ఆయన కృపాదృష్టికి అడ్డులేదు

 రెండువారాల కిందట నెల్లూరు జిల్లాలో కలువాయి మండలంలో కొన్ని పాఠశాలలు సందర్శిస్తూ ఉండగా, నాతో పాటు ఉన్న ఉపాధ్యాయులు ‘నాగుల వెల్లటూరు ఇక్కడికి దగ్గర్లోనే’ అన్నారు. నాకు చాలా సంతోషమనిపించింది. భగవాన్ గొలగమూడి వెంకయ్యస్వామి పుట్టిన ఊరుకి అంత దగ్గరగా ప్రయాణించానని అనుకోగానే ఎలాగేనా ఆ ఊరు కూడా వెళ్ళాలనీ, అక్కడ వెంకయ్యస్వామి పుట్టి పెరిగిన ఇల్లు కూడా వెంటనే చూడాలనీ బలంగా అనిపించింది.

వెంకయ్యస్వామి గురించి చాలా ఏళ్ళ కిందటే నేను మొదటిసారి విన్నప్పటికీ, ఆయన జీవితం గురించీ, సందేశం గురించీ సాకల్యంగా విన్నది మాత్రం అల్లు భాస్కర రెడ్డి గారి ద్వారానే. భాస్కరరెడ్డిగారు, కోడూరి ఇందిరమ్మగారు భగవాన్ వెంకయ్య స్వామి జీవితచరిత్రను ఒక పుస్తకంగా వెలువరించారు. పదేళ్ళ కిందట వెలువడిన ఆ పుస్తకానికి ముందుమాట రాసే అదృష్టం నాకు లభించింది. అంతేకాదు, నెల్లూరులో ఎంతో వైభవంగా జరిగిన ఆ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడే అవకాశం కూడా పొందగలిగాను.

మామూలుగా యోగులగురించీ, భక్తుల గురించీ రాసే జీవితచరిత్రలు చాలా మహిమలతోనూ, అతిశయోక్తులతోనూ నిండి ఉంటాయి. కాని భాస్కరరెడ్డిగారు రాసిన పుస్తకం అటువంటి జీవితచరిత్ర కాదు. ఆయన వెంకయ్యస్వామి జీవితం గురించి రాయాలని అనుకోగానే కొంతమంది యువతీ యువకుల్ని వెంకయ్యస్వామి ఏ గ్రామాల్లో సంచరించారో ఆ గ్రామాలకు పంపించారు. ఆ యువతీయువకులు పెద్ద చదువులు చదువుకుంటున్న తరం. వారు ఆ గ్రామాలకు వెళ్ళి వెంకయ్యస్వామిగురించి ఎవరు ఏమి చెప్పినా ఆ వాజ్మూలాలన్నిటినీ ఎంతో శ్రద్ధగా సేకరించి తీసుకువచ్చారు. వాటిని భాస్కరరెడ్డిగారు జల్లెడపట్టారు. ఆ వాజ్మూలాల్నీ, సాక్ష్యాల్నీ ఒకదానితో ఒకటి పోల్చి చూసుకున్నారు. న్యాయస్థానంలో ఒక న్యాయవాది తాను సమర్పించాలనుకున్న వాదనను ఎంత సాక్ష్యాధారాలతో ప్రవేశపెడతాడో అంత హేతుబద్ధంగా, విశ్వసనీయంగా ఆయన వెంకయ్యస్వామి జీవితచరిత్రను పునర్నిర్మించారు. సాయిబాబా జీవితసచ్చరిత్ర రాసే అవకాశం హేమాద్ పంతుకి ఇచ్చినట్టుగా, తన జీవితచరిత్ర రాసే అవకాశం వెంకయ్యస్వామి భాస్కరరెడ్డిగారికి అప్పగించారని ఆ పుస్తకం చదివితే మనకి బోధపడుతుంది.

ముందుమాట రాయడం కోసం ఆ పుస్తకం చదివినప్పుడు నా మొదటి ప్రతిస్పందన కన్నీళ్ళు, ఎడతెరిపిలేని కన్నీళ్ళు. కంప్యూటరు మీద టైపు చేస్తూ ఉండగా, ఆగకుండా ప్రవహిస్తున్న అశ్రువుల మధ్య నేనిట్లా రాసాను:

‘..ప్రతి సిద్ధపురుషుడూ తానుండే తావును ఎంచుకోవడంలోనూ, తన శ్రోతల్నీ, శిష్యుల్నీ ఎంచుకోవడంలోనూ, తన భాషనీ, బోధనల్నీ ఎంచుకోవడంలోనూ కూడా ఒక దేశకాలబద్ధత ఉంటుంది. ఏసు గలిలి సముద్రం ఒడ్డున జాలరుల్నీ, సుంకరుల్నీ తన శ్రోతలుగా ఎంచుకున్నట్టు, బుద్ధుడు వైశాలిలో, శ్రావస్తిలో తన శ్రోతల్ని ఎంచుకున్నట్టు, రామకృష్ణ పరమహంస ఆధునిక బెంగాల్ లో ఇంగ్లీషు విద్య చదువుతున్న నవయువకుల్ని ఎంచుకున్నట్టు, షిరిడిలో సాయినాథుడు నిరక్షరాస్యులైన హిందూ-ముస్లిం రైతుల్నీ, గృహిణుల్ని చేరదీసినట్టు వెంకయ్యస్వామి కూడా పెన్నానదికి అటూ ఇటూ ఉండే గ్రామాల్లో రైతుల్నీ, శ్రామికుల్నీ గృహిణుల్నీ అక్కున చేర్చుకున్నారు. అలా నిర్దిష్ట దేశకాలాలకు చెందిన శ్రోతల్ని ఉద్దేశించి ఆయా మహాపురుషులు మాట్లాడినప్పటికీ వారి కృషీ, వారి సందేశం దేశకాలాల ఎల్లలు దాటి నలుగురికీ అంది తీరతాయి. కొందరి విషయంలో అది వారి జీవితకాలంలోనే జరగవచ్చు. కొందరి విషయంలో కొంత ఆలస్యంగా జరగవచ్చు. కాని సుదూర గగనంలో ఉండే నక్షత్రాలనుంచి కాంతికిరణాలు కొన్ని వేల కాంతిసంవత్సరాల పాటు రోదసిలో ప్రయాణించి భూమికి చేరుతున్నట్టే ఆయా సిద్ధపురుషుల బోధలు కూడా కొన్ని ముందువెనకల తేడాలో అందరికీ అందక తప్పదు. శ్రీ వెంకయ్యస్వామి జీవితం గురించీ, బోధల గురించీ, ఆలస్యంగానే అయినప్పటికీ, అల్లుభాస్కరరెడ్డి ద్వారా ఇప్పుడు ఆంధ్ర దేశం, రేపు మొత్తం ప్రపంచం, తెలుసుకునే అవకాశం నేటికి ఈ పుస్తకం ద్వారా లభించింది.’

‘ఈ పుస్తకంలో ఎక్కడ ఏ అధ్యాయం తెరిచినా తనను తాను విస్మరించి తన చుట్టూ ఉండే నలుగురి క్షేమం కోసం మాత్రమే బతికిన ఒక మహనీయుడు కనిపిస్తాడు. చుట్టూ ఉండే ప్రపంచం తనను హింసించినా, అపహాస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా తాను మాత్రం తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ప్రేమించాడు, గౌరవించాడు, లాలించాడు, బుజ్జగించాడు, సేవించాడు.’

‘ఈ జీవితచరిత్రను నేను కన్నీళ్ళతో చదివాను. చదివినంతసేపూ నా హృదయం మెత్తబడుతూ, నాలోని మాలిన్యాలు అడుగంటుతూ, నా మనస్సు తేటపడుతున్నట్టుగా అనుభూతి చెందాను. ఈ పుస్తకాన్ని పారాయణం చేసే ప్రతి ఒక్కరికీ ఇటువంటి అనుభూతినే శ్రీ వెంకయ్యస్వామి వాద్గానం చేసారని నమ్ముతున్నాను.’

ఆ ముందుమాట రాసినందుకు ప్రతిఫలం పదేళ్ళ తరువాత, అనుకోకుండా ఆయన పుట్టిన ఊరు వెళ్ళగలగడం, ఆయన పుట్టి పెరిగిన ఇంట్లో అడుగుపెట్టడం, అక్కడ కొంతసేపు కూర్చోగలగడం, ఆయన తమ్ముడి పిల్లలతోనూ, ఆ పిల్లల పిల్లలతోనూ సంభాషించగలగడం.

వెంకయ్యస్వామి రైతుబిడ్డ. తాను ఆ ఊళ్ళో ఉన్నంతకాలం ఆయన అరకపట్టాడు. పొలం దున్నితే పదిమంది పని ఒక్కడే చేసేవాడు. కాని ఎప్పుడో ఏ క్షణంలోనో ఆయనకు సాక్షాత్కారం లభించింది. ఆ జ్ఞానోదయం అన్నిటికన్నా ముందు మనుషుల మధ్య కులాలు లేవనే ఒక ఎరుకగా ఆయన్ని నిలవనివ్వలేదు. వందేళ్ళ కిందటి ఆ గ్రామం ఆయనకి ఆ ఎరుక కలిగినందుకు ఆయన్ని ఎంతలా హింసించాలో అంతగానూ హింసించింది. మాదిగ, మంగలి, చాకలి, డక్కలి కులాలన్నీ ఒకటే అంటో వారు తింటున్న అన్నం తానుకూడా వారి చేతుల్లోంచో, పళ్ళాల్లోంచో లాక్కుని తిన్నందుకు ఆయన నాలికకి వాతపెట్టారు, చెట్టుకి కట్టి కొట్టారు. ఆ యువకుడు ఆ అమానుషత్వానికి వణికిపోయాడు. భయపడిపోయాడు. ఊరినుంచి పారిపోయాడు. తిరిగి చాలా ఏళ్ళ తరువాత తన జ్ఞానం తనకి కలిగించిన ఆత్మస్థైర్యంతో సంచరించడం మొదలుపెట్టాక కూడా, ఆ ఊరుమీంచి వెళ్ళవలసి వస్తే చూపులు పక్కకి తిప్పుకుని వెళ్ళిపోయేవాడట. కాని ఆ ఊరు పట్ల ఆయన కృపాదృష్టికి మాత్రం అడ్డులేదు.

‘మేము ఒక పొలం కొనుక్కోవాలనుకుంటున్నాం, మంచిదేనా అని అడిగాం ఆయన్ని’ అని చెప్తున్నాడు ఆయన తమ్ముడి కొడుకు నాతో, ‘మంచిదే కదయ్యా, ఉత్తరాన కాలువ పోతున్నది కదా’ అన్నాడు స్వామి. ఆ పొలానికి ఉత్తరాన ఏ కాలువ లేదే. దక్షిణంగా మాత్రం దూరంగా ఒక చిన్న ఏరు ఉంది. స్వామి పొరపడుతున్నాడనుకుని ఆ మాటే అన్నాం. ‘లేదయ్యా, ఉత్తరాన కాలువ పోతున్నది కదా, పంటకాలువ’ అన్నాడు మళ్ళా. ఏదోలే పిచ్చి మాటలు అనుకున్నాం. కాని, ఇప్పుడు ఆ పొలానికి ఉత్తరాన సోమశిల పంటకాలువ పోతున్నది’ అన్నాడు ఆ పెద్దమనిషి ఆ రోజు నాతో.

ఇటువంటి మాటలు కొన్ని వందలు భాస్కరరెడ్డిగారు సేకరించారు. వెంకయ్యస్వామి సమాధి చెంది నలభయ్యేళ్ళు కావొస్తున్నది. ఈ నాలుగు దశాబ్దాలుగా ఒకప్పుడు ఆయన పిచ్చిమాటలుగా జనం పరిగణించని మాటలు ఎప్పుడు ఎక్కడ ఎలా నిజమయ్యాయో, నిజమవుతున్నాయో చెప్పుకోవడమే ఆ గ్రామాల్లో నేడు ఆయన స్మరణగా కొనసాగుతున్నది.

ఆ రోజు వెంకయ్యస్వామి గారి ఇంటిముంగిట ఆయన తమ్ముడిపిల్లలతోనూ, గ్రామస్థులతోనూ చాలాసేపే మాట్లాడాను. వాళ్ళు నాకు టీ ఇచ్చారు. ఎందుకు శ్రమ అంటే, ఇది ఆయన ప్రసాదం అన్నారు. కాని ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు నాకు కలిగిన మొదటి భావన ఏమంటే, ఈ దేశం ఎంత ఆధ్యాత్మిక భూమి అని మనం చెప్పుకుంటున్నప్పటికీ, ఒక మనిషికి నిజంగా ఆధ్యాత్మిక సిద్ధి కలిగితే ఆయన్ని ఎలా గుర్తించాలో, ఎలా గౌరవించాలో మనకి ఇప్పటికీ తెలియదు అనే. ఆ మనిషి ఈ లోకాన్ని వీడిపోయేదాకా మనం ఆయన్ని అనుమానిస్తూనే ఉంటాం, వేధిస్తూనే ఉంటాం, హింసిస్తూనే ఉంటాం.

ఇప్పుడు ఆ ఊళ్ళో వెంకయ్యస్వామి మందిరం ఉంది. అక్కడ ఒక ధుని నిత్యాగ్నిహోత్రంగా వెలుగుతూ ఉంది. ఆ మందిరప్రాంగణంలో అడుగుపెట్టగానే చల్లగానూ, సేదతీర్చేదిగానూ అనిపించింది. ఆ మందిరంలో ఆయన మూర్తి ఒక పల్లెటూరి పెద్దమనిషిలాగా మన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మనం చెప్పబోయేది వినటానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఆయన అనుగ్రహసూచకంగా నా చేతికి దారం కట్టారు. అది బయటి ప్రభావాలనుంచి కాదు, ముఖ్యంగా నా నుంచి నన్ను రక్షిస్తుందనే అనుకుంటున్నాను.

8-6-2021

Leave a Reply

%d