ఆత్మకథనాత్మకం

అకిరా కురొసొవా తీసిన Dreams కూడా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టి ట్యూట్ ఎంపిక చేసిన చిత్రాల్లో లేదుగాని, ఒక ప్రఖ్యాత దర్శకుడు, ఎనభయేళ్ళ వయసులో ఆత్మకథనాత్మకంగా ఒక సినిమా తీసాడని తెలిసినప్పుడు చూడకుండా ఉండలేకపోయాను. అది కూడా తన స్వదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఏ స్టూడియో కూడా ముందుకు రానప్పుడు తన అమెరికన్ మిత్రుల సహాయంతో సినిమా నిర్మాణానికి పూనుకున్నాడని తెలిసినప్పుడు ఆ సినిమా పట్ల సహజంగానే ఆసక్తి కలుగుతుంది.

Dreams (1990) ఎనిమిది విడివిడి కలల, సంఘటనల సమాహారం. వాటన్నింటినీ కలిపే ఏకసూత్రత ఏదీ ఒక ఇతివృత్తంగా మనకి కనిపించదు. తనని చిన్నప్పణ్ణుంచీ వెంటాడే కొన్ని కలల్ని తాను దృశ్యమానం చేయడానికి ప్రయత్నించానని కురొసొవా చెప్పుకున్నాడు.

ఆ ఎనిమిదిలో మొదటిది ఎండావానా కలిసి పడే దృశ్యం. నా చిన్నప్పుడు మా ఊళ్ళో, అట్లా వానపడుతున్నప్పుడు ఎండకాస్తే, కుక్కలకీ, నక్కలకీ పెళ్ళవుతుందనేవాళ్ళు. సినిమాలో కూడా అదే మాట వినిపిస్తుంది. ఆ కలలో కురొసొవా బాలుడు. వానమధ్య ఎండపడుతున్నవేళ బయటికి వెళ్ళొద్దనీ, ఊరవతల అడవిలో నక్కల పెళ్ళి ఊరేగింపు జరుగుతుందనీ అతడి తల్లి అతణ్ణి హెచ్చరిస్తుంది. కాని ఆ చిన్నపిల్లవాడు కుతూహలం ఆపుకోలేక తల్లి హితవు పెడచెవిన పెట్టి ఊరు బయట అడవికి వెళ్తాడు. అక్కడ ప్రకృతి దేవతల పెళ్ళి ఊరేగింపు చూస్తాడు. ఆ దేవతల కంటపడతాడు. భయంతో ఇంటికి పరిగెడతాడు. కాని తల్లి గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. ఆ బాలుణ్ణి చూసిన ఒక దేవత తన దగ్గరికి వచ్చి తనకొక కత్తి ఇచ్చిందని చూపిస్తుంది. అతడు తిరిగి వెనక్కి వెళ్ళి ఆ దేవతల్ని క్షమాపణ యాచించమనీ లేకపోతే ఆ కత్తితోనే తన జీవితాన్ని అంతం చేసుకోక తప్పదనీ చెప్తుంది. అతడి మొహం మీదనే తలుపు వేసేస్తుంది. ఆ బాలుడు మళ్ళా అడవి దగ్గరికి, కొండల దగ్గరికి పరుగెడతాడు. అక్కడొక ఇంద్రచాపం అతడికి సాక్షాత్కరిస్తుంది.

తక్కిన ఏడు సంఘటనలూ కూడా ఇట్లాంటి ధోరణిలోనే సాగుతాయి. రెండవ కలలో అంతరించిపోయిన ఒక పండ్లతోట. అక్కడ వనదేవతలు సాక్షాత్కరిస్తారు. అతడికోసం ఒక ప్రాచీన జపనీయ నృత్యాన్ని అభినయిస్తారు. మూడవకల ఒక పర్వతారోహణ దృశ్యం. అందులో కురొసొవా పర్వతారోహకుల బృందానికి నాయకుడు. వాళ్ళంతా ఒక మంచుతుపానులో దాదాపుగా మృత్యువు అంచుకి చేరుకుంటారు. అప్పుడొక పురాణదేవత అతణ్ణి చేరవచ్చి లాలించి నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. కాని అతడా నిద్రని, ఆ మృతతంద్రని విదిలించుకుని తన సహచరుల్ని కూడా మృత్యువునుంచి బయటకు లాగుతాడు. వాళ్ళ గమ్యం ఎక్కడో సుదూరంగా ఉందనుకున్నది కాస్తా, ఆ పక్కనే నాలుగైదు అడుగుల దూరంలో కనిపిస్తుంది. నాలుగవ కలలో అతడొక సైనిక దళపతి. రెండవ ప్రపంచయుద్ధంలో పోరాడిన ఒక యోధుడు. అతడు ఒక సొరంగంలో అడుగుపెడతాడు. అక్కడొక యుద్ధశునకం అతడి వెంటపడుతుంది. అతడా దీర్ఘసొరంగంలో, ఆ చీకటిలో, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ సొరంగాన్ని దాటేటప్పటికి, యుద్ధంలో తాను నాయకత్వం వహించిన ప్లటూన్ మొత్తం అతడి ముందు హాజరవుతుంది. అతడు యుద్ధంలో సరైన అంచనా లేకుండా ఇచ్చిన ఆదేశాల వల్ల ఆ ప్లటూన్ మొత్తం నశించిపోయి ఉంటుంది. వాళ్ళంతా ఇప్పుడు మళ్ళా అతడి ఎదట నిలబడి నిష్ప్రయోజనకరమైన ఒక యుద్ధానికి తమని ఆహుతి చేసినందుకు అతణ్ణి నిందిస్తారు. అతడి దగ్గర సమాధానం ఉండదు. విషాదంతో తలవాల్చుకుని అతడు తన అడుగులు వెతుక్కునేలోపు మళ్ళా ఆ శునకం అతడిముందు వచ్చి మొరగడం మొదలుపెడుతుంది.

అయిదవకల మరీ విచిత్రమైంది. ఆ కలలో అతడు అమస్టర్ డాం లో ఒక చిత్రప్రదర్శనశాలలో వాన్ గో చిత్రించిన చిత్రాలు చూస్తూ నెమ్మదిగా ఒకప్పటి డచ్చి గ్రామసీమల్లోకి ప్రయాణిస్తాడు. అక్కడ గోధుమ చేలమధ్య బొమ్మలు వేసుకుంటున్న వాన్ గో ని కలుస్తాడు. అతడితో సంభాషించాలని ప్రయత్నిస్తాడుగాని, ఆ చిత్రకారుడు తన బొమ్మలు తాను గీసుకుంటూ వడివడిగా వెళ్ళిపోతాడు. కాని ఆ చిత్రకారుడితో ఆ నాలుగు మాటలూ మాట్లాడగానే ఇప్పుడు కథానాయకుడు పల్లెలమధ్యనుంచి పొలాలమధ్యనుంచి వాన్ గో చిత్రలేఖనాల్లోకి ప్రయాణిస్తాడు. ఆ బొమ్మలే నిజమైన ప్రపంచంగా ఆ బొమ్మల్లో చిత్రించిన చెట్ల కింద, పొలాల్లో నడవడం మొదలుపెడతాడు. వాన్ గో చిత్రించిన ఒక చిత్రలేఖనంలో ఒక పొలం మీద పరుచుకున్నట్టే కాకులు గుంపులుగా అతడిమీద కూడా పరుచుకుంటాయి.

ఆరవకలలో ఫుజియామా అగ్నిపర్వతం దగ్గర ఉండే ఆరు అణురియాక్టర్లు పేలిపోయి ఆ అగ్నిపర్వతమే విస్ఫోటనం చెందిందా అన్నంతగా అగ్ని వ్యాపిస్తుంది. పొగ కమ్మేస్తుంది. విషవాయువులు చుట్టుముడతుండగా ప్రజలు దిక్కుతోచకుండా పరుగెడుతుంటారు. ‘జపాన్ మరీ చిన్నది, తప్పించుకుపోలేకపోతున్నాం ‘అని అరుస్తుంటారు. అక్కడొక సముద్రం దగ్గర సూటు వేసుకున్న ఒక వ్యక్తి, అతడికి కొంతదూరంలో ఒక స్త్రీ ఉంటారు. ఆ సూటు వేసుకున్న వ్యక్తి తానే ఆ అణువిధ్వంసానికి కారణమని చెప్తాడు. ఆ స్త్రీ తన పిల్లలతో రోదిస్తూంటుంది. ఆ సూటువేసుకున్న వ్యక్తి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. భయంతో మరింత రోదిస్తున్న ఆ స్త్రీనీ, ఆమె పిల్లల్నీ ఆ విషవాయువు సోకకుండా కాపాడాలని కురొసొవా ప్రయత్నిస్తుంటాడు.

ఏడవ కలలో అతడికొక రోదిస్తున్న దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యం కూడా ఒకప్పుడు మనిషినే. కాని దెయ్యంగా, భూతంగా, రాక్షసుడిగా మారిపోయాడు. తానొకప్పుడు ఒక రైతుననీ, లాభాపేక్షతో తన పండిన పంటకి ధర పెరగడంకోసం ఆ పంటని తానే నాశనం చేసాననీ, అందుకనే ఇప్పుడు తానొక రాక్షసుడిగా మారాననీ చెప్తూ, తనలాంటి రాక్షసులు రోదిస్తున్న చోటుకి తీసుకువెళ్తాడు. అక్కడ అసంఖ్యాకులైన రాక్షసజీవులు విలపిస్తో, భరించలేని బాధతో మెలికలు తిరుగుతో కనిపిస్తారు. వాళ్ళంతా ఒకప్పటి లక్షాధికారులో, లేదో ప్రభుత్వోద్యోగులో నని తెలుస్తుంది. వాళ్ళు అతణ్ణి నువ్వు కూడా ఒక రాక్షసుడిగా మారతావా అనడుగుతారు . ఆయన అక్కణ్ణుంచి భయంతో ఆ రాక్షసప్రపంచం నుంచి పారిపోతాడు.

ఇక ఎనిమిదవ కల, చివరి కలలో అతడొక ప్రశాంతమైన ఏటి ఒడ్డునుండే పల్లెపట్టులో అడుగుపెడతాడు. అక్కడ నీటిమరలు తిరుగుతుంటాయి. అక్కడొక శతాధికవయస్కుడూ, ఆరోగ్యవంతుడూ అయిన ఒక వృద్ధుణ్ణి చూస్తాడు. అతడు పని చేసుకుంటూ ఉంటాడు, కాలుష్యానికి దూరంగా జీవించడమే తమ జీవితరహస్యమని చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక చావు ఊరేగింపు బాజాలు వినిపిస్తాయి. ఆ వృద్ధుడు తాను కూడా ఆ ఊరేగింపులో పాలుపంచుకోవాలనీ, ఆ మరణించిన మనిషి ఒకప్పటి తన మిత్రురాలేనని చెప్తూ, మరణం కూడా సంతోషప్రదంగా ఉత్సవంలాగా జరుపుకోవలసిందేనని చెప్తాడు. అక్కడ ఊరి మొదట్లో ఏటి ఒడ్డున ఒక చిన్న రాతిమీద పిల్లలు పువ్వులు పెడుతుంటారు. అదేమని అడిగితే ఒకప్పుడొక యాత్రీకుడు తమ ఊరికి వచ్చాడనీ, అప్పుడు జరిగిన ఒక యుద్ధంలో, అక్కడే తనువు చాలించాడనీ, అతడికి గుర్తుగా అక్కడ పూలు సమర్పించడం ఒక ఆచారంగా మారిపోయిందనీ వివరిస్తాడు. కురొసావా కూడా తన వంతు నివాళిగా ఆ స్మారకశిలమీద తాను కూడా ఒక పువ్వు సమర్పిస్తాడు.

Dreams సినిమా పట్ల సినిమా ప్రపంచ స్పందన మిశ్రమంగా ఉండింది. దర్శకుడు మరీ నీతిప్రబోధకుడిగా కనిపించాడనీ, అణుయుద్ధంగురించీ, స్వలాభాపేక్షతో పంటల్ని మట్టిపాలు చేసే వ్యాపారప్రపంచం గురించీ కురొసోవా కొత్తగా చెప్పేదేముందనీ, ఆ చెప్పింది కూడా బలంగా చెప్పలేకపోయాడనీ సమీక్షకులు పెదవి విరిచారు. కాని, ఆ తొలిస్పందనలు పక్కకిపోయాక, ఇప్పుడు ప్రపంచం ఆ సినిమాని మళ్ళా కొత్తగా చూస్తోంది. ఎందుకంటే, ఆ సినిమాని కురొసొవా ప్రాచీన జపానీయ నోఁ నాటక శైలికి అనుగుణంగా తీసాడనీ, ఆ సినిమా అర్థం కావాలంటే జపాన్ రంగస్థలం గురించి మనకి ఎంతో కొంత తెలిసి ఉండాలనీ ఇప్పటి విమర్శకులు మనకి తెలియచెప్తున్నారు.

‘నోగాకు’ పేరిట అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నోఁ నాటక శైలి మధ్యయుగాల్లో ప్రభవించి గత ఆరేడు వందల ఏళ్ళుగా జపాన్ లో వర్ధిల్లుతూ వస్తున్న ఒక నాట్యశైలి రంగప్రక్రియ. క్యోగెన్ అంటే వినోదపూర్వక నాట్యం. నోఁ, క్యోగెన్ రెండూ కలిసి నోగాకు పేరిట ప్రసిద్ధి చెందాయి. సాంప్రదాయిక ప్రయోగరీతిలో నోఁ నాటకంలో అయిదు సంఘటనలు ఉంటాయి. మధ్యలో విరామప్రాయంగా క్యోగెన్ నాట్యాలుంటాయి. నోఁ నాటకం ప్రధానంగా ఇద్దరు పాత్రధారుల మధ్య నడుస్తుంది. అందులో ప్రధాన పాత్రధారిని ‘షి-తె’ అంటారు. అతడు దేవత కావచ్చు, రాక్షసుడు కావచ్చు, మొదట్లో మానవుడిగా ఉంటూ తర్వాత దేవతగా మారినవాడు కావచ్చు. రెండవ పాత్ర ‘వకి’. అతడు షి-తె తో సంవాదం సాగించే పాత్ర. వారిద్దరూ పైలోకానికీ, ఈలోకానికీ ప్రతినిధులు. పై లోకం అన్నప్పుడు అది స్వర్గమే కానక్కర్లేదు. పాతాళం కూడా కావొచ్చు. ఆ పాత్రలిద్దరూ మాస్కులు ధరించి అభినయానికి పూనుకుంటారు. వట్టి ముఖమయితే ఆ హావభావాల ప్రకటనలో పరిపూర్ణత్వం సాధ్యం కాదని వారు ముసుగులు ఉపయోగిస్తారు. వారి కదలికలూ, భంగిమలూ ప్రతి ఒక్కటీ ఎంతో నిర్దుష్టంగానూ, శాస్త్రం నిర్దేశించినట్టుగానూ నడుస్తాయి. ఆ ప్రక్రియ మొత్తాన్ని ‘జొ-హా-క్యు’ అంటారు. అది నెమ్మదిగా మొదలై, ఆ పైన వేగం పుంజుకుని, ఒక అలౌకిక విన్యాసంగా మారే నాట్యప్రక్రియ. ఆ క్రమంలో వారిద్దరూ కలిసి మాట్లాడుకునే ఆ రంగస్థలం ఈ ప్రపంచం కన్నా భిన్నమైన ఒక లోకం. అదొక పవిత్రభూమి. అక్కడ మర్త్యలోకపు ప్రతినిధిగా ఉండే వకి, అమర్త్యలోకపు ప్రతినిధి అయిన షితె ని కలిసి అతడితో మాట్లాడుతూ, సంవదిస్తూ, వాదిస్తూ, ప్రశ్నిస్తూ, అర్థం చేసుకుంటూ చేసే ఆ సంభాషణని చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు తాము కూడా మరొక లోకంలోకి ప్రయాణించిన అనుభవానికి లోనవుతుంటారు.

కురొసొవా తన కలల్ని చిత్రిస్తున్నప్పుడు ప్రతి ఒక్క కలనీ ఒక నోఁ నాటకంగా చిత్రించాడు. ప్రతి ఒక్క కలలోనూ ఒక షి-తె, ఒక వకి ఉంటారు. ఒక కలలో ఆ షితె దేవత, ఒక కలలో దేవతాసమానుడైన చిత్రకారుడు, ఒక కలలో రాక్షసుడు. తాను జీవిస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని తనకు నివాస యోగ్యంగా మార్చుకోవడానికి, తన బయటి ప్రపంచం నుంచీ, తన అంతరంగం నుంచీ కూడా స్ఫూర్తి కోసం కురొసొవా అన్వేషించాడని మనకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ స్ఫూర్తిని వట్టి కథనంగా చెప్పడం కాదు, కళాత్మకంగా చెప్పుకోవాలని కూడా అతడు తపించాడని తెలుస్తున్నది. ఉదాహరణకి అతడు వాన్ గో ని కలిసినప్పుడు అంతదాకా పొలాలుగానూ, చిత్రకారుడు చిత్రిస్తున్న చిత్రాలుగానూ విడివిడిగా ఉన్న దృశ్యాలు ఒకటిగా మారిపోయి, అప్పుడు కురొసొవా నేరుగా ఆ చిత్రలేఖనాల్లోనే ప్రయాణించిన అనుభవానికి లోనవుతాడు. అంటే ఏమిటి? ఒక కళాకారుడు తన ఎదట ఉన్న ప్రపంచాన్ని తన కళతో తన కృతిగా మార్చేస్తాడు. నువ్వొక సంగీత కారుడివనుకో, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వొక రాగాలాపనగా మార్చేస్తావన్నమాట. సరిగ్గా కురొసావా చేయడానికి ప్రయత్నించిందీ అదే. అత్మహననానికి సిద్ధపడుతున్న ఈ ప్రపంచాన్ని తన సినిమాతో అతడొక చల్లని పల్లెపట్టుగా మార్చడానికి ప్రయత్నించాడు.

ఏరీ అటువంటి కళాకారులు మనకి? సినిమా సరే, తన కలల్ని ఒక కావ్యంగానైనా కూర్చడానికి ఉత్సాహపడ్డ కవులేనా ఉన్నారా మనకి?

22-9-2020

Leave a Reply

%d bloggers like this: