరవలేని అపూర్వ గాంధర్వఘడియ.

అవి ఏమి నాట్యాలు! ఆవి ఏమి భంగిమలు! ఏమి పాదచాలనాలు! ఏమి హస్తముద్రలు! ఏమి సమ్మోహనీయ విలోకనాలు! ఏమి రాగాలు! ఏమి భావాలు! ఏమి తాళాలు! ఇన్నాళ్ళ నా జీవితంలో ఇప్పుడే నేను కూచిపూడిని మొదటిసారి చూసినట్టుంది. ఒక రోజు గడిచిపోయిందిగానీ ఇప్పటికీ అక్కడే ఉన్నాను, ఉండిపోవాలనీ అనుకుంటున్నాను. దిగిరాను, దిగిరాలేను, ఆ దివినుండి భువికి.

అవి నాట్యాలా! ఆ చిన్నారులు నర్తకులా! కాదు, వారు నడిచే శిల్పాలు, రంగవేదికపైన పరుచుకున్న హళేబీడు, బేలూరు, రామప్పలు. ఆ రెండు హస్తాల్నీ ముద్రలకోసం దగ్గరగా తీసుకు వచ్చినప్పుడు వారు సృష్టిని ముకుళితం చేస్తున్నారు, తిరిగి ఆ రెండు చేతులూ విస్తారంగా చాపినప్పుడు, సర్గలయాల్ని ఒక్కసారిగా మనముందు దృశ్యాదృశ్యం చేస్తున్నారు. ఆ నిమీలితాక్షులతో వారు ఆ రంగస్థలాన్ని తామరపూల చెరువుగా మార్చేస్తున్నారు. ఆ పాదతాడనాలతో వారు జలపాతాల్ని కుమ్మరిస్తున్నారు. చూస్తున్నంతసేపూ మనమీంచి ఆ జలపాతాలు ప్రవహించిపోతూనే ఉన్నాయి. ఆ సౌష్టవ భంగిమలు, ఆ అభినయ శుద్ధి, ఆ వాచికం, ఆ తాళధ్వని, జీవితాన్ని పరిశుభ్రపరిచి సుసంస్కృతం చేసి నీ ముందు స్వీకారయోగ్యంగా నిలబెట్టిన క్షణాలవి.

ఎటువంటి సంపద కూచిపూడి! వెయ్యేళ్ళుగా ఆ చిన్న పల్లెటూరు ఎటువంటి సజీవశిల్పసంపదని చెక్కుతూ, మెరుగులుపెడుతూ, రోజురోజుకీ మరింత మరింత తీర్చిదిద్దుతూ ఉన్నది! తెలుగు వాళ్ళమై పుట్టినందుకు ఎంత గర్వించాలి మనం! నిన్న రాత్రంతా యూ ట్యూబ్ లో మహిమాన్వితమైన మరెన్నో నృత్యరీతుల్ని వెతికి వెతికి చూసాను. నవ్యవైష్ణవం అసాంలో రూపుదిద్దిన సత్త్రియా నృత్యం, కేలూ చరణ్ మొహాపాత్ర గీతగోవిందానికి అభినయ రూపాన్నిచ్చిన ఒడిస్సీ, కేరళ మోహినీయాట్టం, రాజస్థానీ జానపద నృత్యరీతులు, తమిళదేశపు భరతనాట్యం- కాని కూచిపూడి వాటన్నిటికన్నా సమగ్రంగా, మరింత సమ్మోహనీయంగా కనిపిస్తున్నది నా కళ్ళకి. బహుశా కూచిపూడి దరువులో తెలుగువాడి హృదయస్పందనం మరింత స్పష్టంగా వినబడుతున్నందుకా!

నిన్న ఆ గురుశిష్య బృందం ఒకదానివెనక ఒకటి నృత్యాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. అంబాస్తవం, నర్తన గణపతి ప్రార్థన, విశ్వనాథాష్టకం, కాలభైరవాష్టకం, చిదంబర స్తోత్రం, దశావతార స్తుతి, రావణకృత శివస్తోత్రం, ప్రహ్లాద చరిత్ర యక్షనాలతో పాటు అన్నమాచార్య కీర్తనలకు కూడా అభినయ రూపాన్నిచ్చారు. ఆ విద్యార్థులు నాట్యం చేస్తున్నంతసేపూ ఆ దేవీదేవతలంతా ఆ వేదికమీద కిక్కిరిసిపోయారు. ఇక అన్నిటికన్నా, ఆ దశావతార స్తోత్రం. వెంపటి చినసత్యం గారు కంపోజ్ చేసిన నాట్యం. పేరుపొందిన నర్తకీమణులెందరో అభినయించిన ఈ నాట్యం మీకు యూ ట్యూబ్ లో దొరుకుతుంది. కాని ఆ కూచిపూడి కంఠాలతో, ఆ కూచిపూడి గాలిలో, ఆ కూచిపూడి వెలుగులో, ఆ కూచిపూడి రంగభూమిపైన ఆ నాట్యం లాంటి నాట్యాన్ని మీరు మరెక్కడా చూడలేరని సంకోచం లేకుండా చెప్పగలను.

ఈ సంపద మనది, మన పిల్లలది. ఈ వారసత్వాన్ని భద్రపరుచుకోవలసింది మనం. భద్రంగా ముందు తరాలకు అందించవలసింది మనం.

20-12-2020

Leave a Reply

%d bloggers like this: