ఏనీడ్ -2

Reading Time: 4 minutes

ఏనీడ్ మహాకావ్యాన్ని వర్జిల్ అగస్టస్ సీజర్ కాలంలో రాసాడు. ఆయన పరాక్రమాన్ని ఉద్ఘాటించడానికీ, ఆయన రాజకీయ ఆశయాల్ని సుస్థిరం చేయడానికీ వర్జిల్ ఏనీడ్ రాసాడనేది సాధారణంగా చెప్పేమాట. ఎనియస్ పాత్ర ద్వారా వర్జిల్ అగస్టస్ సీజర్ నే చిత్రించాడనీ, ఆ కావ్యం ప్రధానంగా రాజకీయ ప్రచారంకోసం రాసాడనీ కూడా చెప్పుకుంటూ వచ్చారు.

అసలు ప్రతి పురాణగాథా కూడా ఒక రాజకీయ ప్రయోజనం నెరవేర్చడం కోసమే ప్రభవిస్తుంది. అప్పటిదాకా చెదురుమదురుగా ఉన్న వివిధ తెగల్ని ఒక జాతిగా ఏకీకరించే క్రమంలో వారికొక గతాన్నీ, ఒక వర్తమానాన్నీ, ఒక భవిష్యత్తునీ నిర్మించే క్రమంలో మైథాలజీలు రూపొందుతాయి. కొన్ని తెగలు జాతిగా రూపొందుతున్నప్పుడు వారికొక రాజకీయ సమగ్రతను కల్పించడం కోసం, వారిముందు కొన్ని ఉమ్మడి రాజకీయ లక్ష్యాల్ని నిర్దేశించడంకోసం పురాణగాథలు ప్రభవిస్తాయి. ఆ మేరకు ఏనీడ్ ని కూడా ఒక రోమన్ వంశచరితంగా భావించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

కాని ఏనీడ్ పురాణం మాత్రమే కాదు. కావ్యం కూడా. ఒక కావ్యాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం వ్యాఖ్యానించడం వల్ల చెప్పలేని అనర్థాలు సంభవిస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఇటలీలో ముస్సోలినీ అధికారంలోకి వచ్చిన తరువాత అతడు మరొకసారి రోమన్ వైభవాన్ని పునరుద్ధరించాలని కలలుగన్నాడు. సీజర్, అగస్టస్ ల తరువాత తాను మూడవ రోమ్ ని నిర్మించాలని ఆశించాడు. అందుకు అతడికి ఏనీడ్ ఒక స్ఫూర్తిదాయక గ్రంథంగా కనబడింది. ఏనీడ్ లోని జిగీష అతడికి ఆదర్శప్రాయమైంది. ఇటలీని మరొకసారి రాజకీయంగా సంఘటిత పరచడానికి చేసిన అతడి ప్రయత్నాలు ఒక ఫాసిస్టు రాజ్యానికి దారితీసాయి. అసలు ఫాసిజం అనే మాట fasces అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఒక గొడ్డలికి కట్టిపెట్టిన కట్టెలమోపు అని దాని అర్థం. అంటే విడివిడిగా ఉంటే ఓడిపోతామనీ, కలిసికట్టుగా ఉంటే బలపడతామనీ ఆ ప్రతీక సారాంశం.

ముస్సోలినీ ఫాసిజం, హిట్లర్ నాజీజంతో కలిసి యూరోప్ ని రెండవ ప్రపంచ యుద్ధంలోకి నెట్టిందని మనకి తెలుసు. ఆ యుద్ధం వెనక, ఇటలీ రాజకీయ జిగీష ఉంది. ఆ జిగీష వెనక, ఏనీడ్ మహాకావ్యంలో కథానాయకుడు ఒక promised land కోసం చేసిన నిర్విరామ అన్వేషణ కూడా ఉంది. ప్రపంచంలోని ప్రతి రాజకీయ సిద్ధాంతమూ ఒక వాగ్దత్త వసుంధరను చూపించేదే. నేడు నువ్వు జీవిస్తున్న నేలకన్నా భిన్నమైన మరొక బంగారులోకాన్ని ఆశపెట్టే ప్రతి ఒక్క సిద్ధాంతమూ అంతిమంగా రక్తచరిత్రకే దారితీస్తుంది. అటువంటి సిద్ధాంతాలు తమ జాతుల్ని ఏకీకరించుకునే ప్రయత్నంలో తమ పురాతన మహాకావ్యాల్ని వాడుకోవడం మొదలుపెడితే ఆ పరిణామాలు మరింత అనర్థదాయకంగా ఉంటాయి. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంరంభంలో ఏనీడ్ ని మరొకసారి రాజకీయంగా చదవడం మొదలుపెట్టడం అటువంటి అనర్థానికే దారితీసింది.

కాని రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏనీడ్ ని చదివే పద్ధతిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని అమెరికన్ పండితులు ఏనీడ్ నిజంగా వీరరసప్రధాన కావ్యమా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏనీడ్ కి సంబంధించి హార్వర్డ్ స్కూల్ చింతన గా ప్రసిద్ధి చెందిన ఈ కొత్త వ్యాఖ్యానాలు ఏనీడ్ ని కరుణరసప్రధాన కావ్యంగా, యుద్ధానికి, విజిగీషకీ వ్యతిరేకంగా కవి ప్రకటించిన ప్రకటనగా చూసే ప్రయత్నం చేసారు. వారి దృష్టిలో ఏనీడ్ లో రెండు కంఠాలున్నాయి. ఒకటి బాహాటంగా యుద్ధాన్నీ, జిగీషనీ, రోమన్ సామ్రాజ్య స్థాపననీ సమర్థించే గళం. ప్రచారగళం. చరిత్రకారులు ఇంతదాకా ఆ కంఠాన్నే వర్జిల్ కంఠంగా ప్రతిపాదిస్తూ వచ్చారు. కాని, ఆ కథానకథనంలో మరొక గళం కూడా మనకి స్పష్టంగా వినిపిస్తున్నది. అది యుద్ధాన్ని ద్వేషించే గళం. జిగీషని ప్రశ్నించే గళం. అసలు మొత్తం కావ్యంలో చివరి యాభై పంక్తులదాకా కూడా ఎనియస్ ఎక్కడా యుద్ధం పట్ల వ్యామోహాన్ని చూపించడు. అతడు తన ప్రయాణాన్ని దేవతల పట్ల విధేయతతోనే కొనసాగించినప్పటికీ, ఆ ప్రయాణం పట్ల అతడికేమీ ఉద్వేగం లేదు సరికదా, ఎప్పటికప్పుడు చెప్పలేనంత అయిష్టత కూడా కనపరుస్తూనే వచ్చాడు. ప్రతి సారీ తన మానవభావోద్వేగాల్ని అణచిపెట్టుకుంటూ, దైవవాణి ముందు అతడు వీలైనంత భావరహితంగానే నిలబడుతూ వచ్చాడు. తాను ఎందుకు తీరం నుంచి తీరానికి దిమ్మరుతూ పోవలసి వస్తున్నదో, అపారమైన శక్తిసామర్థ్యాలు కలిగి కూడా తాను ఎందుకు ఒక ప్రవాసిగా ప్రయాణించవలసి వస్తున్నదో అతడు చింతిస్తూనే ఉన్నాడు.

ఇటలీ నేలమీద ట్రోజన్, లాటిన్ వంశాల ఉమ్మడి పాలనని స్థాపించడమే ఏనీడ్ ఇతివృత్తంగా మనకి కనిపిస్తున్నప్పటికీ, అసలు ఆ యుద్ధాలు అవసరమా, మనుషులు ఒకరినొకరు అంత హింసాత్మకంగా వేటాడి వధించడం అవసరమా అన్న ప్రశ్న మనకి ప్రతి ఒక్క సర్గలోనూ వినిపించడం మానదు. మనుషులు ఒకరినొకరు సంహరించుకుంటున్నప్పుడు వర్జిల్ చేసే చిత్రణలో ఉద్వేగానికీ, ఉత్సాహానికీ బదులు ఎప్పటికప్పుడు నిర్వేదమే కనిపిస్తున్నదని ఏ పాఠకుడైనా సులభంగా గ్రహించితీరతాడు. ఈ అంశంలో చాలాచోట్ల ఎనియస్ మనకి రాముణ్ణి గుర్తుకు తెస్తూ ఉంటాడు.

చివరికి వచ్చేటప్పటికి వర్జిల్ తన ఆవేదనని ఇలా వాచ్యంగా చెప్పకుండా ఉండలేకపోయాడు కూడా:

టర్నస్ ఒకసారి, ట్రోజన్ వీరుడు ఒకసారి

ఒకరివెనక ఒకరు, ఆ యుద్ధభూమిలో

ప్రవహింపచేసిన ఆ ద్వేషం, ఆ రక్తం

ఆ సైనిక సంహారం-వాటిని నా గీతంలో

వర్ణించడానికి ఏ దేవుడు నాకు మాటలివ్వగలడు?

చిరకాలం శాంతిమయసహజీవనం చెయ్యవలసిన

జాతులిట్లా సంక్షోభంలో, సంఘర్షణలో

కూరుకుపోవడమే, స్వర్గాధినాథుడా

నీ సంకల్పమా?

( 11: 674:680)

పైకి ఒక promised land అన్వేషణగా కనిపించే ఒక నిర్వేదప్రధానమైన రచన ఏనీడ్ అని ఆ కావ్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన పండితులు వివరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఏనీడ్ లో కథానాయకుడు తన ప్రయాణంలో భాగంగా నరకలోకానికి కూడా వెళ్తాడు. నరకం ఎలా ఉంటుందో వర్జిల్ కి తెలుసు. నరకం గురించి హోమర్ కి కూడా తెలుసు. ఓడెస్సీలో ఒడెస్యూస్ కూడా నరకంలో అడుగుపెడతాడు. కాని హోమర్ చూసిన నరకం వేరు. వర్జిల్ చూసిన నరకం వేరు.

ఏనీడ్ కావ్యంలోని ఆరవసర్గలో ఎనియస్ నరకానికి వెళ్ళినప్పుడు అతడి తండ్రి అతడికి అక్కడ రోమన్ భవిష్యత్తు గురించి వివరిస్తాడు. చాలామంది దృష్టిలో వర్జిల్ రోమ్ వైభవాన్ని కీర్తించడంకోసమే ఆ వర్ణన చెప్పించాడు. కాని వెండెల్ క్లాసన్ అనే పండితుడు ఆరవ సర్గని మళ్ళా కొత్తగా చదివాడు. అతడు చెప్పిన దాన్ని బట్టి రోము భవిష్యత్తు గురించి ప్రచారం చెయ్యడమే వర్జిల్ లక్ష్యమై ఉంటే, అతడు ఆ వర్ణన నరకలోకంలో ఒక మృతజీవితో ఎందుకు చేయించాడు? ఆ పండితుడి దృష్టిలో కావ్యవ్యంగ్యమంతా ఇక్కడే ఉంది. నువ్వు అన్వేషిస్తున్న promised land నీకు దొరుకుతుంది, కాని అందుకు నువ్వొక నరకాన్ని నిర్మించుకోక తప్పదు అనే కవి చెప్తున్నాడు. వీరుడు విజయం సాధిస్తాడు, కాని అందుకు చెల్లించవలసిన మూల్యం మాట? కవిగా వర్జిల్ రెండు బాధ్యతలు నిర్వహించాడనీ, ఒక వైపు అతడు తన సమకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఒక promised land ని ఉద్ఘాటించినప్పటికీ, ఒక జాతి అందుకు చెల్లించవలసిన మూల్యం గురించి అతడు అపారంగా కలతచెందుతూనే ఉన్నాడనీ ఆ పండితుడు వివరిస్తూ, ఆ దృష్టితో చదివినప్పుడు, ఏనీడ్ ఒక public voice of triumph and private voice of regret అని నిష్కర్షగా చెప్పేస్తాడు.

కాని రెండవ ప్రపంచ యుద్ధం సంభవించకపోయి ఉంటే, ఈ వాక్యానికి మనం చేరుకోగలిగి ఉండేవాళ్ళం కాదు. క్లాసన్ పండితుడు మహాభారతం చదివేడో లేదో నాకు తెలియదు, కాని స్వర్గారోహణ పర్వానికి వచ్చేటప్పటికి యుధిష్టిరుడి మనఃస్థితి కూడా ఇటువంటిదే. ఆయన కూడా నరకంలో అడుగుపెట్టాడు. కాని అక్కడ తన తమ్ముల్నీ, కర్ణుణ్ణి నరకంలో చూసినప్పుడు అతడికి అపారమైన దుఃఖం కలిగింది. తాను స్వర్గానికి వెళ్ళాలని కోరుకోవడంలేదనీ, తనవారికోసం ఆ నరకంలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నాననీ చెప్తాడు.

ఏనీడ్ కావ్యంలో కథానాయకుడు కథాంతంలో కాదు, కథ మధ్యలో నరకంలో అడుగుపెట్టాడు. కాని ఆ తర్వాత, అతడు చేపట్టిన ప్రతియుద్ధంలోనూ, చేపట్టిన ప్రతి వధలోనూ నరకం అతడి పక్కనే ప్రత్యక్షమవుతూనే ఉంది. చివరికి, ఏనియస్ టర్నస్ ని నేలకూల్చినప్పుడు, టర్నస్ తనని తన తండ్రి దగ్గరికి చేర్చమని అడిగినప్పుడు, అప్పుడు, ఆ చివరిక్షణాల్లో, ఎనియస్ అతణ్ణి క్షమించకపోగా, కసిదీరా వధించడానికి కారణం కూడా ఆ నరకమే. ఎందుకంటే, ఆ చివరి క్షణాల్లో, అతడు టర్నస్ కోరికని పరిగణిస్తున్న ఆ చివరి క్షణాల్లో, అతడికి టర్నస్ దేహం మీద పల్లాస్ ని గుర్తుచేసే పట్టీ కనిపించింది. ముక్కుపచ్చలారని పల్లాస్ ని వధించి, అతడి అలంకారాన్ని తన విజయచిహ్నంగా ధరించిన టర్నస్ ని ఎనియస్ క్షమించలేకపోయాడు. అతణ్ణి పూర్తిగా వధించాడు. మొత్తం కావ్యంలో ఎనియస్ తన భావోద్వేగాన్ని అణచుకోలేకపోయిన ఘట్టం అదొకటే అని పండితులు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎనియస్ అప్పటిదాకా తన నరకాన్ని తనలోనే అనుభవిస్తూ ఉన్నాడు. ఆ క్షణాన ఇక అతడు ఆ నరకాన్ని బయటకు వెళ్ళగక్కకుండా ఉండలేకపోయాడు. కాని తన విరోధిని సంహరించిన ఆ క్షణమే అతడి విజయక్షణం కూడా. కాని ఏ విజయం? బాహ్య విజయం మాత్రమే. అతడు ఆ క్షణాన తన బాహ్య శత్రువుని వధించగలిగాడుగానీ, అంతశ్శత్రువుకి పూర్తిగా లొంగిపోయాడు.

అపారమైన, ఎంతో లోతైన ఈ కావ్య వ్యంగ్యం వల్ల ఏనీడ్ నాకు రామాయణంకన్నా, మహాభారతం కన్నా రఘువంశ కావ్యానికి ఎక్కువ సన్నిహితంగా కనిపిస్తున్నది. రఘువంశం గురించి కూడా సాహిత్యచరిత్రకారులు ఏనీడ్ గురించి చెప్పినమాటలే చెప్పారు. గుప్త చక్రవర్తుల జైత్రయాత్రల్ని వర్ణించడం కోసం కాళిదాసు ఆ కావ్యం రాసాడన్నారు. కాని ఆ కావ్యంలోని విషాదాన్ని మొదటిసారిగా టాగోర్ పట్టుకున్నాడు. వర్జిల్ లానే కాళిదాసు కి కూడా గతం తిరిగి రాదని తెలుసు. తపోవనకాలంలోని ఆ శాంతిమయ ప్రపంచం ఎక్కడ? జిగీషతో,భోగలాలసతో మద్యపానంలో కూరుకుపోయిన వర్తమానమెక్కడ? కాళిదాసు తన కావ్యాన్ని అసంపూర్తిగా ముగించాడన్న భ్రమతో మరొక కవి ఎవరో రఘువంశాన్ని పూర్తిగా రాయడానికి ప్రయత్నించాడు. ఏనీడ్ కూడా అలాంటి అసంపూర్తి కావ్యమేనని భావించేవారున్నారు. కాని నా దృష్టిలో రెండు కావ్యాలూ కూడా ఆ కవులు ఎక్కడ ముగించారో అక్కడే ముగిసిపోయాయి.

ఎనియస్ నరకలోకం నుంచి బయటకి వస్తున్నప్పుడు, వర్జిల్ నరకానికి రెండు నిద్రాద్వారాలున్నాయని చెప్తాడు. ఒకటి కొమ్ములతో చేసిన ద్వారం. నరకం నుంచి బయటపడటానికి అది చాలా సులభమైన దారి అట. మరొకటి తెల్లగా మెరుగులీనే దంతాలతో నిర్మించిన ద్వారం. ఆ దారిలో నరకం ఎప్పటికప్పుడు అసత్య స్వప్నాల్ని స్వర్గం వైపుగా పంపుతూ ఉంటుందట. ఎనియస్ ని అతడి తండ్రి ఆంచీస్ ఆ దారిన నరకం నుంచి బయటకు పంపించాడని చెప్తాడు వర్జిల్. బహుశా ఏనియడ్ కావ్యరహస్యమంతా ఈ మాటల్లో ఉందనిచెప్పవచ్చు. మనిషి తనని వేధించే వేదననుండి బయటపడటానికి మూడే మార్గాలున్నాయనీ, అవి పలాయనమూ, అత్మహననమూ, కృతకశక్తుల పూజనమూ అని బైరాగి అంటున్నప్పుడు అతడు వర్జిల్ కి ఎంత సన్నిహితంగా కనిపిస్తున్నాడు!

4-6-2021

Leave a Reply

%d bloggers like this: