ఆ బంభర నాదం

Reading Time: 2 minutes

మాష్టారి అబ్బాయి మార్కండేయులు మాష్టారి పద్యాలు పంపించాడు విను అని అక్క నిన్న నాకు వాట్సప్ లో పంపించింది. ఎప్పటి పద్యాలవి! ఆ పద్యాలు చదువుతుండగా వినిపించిన కరతాళ ధ్వనులు బట్టి, అవి 1983 లో నన్నయ సహస్రాబ్ది ఉత్సవాల్లో, ఆనం వెంకటేశ్వర కళాకేంద్రంలో మాష్టారు చదివిన పద్యాలని గుర్తుపట్టగలిగాను.

ఆ రోజు నాకిప్పటికీ గుర్తే. పొద్దుణ్ణుంచీ నన్నయ మీద ఎందరో వక్తలు ఏకధాటిగా ప్రసంగిస్తూనే ఉన్నారు. అసలు నన్నయ అనగానే అందరికన్నా ముందు మాష్టారు కదా మాట్లాడాలి. కాని రాజమండ్రి ఆయనకి ఆ గౌరవం ఇవ్వలేకపోయింది, అలాగని పక్కన పెట్టలేకపోయింది కూడా. ఆ రోజు ఆయన్ని అందరికన్నా చివరి వక్తగా, ఇక భోజన విరామానికి ముందు వక్తగా పిలిచారు. అప్పటికే హాల్లో శ్రోతలు పలచబడటం మొదలుపెట్టారు. వేదిక మీద వక్తలు కూడా ఒకరూ ఒకరూ జారుకుంటున్నారు. అప్పుడు, అలాంటి, ఉదాసీన క్షణాల్లో, మాష్టారు నన్నయ గురించి మాట్లాడాలి!

కాని ఆ రోజు ఆయన ప్రసంగించలేదు. తనలో ఉబికి వస్తున్న ఆవేశాన్నీ, అసహనాన్నీ దాచుకునే ప్రయత్నమేమీ చెయ్యలేదు సరికదా, ‘ఇది శాస్త్ర వేదిక కాదు, సాహిత్య వేదిక. మనం ఇక్కడికి వచ్చింది మనకేం తెలుసో చాటుకోడానికి కాదు, నన్నయ కవిత్వమెటువంటిదో పంచుకోడానికి. ఏదీ? ఇంతదాకా ఎవరూ ఆ పని చెయ్యరేం? ఇందాకణ్ణుంచీ చూస్తున్నాను, ఇక్కడ సరస్వతీదేవి కనిపిస్తుందేమోనని. ఏదీ ఆమె? ఎక్కడుంది? ఇంతసేపూ మాట్లాడిన వక్తల వాగ్ధాటికి నొచ్చుకుని ఈ ప్రాంగణంలో అడుగుపెట్టడానికే సంకోచిస్తూ ఉండిపోయినట్టుంది. ఇదిగో, ఇప్పుడు నేను ఆమెని ఆహ్వానిస్తాను, గొంతెత్తి రమ్మని పిలుస్తాను, వినండి, మీకు ఆమె నూపురధ్వని వినిపించిందో లేదో చెప్పండి ‘అంటో ఎలుగెత్తి నన్నయ పద్యాలు ఒకటొకటే ధారాపాతంగా, ధారణలోంచి వినిపించడం మొదలుపెట్టారు. ఆ పద్యాల్లో, వసంత ఋతువుని నన్నయగారు వర్ణించిన రెండు పద్యాలూ కూడా చదివారు. ఆ పద్యాలే, ఇదిగో, ఇక్కడ వినండి. ఆ కంఠం, ఆ బంభర నాదం, ఒక సరస్వతీ ఉపాసకుడు పంచాక్షరి జపించినట్టుగా పద్యపదాల్ని ఎలా జపిస్తున్నాడో వినండి.

కమ్మని లతాంతముల కుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నిన దమ్ములెసగెం చూ

తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధిముకుళమ్ములను నానుచును ము దమ్మొనరవాచా

లమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మగుచు విన్చెననిశమ్ము సుమనోభా

రమ్ముల నశోక నికరమ్ములను చంపక చయమ్ములును కింశుక వనమ్ములును నొప్పెన్

(ఆదిపర్వము, 5: 138)

చందన తమాల లతలందు అగరు ద్రుమములందు కదళీవనములందు లవలీమా

కందతరుషండముల యందు అనిమీలదరవిందసరసీవనములందు వనరాజీ

సందళిత పుష్పమకరందరసుముందగులుచుందనుపు సౌరభమునొంది జనచిత్తా

నందముగ బ్రోషితుల డెందములలందురగమందమలయానిల మమంద గతివీచెన్

(5:139)

కాని ఇన్నేళ్ళ తరువాత, ఆ పద్యాలు వినగానే నాకు చెప్పలేనంత దిగులు కమ్మేసింది. ఆ రసజ్ఞుడు ఇప్పుడు మనమధ్య లేడని మాత్రమే కాదు, అసలు, ఆంధ్ర దేశంలో ఏ పట్టణంలోనైనా, ఏ కవి గురించైనా అలా ఎలుగెత్తి పద్యాలో, గేయాలో చదివే వక్తలెవరేనా ఉన్నారా ఇప్పుడు? అలా ఒక రసజ్ఞుడు ఎలుగెత్తి, మేఘగంభీర స్వరంతో పద్యాలు చదువుతోంటే, భయంతో, భక్తితో, వినమ్రతతో అట్లా ఆ రోజు రాజమండ్రి ఆ ఉద్గాత ముందు చెవి ఒగ్గినిలబడిపోయినట్టుగా ఇప్పుడు ఏ పట్టణమేనా చెవి ఒగ్గడానికి సిద్ధంగా ఉందా? ఏమై పోయింది ఆ కాలం? ఆ రసజ్ఞులు? తే వందినః? తాః కథాః?

19-4-2021Leave a Reply

%d bloggers like this: