ఇదిగో లోకానికి ఇది నా లేఖ

ఎమిలీ డికిన్ సన్ కవిత్వం గురించి నేను రాసినప్పుడు ఆ కవిత్వాన్ని ఎవరన్నా తెలుగులోకి అనువదించారో లేదో నాకు తెలీదు అంటే, సరోజినీ ప్రేమ్ చంద్ గారు ‘ఇదిగో లోకానికి ఇది నా లేఖ’ అనే పుస్తకం వెలువరించారని, నాసరరెడ్డి చెప్పాడు. వెంటనే ఉండబట్టలేక ఆమెకి ఫోన్ చేస్తే ఆమె ఎంతో దయతో, సహృదయతతో ఆ పుస్తకం ఒక ప్రతి నాకు పంపించారు.

ఎమిలీ డికిన్ సన్ కవిత్వాన్ని తాను 1987 నుంచి చదువుతున్నానని, ఆ కవిత్వంలో తనకి ఎప్పుడు ఏది తెలుగు చేయాలని అనిపిస్తే ఆ కవితలు తెలుగు చేస్తూ వచ్చానని ఆమె ఆ పుస్తకానికి ముందుమాటలో రాసుకున్నారు. మొత్తం 138 అనువాదాలు. ఆమె తను అనువాదాన్ని అనుసృజన అని చెప్పుకున్నారు. ఆ మాట సమంజసమే. ఎందుకంటే, ఆ కవిత్వం నేరుగా తెలుగులోనే రాసినట్టుగా ఎంతో మృదువుగానూ, ఎంతో సరళంగానూ కనిపిస్తున్నది.

సరోజినీ ప్రేమ్ చంద్ గారు కవి పరిచయం చేస్తూ ఇలా రాసుకున్నారు:

‘..(ఎమిలీ డికిన్ సన్) కవిత్వం చదివి ఆశర్యంతో నిశ్చేష్టురాలినైపొయాను. ఇంత తేలిక మాటలలో ఇంతగా హృదయాన్ని ఆకట్టుకునే శక్తి ఎమిలీ డికిన్ సన్ కవితల్లోని వైశిష్ట్యం. మరికొన్ని కవితల్ని కూడా చదివాక ఒక కొత్తలోకంలో విహరించి వచ్చినట్టు నా మనస్సు ఎన్నడూ ఎరగనంతగా సమ్మోదంతో నిండిపోయింది. సరళంగా, సూటిగా, స్నేహపూరితంగా, సన్నిహితంగా చెవిలో గుసగుసలు ఎప్పినట్లుగా కవిత్వం అల్లిన ఎమిలీ డికిన్ సన్ ఆ రోజునుంచి నాకు ఆత్మీయురాలైంది. సమయం దొరికినప్పుడల్లా ఒకటి రెండు పుటలు చదవడం ఆమె చిత్రణ చేసిన లోకంలో విహరించడం నా నిత్యజీవితంలో భాగమైంది. ఈ పని చేయాలి అని ప్రత్యేకంగా అనుకోకుండానే ఈ కవితలను తెలుగులోకి మార్చడం మొదలుపెట్టాను.’

ఈ మాటలు అక్షర సత్యాలని ఆమె అనుసృజన చదివితే అర్థమవుతుంది. ఎమిలీ డికిన్ సన్ కవిత్వంలోని పూలపరాగమూ, ఆ పక్షికూజితాలూ, ఆకాశపు అరుణిమా మనకి ఈ పుస్తకంలో తెలుగు భాషలో కనిపిస్తాయి. ఈ కవిత చూడండి:

కొన్ని రెక్కలు విప్పుకుని

ఎగిరిపోతుంటాయి-పక్షులూ, క్షణాలూ, తుమ్మెదలూ-

వీటిమీద వియోగ గీతాలు రాయను.

కొన్ని ఉన్నచోటే ఉండిపోతాయి

బాధలు, బండరాళ్ళు, అనంతత్త్వం-

వీటినీ నేను పట్టించుకోను-

కొన్ని ఉన్నట్లే ఉండి

రెక్కలు చాచి

ఎగిరిపోతుంటాయి-

అంతరిక్షంలోని నిగూఢత

వివరించ సాధ్యమా?

నిశ్చలంగా నిలబడిపోయింది ప్రశ్న.

ఎమిలీ డికిన్ సన్ ని అనువదించడం కష్టం కాదు, దాదాపుగా దుస్సాధ్యం. ఎందుకంటే, ఆ విలక్షణమైన ఇంగ్లీషుని ఇంగ్లీషులోకి అనువదించడమే కష్టం, ఇక తెలుగులోకి తేవడం ఎట్లా? కాని సరోజిని గారు ఆ నిశ్శబ్ద్దాన్ని, ఆ వైశిష్ట్యాన్ని, ఆ మృదూక్తిని, ఆ అర్థోక్తిని ఎంతో సరళంగా అనుసృజించుకున్నారు. ఈ కవిత చూడండి:

మాట బయటకు అనగానే

దాని ఆయువు తీరిపోతుంది

అని కొందరు అంటారు-

కాదంటాను నేను

వెలుపలకు వచ్చాకే

ప్రాణం పోసుకొని

బ్రతకడం ఆరంభిస్తుంది

మాట.

దీని ఇంగ్లీషు మూలం ఇలా ఉంది:

A word is dead

When it is said.

Some say.

I say it just

Begins to live

That day.

మూలంతో పోల్చినప్పుడు ఆమె తెలుగు ఎంత సులభసుందరంగా ఉందో చూడండి. ఇటువంటి కవితలు ఎన్నో ఎంచవచ్చును ఈ పుస్తకంలో. ఈ కవిత చూడండి, ముందు ఇంగ్లీషులో:

I had no time to Hate-

Because

The Grave would hinder Me-

And Life was not so

Ample I

Could finish-Enmity-

Nor had I time to Love-

But since

Some Industry must be-

The little Toil of Love-

I thought

Be large enough for Me-

ద్వేషించడానికి నాకు సమయం లేదు

నా ఆయుష్కాలం అందుకు అడ్డుతగులుతుంది

శత్రుత్వం సాధించేటంత

దీర్ఘకాలం సాగదు బ్రతుకు.

ప్రేమించడానికి సమయం లేకపోయింది

ప్రతి మనిషీ ఏదో ఒక కృషి చేయకతప్పదు

చేతనైన చిన్న పనిలో ప్రేమను నింపాను

చాలును నా జన్మకిది అని తలచాను.

ఈ ఎనిమిది పంక్తుల అనువాదంలో ఆమె చూపిన మెలకువల మీద ఒక వ్యాసం రాయవచ్చును. అనువాదమంటే ఇలా చెయ్యాలి. మూలవిధేయంగా ఉంటూనే చిన్ని చిన్ని స్వతంత్రాలు, బంగారానికి మెరుగుపెట్టినట్టు.

ఇక ఈ కవిత అయితే అచ్చం నేను రాసుకున్నట్టే ఉంది:

వసంతం వచ్చీ రాకమునుపే

ప్రత్యూష సమయంలో

నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ

గబగబా కాసిని అరుపులు

అరిచే దెవరు?

కోయిలమ్మ కదూ!

వసంతశోభ వెల్లివిరుస్తుంటే

మధ్యాహ్నం వరకు దొరిలిపోతూనే వుంటాయి

వరుసలు కట్టిన చరణాలు

పాడేదెవరు?

కోయిలమ్మ కదూ!

గూటిలో కూర్చుని

ఇంటిలోనే సుఖం వున్నది

ఇచటే నిశ్చింత

మౌన సందేశం ప్రకటించేదెవరు?

కోయిలమ్మ కదూ!

మొత్తం అన్నీ కవితలూ ఎత్తి రాయాలని ఉంది కాని, సముచితం కాదని ఆగుతున్నాను.

10-6-2021

Leave a Reply

%d bloggers like this: