ఆధ్యాత్మిక పరీక్ష

ఆ మధ్య ఒక మీటింగ్ లో అయిదారుగురు ఉన్నతాధికారులూ, ఒక మినిస్టరు గారూ కూర్చుని ఉండగా ఆ మంత్రిగారు మాటల మధ్యలో The Two Popes (2019) సినిమా గురించి ప్రస్తావించారు. నేను ఆశ్చర్యపోయాను. నేను చాలా వెనకబడి ఉన్నానని అర్థమయింది. కొద్దిగా సిగ్గనిపించింది కూడా. నిన్న రాత్రి నెట్ ఫ్లిక్స్ లో ఆ సినిమా చూసే దాకా నా మనసు కుదుటపడనే లేదు.

The Two Popes మరీ ఇటీవలి సంఘటనల ఆధారంగా నిర్మించిన ఒక జీవితకథనాత్మక చిత్రం. 2005 లో పోప్ రెండవ జాన్ పాల్ నిర్యాణానంతరం పోప్ పీఠానికి జరిగిన ఎన్నికలో జర్మన్ కార్డినల్ జోసెఫ్ రాట్జింగర్ కీ, అర్జెంటినీయన్ ఆర్చిబిషప్ బెర్గోగ్లియో కి మధ్య పోటీ జరుగుతుంది. రాట్జింగర్ ఎన్నికవుతాడు. బెర్గోగ్లియో తిరిగి వెళ్ళిపోతాడు. ఏడేళ్ళు గడుస్తాయి. 2012 నాటికి బెర్గోగ్లియో తన బిషప్షిప్ కి రాజీనామా చేసి మామూలు పురోహితుడిగా జీవితం కొనసాగించాలనుకుని పోప్ అనుమతి కోసం రోమ్ బయల్దేరతాడు. మరొక వైపు వాటికన్ రహస్య పత్రాలు బయటికి పొక్కడంతో పెద్ద పుకారు తలెత్తుతుంది. ఎన్నడూ లేనివిధంగా వాటికన్ సిటీ అపప్రథలో చిక్కుకుపోతుంది. ఈలోపు పోప్ బెనెడిక్ట్ తనే బెర్గోగ్లియో ని ఉన్నపళంగా రమ్మని కబురు చేస్తాడు.

వారిద్దరూ పోప్ వేసవి విడిదిలో సమావేశమవుతారు. ఆ సందర్భంలో బెర్గోగ్లియో రాజీనామ చెయ్యడం వల్ల చర్చి మరింత బలహీనపడుతుందనీ, కాబట్టి ఆ ఆలోచనని విరమించుకొమ్మనీ పోప్ బెనెడిక్ట్ బెర్గోగ్లియోకి చెప్తాడు. వాళ్ళిద్దరూ ఒక రోజంతా చర్చి గురించీ, దైవ సన్నిధి గురించీ, విశ్వాసులకు ఎదురయ్యే ఆధ్యాత్మిక పరీక్షల గురించీ చర్చించుకుంటారు. మర్నాడు పోప్ అత్యవసరంగా వాటికన్ సిటీకి బయలుదేరవలసి వస్తుంది. బెర్గోగ్లియో కూడా ఆయన వెంట బయలుదేరతాడు. వాళ్ళ మధ్య చర్చలు కొనసాగుతాయి. తనని కొన్నాళ్ళుగా వేధిస్తున్న సమస్యకి తనకొక పరిష్కారం దొరికిందనీ, తాను పోప్ పీఠానికి రాజీనామా చేసి ఒక సాధారణ విశ్వాసిగా జీవితం కొనసాగించాలనుకుంటున్నాననీ, తన తర్వాత పోప్ పదవిని అలంకరించడానికి తగిన వ్యక్తి బెర్గోగ్లియోనేనని తనకి అర్థమయిందని పోప్ బెనెడిక్ట్ చెప్తాడు. కాని బెర్గోగ్లియో అందుకు అంగీకరించడు. పోప్ పీఠమనేది ఒక జీవితకాల బాధ్యత అనీ దాన్నుంచి పోప్ బెనెడిక్ట్ పక్కకి తప్పుకోడాన్ని తాను అంగీకరించలేననీ, అంతేకాక, తనకు పోప్ కాగలిగే అర్హత లేదనీ కూడా చెప్తాడు. ఆ సందర్భంగా తన గతాన్ని పోప్ తో పంచుకుంటాడు.

అర్జెంటీనాలో ఒక రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కూలదోసి సైనికపాలన మొదలయినప్పుడు, తాను తన వాళ్ళని రక్షించుకోవడం కోసం తాత్కాలికంగా మిలటరీతో సన్నిహితంగా మెలగవలసి వచ్చిందనీ, ఆ సందర్భంగా తనకి ఎంతో సన్నిహితులైన ఇద్దరు జెసూటు గురువుల్ని మిలటరీ అరెష్టు చేసి హింసించిందనీ, తాను వాళ్ళని విడిపించమని కోరినా మిలటరీ అంగీకరించలేదనీ చెప్తాడు. ఆ తర్వాత సైనిక పాలన అంతమై ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడ్డాక తనని ప్రజలు నమ్మలేదనీ, రైట్ వింగ్ మనిషిగానే చూసారనీ, కానీ, ఆ ఇద్దరు గురువుల్లో ఒకాయన తనను క్షమించాడనీ, మరొకాయన తనను క్షమించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమించాడనీ, తన గతం ఒక గాయంలాగా తనని సలుపుతూనే ఉందనీ చెప్తాడు బెర్గోగ్లియో. కాని ఎంతో నిజాయితీతో పంచుకున్న ఆ ఆత్మనివేదనను పోప్ ఒక కన్ఫెషన్ గా భావించి, బెర్గోగ్లియోని తన గతం నుంచి విడుదల చేసి అతణ్ణింక పూర్తి పునీతుడిగా జీవించమని ఆశీర్వదిస్తాడు.

మరొకవైపు పోప్ బెనెడిక్ట్ కూడా తాను కూడా ఒక ఆత్మనివేదన చేసుకోవలసి ఉంటుందని చెప్తాడు. తాను బాధ్యత వహిస్తున్న మఠంలో తన సన్నిహిత అధికారులపైన అబద్ధం, వంచన, ద్రోహం, లైంగిక హింస వంటి ఆరోపణలు వచ్చిపడుతున్నప్పుడు తాను స్పందించవలసినంతగా స్పందించలేదనీ, తన నిష్క్రియ వల్ల దాదాపుగా తాను కూడా వారికి సహకరించినట్టే అయిందనీ, సెయింట్ పీటర్ వంటి వారు కూర్చున్న పీఠం మీద తాను కూర్చోలేకపోతున్నాననీ నివేదించుకుంటాడు. హృదయపు లోతులనుంచీ వినిపించిన ఆ నివేదనను బెర్గోగ్లియో సానునయంగా విని, మనఃపూర్వకంగా పోప్ ను ఆశీర్వదిస్తాడు. పోప్ తనని బాధిస్తున్న గతం నుండి పూర్తిగా పునీతుడయ్యాడని ప్రకటిస్తాడు. ఆ మర్నాడు అతడు తిరిగి అర్జెంటీనా వెళ్ళిపోతాడు.

కాని ఏడాది తిరక్కుండానే 2013 లో పోప్ బెనెడిక్ట్ తన పీఠాధిపత్యానికి రాజీనామా చేస్తాడు. ఒక ఆధ్యాత్మిక యాత్రీకుడిగా గ్రామసీమకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పీఠానికి జరిగిన ఎన్నికలో బెరోగ్లియో పోప్ ఫ్రాన్సిస్ గా ఎన్నికవుతాడు. అతణ్ణి చూడటానికి ఒకప్పటి పోప్ బెనెడిక్ట్ వస్తాడు. ఇద్దరూ కలిసి అప్యాయంగా మాట్లాడుకుంటారు. ఆ రాత్రి వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్ ని టెలివిజన్లో చూస్తారు. అర్జెంటీనా జట్టుమీద జర్మనీ జట్టు విజయం సాధిస్తుండగా పోప్ ఫ్రాన్సిస్ తన పూర్వపు పోప్ ని అభినందిస్తుండగా చిత్రం ముగుస్తుంది.

సినిమాలో అన్నిటికన్నా ముందు చెప్పవలసింది స్క్రీన్ ప్లే. ముఖ్యంగా పోప్ బెనెడిక్ట్, బెర్గోగ్లియోల మధ్య సంభాషణల్లో ప్రతి ఒక్క హావభావాన్నీ స్క్రీన్ ప్లే కారుడు ముందే రాసుకున్నాడు. ఆ సంభాషణ, ఆ సంఘర్షణ అతడు ఎంతో విస్పష్టంగా తాను ముందే దర్శించి, అనుభవించి, ఆ తర్వాత ఆ నటులిద్దరిద్వారా మనకు దర్శింపచేసాడు. ఒక సంభాషణలో కూడా అపారమైన నాటకీయతని సాధించవచ్చని రుజువు చేసాడు. ఇద్దరూ పోప్ లదీ కూడా అత్యున్నత స్థాయి అభినయం.

కాని కేవలం ఒక క్రైస్తవ పీఠానికి సంబంధించిన చరిత్రకి పరిమితం కాకపోవడంలోనే ఈ సినిమా తాలూకు విశిష్ఠత ఉంది. ఇది నేటి ప్రపంచంలో భగవంతుడి స్థానం, ఒక globalization of indifference వ్యాధిలాగా ప్రపంచాన్ని కమ్ముకుంటున్న వేళ, నిజమైన భగద్విశ్వాసి కర్తవ్యమేమిటి, అతడు ఎటువంటి స్థితప్రజ్ఞత ని కనపర్చాలన్నది ఈ సినిమాలో కీలక ప్రశ్నలు. అన్నిటికన్నా కష్ఠమైంది భగవద్వాణిని వినడం, చివరికి పోప్ కి కూడా, ఇంకా చెప్పాలంటే, అందరికన్నా కూడా పోప్ కే మరీ ఎక్కువ కష్టం. ఒకప్పుడు, అంటే కొన్ని శతాబ్దాల కిందట, భగవంతుడి వాణి చాలా స్పష్టంగానూ, సరళంగానూ వినిపించేదని, అప్పుడొక యువకుడికి ఆ మాట వినడంగాని, అనుసరించడంగాని ఎంతో సులభంగా ఉండేదనీ, కానీ ఇప్పటి సంక్లిష్ట జీవితం మధ్య ఆ వాణి మునుపటిలాగా స్పష్టంగా వినిపించడం లేదనేది పోప్ బెనెడిక్ట్ సమస్య. తానొక పసిబిడ్డగానూ, బాలుడిగానూ ఉన్నప్పుడు భగవంతుడి సన్నిధి తనకెంతో స్పష్టంగా అనుభవమయ్యేదనీ, ఇప్పుడు తాను ఒంటరినైపోయానన్నది ఆయన వేదన.

కాని ఆయన ఒక సనాతన కాథలిక్. ఒక విశ్వాసి విశ్వాసిగా జీవించడానికి పెట్టుకున్న ఏ నియమావళినీ అవసరం కోసమో, ఆపద్ధర్మం కోసమో ఉల్లంఘించడానికి ఆయన సుతరామూ ఇష్టపడడు. మార్పు అంటే ఆయన దృష్టిలో రాజీపడటమే. దేవుడు సదా స్థిరుడనీ, శాశ్వతుడనీ, మనిషి ఆయనలో నివసించడం ఎంత నేర్చుకున్నా కూడా మనిషి ఎప్పటికీ మనిషేననీ అంటాడు. మరొకవైపు బెర్గోగ్లియో వెనక లాటిన్ అమెరికన్ liberation theology ఉంది. యేసు అన్నిటికన్నా ముందు బీదప్రజల పక్షపాతి అని ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతాడు. పోప్ తన ఒంటరితనం నుంచి బయటపడాలంటే ముందూ ఒక్కడూ కూచుని భోజనం చెయ్యడం మానెయ్యాలనీ, క్రీస్తు ఎప్పుడూ ఒక్కడే రొట్టెలు తినలేదనీ, ఎప్పుడు చూసినా ఉన్న రొట్టెలేవో నలుగురితో పంచుకోడానికే ఇష్టపడ్డాడనీ అంటాడు. తన విలాసవంతమైన, ఆడంబరంతోనూ, అధికారిక లాంఛనాలతోనూ కూడుకున్న జీవన శైలిని వదిలిపెట్టి ప్రజలతో మమేకం కాకపోతే చర్చికి భవిష్యత్తు లేదని చెప్తాడు.

మొదట్లో ఇది మనకి సనాతన విశ్వాసాలకీ, సంస్కరణ దృక్పథానికీ మధ్య జరుగుతున్న సంవాదంగా వినిపిస్తుంది. దాదాపుగా సమీక్షకులంతా అలానే రాసారు. ఒక అర్జంటీనియన్ సమీక్షకుడు ఈ సినిమాలో ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధానమైన సమస్యల్ని చర్చించనేలేదని వాపోయాడు. ఇవాన్ ఇల్లిచ్ లాగా, ఫాలో ప్రయరీ లాగా పోప్ ఫ్రాన్సిస్ కూడా ఏదో ఒక మాట్లాడాలని తాను కోరుకుంటున్నానని రాసాడు. కాని సినిమా ప్రధాన ఉద్దేశ్యం అది కాదు. చర్చిని నువ్వు సంస్కరించినా, సంస్కరించకపోయినా ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నిన్ను వేధిస్తున్న గతం నుండి ముందు నువ్వు బయట పడాలి. దుఃఖంతోనూ, వేదనతోనూ కూడుకున్న ప్రపంచంలో ఏ ఒక్క మనిషీ, చివరికి పోప్ కూడా, పూర్తి పునీతుడిగా జీవించడం సాధ్యం కాదు. కాని ఆ ఎరుకతో, ప్రార్థనతో జీవించినట్లయితే మనిషి ఎప్పటికప్పుడు శుభ్రపడటం అసాధ్యం కాదు. మనం దేవుడి వైపుగా ప్రయాణిస్తోనే ఉండాలని బెర్గోగ్లియో అన్నప్పుడు ‘మరి దేవుడు కూడా స్థిరంగా ఉండడన్నావు కదా, ఆయన కూడా ప్రయాణించడం మొదలుపెడితే ఎలాగ’ అని పోప్ బెనెడిక్ట్ హాస్యమాడినప్పుడు, ‘అవును, దేవుడు కూడా సంచరిస్తూనే ఉంటాడు. మనం ప్రయాణం మొదలుపెట్టగానే ఆయన మనకు దారిలో ఎదురవుతాడు ‘ అంటాడు బెర్గోగ్లియో.

ఈ మాట నిజంగా ఒక సువార్త. మనిషీ, దేవుడూ పరస్పరం ఒకరినొకరు వెతుక్కుంటూ ఒకరినొకరు కలుసుకోడానికి నిరంతరం ప్రయాణిస్తోనే ఉంటారు. వెతుక్కోవాలే గాని ప్రతి ఒక్కరోజూ ఎన్నో నిదర్శనాలు , ఈ కలయికని నిర్ధారించుకోడానికి.

28-9-2020

Leave a Reply

%d bloggers like this: